అప్పుడే సభలో శ్రీకృష్ణదేవరాయలు కొలువుదీరాడు. ‘ఏడ్చే చిన్నపిల్లలను సంతృప్తిపరచడం సాధ్యమా?’ అని పండితులు ఆ సభలో సమస్యను ఇవ్వగా- కొందరు సాధ్యం కాదన్నారు. మరికొందరు సాధ్యమే అన్నారు. తాతాచార్యులు ‘నేను ఎంతటి తుంటరి పిల్లవాన్నైనా సంతృప్తిపరుస్తానన్నారు. తాతాచార్యులకు, తెనాలి రామకృష్ణుడికి ఎప్పుడూ పొసగేది కాదు. రామకృష్ణుడు ‘చిన్నపిల్లల ఏడుపు మాన్పించడం సాధ్యం కాదు’ అన్నాడు. వెంటనే రాయలవారు అందుకొని ప్రస్తుతానికి రామకృష్ణుడు చిన్నపిల్లవాడైన మనుమడు. తాతాచార్యులు అతడిని తాతగా సంతృప్తిపరచాలి అన్నాడు. ఇద్దరూ తాత, మనవడుగా సంతలోకి వెళ్ళారు. రామకృష్ణుడు ఆకతాయిలా మారాం చేస్తూ అనేక వస్తువులు కొనిపించుకొంటాడు. అందులో ఒక చిన్న సంచీ, ఏనుగు కూడా వున్నాయి. ఇద్దరూ ఏనుగుపైన ఎక్కి రాయల కొలువుకూటానికి వెళ్ళారు. అక్కడే చివరి పరీక్ష. సభలో రామకృష్ణుడు మళ్లీ ఏడుపు మొదలుపెట్టాడు. ‘అన్నీ ఇప్పించాక ఇంకెందుకు ఏడుస్తున్నావు..’ అన్నాడు తాతాచార్యులు. ‘ఆ ఏనుగును ఈ చిన్న సంచీలో పెట్టాలి’ అని మళ్లీ ఏడ్చాడు. ఎవడైనా ఏనుగును సంచీలో దూర్చగలరా? అని తాతాచార్యులు ఓటమి ఒప్పుకొన్నాడు. సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇలాంటి ఎత్తుగడనే ప్రదర్శిస్తున్నాయి. కేంద్రం ఎన్ని నిధులిచ్చినా ఏదో ఒకటి కొత్తది అడుగుతూ కాదనపించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీని వీలైనంత అపఖ్యాతిపాలు చేయడమే ఇందులోని రహస్యం.
భాజపాకు చెందిన వెంకయ్యనాయుడు కేంద్ర మం త్రిగా ఉన్నన్నిరోజులు అనేక గొంతెమ్మ కోర్కెలను తీర్చుకొన్న చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల కేంద్రంలోని భాజపాపై తిరుగుబాటు మొదలుపెట్టింది. చాలారోజులుగా చంద్రబాబు, మోదీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గతంలో కేంద్రంలో ఎన్నోసార్లు చక్రం తిప్పిన చంద్రబాబు గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీని తీవ్రంగా విమర్శించారు. అదే చంద్రబాబు మళ్లీ మోదీకి, భాజపాకు దగ్గరయ్యారు. గత నాలుగేళ్ళలో మోదీ, భాజపా చంద్రబాబుకు వాజపేయి కాలంలో ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్టీఆర్ కాలం నుండి టీడీపీ కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువు. కాంగ్రెస్‌తో చేరితే అవకాశవాద పొత్తు అన్న అపప్రథ వస్తుందని బాబు దూరంగా ఉన్నాడు. మోదీ, అమిత్ షాలు అద్వానీ, వాజపేయిల్లా సత్యకాలపు సత్తయ్యలు కారు. రాజకీయం తెలిసిన అపర చాణక్యులు. ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు ఇన్నాళ్లూ వౌనంగా ఉన్నాడు. కానీ ఇటీవల ఏపీలో వైఎస్ జగన్ ‘గ్రాఫ్’ పెరుగుతూ వస్తోంది. ‘ప్రత్యేక హోదా’ అంశంపై పవన్‌కల్యాణ్ మరోవైపునుండి నరుక్కుంటూ వస్తున్నాడు. సహజ సిద్ధమైన భాజపా వ్యతిరేకతను ప్రదర్శించే వామపక్షాలు చంద్రబాబుపై దుష్ప్రచారం తీవ్రం చేశాయి.
ఇవన్నీ ఇలా తన్నుకువస్తుంటే వౌనంగా ఉంటే రాజకీయంగా దెబ్బ తగులుతుందని భావించిన చంద్రబాబు- ‘పాము చావకుండా, కర్ర విరగకుండా’ ఇపుడు భాజపాను బజారుకు ఈడ్చాడు. మరోవైపు జగన్, ఇంకోవైపు పవన్‌కళ్యాణ్ ‘హోదా’ కోసం వామపక్షాలు, లోక్‌సత్తా జేపీ తదితరులతో కలిసి మేధోచర్చల్లా భ్రమింపజేస్తున్నారు. ఏపీ కోసం కేంద్రం గత నాలుగేళ్ళలో చేసిన మంచి ఎక్కడ గాలిలో కలిసిపోయిందో గాని, ‘హోదా’ అన్న ఒక్క మాట మాత్రం భాజపాను బాగా అపఖ్యాతి పాలు చేసింది. సోము వీర్రాజు లాంటి వాళ్ళు మొదటినుండి తెలుగుదేశాన్ని కరకుగా ఎదుర్కొంటున్నారు. బాబు క్యాబినెట్‌లో ‘రాజీనామాలు చేసే వరకూ’ కొనసాగిన ఇద్దరు భాజపా మంత్రులు మాత్రం నోరుమెదపలేదు. ఒకప్పుడు తెలంగాణ ఇవ్వడమే సకల సమస్యలకూ పరిష్కారం అనే నినాదంలా, ఇప్పుడు ఆంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఓ నినాదమైంది. విచిత్రమేమిటంటే ఈ యాభై ఏళ్ళలో ఏపీకి ఏ ప్రభుత్వం చేయనన్ని మేం చేశాం అని భాజపా నేతలు మొత్తుకుంటున్నా, ‘ఆగర్భ భాజపా శత్రుత్వం’ వున్న తెలుగు ప్రచార, ప్రసార మాధ్యమాలు వాళ్ళను పట్టించుకోవట్లేదు. ఈ విషయాలు తెలిసి సాక్షీభూతంగా వున్న వెంకయ్య నాయుడు ఇపుడు నోరు తెరిచే పరిస్థితి లేదు. ‘వ్రతం చెడ్డా సుఖం లేదన్నట్లు’గా భాజపా పరిస్థితి తయారైంది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు కోరిక మేరకు తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపింది. ఇలా విలీనం చేసినందుకు చంద్రబాబు మెచ్చుకోవడం లేదు. కానీ తెరాస మాత్రం భాజపాను తిట్టాలనుకున్నప్పుడల్లా ఈ విషయం తెరపైకి తెస్తున్నది. అలాగే హైకోర్టు విభజన జరగకపోవడంలో సాంకేతిక అంశాలతోపాటు బాబు వ్యూహం కూడా వుంది. ఆ నెపం కూడా భాజపా మోస్తున్నది. హైకోర్టును విభజించనందుకు ఆంధ్ర నాయకులు భాజపాకు కిరీటం పెట్టలేదు కానీ తెలంగాణ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత కలిగించారు. ఇలాంటి ఉదాహరణలు వంద చెప్పవచ్చు.

ఇలాంటప్పుడు చంద్రబాబుకు నిజంగా హోదాపై తీవ్రత ఉంటే- ఇప్పుడు కాదు.. ఎప్పుడో కేంద్రంలో తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించి, రాష్ట్రంలోని ఇద్దరు భాజపా మంత్రులను సాగనంపి ఉండాలి. మరోవైపు భాజపాను తొక్కేసే పని మీడియా సహా ఆంధ్రలోని అన్ని పార్టీలు చేస్తున్నాయి! ఎన్నికలు కాస్త దూరంగా ఉన్నందున అన్ని పార్టీలు ఇప్పుడు వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.
తెలంగాణలో గత వారం రోజుల నుండి మరో క్రొత్త రాజకీయం మొదలైంది. ఇప్పటివరకు కేంద్రంలో చక్రాలు తిప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబే అని పేరుండేది. ఇపుడు కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించడం సంచలనమైంది. పదిహేను రోజుల క్రితం ఓ రైతు సభలో ఆయన కాస్త ఆక్రోశంతో మోదీపై ఏకవచన ప్రయోగం చేశారు. అయితే- ఆ తర్వాత కెటీఆర్, కవిత అది ‘ఉపన్యాస ప్రవాహంలో వచ్చి తొట్రుపాటు’అని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కెసీఆర్ తనకు మోదీ పట్ల గౌరవం ఉందన్నా, తన మాటలను వెనక్కు తీసుకోలేదు. ఈలోపు ఏం జరిగిందో బయటకు తెలియదు కాని కేంద్రంపై కెసీఆర్ యుద్ధం ప్రకటించారు. కాంగ్రెస్, భాజపా రెండూ రెండూ దేశాన్ని భ్రష్టుపట్టించాయని ఆయన ధ్వజమెత్తారు. వెంటనే తెరాస నేతలు కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అభిషేకాలు చేశారు. సోషల్ మీడియాలో దీనిపై అనేక సరసోక్తులు, వ్యంగ్యోక్తులు, నిందలు, స్తుతులు నిండిపోయాయి. వెంటనే మమతాబెనర్జీ, అజిత్ జోగి, మహారాష్ట్ర ఎంపిలు, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ కెసీఆర్‌కు స్వాగతం పలికారు. ‘అంతా కలసి మోదీని దునే్నద్దాం’ అని వీరు అన్నారని ప్రగతిభవన్ మీటింగ్‌లో కెసీఆర్ చెప్పారట!
ఈశాన్య భారతంలో చరిత్రను తిరగరాస్తూ భాజపా గెలుపొందగానే ఆ ఫలితాలు వెలువడ్డరోజే ఇదంతా జరిగింది. భాజపా గెలుపును తక్కువ చేసి చూపించడానికే థర్డ్‌ఫ్రంట్, కెసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం అనే అంశాలు మీడియా ఎక్కువ చేసి చూపిందని విశే్లషకుల అభిప్రాయం. కెసీఆర్ ప్రకటన వెనుక ఆరెస్సెస్ ఉందని రేవంత్‌రెడ్డి అంటే, మోదీ ఉన్నాడని కాంగ్రెస్ అంటోంది. చంద్రబాబు భవిష్యత్తులో కాంగ్రెస్‌తో కలుస్తాడనే నిఘా వర్గాల కథనం వల్లనే భాజపా నాయకత్వం కేసీఆర్‌ను రంగంలోకి దింపిందని, అందుకే ఇన్నాళ్లు ఆంధ్ర నాయకులతో ఉప్పు నిప్పుగా ఉన్న కేసీఆర్ తెలుగుజాతి నినాదం అందుకున్నారని మరికొందరి విమర్శ. కానీ ఆయన అంత అస్వతంత్రమైన నిర్ణయాలు తీసుకొనే అపరిపక్వ నేత కాదు. బహుశా ఆయన వయస్సు దృష్ట్యా తెలంగాణలో తన కుమారుడు కేటీఆర్‌ను ప్రమోట్ చేయడానికే ఇది జరిగిందని ఒక అంచనా.
ఈ విషయాన్ని గోరంతలు కొండంతలు చేయడానికి మీడియాకు, కేసీఆర్ వ్యతిరేకులకు రెండు ప్రయోజనాలున్నాయి. ఒక పత్రిక అయితే ఏకంగా కేసీఆర్ రోజూ ఎలాంటి వ్యూహాలు అల్లాలో అడుగకుండానే నిర్దేశం చేస్తున్నది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుండి మీడియా చాలా నియంత్రణలో పనిచేస్తోంది. ఈ నాలుగేళ్లలో ఒక్క పత్రికలో కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్టూన్ కూడా వేయలేకపోయారు. అది భయమో, భక్తో తెలియదు. కాబట్టి ఆయనను కేంద్రానికి పంపిస్తే ఇక్కడ మళ్లీ తమ పూర్వవైభవం నిలబెట్టుకోవచ్చు అనేది కొన్ని మీడియా సంస్థల ఆలోచన. ఆయన రాష్ట్రం నుండి వెళ్లిపోతే ఇక్కడ తెరాస పలుచబడిపోవడమే కాక, కేంద్ర రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత సులువు కాదు అనేది వాళ్లకు తెలుసు. కాకలు తీరిన ములాయం, శరద్‌పవార్, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, లాలూ, చౌతాలా కుటుంబం, నవీన్ పట్నాయక్, శివసేన పార్టీ, అబ్దుల్లా కుటుంబం, దేవెగౌడ, సోనియా గాంధీ లాంటివాళ్ళు భాజపా నేతల ప్రవాహానికి ఎదురీదుతున్నవారే. ఎన్నో చక్రాలు తిప్పిన చంద్రబాబు, మడమ తిప్పని మమత, ఆకాశమంత ఎగిరి దూకిన అరవింద్ కేజ్రీవాల్, కాకలు తీరిన కరుణానిధి వంటి నేతలందరూ మోదీ, అమిత్ షాల రాజకీయాల ముందు ఇబ్బంది పడుతున్నవారే. కాబట్టి కేసీఆర్‌ను ఢిల్లీకి పంపి, ఆయనను ఇబ్బందుల్లో పడేయాలని తెలుగు మీడియాలోని ఓ వర్గం ఉవ్విళ్లూరుతోంది. మోదీని తిట్టే మోటార్ సైకిల్ వాడినైనా కౌగిలించుకునే కమ్యూనిస్టులు, వారి మీడియా భజంత్రీలు నిన్నమొన్నటి వరకు మోదీని, కెసిఆర్‌ను నియంత, దొర అని తిట్టిపోశారు. ఇపుడు కెసీఆర్‌ను వ్యూహకర్త అంటున్నారు. వారు కాంగ్రెస్‌ను కూడా ఇందులోకి తెద్దాం అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
మొరార్జీ దేశాయి కాలం నుండి ‘పుబ్బలో పుట్టి మఖలో మాయమవుతున్న’ ఫ్రంట్‌లు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చెప్పలేం. రాష్ట్రానికో రావణకాష్ఠం రగులుతున్న ఈ కాలంలో ఈ పంచకూట్ల కూటములు ఏ ఎజెండాతో ముందుకెళ్తాయో అన్నది గహనమైన ప్రశే్న! మోదీని బాగా తిట్టగలిగిన నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, కన్హయ్యకుమార్‌ల వరుసలో ఇపుడు తెరాస అధినేతను నిలబెట్టాలని మీడియా చూస్తోందన్నది అక్షరసత్యం. కేంద్రం ఎన్ని కోర్కెలు తీర్చినా చంద్రబాబు, కేసీఆర్‌లు సంతృప్తి చెందరు. ఎన్ని తీర్చినా క్రొత్త కోర్కెలతో కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడేయగల రాజకీయ సమర్థత వాళ్ళిద్దరికీ వుంది. ఇప్పటికైనా తెలుగు  రాష్ట్రాలలో ‘కమ్యూనిస్టుల్లా తోక పార్టీ మనస్తత్వం’ వల్ల భాజపా సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం. అలాగే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో సఫలం కాకపోతే తెరాస ఉనికికి, ఆయనకున్న ప్రతిష్ఠకు భంగకరం. ఇంతకన్నా ఎక్కువగా ముందుకు పోతే చంద్రబాబుకు మరో కొత్త సమరం తప్పదు. ఇదే రంగు మారుతున్న రాజకీయం!


****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
Friday, March 09, 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి