‘నాకు ఈ సమయంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత గుర్తొస్తోంది. ‘నీ విధి నువ్వు నిర్వర్తించాలి’ అంటూ విష్ణువు యువరాజుకు (అర్జునుడికి) చెబుతూ తన విశ్వరూపాన్ని చూపుతాడు. ‘నేనే మృత్యువును. లోకాలను నాశనం చేసే శక్తిని’ అని చెబుతాడు’’
..రెండో ప్రపంచయుద్ధ సమయంలో అణ్వస్త్రాలకు సంబంధించిన మన్‌హట్టన్‌ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన రాబర్ట్‌ జూలియస్‌ ఓపెన్‌హేమర్‌ చెప్పిన మాట ఇది. అణుబాంబు తయారీలో కీలకపాత్ర పోషించిన ఆయన భగవద్గీత చదవడం వల్లనే తనకు ఆ స్థితప్రజ్ఞత కలిగిందని చెప్పాడు. అణుపరీక్ష జరిపినప్పుడు విడుదలైన వేయిసూర్యుల కాంతిని విశ్వరూపుడైన పరమాత్మ కాంతితో సరిపోల్చాడు. ప్రపంచ మత గ్రంథాల్లో యుద్ధభూమిలో చెప్పబడిన ఏకైక గ్రంథం.. గీత. లోకంలోని దుఃఖాన్ని తన దుఃఖంగా భావించుకొని అర్జునుడు పొందిన విషాదాన్ని కృష్ణుడు గీతాప్రబోధంతో పటాపంచలు చేశాడు. ధర్మక్షేత్రాల్లో కూడా యుద్ధం సంభవించడం.. శ్రీకృష్ణుడి లాంటి దక్షుడైన అవతారపురుషుల కాలంలో కూడా రాజ్యకాంక్ష ఉండటం ద్వాపరం విశేషం. అనుశాసన పర్వంలో ధర్మరాజు ఇదే విషయాన్ని చెబుతూ.. ‘‘రాజ్యకాంక్షతో ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డ దుర్యోధనుడు సరే.. నా సంగతేమిటి? ‘ఛీ, ఈ రాజ్యం నాకెందుకు’ అని నేను అనుకుని ఉంటే యుద్ధం తప్పేదిగా? అంటే జరుగుతున్న పరిణామాలకు దుర్యోధనుడు ఒక కోణమైతే నేను ఇంకో కోణం అన్నమాట’’ అని వాపోతాడు. ఇవే ప్రశ్నలు.. ‘నేనే చేస్తున్నాను’ అనే భావన అర్జునుడిలోనూ ఉదయించినందువల్లనే గీత బోధ జరిగింది. అర్జునుడిని స్థితప్రజ్ఞుడిని చేసి ఆ స్థితి నుంచి కర్తవ్యం దిశగా తీసుకెళ్లడమే గీతా యోగం. అలా ఎవరికైనా సరే కర్తవ్యబోధ చేసి ఒడిదొడుకుల నుంచి కాపాడే పరమౌషధం భగవద్గీతే. అందుకే అందరూ భగవద్గీత చదవాలి.


****************************************************
డాక్టర్‌ పి. భాస్కర యోగి
ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి