ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ భాజపా కార్యదర్శిగా నియమితులైనపుడు- ఒక స్థానిక పత్రికా విలేఖరి ఆయన గదికి మాట్లాడటానికి వచ్చాడట. మాటలన్నీ అయ్యాక వారిద్దరూ ‘చాయ్’ తాగుదామనుకొన్నారట. ఆ విలేఖరి- ‘మోదీ చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో..’ అని అనుకొని చాయ్ తెప్పించమన్నాడు. వెంటనే మోదీ బయటకు వెళ్లి చాయ్ తెచ్చి ఇవ్వగానే ఆయన నిరాడంబరతకు విలేఖరి విస్మయం చెందాడట! ఇలాంటి ఘటనలు మోదీ జీవితంలో చాలా ఉ న్నాయి. కానీ ఇటీవల ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వారి చెప్పుచేతల్లోని మీడియా మోదీని ‘నిరంకుశుడి’గా ప్రచారం చేస్తున్నాయి. వీరికి తోడుగా తెలుగు రాష్ట్రాల ప్రసార మాధ్యమాలు మోదీని టార్గెట్‌గా చేసుకుని గత రెండు వారాలుగా ఊదర గొడుతున్నాయి. మోదీని నిజాయితీపరుడిగా ఆకాశానికి ఎత్తినవారే ఇప్పుడు తమ వెనుకున్నవారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయనను ‘విలన్’గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘నేను దేశాన్ని నాశనం కానివ్వను. దేశాన్ని తలవంచనీయను. వాళ్లు ఎంత అంధకారం వ్యాపింపజేస్తే- నేను అంతలా కాంతులు వెదజల్లుతాను’- అని తాను రాసుకొన్న కవితా పంక్తులను మోదీ ఆచరణలో చూపిస్తున్నాడు. అదే విపక్షాల కోపానికి హేతువు!
‘మృగ-మీన-సజ్జన శత్రుత్వం’ గురిచి నీతిశాస్త్రం చెబుతుంది. మృగం- జింకకు పుట్టిన వెంటనే దానిని చంపే పులి శత్రువుగా ఉంటుంది. మీనం (చేప) జన్మించగానే జాలరి దానికి శత్రువు అవుతాడు. సజ్జనుడు జన్మించగానే- అతనికి శత్రువులు కూడా పుడతారని నీతిశాస్తక్రారులు చెప్తారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాగానే అతనికి దేశం నిండా విరోధులు తయారయ్యారు. రామభక్తులైన కరసేవకులను గుజరాత్‌లోని గోద్రాలో కొందరు దుర్మార్గులు రైల్లో సజీవ దహనం చేశారు. దాంతో గుజరాత్‌లోని హిందూ సమాజం భుగ్గమంది. గోద్రా అనంతరం గుజరాత్‌లో మత ఘర్షణలు జరిగి ఎందరో మరణించారు. అప్పుడు కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం పాలిస్తున్నా మోదీ వెంటనే అల్లర్లు ఆపడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను సహాయం అడిగాడు. లిఖిత పూర్వకంగా సహాయం అడిగినా, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సహాయాన్ని నిరాకరించాయి. ఈరోజు సెక్యులరిజం కోసం జబ్బలు చరిచే దిగ్విజయ్ సింగ్ నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. సూడో సెక్యులరిస్టులు ప్రతిదాంట్లోనూ ఓటునే వెతుక్కుంటారు.
గోద్రా సంఘటన, తదనంతరం జరిగిన అల్లర్లు మోదీని ఎంతగా అపఖ్యాతిపాలు చేశాయో, ఆయనకు అంతే పాపులారిటీని కూడా తెచ్చిపెట్టాయి. విచిత్రమేమిటంటే ఆయనకు ఉన్న పేరు ప్రతిష్ఠల కన్నా ‘సూడో సెక్యులర్ గ్యాంగ్’ మోదీకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. గుజరాత్ అల్లర్ల తర్వాత జరిగిన రాజకీయ పెనుమార్పులు మోదీని రాజకీయంగా ముందుకు నడిపాయి. యుద్ధం తర్వాత శాంతిలా గుజరాత్ ప్రజలు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నా దేశం నిండా ఉన్న సెక్యులర్ శక్తులు చేసిన అతి ప్రచారం మోదీకి కలిసి వచ్చింది. ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు గుజరాత్‌లో ఒక్క మత ఘర్షణ జరగలేదు. సరిగ్గా ఈ రోజు కూడా దేశంలోని చిన్నా పెద్దా పార్టీల నేతలు, కుహనా లౌకికవాద మేధావులు, ‘ఎర్ర’ జర్నలిస్టులు మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీపై నిరంకుశ ముద్ర వేసినట్లే, ఇప్పుడూ మోదీపై అలాంటి ఎత్తుగడనే వేస్తున్నారు.
వాధ్‌నగర్ రైల్వే స్టేషన్లో ‘టీ’ అమ్మిన ఓ చాయ్‌వాలా ఈ దేశానికి ప్రధానిగా ఐదు ఏళ్ళు కూడా పనిచేయకూడదా? నిరంతరం కమ్యూనిస్టులు మాట్లాడే బడుగు వర్గాల నుండి వచ్చిన వ్యక్తి అత్యున్నత పీఠంపై కూర్చోవడం నేరమా? సామాన్యుడిగా సగటు భారతీయుల జీవితాన్ని అనుభవించి నీతి నిజాయితీతో పాలించే వ్యక్తిపై ఎందుకు వీళ్లంతా బురద చల్లుతున్నారు? అమిత్ షాలోని అపర చాణక్య రాజనీతిని మోదీకి అంటగట్టి అతణ్ణి నిరంకుశుడిగా, దయాదాక్షిణ్యం లేని వ్యక్తిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? లౌకికవాదం నుండి నియంతగా చిత్రించే దుష్ప్రచారం వెనుక కథ ఏంటి?
నిజానికి మోదీ ప్రధాని గద్దెపై కూర్చోకముందే భయంకరమైన దుష్ప్రచా రం జరిగింది. ముస్లిం వర్గాల్లో భయాన్ని రేకెత్తించే పని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దేశంలో జరిగే ప్రతి సంఘటనపై మోదీ మాట్లాడాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద దేశంలో ఏ మారుమూల చిన్న సంఘటన జరిగినా దానికి మోదీనే బాధ్యుణ్ణి చేస్తున్నారు. ఇటీవల మో దీని ఎదుర్కోవడానికి వివిధ రాష్ట్రాల్లో బద్ధవిరోధులైన నాయకులు, పార్టీలు కలిసిపోవడం విడ్డూరం. మోదీ ఎమర్జెన్సీ విధించి పాలన చేస్తున్నాడా?
ఫోర్బ్స్ పత్రిక నివేదిక ప్రకారం మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. స్వయంగా కవి, రచయిత అయిన మోదీ అంతర్ముఖుడు. దాదాపు 14 ఏళ్ళకుపైగా గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి జాతీయవాద సంస్థలో నిబద్ధతగా పనిచేశాడు. ఇనే్నళ్లుగా అధికారంలో ఉన్నా తన కుటుంబాన్ని దగ్గరకు రానీయలేదు. దేశం కోసం చిన్ననాడే వివాహబంధాన్ని కూడా వదులుకున్నాడు. తనతోపాటు మంత్రులను కూడా నీతిపరులుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజాక్షేత్రానికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యాడు. సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. నోట్ల రద్దు ద్వారా తీవ్రవాదులకు డబ్బు అందకుండా చేశాడు. ఒక జవాను మరణిస్తే అందుకు బదులుగా నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టిస్తున్నాడు. దేశంలోకి విచ్చలవిడిగా ఎన్జీవోలకు వస్తున్న నిధులకు లెక్కలు అడుగుతున్నాడు. విదేశాల డబ్బుతో మత మార్పిళ్లు, అంతఃకలహాలు సృష్టిస్తున్న వ్యక్తుల, సంస్థల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసాడు. దేశదేశాల్లో భారతదేశం కీర్తిని ఇనుమడింపజేస్తున్నాడు. ఇప్పటివరకు భారత్ కనె్నత్తి చూడని దేశాలతో సైతం దౌత్య సంబంధాలు నెరపుతున్నాడు. తాను స్వచ్ఛంగా ఉంటూ దేశాన్ని స్వచ్ఛంగా ఉంచాలని ‘స్వచ్ఛ భారత్’కు సంకల్పించాడు. దేశాన్ని యోగమయం చేయడానికి ముస్లిం దేశాలను సైతం ఒప్పించాడు. 2016 అక్టోబర్‌లో సమాచార హక్కు చట్టప్రకారం తీసిన వివరాల్లో మోదీ ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా సెలవు తీసుకోలేదు. 1984 తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వానికి జీవం పోశాడు. ఇవన్నీ ఈ దేశంలోని సెక్యులర్ ముఠాకు నిరంకుశంగా కన్పిస్తున్నాయి.
డెబ్బై ఏళ్ళు అధికారం ఒకే కుటుంబం చేతిలో పెట్టి వాళ్ల మోచేతి నీళ్లు తాగే నాయకులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీని గద్దెనుండి దింపేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. మ తం పేరుతో డెబ్బై ఏళ్లు అనుసరించిన సంతుష్టీకరణకు కాలం చెల్లిందని ఇప్పటికైనా గ్రహించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. మత రాజకీయం చేస్తే ప్రజలు విడిపోయి అంతిమంగా మోదీకే లాభం కలుగుతుందని భావించిన ఈ శక్తులు కుల రాజకీయాలను ముందుకు తెస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని గౌరీ లంకేశ్ హత్య వరకు అన్నీ మోదీపై రుద్దేసి దుష్ప్రచారానికి పూనుకొంటున్నారు. ఇనే్నళ్లు కాంగ్రెస్ కుటుంబ పాలనను కళ్లకద్దుకొని స్వీకరించిన పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇపుడు ‘ఉత్తర భారత్, దక్షిణ భారత్’ పేరుతో అడ్డుగోడలు కడుతున్నారు. ద్రవిడ-ఆర్య పేరుతో కొత్త సిద్ధాంతాలను వల్లిస్తున్నారు. దక్షిణ భారతం నుండి ఉప రాష్టప్రతి పదవి పొందిన వెంకయ్య నాయుడును ఎవరు ఆ గద్దెపై కూర్చోబెట్టారు? భాజపాను పాతాళం నుండి భూమిపైకి తెచ్చిన అగ్రనేత అద్వానీని కాదని, దళిత మేధావి రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్టప్రతి పీఠంపై కూర్చోబెట్టింది ఎవరు? యూపీఏ ప్రభుత్వాన్ని ‘ఇల్లిజిటేట్’ అని విమర్శించిన అద్వానీపైకి ఎంపిలను ఉసిగొల్పిన సోనియా ఆయనపై గౌరవం ఒలకబోస్తోంది. భావ దారిద్య్రం ఏమిటంటే- ఒకనాడు అద్వానీని బూతులు తిట్టినవారే ఆయనపై కపటప్రేమ ప్రదర్శిస్తున్నారు.!
ఇటీవల త్రిపురలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఒకే విమానంలో అద్వానీతో పాటు కలిసి వెళ్లిన మోదీ, వేదికపై అద్వానీని పట్టించుకోలేదని గోల చేస్తున్నారు. అక్కడే ఉన్న మాజీ సీఎం, సిపీఎం నేత మాణిక్ సర్కార్‌ను ఆప్యాయంగా మోదీ పలకరించినా- అద్వానీ విషయంలో వివాదం సృష్టించేందుకు యత్నించారు. ఒకవేళ మాణిక్ సర్కార్‌ను మోదీ పట్టించుకోకపోతే దానిపై ఎలా విషం చిమ్మేవాళ్లో ఊహించవచ్చు. మహారాష్ట్ర సీఎం పీఠంపై బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూర్చోబెట్టినా, రాష్టప్రతి పదవిలో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను అలంకరింపజేసినా- మోదీ దృష్టిలో సమర్థతకే ప్రాధాన్యత. కులగజ్జిలో పొర్లాడుతున్న వ్యక్తులకు- మోదీ వ్యక్తిగత జీవితంలోని త్యాగబుద్ధి ఎలా అర్థమవుతుంది? చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగేలా ప్రకటించుకుంటే లోలోపల సంతోషపడేవారికి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను చూసి మురిసిపోయేవాళ్లకు మోదీని చూస్తే సంతోషం కలుగుతుందా?
సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేసి, ప్రతి రాష్ట్రంలో ఓ కుటుంబం అధికారం చెలాయిస్తోంది. వ్యక్తి ప్రాధాన్యత కన్నా వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ, వాటిని సంరక్షించడానికి ప్రాధాన్యం ఇస్తున్న మోదీ నియంతలా కాక ఇంకెలా కన్పిస్తాడు?! భాజాపా వాళ్లు పట్టించుకోకపోవడం వల్ల టీవీ చానళ్ల యాంకర్లు కూడా మోదీని ప్రధాని అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా నిందిస్తున్నారు.
సోనియా, దిగ్విజయ్ సింగ్, మణిశంకర్ అయ్యర్, రషీద్ అల్వీ, మమత, లాలూ, కేజ్రీవాల్, సల్మాన్ ఖుర్షీద్, అసదుద్దీన్ ఓవైసి, సీతారాం ఏచూరి, నారాయణ, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు తనపై విమర్శలు చేస్తున్నా- ఏ రోజూ వాళ్లను పనె్నత్తి మాట అనకుండా తన మార్గంలో తాను వెళ్తున్నాడు మోదీ. తిట్లు, శాపనార్థాలను పూలబాటలుగా మార్చుకొని ముందుకు సాగుతున్నాడు.
మోదీపై యుద్ధం ప్రకటించేందుకు వెళ్తున్న వీళ్లందరికీ భాజపా మాత్రం మంచిదట..!? వాళ్ల పోరాటం అంతా మోదీ, అమిత్ షాల అహంకారంపైనేనట! ఎంత ఆశ్చర్యం..!? అరవై ఏళ్లు అధికారం అనుభవించి వృద్ధనాయకులను సైతం తన వెంట చిన్నపిల్లల్లా తిప్పుకొంటూ, బడిపిల్లల్లా వారిని నిలబెట్టి మాట్లాడిన సోనియా గాంధీ శాంతమూర్తి? ప్రజాస్వామ్యవాది? మొదటిసారి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోకి  అడుగుపెడుతూ ఉద్విగ్నతకు లోనై- ‘ఔరా! ప్రజాస్వామ్యం ఎంత గొప్పది!’ అని పార్లమెంట్ భవనం మెట్ల వద్ద సాష్టాంగ ప్రణామం చేసిన నరేంద్ర మోదీ నిరంకుశుడా?!

****************************************************
-డా. పి భాస్కరయోగి 
Published Andhrabhoomi :
Friday, March 30, 2018


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి