ఇద్దరు గొప్ప గురువులు సంవాదానికి వస్తున్నారని తెలిసి రెండువైపుల నుంచీ శిష్యులు ఒకచోటుకు చేరారు. మా గురువు గొప్పవాడంటే.. కాదు మా గురువే అధికుడని వాదించుకున్నారు. అందరూ చూస్తుండగా గురువులిద్దరూ వేదికపైకి చేరారు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకున్నారు. కాంతి ఏకమయ్యింది. తర్కం, వాదం అన్నీ మాయమైపోయాయి. ఇద్దరూ తమ తత్వాలను ఒకటిగా చేసుకున్నారు. రెండు వేర్వేరు తత్వాలు లేవని గ్రహించి వెళ్లిపోయారు. ఇదో చిన్న వేదాంత కథ. చాలామంది తమకు తెలిసిన చిన్నచిన్న విషయాలనే గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంగా భావిస్తుంటారు. కానీ, జ్ఞానుల దర్శనం చాలా లోతైనది. కొందరైతే మోక్షాన్ని కూడా బంధనంగా భావించారు. బౌద్ధం మోక్షానికి ‘నిర్వాణం’ అనే పదాన్ని వాడింది. అలాగే.. ‘ఏ సాధన నీకెందుకు?’ అని అచలతత్వం ప్రశ్నించింది. ‘నీవు వేసిన జ్ఞానపుటడుగుల పాదముద్రలను కూడా మనసులో ఉంచుకోవద్దు’ అన్నాడో ఆధునిక తత్వవేత్త.
 
గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞాన తత్పరః
పలాలమివ ధాన్యార్థీ త్యజేద్గ్రంథమశేషతః
 
వ్యవసాయదారుడు ధాన్యాన్ని గ్రహించిన తర్వాత కసవును విడిచిపెట్టినట్లు బుద్ధిమంతుడైనవాడు వేదాంత శాస్త్రాలను గురూపదేశపూర్వకంగా అభ్యసించి బ్రహ్మసాక్షాత్కారం పొందిన తర్వాత ఆ గ్రంథంతో పనిలేదు కాబట్టి విడిచిపెట్టాలని ఉత్తరగీత చెప్పింది. ఇందుకు అగ్నిహోత్రమే గొప్ప ఉదాహరణ. అగ్ని..
 
యజ్ఞసయమంలో అన్ని సమిధలనూ భస్మం చేస్తుంది. సమిధల లక్ష్యాన్ని, రుత్విక్కుల లక్ష్యాన్ని, యజ్ఞకర్త లక్ష్యాన్ని.. తాను మండడం అనే ఒకే క్రియ ద్వారా చేస్తుంది. హవిస్సులను అగ్నిదేవుడు దేవతలకు అందిస్తాడు. తాను మండుతూ మండుతూ చివరికి తన రూపాన్ని ఉపసంహరించుకుంటాడు. అది ఏమీ లేని స్థితి. ఇలాంటిదే సాధనలో అతీత అవస్థ.
 
సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః
 
‘సమస్త ధర్మాలనూ నాయందు త్యజించి నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపాల నుంచీ విముక్తుడిని చేస్తాను. నీవు శోకించవద్దు’ అన్నాడు కృష్ణుడు. ఇక్కడ సర్వధర్మాలంటే అన్నిరకాల బంధాలు అని అర్థం చేసుకోవచ్చు. ఆయనను శరణం పొందడమంటే.. మన ఉనికిలేని అతీత స్థితి. అన్ని పాపాలు అంటే.. అన్ని చిత్తవృత్తులని అర్థం. అదొక యోగం. అన్నీ వదిలిపెట్టిన లయ యోగం. సమర్పణ భావం. ఇది అన్ని సాధనలకూ అతీతస్థితి. వశిష్ఠుడు మొదలుకొని సజీవంగా మన ముందు కదులుతున్న గురు గెంటేల వెంకటరమణుల వరకూ అందరూ అనుభూతి పొందుతున్న సిద్ధ సాధన.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 26 - 08 - 2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి