స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో సుమా రు 550 సంస్థానాలుంటే వాటిలో పెద్ద సంస్థానం హైదరాబాద్. 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న హైదరాబాద్ సంస్థానం ప్రస్తుతం గ్రేట్ బ్రిటన్ అంత పెద్దది. తెలంగాణను మూడు భాగాలుగా చేస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, అత్రాఫ్‌బల్దా, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్- అనే 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతంలోను, బీడ్, పర్బనీ, ఉస్మానాబాద్, నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలు మహారాష్టల్రోను, బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి.
హైదరాబాద్ సంస్థానంలో 88 శాతం హిందువులు, మిగతా మతాలవారు 12 శాతం ఉండేవారు. భాషాపరంగా చూస్తే 1951 జనాభా లెక్కల ప్రకారం తెలుగు మాట్లాడేవాళ్లు 50 శాతం, మరాఠీ మాట్లాడేవారు 25 శాతం, కన్నడ మాట్లాడేవారు 11 శాతం, ఉర్దూ మాతృభాషగా గలవారు 12 శాతం ఉన్నప్పటికీ పాలకుడిగా ముస్లిం రాజైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉండడం వల్ల ఇక్కడ ‘అనల్ మాలిక్’- ముస్లిములంతా పాలకులే అన్న నినాదం బాగా పనిచేసింది.
క్రీ.శ. 1323లో ప్రతాపరుద్రుని మరణం తర్వాత విశాల కాకతీయ సామ్రాజ్యం ధ్వంసం అవ్వడంతో ఇక్కడి మెజారిటీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. సుమారు 625 సంవత్సరాల కాలవ్యవధిలో ఇక్కడి ప్రజలు ఎదుర్కోని కష్టం లేదు, అనుభవించని దుఃఖం లేదు. క్రీ.శ. 1321లో ఘియాజుద్దీన్ ఆదేశంతో దక్షిణాదిపై దండయాత్రకు వచ్చిన ఉలుఘ్‌ఖాన్‌ను రుద్రదేవుడు, అన్నదేవుడు మొదటిసారి ఎదుర్కొన్నారు.
మరోసారి నాలుగు నెలలకే మిడతల దండులా కాకతీయ సామ్రాజ్యంపై దాడిచేస్తే అక్కడి ప్రజల సంరక్షణార్థం ప్రతాపరుద్రుడు లొంగిపోయాడు. ఉలుఘ్‌ఖాన్ ప్రతాపరుద్రుణ్ణి బంధించి ఖ్వాజా హాజీ, మాలిక్ చౌదర్‌లు ఢిల్లీకి పంపగా దారిలో ఈ అవమానం భరించలేక నర్మదా నదిలో దూకి చనిపోయాడు. ఇలా ఆలోచిస్తే తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన మొదటి అమరవీరుడు ప్రతాపరుద్రుడే.
ప్రతాపరుద్రుని మరణంతో ఓరుగల్లు సాంస్కృతికంగా విధ్వంసం అయ్యింది. ఢిల్లీ సుల్తానుల ఆధ్వర్యంలో ఓరుగల్లు సుల్తాన్‌పూర్‌గా మారింది. వారి మత దురభిమాన పాలనను ‘విలసతామ్ర శాసనం’ కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆ తర్వాత ‘హిందూ ధర్మం - హిందూ రాజ్యం’ అన్న నినాదాన్ని ఈ గడ్డపైనుండి మొదట ఇచ్చిన వీరుడు ముసునూరి ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1325-1333) అసమాన ధైర్యసాహసాలతో ప్రతాపరుద్రుని వెంట నడిచిన 75 మంది నాయకులను తన వెంట తీసుకొని అనతికాలంలోనే తీరస్థాంధ్రం ప్రాంతానికి ఢిల్లీ సుల్తానుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాడు.
ఆయన తన ప్రయత్నాన్ని అలాగే కొనసాగిస్తూ తూర్పు కనుమలకు ఎగువ భాగంలోని భౌగోళికంగా నిజాం ప్రాంతంగా మనం తర్వాత చెప్పుకొన్న తెలంగాణ విముక్తికి భద్రాచలం దగ్గరున్న రేకపల్లిని రాజధానిగా చేసుకొన్నాడు. ప్రోల య నాయకుడి హిందూ ధర్మరక్షణ సంకల్పం- కార్యాచరణ వెన్నయకు విలసగ్రామం అగ్రహారంగా ఇచ్చిన సందర్భంలో రాసిన విలస తామ్ర శాసనంలో కన్పిస్తున్నది. ఈ విలసనే నేడు ప్రాజెక్టు కడుతున్న పోలవరం. ఈ పోలవరం గ్రామం ప్రోలయ నాయకుడి పేరుమీద ఏర్పడిందే.
ఈయన సంకల్పాన్ని పూర్తిచేసేందుకు రంగంలోకి దిగిన (ప్రోలయ పినతండ్రి కొడుకు) కాపయ నాయకుడు తెలంగాణ చరిత్రలో మరో ధృవతార. ఢిల్లీ సుల్తానులను ఎదిరించేందుకు కాపయ 1347 ప్రాంతంలో అల్లావుద్దీన్‌కు సహాయం చేసి దక్షిణాదిన బహమనీ సామ్రాజ్యం ఏర్పడేందుకు తోడ్పడ్డాడు. అలా మొదలైన దారుల్ ఇస్లాం పాలన బహమనీ సుల్తానులు (1347-1518), కుతుబ్‌షాహీలు (1518-1687), అసఫ్ జాహీల (1724-1948) పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని రక్తసిక్తం చేసింది.
ఈ ఆరువందల ఏళ్ళలో తెలంగాణలో హిందువులకు ఆరేళ్లు కూడా సరైన సుఖం లేదు. కొంతవరకు కుతుబ్‌షాహీల కాలంలో స్థానిక భాషలు, పాక్షిక మత సహనం, సాంస్కృతిక, సాహిత్యాలను హరించుకు తిన్నదే. అసఫ్ జాహీల వంశస్థాపకుడైన మీర్ కమ్రుద్దీన్ 1724లో పాలన మొదలుపెట్టాక వచ్చిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్‌ను మినహాయిస్తే మిగతా పాలనలో పెద్దగా హిందువులకు ఒరిగిందేమీ లేదు. ఆ మహబూబ్ అలీ వెంట మొదటి సాలార్‌జంగ్ వంటి సంస్కరణవాది, రాజాకిషన్ ప్రసాద్ వంటి గొప్ప వ్యక్తి ప్రధానిగా ఉండడం, అతను సూఫీ మార్గాన్ని అనుసరించడం అతని ఆమాత్రం మతసహనానికి కారణాలుగా చెప్పవచ్చు.
ఇక 1911లో సింహాసనమెక్కిన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వం, ధనాశ, మతవ్ఢ్యౌం, అహంకారం అసఫ్ జాహీల వంశ నాశనానికే కారణం అయ్యింది. బహమనీల కాలంలో మొదలైన ఆపాకీల దిగుమతి కేవలం ఉద్యోగాల కారణమైతే 7వ నిజాం కాలంలోకి వచ్చేసరికి అది మతపరమైన వలసగా మారిపోయింది. పఠాన్లు, వజీర్లు ఇక్కడ ఉస్మానిస్తాన్ కోసం రప్పించుకొన్నారు. దారుల్ ఇస్లాం రాజ్యభావనతో దాన్ని సుస్థిరపరిచేందుకు రజాకార్- శాంతి కోరే స్వచ్ఛంద సేవకులు- అనే పేరున 1927-28లోనే ప్రారంభమైంది. మొదట దీని పేరు ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లిమీన్’. తర్వాత 1929లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా మారిపోయింది. దీనికి మొదట బహద్దూర్ యార్ జంగ్, తర్వాత ఖాసీం రజ్వీ అధ్యక్షులై కొనసాగించిన నరమేధం చరిత్రను ‘సెప్టెంబర్ 17’గా ఆవిర్భవింపజేసింది.
షేక్ బందగీ, దొడ్డి కొమరయ్య, రాంజీ గోండు, కొ మరం భీం, పుట్నాల రామ క్క, జీటోతు పూలమ్మ, చాకలి ఐలమ్మ, మొగిలయ్య గౌడ్, నారాయణరెడ్డి, షహీద్, శ్యాం లాల్, వేదప్రకాశ్, ధర్మప్రకాశ్, బండి యాదగిరి, శఠగోపాచారి, రామారావు పట్వారి, నారాయణరావు మక్తేదార్, రేణిగుంట రామిరెడ్డి, షోయబుల్లాఖాన్, పోలీసు పటేల్ రాజిరెడ్డి వంటి ఎందరో బలిదానాలు చేసి తెలంగాణకు విమోచనం కల్పించారు. చివరకు భారత బిస్మార్క్‌గా పేరొందిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛావాయువులు పీల్చుకొన్నారు.
వారి స్ఫూర్తి అన్ని వర్గాలకు కల్పించాల్సిన మనం- నేడు సంతుష్టీకరణకు అలవాటుపడి చరిత్ర అనే సూదిని బట్టలో కట్టి దాచేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా నిజాం రజాకార్లపై చేయాల్సిన పోరాటాన్ని ఇక్కడి భూస్వాములపై చేసి సాయుధ పోరాటాల పేరుతో వందల పుటలు చరిత్రగా రాసేసుకున్నారు. ఇక్కడి విమోచనను ఏ ముస్లింగాని, ఆఖరుకు మజ్లిస్‌గానీ నేరుగా వ్యతిరేకించకున్నా మేధావుల పేరుతో ప్రచార ప్రసార మాధ్యమాలలో చొరబడ్డవారే పాలకులను భయపెడుతూ వచ్చారు.
ఇప్పుడూ విమోచన కూడా అలాంటి ఏడ్పుగొట్టు రాగాలతో అదే దిక్కుమాలిన సిద్ధాంతాలతో, తర్కంతో వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ చరిత్ర హననానికి పాల్పడడం ఇదేం కొత్తకాదు. తెలంగాణలో 4వేల మంది మరణానికి కారణమైన సాయుధ పోరాటం కొనసాగించాలా? వద్దా?? అని అడిగేందుకు 1951లో అజయ్ ఘోష్, అమృత్ డాంగే, మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు బృందం మాస్కో వెళ్లి స్టాలిన్‌ను కలిసి విన్నవించుకొన్నారు. సమస్యను సాంతం విన్న స్టాలిన్ హైదరాబాద్ మ్యాప్‌ను పరిశీలించి ‘ఈ ప్రాంతం నుండి మీరు బయటపడేందుకు సముద్రం ఉందా? ఇంకెలా ఉద్యమం చేస్తారు?’ అని ప్రశ్నించాడు. అబద్ధపు చరిత్రలతో చరిత్రను గతి తప్పించినా ఇక్కడి ప్రజల మెదళ్లలో సెప్టెంబర్ 17 విమోచనదినంగానే పదిలమై ఉంది.
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి