మన ధర్మంలో ప్రతిరోజూ పండగే. ప్రత్యేకించి ప్రతి మాసంలో ఏదో ఒక పెద్ద పండుగ వస్తూనే ఉంటుంది. ఈ పండుగలన్నీ కేవలం మనం ఆనందించడానికి కాదు.. మనకు నూతనోత్సాహాన్ని కలిగిస్తూనే జ్ఞాన మార్గంవైపు తీసుకెళ్లేవి. కానీ, ఇటీవలికాలంలో మనం పండుగలను కేవలం వినోద కార్యక్రమాల స్థాయికి దిగజార్చడం కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. దీనికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో.. పండుగలను ఆచరించడం వెనుక ఉన్న మూల భావనను పూర్తిగా కోల్పోతాం. సంసార సంబంధమైన దుఃఖం నుండి తరింపజేసేందుకు విద్వాంసులు చేసే కార్యక్రమానికే ఉత్సవం అని పేరు అని ఆగమాలు నిర్వచిస్తున్నాయి. కానీ మనం పండుగలకు, ఉత్సవాలకున్న సజీవ లక్షణాన్ని ధ్వంసం చేసి వాటి అంతరార్థాల్ని మరుస్తున్నాం.
 
పర్వదినాల సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ఊరేగింపుల్లో భాగంగా ఆయా దేవతా మూర్తులు వాహనాలపై వెళ్తున్నప్పుడు ఆ యాత్రను అనుసరించడం, స్తోత్రం చేయడం, కీర్తించడం, నృత్య గీతాలతో ఆనందాన్ని వ్యక్తపరచడం ‘అపవర్గ సాధకం’ అని ఆగమ శాస్త్రం తెలిపింది. అంటే మోక్షసాధన అని అర్థం. ఆ పరమాత్మను మనసు నిండా నిలుపుకొని అలాంటి సేవల్లో పాల్గొంటేనే ఇది సాధ్యం. కానీ, ఈ విషయం ఈ రోజు ఎవరికీ తెలియదు.

 భక్తులకే కాక అందరికీ ఇబ్బంది కలిగించే మైక్‌ సెట్లను ఉపయోగించడం, చెవులు బద్దలయ్యేలా సినిమా పాటలు పెట్టడం, కళ్లకు తీవ్ర హాని కలిగించే డిస్కో లైట్లను వెలిగించి ఆర్పుతుండడం, నృత్యాల పేరుతో అశ్లీల కదలికలతో గెంతులు వేయడం వంటి చర్యలతో పాపం మూటకట్టుకుంటున్నారు. షోడశోపచారాల్లో నృత్యం, గీతం కూడా భాగమేగానీ.. ఇలా కాదు. గణపతి ఉత్సవాలు, దేవీ నవరాత్రుల్లో చాలా మంది చేస్తున్నది ఇదే పని.
 
ఈ పర్వదినాల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించిన అతి కొద్దిమంది మాత్రమే సంప్రదాయం ప్రకారం, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఆ వేడుకలను నిర్వహిస్తున్నారు. అలాగే.. చిన్న చిన్న జన సమూహాలుండే కాలనీల్లో ఎక్కువ విగ్రహాలు పెట్టడం వల్ల సమాజంలోని ఏకత్వ భావనకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. పూర్వం దసరా లాంటి పండుగలు ఊరి ప్రజలంతా కలసి సామూహికంగా జరుపుకోవడం ద్వారా కలిసి ఉన్నామనే భావన పొందేవారు. ఆ కాలంలో డబ్బు కొరత ఉన్నా ఆనందానికి లోటు ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఆనందం తగ్గిపోయి అహంకారం పెరిగిపోయింది. కులాలవారీగా వేడుకలు నిర్వహిస్తూ దేవుడికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. ఇలా కృతకమైన ప్లాస్టిక్‌ జీవితాన్ని మన ఉత్సవాల్లో ప్రదర్శిస్తే ఇక భవిష్యత్తరాలకు మనం నేర్పగలిగేది ఏమీ ఉండదు.

**********************************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 21 - 10 - 2019 : సోమవారం*కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి