మనకు శిల, దారు, లోహాలతో విగ్రహం తయారుచేసి పూజించే సంప్రదాయం ఉంది. కానీ.. పుష్పాలను ఆరాధ్యదేవతగా చేసుకుని పూజించే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. సుందరంగా ఉండే ఈ నిసర్గచక్రంలో ముగ్ధమనోహరంగా కనిపించేవి పుష్పాలు. ఆ పువ్వులు ప్రకృతికే అలంకారమయ్యే రుతువు శరత్కాలం. వర్ణ సంశోభితమైన పుష్పాలను కళాత్మకంగా ఏర్చికూర్చే ఈ సంబరం చూసిన కన్నులే కన్నులు. బతుకమ్మలను తీర్చిదిద్దడం, ఆ తర్వాత వాటిచుట్టూ స్త్రీలు తమ సంగీత, నృత్య, సాహిత్య కౌశలాన్ని ప్రదర్శించేందుకకు ఆడే ఆటలు, పాటలు మరో వినూత్న చైతన్యాన్ని తెలియజేస్తాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మనాడు కలిసి ప్రసాదాలు పంచుకుని ఆడిపాడి ఆనందాన్ని పంచుకొనే దృశ్యం మన పండుగల సామాజిక దృష్టిని తెలియజేస్తున్నది. అదేరోజు సాయం సమయాన నీటిలో తేలియాడుతూ పూలరథాలుగా పయనించే వర్ణశోభిత బతుమ్మల సౌందర్యంలో భాషకందని భావాలతో సాగనంపే స్త్రీమూర్తుల ఆరాధన వ్యక్తమవుతుంది.
ఈ బతుకమ్మ.. వర్షరుతువు సమాప్తిని, శరదృతువు ఆగమనాన్ని సూచిస్తూ ఏటా మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ మహర్నవమి మహాగౌరీపూజతో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల్లో తయారుచేసే బతుకమ్మలను ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పేర్లముందున్న పదార్థాలే నైవేద్యాలు. బతుకమ్మ శబ్దం ‘బృహతమ్మ’ నుంచి వచ్చిందని కొందరు చెబుతారు. కాకతీయుల వంశదేవత కాకతమ్మనే బతుకమ్మగా మారిందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో తంగేడు పువ్వుగా పుట్టిన చెల్లెలే బతుకమ్మ అని జానపదగాథలు చెబుతున్నాయి.
సంప్రదాయాలు తెలిసినవారు నవరాత్రుల్లో శ్రీచక్రాన్ని ముందు పెట్టుకొని నవావరణ పూజ చేస్తే.. సామాన్య స్త్రీలు ఎలాంటి రసాయనాలూ లేకుండా పూచే తంగేడు, గుమ్మడి, బీర, కట్ల గోరింట, గునుగు, అల్లి, టేకు పూలతో బతుకమ్మను మేరుప్రస్థ శ్రీచక్రం ఆకారంలో అమర్చి ఆరాధిస్తారు. స్త్రీలు ఇంటిపనులకే పరిమితం కాకుండా ఆట, పాటలలో నిమగ్నమై సామూహిక నిమజ్జనం (సామాజిక దృష్టి) చేసి సరికొత్త ఆలోచనలకు తెరతీస్తారు. అందరూ కలిసి ఆడిపాడి కులసమానత్వాన్ని సాధిస్తారు. సద్దుల బతుకమ్మనాడు అందరూ ఇళ్లనుంచి తెచ్చుకున్న ప్రసాదాలు పంచుకుని తినడం అంటే.. రుచికరమైన పదార్థం అందరూ తినాలనే ఆత్మీయత అందులో ఉంటుంది. మాతృ ఆరాధనకు నెలవుగా ఉన్న ఈ పండుగ స్త్రీత్వాన్ని గౌరవించాలని తెలుపుతుంది. అమ్మదనం ఉండి అందరూ బతకాలి.. అందరినీ బతికించాలి అనే సందేశం ఈ పండుగలో నిగూఢమై ఉంది.
********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి