పురాణ కథలు అనగానే చాలామంది తానున్న కాలానికి అన్వయించుకొని ద్వేషిస్తారు. ఈ సమాజం ఏది ఉత్తమమైందో దాన్ని మాత్రమే గ్రహిస్తుంది. చాలావరకు పురాణగాథల్లో అనేక ప్రతీకలుంటాయి. ‘అర్ధనారీశ్వర స్వరూపం’ తీసుకుందాం. ఎక్కడైనా స్ర్తీ పురుషులు అతుక్కొని ఉంటారా? ఈ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకొన్నారో గ్రహించాలి. సృష్టికి తల్లిదండ్రులుగా శివపార్వతులను చెబుతారు. ‘‘జగతః పితరౌ’’ అన్నారు.
సృష్టి ఏర్పడాలంటే స్ర్తీ-పురుషుల కలయిక అవసరమని చెప్పే రూపం అది. ఎక్స్, వై క్రోమోజోములను మనంవెళ్లి చూడకున్నా నమ్మేస్తాం. కానీ సృష్టికి మూలం అర్ధనారీశ్వరతత్వం అని చెప్పే ప్రతీకను పట్టించుకోం. అలాగే.. గణపతి విగ్రహం కేవలం దేవతార్చనకు మాత్రమే కాదు. అందులో నేర్చుకోదగిన ఎన్నో అంశాలున్నాయి.
పెద్ద చెవులు- ఎక్కువ విషయ గ్రహణానికి, చిన్నకళ్లు- సూక్మదృష్టికి, ఏనుగు తల పెద్దదైన బుద్ధికి, ఎలుకవాహనం శ్రద్ధకు, విరిగిన దంతం అహంకార నాశనానికి, సర్ప యజ్ఞోపవీతం సకల జీవారాధనకు, శూలం, అక్షమాల శత్రునిర్మూలనకు, జప యజ్ఞానికి, ఉండ్రాళ్ల నైవేద్యం నిరాడంబర ఆహారానికి, వినాయక చవితిలో వాడే పత్రాలు పాకృతిక పరిజ్ఞానానికి ప్రతీకలు. అలాగే హనుమంతుడు లంకకు వెళ్తుంటే.. మైనాకుడు అడ్డుగావచ్చి తనపై సేద దీర్చుకోమంటాడు. కానీ ఆంజనేయుడు తిరస్కరిస్తాడు.
కార్యసాధకుడు సుఖదుఃఖాలను లక్ష్యపెట్టవద్దని చెప్పినట్లే చెప్పి.. కేవలం సుఖం ఆశించి అందులో ఇరుక్కోగూడదు అనేది ఇందులో సందేశం. సురస అనే రాక్షసి కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది. ఈ సురస ఆశకు ప్రతీక. హనుమంతుడు సురసను తప్పిస్తాడు. సుఖం, ఆశ అనే బాహ్య శత్రువులను తప్పించుకొని ముందుకు వెళ్లేవాడే కార్యజయుడవుతాడు. అసూయకు ప్రతీకయిన సింహికను సంహరించి లంకను చేరాక.. లంకిణి అడ్డుకొంటుంది. అది అహంకారానికి ప్రతీక. ఆమెను చావుదెబ్బ కొడతాడు.
అసూయ, అహంకారం అదృశ్యంగా ఉన్న మనస్సును భ్రమల్లో ముంచే బాహ్య శత్రువులు. మనలోనే అదృశ్యంగా ఉన్న అంతఃశత్రువులను జయిస్తేగాని.. పరమాత్మ దర్శనం జరగదు. బతుకమ్మ పండుగలో వాడే పూలు ప్రకృతికి సంకేతం. చెక్కపీటపై శ్రీచక్రం ముగ్గుగా వేస్తారు. దానిపై పళ్లెంలో వర్తులాకారంగా పేర్చే పూలరాశిలో షట్చక్రాలున్నాయి. పైన గౌరమ్మ.. సహస్రార చక్ర నిలయంగా కన్పిస్తుంది.
బతుకమ్మ చుట్టు తిరుగుతూ పాడే పాటలు.. ఆగకుండా నడిచే వాదానికి ప్రతీక. ఆలయాల్లో పంచకోశాలుంటాయి. మొదటి ప్రాకారంలో అన్నమయ కోశంలో మతాతీత, లౌకిక, సామాజిక కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది ప్రాణమయకోశంలో అలంకార, వాహన, కల్యాణ, పరివార దేవతలు, యజ్ఞశాల, వంటగది ఉంటాయి. మూడోది విజ్ఞానమయకోశంలో మహామండపం, వాహన మండపం, బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి.
నాలుగో మనోమయకోశం ప్రదక్షిణ స్థలం. ఇది సాధనా స్థలి. చివరిదైన ఆనందమయకోశంలో గర్భగృహం ఉండి.. ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఉంటాడు. ఇవన్నీ తెలుసుకొన్న తర్వాత అందులోని సంకేతాలు, ప్రతీకలు గ్రహిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో గ్రహించగల్గుతాం.
***********************************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 23 - 09 - 2019 : సోమవారం*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 23 - 09 - 2019 : సోమవారం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి