70 ఏళ్ల నుండి కొనసాగుతున్న తీవ్రవాదం, రాళ్లు విసరడం తగ్గిందా? ఉరీ, ఫుల్వామా ఘటనలు కూడా జరిగాయి కదా! మరి ఇలాంటి పరిస్థితుల్లో 370 రద్దు వల్ల తీవ్రవాదం పెరుగుతుందనడం ఆత్మహత్యా సదృశం. ప్రజలతో సంబంధం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఆదరాబాదరాగా బిల్లు ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. డెబ్భై ఏళ్ల చర్చ ఇంకెంత కాలం కొనసాగిస్తాం?
‘‘హే! ఈశ్‌ భారత్‌ వర్ష్‌ మే శత్‌బార్‌ మేరా జన్మ్‌ హో
కారణ్‌ సదాహీ మృత్యు కా దేశోపకారక్‌ కర్మ్‌ హో’’
ఓ ఈశ్వరా! నేను వందసార్లు భారత ధరిత్రిపై జన్మించాలి. ప్రతిసారీ దేశానికి మేలు చేసే పనిలోనే మరణించాలి... గోరఖ్‌పూర్‌ జైల్లో ఉరికంబం ఎక్కేముందు రాంప్రసాద్‌ బిస్మిల్‌ చెప్పిన మాటలివి. కశ్మీర్‌ విషయంలో మోడీ,షాలు ఆగస్టు 5న చేసిన సాహసం చూసి దేశంలోని ప్రతి పౌరుడూ ఇలాంటి ఉద్విగ్నతకు లోనయ్యాడు. కానీ,దురదృష్టమేమిటంటే సంతుష్టీకరణకు వకాల్తా పుచ్చుకున్న నాయకులూ, కొన్ని పార్టీలూ, లిబరల్స్‌, సూడో సెక్యులర్‌ హర్యాలీగ్యాంగ్‌ మాత్రం యథాలాపంగా ఏడుపుగొట్టు రాగాలు మొదలు పెట్టారు.
మన దేశంలో 1925లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్యం వచ్చే వరకూ దేశ రాజకీయాల్లో పాగా వేయాలని చూసింది. కానీ, వేళ్లూనుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ ప్రయత్నాలు సాగనివ్వలేదు. దానితో కమ్యూనిస్టులు అప్పటి నుండి కాంగ్రెస్‌ గోడ దూకారు. నెహ్రూ సోషలిస్టు మనస్తత్వం వాళ్లకు లడ్డూలా దొరికింది. తమ లక్ష్యాలను నెహ్రూ కాంగ్రెస్‌ ద్వారా సాధించాలనుకున్నారు. 1950 నుండే నెహ్రూ తనను తాను అంతర్జాతీయ నాయకుడిగా భావించుకొని, అలాంటి ఉద్వేగంలో కొట్టుకుపోతూ చేసిన తప్పిదాలు తదనంతర కాలంలో భారత్‌కు శాపమయ్యాయి. ఆయన చుట్టూ చేరిన వి.కె. కృష్ణమీనన్‌ లాంటి వాళ్లు తమ రహస్య ఎజెండాను చక్కగా అమలు పరిచారు. 1964 నుండే కమ్యూనిస్టుల వలసలు కాంగ్రెస్‌లోకి బహిరంగంగానే జరిగాయి. నాటి కమ్యూనిస్టు నేతలు రజనీ పటేల్‌, కె.వి.రఘునాథరెడ్డి, ఆర్కే ఖాదిల్కర్‌, నూరుల్‌ హసన్‌,, డి.పి.ఛటోపాధ్యాయ, నందిని శత్పత్తి, ధర్మవీర్‌ సిన్హా, కె.ఆర్‌.గణేశ్‌, అర్జున్‌ ఆరోర, చింతామణి పాణిగ్రాహి... వంటి వారు కాంగ్రెస్‌ను నడిపించారు. వీరి కమ్యూనిస్టు ఎజెండా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత ఎజెండాగా మారింది. ఈ విధంగా 130 ఏళ్ల కాంగ్రెస్‌ రక్తంలో నిఖార్సయిన ఎరుపుదనం కలిసిపోయింది. అందుకే 370 ఆర్టికల్‌ రద్దుపై దేశమంతా మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తే, కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు మాత్రమే గుడ్డిగా వ్యతిరేకించారు. జ్యోతిరాదిత్య సింధియా, దీపేందర్‌ హూడా, జనార్థన్‌ ద్వివేది, మిళింద్‌ దేవర, భువనేశ్వర్‌ కలితా వంటి కాంగ్రెస్‌ నాయకులు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. గులాం నబీ ఆజాద్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో ఈ రద్దును వ్యతిరేకించిన కరణ్‌సింగ్‌ రెండు రోజుల తర్వాత సమర్థించారు. కానీ బుద్ధి జీవులు పత్రికల్లో, టీవీ ఛానళ్లలో తమ ఎర్ర మెదళ్ల నుండి విషం చిమ్మడం మొదలుపెట్టారు. కశ్మీరియత్‌ నాశనమైందని, ఫెడరల్‌ స్ఫూర్తి దెబ్బతిన్నదని, ఇందులో మత కోణం ఉందని, కశ్మీరీలు మరింత మంది తీవ్రవాదులవుతారని, మోనార్కిజంలో ఇదంతా మోదీ, షా చేశారని బెదిరింపులకు దిగారు.
వీరి దృష్టిలో కశ్మీరియత్‌ అంటే ఏమిటో చెప్పరు? అక్కడ ఆదిశంకరాచార్య హిల్‌, హజ్రత్‌బల్‌, వైష్ణోదేవి, కల్హణుడి రాజతరంగిణి, కశ్యప మహర్షి మూలతత్వం, హిమవన్నగాల సొగసులు, కశ్మీర్‌ శైవం, అందమైన సెలయేళ్లు, కుంకుమ పువ్వుల సుగంధాలు ఇవి కదా కశ్మీరియత్‌ అంటే! మరి ఇప్పుడు బుర్హన్‌ వనీ, అఫ్జల్‌ గురుల ఆరాధన, జైష్‌ ఏ మహ్మద్‌ తీవ్రవాదం, పాకిస్థాన్‌ భజన,.. ఈ కశ్మీరియత్‌ గురించేనా వీరంతా వాపోతున్నది? అక్కడి జమ్ము, లద్దాఖ్‌ ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కశ్మీరీలు అంటే మీ దృష్టిలో లోయలో ఉండే ముస్లిములేనా? దేశంలోని మైనార్టీలపై ప్రేమ ఒలకబోసే మీరందరూ జమ్మూకశ్మీర్‌లోని మైనారిటీల గురించి ఆలోచించారా? లద్దాఖ్‌ ఎంపీ నంగ్యాల్‌ పార్లమెంటులో ఇలాంటి దుర్నీతిని చీల్చి చెండాడుతుంటే మీ తలలు ఎక్కడ పెట్టుకున్నారు? అర్బన్‌ నక్సల్స్‌ విశ్లేషకులుగా మారి ఏది బడితే అది మాట్లాడటం ఎంతవరకు సబబు? ముస్లిములు అధికంగా ఉన్న కశ్మీర్‌ను బూచిగా చూపి సంతుష్టీకరణ రాజకీయాలు చేసి ‘మేం ప్రత్యేకం’ అన్న భావన కల్పించారు కదా! దానికి బలాన్నిచ్చే 370 అధికరణ, 35 ఏను రద్దు చేస్తే దేశం విభజింపబడుతుందా?
‘ప్రత్యేకత పొందినవి ఏవైనా నశించిపోతాయి’ అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. ‘మెజార్టీలో కలిసిపోకుండా ఏ మైనార్టీకీ భవిష్యత్తు ఉండదు’ అంటాడు దళిత కవి బోయి భీమన్న. మహమ్మద్‌ బతికి ఉన్న కాలంలో మలబార్‌ తీరంలో ప్రపపంచంలోనే రెండవ మసీదును నిర్మింపజేసి మహ్మద్‌ ప్రవక్త వారసులకు ఆశ్రయమిచ్చి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు సింధూ ప్రాంతాన్ని ఏలిన హిందూ రాజు దాహిర్‌ సేన్‌. ఈయనలోని ఈ ‘సెక్యులర్‌ భావనే’ భారత్‌ను దాదాపు 800 ఏళ్లు బానిసత్వంలోకి నెట్టింది. క్రీ.శ. 638 నుండి 712 వరకు 74 ఏండ్లలో 15 సార్లు భారత్‌లోకి జీహాదీ శక్తులు చొరబడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అయితే క్రీ.శ.712 జూన్‌ 16న దాహిర్‌ సేన్‌ కూలిపోవడంతో మహమ్మద్‌ బిన్‌ కాశిం మనదేశంలోకి చొరబడ్డాడు. దాని కొనసాగింపే పాకిస్థాన్‌ మనపై ఉసిగొల్పుతున్న తీవ్రవాదం. దీని మూలాన్ని అర్థం చేసుకోకుండా కశ్మీర్‌ను ఓ సాధారణ సమస్యగా భావిస్తే ఎలా? ఆ రాష్ట్రం విభజన జరిగాక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆ దేశ పార్లమెంటులో మాట్లాడుతూ ‘మా వారసత్వం మదీనాలో ఉంది’ అన్నాడు. ఆ రోగాన్ని కొందరు మోస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుంటే కశ్మీరియత్‌ నిలబడుతుందా?
జాతీయవాద ముస్లిములు కంటికి కనిపించరా?‘మతపరంగా మాకు పునర్జన్మ లేకున్నా భారత్‌కు స్వాతంత్ర్యం సాధించేందుకు మళ్లీ ఈ గడ్డపై జన్మిస్తాను’ అన్న అష్ఫఖుల్లా ఖాన్‌ కన్నా గొప్ప జాతీయ వాది ఎవరు? ముస్లిం లీగ్‌ను ఎదిరించి భారత సైక్యులరిజాన్ని కోరుకున్న సరిహద్దు గాంధీ బాద్షాఖాన్‌ను ఎప్పుడైనా తలచుకున్నారా? భారత్‌లో మణిరత్నాలుగా వెలిగిన రజియా సుల్తానా, సర్‌ సయ్యద్‌, మౌలానా ఖ్వాజా మొయినొద్దీన్‌ చిస్తీ, ఏపీజె అబ్దుల్‌ కలామ్‌ గురించి ఈ బుద్ధి జీవుల కలం ఏనాడైనా కదిలిందా? కమ్యూనిస్టుల దృష్టిలో షేక్‌ అబ్దుల్లా, ముఫ్తీ, గిలానీలకున్న స్థానం వీరికి లేదు. కశ్మీరీ పండిట్‌లు ఢిల్లీ వీధుల్లో అడుక్కు తింటుంటే ఏనాడైనా పట్టించుకొన్నారా? హురియత్‌ నేతల ఇళ్లముందు పడిగాపులు కాసిన సీతారాం ఏచూరి అశోక్‌ పండిట్‌, సుశీల్‌ పండిట్‌ ఇళ్లకు వెళ్లారా? 4 లక్షల మంది పండిట్‌లు కశ్మీర్‌ నుంచి వలస పోయినప్పుడు ఒక్క కన్నీటి బొట్టైనా కార్చారా?
70 ఏళ్ల నుండి కొనసాగుతున్న తీవ్రవాదం, రాళ్లు విసరడం తగ్గిందా? ఉరీ, ఫుల్వామా ఘటనలు కూడా జరిగాయి కదా! మరి ఇలాంటి పరిస్థితుల్లో 370 రద్దు వల్ల తీవ్రవాదం పెరుగుతుందనడం ఆత్మహత్యా సదృశం. ప్రజలతో సంబంధం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఆదరాబాదరాగా బిల్లు ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. డెబ్భై ఏళ్ల చర్చ ఇంకెంత కాలం? గతంలో షేక్‌ అబ్దుల్లాను అరెస్ట్‌ చేసినప్పుడు, జైలు నుండి విడుదల చేసి నేరుగా ముఖ్యమంత్రిని చేసినప్పుడు వీరేమైనా అడిగారా? వీళ్లు చెప్పే ప్రజస్వామ్యంలో పార్లమెంటు సభ్యులను ప్రజలు ఎన్నుకోరా? ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయమే అభిప్రాయం కాదా? ఇదంతా మనం చర్చకు తొడిగిన ఆర్టిఫీషియల్‌ ఫేస్‌ కాదా? వేర్పాటు వాదులు ఆరాధించే మహమ్మదాలీ జిన్నా తాత, జుల్ఫికర్‌ అలీ భుట్టో తల్లి హిందువులే! షేక్‌ అబ్దుల్లా పూర్వీకులు హిందువులే అని ఫరూక్‌ అబ్దుల్లాయే చెప్పాడు. ఈ లోతుపాతులన్నీ గమనించకుండా భావ స్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడటం విజ్ఞులమని ప్రకటించుకుంటున్న వాళ్లకు తగదు. ఇలా పునాది కొరవడిన వెన్నెముక లేని తర్కంతో, మితిమీరిన హేతురహిత వాదనలతో దేశద్రోహం చేయడం మంచిది కాదు. ‘దేశం బతికున్నప్పుడు నీవు మరణిస్తే కలిగే నష్టం ఏమిటి? నీ దేశం సర్వనాశనం అవుతుంటే నీవు జీవించి ప్రయోజనం ఏమిటి? అన్న స్వాతంత్ర్య సమరయోధుల మాటలు గుర్తు తెచ్చుకుని దేశ చరిత్ర గతిని మలుపు తిప్పే మైలురాయి వద్ద నిలబడదామా? మతిలేని గతి తర్కంతో చరిత్ర హీనులవుదామా?

*********************************

* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఎడిటోరియల్ : ఆంధ్రజ్యోతి*
*24-08-2019 : శనివారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి