గులాబీ చెట్టుకు పూలు, ముళ్లు కలిసే ఉంటాయి. రెండింటి వేర్లూ ఒక్కటే. ముళ్లకు, పూలకు వేర్వేరు మూలం ఉండదు. ద్వంద్వం అలాగే ఉంటుంది; కానీ దానికి అతీతంగా జీవించడం నేర్చుకుంటేనే జీవనం సుఖంగా ఉంటుంది. అలా ద్వంద్వాతీతులైన వ్యక్తులే సుఖంగా జీవించగలుగుతారు. అందుకే..
సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్య స్వనైవం పాపమవాప్స్యసి
‘‘సుఖ దుఃఖాలను, జయాపజయాలను, లాభనష్టాలను సమానంగా భావించి ఆ తర్వాత యుద్ధానికి సిద్ధపడు. అలా చేస్తే నీవు పాపం అనే దోషాన్ని పోందవు’’ అని శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునుడికి భోదించాడు. శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, జయాపజయాలు, రాగద్వేషాలు ఇవన్నీ స్వరూపంగా ఒక్కటే. కానీ ప్రక్రియాపరంగా వేరుగా అనిపిస్తాయి. పొగడ్త, నింద నాణేనికి రెండు భాగాలు. కొన్నింటిని స్వీకరిస్తాం. మరొకదాన్ని తిరస్కరిస్తాం. దూషణ, భూషణాలు కూడా అలాంటివే ఒక దానిలో ఆనందం కలుగుతుంది; మరోదాంట్లో దు:ఖం కలుగుతుంది. ఇందులోని మౌలిక భేదం గుర్తించకుండా ఈ ద్వంద్వాల్లోని మాయలో పడుతుంటాం.
ఇది గుర్తించిన వాళ్లు మహాత్ములవుతారు. ఆనాటి ప్రసిద్ధులైననాయకుల్లో ఒకరైన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటివారు రమణ మహర్షి ముందుకు వస్తే ఎలాంటి రాగం ప్రదర్శించలేదు. శ్రీరామకృష్ణులు తనకు క్యాన్సర్ వ్యాధి వచ్చినా అది దేహబాధగానే భావించారు. మరి విషవృక్షం లాంటి సంసారంపై కూర్చున్న వ్యక్తులు అలా ఉండగలరా? సుఖసుఖాల లోతుపాతులను గ్రహించే ఆత్మజ్ఞానం పొందినవ్యక్తి వాటిని అనుభవిస్తూనే వాటి ఫలితాలను అంటకుండా జీవించగలుగుతాడు. అందుకు శ్రీకృష్ణుని జీవితమే ఒక ఉదాహరణ. భగవద్గీతలో పరమాత్మ చెప్పింది కూడా ఇదే. శాంతి-అశాంతి, సుఖం-దు:ఖం, చావు-పుట్టుకలను వ్యతిరేకమైన పదాలుగా చెప్తాం. వెలుతురు-చీకటి వేరు కాదు. వాటి కలయిక, సంభవం రెండూ ఒకేసారి కన్పించకపోవచ్చు కానీ ఒక చోట కలుస్తాయి. మన నిజజీవితంలో ఇవన్నీ పరస్పర వైరుధ్యంతో కూడిన అంతర్నాటకాలు. దీనిని అర్థం చేసుకోవడం వల్లనే మానవ జీవనం సాఫల్యం అవుతుంది.
********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి