బుతంచ స్వాధ్యాయ ప్రవచనేచ
సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ
యథార్థమైన ఆచరణతో చదువుతూ, చదివిస్తూ ఉండాలి! సత్యాచారంతో సత్యమైన విద్యలను చదువుతూ ఉండాలి అని శ్రుతులు చెప్పాయి. స్వాధ్యాయం ఒక యజ్ఞంగా శ్రీకృష్ణుడు గీతలో చెప్పుకొచ్చాడు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణపురుషుల జీవనాధ్యయనం స్వాధ్యాయమే. పారాయణం, పఠనం బయటకు కనిపించే స్వాధ్యాయ లక్షణాలు. దాని అంతరిక రూపం మననం. మొదటి దశలో పారాయణం, పఠనం చేస్తాం. రెండవ దశలో చదివిన ఆ విషయాన్ని క్రమంగా ఆచరణకు తేవాలి. అలా కాకుండా కేవలం పుస్తకాలను వెంటమోసుకుపోవడం ‘కుంకుమపువ్వును మోసే కాశ్మీరగార్దభం’ చందమే అనేది అక్షర సత్యం. విలువైన కుంకుమ పువ్వు మూటను మోసే గాడిదకు దాని గొప్పదనం తెలియదు. అలాగే శాస్త్రం ఎంత గొప్పదైనా అది చదివి జీర్ణించుకొని, ఆచరించకపోతే ఉపయోగం లేదు.
శాస్త్రాణ్య ధీత్యాపి భవంతి మూర్ఖాః
యస్తుక్రియావాన్ పురుషః సవిద్యాన్
సుచింతితం ఔషధ మాతురాణాం
న నామ మాత్రేణ కరోతి శాంతిమ్
శాస్త్ర వాసన చాలా మందికి ఉన్నా మూర్ఖులుగానే ఉంటారు. ఆచరణ ఉన్న క్రియావంతుడే నిజమైన విద్వాంసుడు. బాగా పరీక్షించి ఎంపిక చేసిన ఔషధమైనా.. కేవలం దాని పేరు చెప్పినంత మాత్రాన రోగనివారణ జరగదు. వ్యక్తిని వ్యక్తిత్వంగల ధీరునిగా తీర్చిదిద్దాలంటే స్వాధ్యాయం అవసరం ఉంది. ఒకప్పటి గురువులు వ్యక్తిలో సంస్కారం నింపి, జీవన సుగంధాలను పరిమళింపజేయాలనే ఉద్దేశంతోనే సద్గ్రంథ రచన చేశారు. ఈరోజు మితిమీరిన సాంకేతిక పరిజ్ఞానంతో మనం జీవిస్తున్నా అందరిదీ అశాంతియుత జీవనమే. ఆ పరిజ్ఞానం అందించే సమాచారం మనలో సంఘర్షణను కూడా కలగజేస్తోంది. వివేచన, సత్యం ఉన్న సమాచారం వివేకాన్ని పెంపొందిస్తుంది. అలాకాకుండా కేవలం సమాచారం కోసం పఠనం, శ్రవణం, పారాయణం, దర్శనం జరిగితే ఎక్కడో వెలితి కనిపిస్తుంది. అలాంటి సదసద్వివేక జ్ఞానం కలిగించే సద్గ్రంథ పఠనం జరగాలి. మనపూర్వులు అత్యంత నిబద్ధతతో అలాంటి సద్గ్రంథాలను మనకు అందించారు. వాటిని ఆధునిక జీవన సమస్యలకు అన్వయించుకొని దర్శిస్తే ఈ రోజూ మనం సుఖంగా ఉండగల్గుతాం.
********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి