బతుకమ్మ పూజతో ఆత్మారాధనం, భూతారాధనం, ప్రాఙ్మానవ దేవతారాధనం, మాత్రారాధనం, సర్వదేవతారాధనం కన్పిస్తుంది. ప్రపంచంలోనే పూలను పూజించే పండుగ బతుకమ్మ. పూలు సాకారానికి, నిరాకారానికి సమన్వయ స్వరూపం. అవి సజీవంగా, సాకారంగా కన్పిస్తాయి. సాయంత్రానికి మాయమవుతాయి. పసుపు ముద్దను గౌరమ్మగా చేసి పూల మధ్యలో పెడతారు. ఈ గౌరమ్మనే  త్రిమూర్త్యాత్మక స్వరూపం.

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ బతుకమ్మ పండుగ. ఇది ఒక జానపద ఉత్సవం. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. అయితే బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ, గౌరి పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు.
బతుకమ్మను లక్ష్మీ, పార్వతీ, సరస్వతుల  త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. అయితే శ్రీ లక్ష్మీదేవే ‘బతుకమ్మ’ స్వరూపంలో, ఆమె అవతారంగా తెలంగాణ ప్రాంతంలో ఆరాధన చేస్తారు. ఇక్కడ ‘లక్ష్మీ’ అంటే సంపద, ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్య అని భావిస్తారు. ఆమెనే ఈ సంపదలను ఇవ్వడానికి ‘శ్రీవాణి’ గిరిజగా భాసిస్తుందనేది అంతరార్థం.

శ్రీలక్ష్మినీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా! అన్న తెలంగాణ ప్రసిద్ధ బతుకమ్మ పాటలో ఇవన్నీ కన్పిస్తాయి. సర్వదేవతాస్వరూపమైన బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో దేవీ నవరాత్రులతో సమానంగా నడుస్తాయి. ‘ఆశ్వియుజ శుద్ధపాడ్యమికి’ ఒక రోజు ముందు మొదలై నవమి వరకు కొనసాగుతాయి. ఇది పౌరాణిక విశేషం అయితే, దీనికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక పండుగలు  పర్వాలు జరుగుతాయి. అవి కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జన సామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ బతకమ్మ. ఈ బతుకమ్మకు అర్థం ‘జీవించు  బ్రతికించు’ అని. అదే తెలంగాణ సంస్కృతిలో ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే దానికి మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది. 
బతుకమ్మ పండుగకు ఓ గొప్ప చారిత్రక ఆధారం కన్పిస్తుంది. తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ రాజులు ఎంత గొప్పగా పాలించారో జగమెరిగిన సత్యం. కాకతీయ రాజ్య పాలకుడైన ‘గుండన’ పాలనలో పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ ‘స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడితోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పనే  ‘దేవతా స్వరూపం’గా మారిపోయింది. కాకతమ్మ అనే శబ్దం, బతుకమ్మ పేరుగా మారింది.

కాకతీయ వంశోద్భవకారిణీం
లోకోద్ధరణ స్వరూపిణీం
కృపామయీం కలుషహరిణీం
శక్తిమయీం రిపు విదారిణీం

నమామి శర్వాణీం ముక్తి దాయినీం అని కాకతీయులు కాకతమ్మను చేసిన ప్రార్థన. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపణిగా ఆరాధించి అటుశక్తి తత్వాన్ని, ఇటు ‘మాతృ దేవతారాధన’ను వారు స్థిరీకరించారు. ఆ కాకతమ్మనే అందరికీ బ్రతుకమ్మగా  బతుకునిచ్చే తల్లిగా చారిత్రక పరిణామం.

బతుకమ్మ సందేశం
ఇంతగా ఆరాధించే బతుకమ్మకు ఎలాంటి విగ్రహం దారుహా ఏర్పడలేదు. ప్రకృతిలో నుండి లభించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్ఠమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా కూడా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్ల నుండి వచ్చే పూలు మళ్లీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడి నుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి. అన్న ఆధ్యాత్మిక, తాత్విక సందేహసంలో ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకదానిపైన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుందో అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసి మెలసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం కన్పిస్తుంది.
మనకళ్లముందే వికసించిన పుష్పాలు మన మనస్సుకు ఆనందాన్ని కలిగించి పంచభూతాల్లోని నీటిలో కలిసిపోతాయి. అలాగే ఉన్నంతసేపు రంగు రంగుల పూలతో దర్శనమిచ్చి, పై భాగంలో గౌరమ్మ, దీపం, అగరవత్తుల వెలుగులు, వాసనలు, అన్నీ మాయమైపోతాయి. ఓ జీవుడా! నీవు ఎక్కడి నుండి వచ్చావు మధ్యలో అలంకారాలు చేసుకొని మాయమైపోతావు అన్న తాత్విక సందేశం ఇందులో ఉంది. 
బతుకమ్మ ఓ సామాజిక ఉత్సవం. సమాజంలో ఎలాగైనా భిన్న దృక్పథాలు  భాష, ప్రాంతం, కులం గలవాళ్లు జీవిస్తున్నారో అలాగే ప్రకృతిలోని ఎన్నో రకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. 

అని స్త్రీలు వాకిట్లో పెట్టి చుట్టూ తిరుగుతూ పాడుతారు. 
బతుకమ్మ లక్ష్మీదేవి స్వరూపం, గౌరిదేవి స్వరూపం, సరస్వతీ స్వరూపం కాబట్టే ఈ ముగ్గురి ఆరాధన ఇందులో కన్పిస్తుంది. అందుకే ‘భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై’ అని పాడుకుంటారు. బతుకమ్మ పండుగ అంతా అమంత్రకంగా స్త్రీలు జరిపే ఉత్సవం. అందువల్ల అనేక పాటలు పుట్టుకొచ్చాయి.
బతుకమ్మకు సంబంధించి భట్టు నరసింహకవి రచించిన పాటనే ప్రధాన ఆధారం. నరసింహకవి ఉయ్యాల పాటలో బ్రతుకమ్మ మూలాలు కన్పిస్తున్నాయి. ఇలా జానపద గాథ బతుకమ్మ చుట్టు తిరుగుతున్నది.

ధరచోళదేశమున ఉయ్యాలో ధర్మాంగుడను రాజ ఉయ్యాలో 
ఆ రాజు భార్యరో ఉయ్యాలో అతివ సత్యవతి ఉయ్యాలో..

ధర్మాంగరాజు భార్య సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తు ‘లక్ష్మీదేవి’ అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదిట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించటానికి దేవాన దేవతలు, మహర్షులు వచ్చి..

బ్రతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో
శ్రీలక్షి దేవియు ఉయ్యాలో సృష్టి బతుకమ్మాయె ఉయ్యాలో.. 

అని ఆమె ‘బతుకమ్మ’ కావాలి అనే నామకరణం చేశారని, ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది. మరి బతుకమ్మ ఏ దేవి స్వరూపం? లక్ష్మీదేవియా, పార్వతియా అని ఆలోచిస్తే 

శ్రీ లక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ  చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవివై పరమేశురాణివై
వరలక్ష్మీవయ్యా గౌరమ్మ భార్యవైతివి హరికినీ గౌరమ్మ

అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియచేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. మహాలయ అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు సాగే బతుకమ్మ ఆరాధన తెలంగాణకు ప్రత్యేక శోభను కల్గిస్తుంది. 

తొమ్మిది రోజులూ ఉయ్యాలో
అతరి గుమ్మడి పూలు ఉయ్యాలో 
అని మొదలై...
పాడి పంటలు గలుగు ఉయ్యాలో
విష్ణుపథము గలుగు ఉయ్యాలో..  అని ముగిస్తారు.
బతుకమ్మ వేడుకల చివరి రోజు చీకటి పడే వేళకి  ఆడపడుచులందరూ బతుకమ్మలను తలపై పెట్టుకుని  పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా వెళ్తారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో, వాయిద్యాలతో కన్నుల పండుగగా వుంటుంది. జలాశయం చేరుకున్న మహిళలు బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత చక్కెర, రొట్టెతో చేసిన ‘మలీద’ అనే వంటకాన్ని బంధువులకు పంచిపెట్టి తింటారు. 
డా॥  పి. భాస్కరయోగి

తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు
9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట  అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..
అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
చద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం.
తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
బతుకమ్మను సిద్ధంచేయుట
దుసరి తీగతో అల్లిన ‘సిబ్బి’ లేదా ఇత్తడి తాంబూలం, ఏదైనా పళ్లెంలో పుష్పాలను మేరుప్రస్థ శ్రీ చక్రంలాగా వర్తులాకారంగా పేరుస్తారు. ఈ పుష్పాల అడుగు భాగంలో పెద్దవైన మోదుగ, టేకు, బాదాం వంటి ఆకులను పరుస్తారు. దానిపైన రకరకాల పూలు బంతి, గునుగు, గోరంట, తంగేడు, నీలంకట్ల, కాకర, బీర, గన్నేరు, పారిజాత, పొన్న, మందార, మొల్ల, మల్లె, గుల్మాల, రుద్రాక్ష వంటి ప్రకృతిలో పెరిగే పూలను సేకరిస్తారు. వాటిని చక్కగా అలంకరించి దారంతో కడతారు. పై భాగంలో పసుపు ముద్దను పెట్టి గౌరమ్మగా భావిస్తారు.

శ్రీరామచంద్రుడూ ఉయ్యాలో అయోధ్య పట్నాన ఉయ్యాలో..
శుక్రవారమునాడు ఉయ్యాలో  చన్నీటి జలకాలు ఉయ్యాలో.. 
చిత్తుచిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ..
ఏమేమి పువ్వొపూచే గౌరమ్మ ఏమేమి కాయేపూసే..
కలవారి కోడలు ఉయ్యాలో కనకమాలక్ష్మి ఉయ్యాలో
ఊరికి ఉత్తరాన వలలో ఉడాలమర్రి వలలో
తంగేడు పూవుల్లో చందమామ మ్లెప్పుడొస్తావు చందమామ
ఒకనాటి కాలాన ఉయ్యాలో ఏమీ జరుగుతుందమ్మ ఉయ్యాలో

గంగమ్మ గౌరమ్మ కోల్ గొవ్వలడంగా కోల్


************************************
డాక్టర్. పి. భాస్కర యోగి
ఆధాత్మికం  : విజయక్రాంతి
సోమవారం : అక్టోబర్  : 08 : 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి