యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కొంద రు నటులు ఇటీవల ‘సేవ్ నల్లమల’ అంటూ నినాదం ఇచ్చారు. కొందరు కవులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఇచ్చిన ఈ నినాదాన్ని విజయ్ దేవరకొండ, అనసూయ లాంటి నటీనటులు, బుల్లితెర యాంకర్లు పునరుద్ఘాటించారు. గతంలో కమ్యూనిస్టులు ఇచ్చే నినాదాలను ప్రజలు అందిపుచ్చుకునేవారు. వామపక్షాల వారు విశ్వసనీయత కోల్పోయాక వాళ్ళిచ్చే పిలుపులను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే కొత్తబ్యాచ్ పట్టించుకోవడం బాగుంది.
ఈ బ్యాచ్ సెలబ్రిటీలుగా మారిపోయి దేశంలో చేస్తున్న ‘సాంస్కృతిక విధ్వంసం’ ఆపేందుకు ఎలాంటి ఉద్యమం చేయాలి?
అమీర్ ఖాన్, నసీరుద్దీన్ షా వంటి నటులు ఈ దేశం సురక్షితం కాదని కూనిరాగాలు తీస్తారు. విచ్చలవిడి శృంగారాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ- రాజకీయాలు చేసే ఎందరో నటీనటులు ఈ దేశంలో ఉన్నారు. సమాజాన్ని కలుషితం చేసే వాళ్ళే ‘గంగానదిలో కాలుష్యం’ వద్దని యాడ్స్‌లో నటిస్తారు. ఎంత విచిత్రం? ఇక తెలుగునాట అయితే సినిమా రంగంలో కొందరు చేసే ఆగడాలకు అంతేలేదు.
ఒక ప్రముఖ నటుడు వేరేవాళ్ళ ఇంటికి వెళ్లి కాల్పులు జరిపినట్టు వార్తలు వస్తాయి. ఆ కేసు పదేళ్లయినా తేలదు. మరో నటుడు హైదరాబాద్‌లో చెఱువులను కబ్జా చేసి ‘కనె్వన్షన్స్’ కట్టి దర్జాగా తన కార్యక్రమాలు చేసుకొంటున్నాడు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఆయన పక్కా నటుడు. ఇపుడు తెలంగాణకు వీర విధేయుడు. సదరు నటుడిపై పోరాటం చేసి ఎంతో సమాచారం ఫైళ్ళకు ఫైళ్ళు తయారుచేసిన సామాజిక కార్యకర్త కసిరెడ్డి భాస్కరరెడ్డి ఇపుడు ఈ తతంగమంతా చూసి ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు.
మరో పాతతరం ప్రముఖ నటుడు గత ప్రభుత్వాధినేతకు దగ్గరై ఎక్కడ అభివృద్ధి జరిగిందో అక్కడే నిర్మాణాలు చేసి కోట్లు గడించాడు. ఇందులో ప్రభుత్వం నేరుగా సహాయం చేయదు. కానీ ఇతని తెలివితేటలు అలా లాభం పొందేటట్లు చేస్తాయి. మత మార్పిడిలా ఇలాంటి వాళ్ళంతా ‘తెలంగాణ మార్పిడి’ అయి వీర తెలంగాణ వాదులయ్యారు. సినిమా నటుల కబ్జాలు, ఆక్రమణలు, ఎన్‌క్రోచ్‌మెంట్‌లు, భూముల రెగ్యులరైజేషన్‌లు, రాయితీలు.. వీటితో పెద్ద సినిమా తీయొచ్చు. అసలు ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ స్కీంలు ప్రజలకన్నా ఇలాంటి కబ్జాగ్యాంగులకే బాగా ఉపయోగపడ్డాయి.
తమకు జరిగే లాభాల కోసమే ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అండగా ఉంటారు. ఈ నటులు తమ ‘ఫేస్ వేల్యూ’ ఉపయోగించి అధికారంలో వున్నవాళ్లకు సాయం అందించి, తమకు జరిగిన లాభానికి కృతజ్ఞత ప్రకటించుకుంటారు. సినిమా, బుల్లితెర- ఈ రెండూ ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావం చేసే మాధ్యమాలు.
కానీ ఇటీవల ఈ రంగాల్లో ఆత్మహత్యలు, హత్యలు, అలవాట్లు, వారి ప్రవర్తన.. ఇవన్నీ వారిలోని నైతిక జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నటుడు శోభన్‌బాబు తను సెట్టింగ్‌లో వేషంలో వున్నపుడు తన వాళ్లను కూడా లోపలికి రానిచ్చేవాడు కాడు. ‘వేషం సరిగ్గా ఉన్నపుడే వేదిక దిగిపోవాలని’ పిలుపు ఇచ్చిన నటుడు శోభన్‌బాబు. ఇప్పుడేమో 70వ దశకం వైపు వయసు దూసుకుపోతున్నా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వృద్ధ యువకులకు సమంతలు, నమంతలు, కైరా అద్వానీలు, కత్రినా కైఫ్‌లు కావాలి! జీవితమంతా వాళ్లు జనాలకు ప్రేమపాఠాలు నేర్పిస్తారు. వాళ్ల పిల్లలు మాత్రం ఎవరినీ ప్రేమించరాదు! సినిమాను వినోదంగా మాత్రమే భావించే పరిపక్వత ఇప్పటి యువతలో ఉందా? ఆడియో రిలీజ్ పేరుతో చేస్తున్న నానా హంగామా ప్రచారార్భాటం కాక ఇంకేమిటి? కులమతాలకు సంబంధించిన వివాదాస్పద విషయాలు పెట్టడం, దానిపై వ్యతిరేక ఉద్యమం సృష్టించడం- వాళ్లే చేసి చీప్ పాపులారిటీని పొందుతున్నారు.
ఇక మొగిలి రేకులు, ఇనుపరేకులు, కార్తీకదీపం, నా పేరు మీనాక్షి, ఆడదే ఆధారం.. పట్టుకుంటే పట్టుచీర, జబర్దస్త్.. వంటి జీడిబంక కార్యక్రమాలతో ఆడవాళ్లకున్న శక్తిని ధ్వంసం చేస్తున్నారు. సెల్ఫీలు, టిక్‌టాక్‌లు, పబ్జీలు, పోర్న్ సైట్లతో జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదంతా ఎవరికైనా పట్టిందా? తమ అందమైన ముఖాలతో మందిని బొందబెడుతున్న ఈ మాధ్యమాల ప్రభావాన్ని ఎవరు నిలువరించాలి? సినిమాలకు, టీవీలకు బానిసలుగా మారిపోతున్న ఈ వైనం ఓ సామాజిక రుగ్మత కాదా? మితిమీరిన జ్ఞానం, వినోదం రెండూ ప్రమాదమే.
5 ఏళ్ల పిల్లవాడు టీవీలు, ఫోన్లలో కలిపి రోజు కనీసం 3 గంటలు రోజూ టీవీ చూస్తే 30 వేల సార్లు మర్డర్లు, 72వేల సార్లు రేప్‌లు ఒక సంవత్సరంలో చూశాక వాడి మానసిక స్థితి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా? ‘పచ్చబొట్టేసిన పిల్లగాడా.. పచ్చి ప్రాయాలనే పంచుకున్నానులే’’ అన్న పాటకు అర్థం అద్భుత కళాఖండం తీసిన ఆ దర్శకుడు చెప్పగలడా? ‘జిల్ జిల్ జిగేల్ రాణీ’ అన్న పాట కుటుంబం మొత్తం కూర్చొని చూసే పరిస్థితి ఉందా?
ఇది వినోదమా? వికారమా? తుచ్ఛమైన పేరు కోసం, డబ్బుకోసం ఇలాంటి పాటల్ని ప్రమోట్ చేస్తున్న సినిమావాళ్లకు వ్యభిచారులు అన్న పేరు పెట్టినా తక్కువే కదా! మీ కుటుంబసభ్యులతో ఇలాంటివే పాడిస్తారా? సినిమాల్లోని, టీవీల్లోని ఈ రాక్షస దృశ్యాలను చూసి చూసి మనం మొద్దుబారిపోయాం. అందుకే మన కళ్లెదుట రోడ్డుపై జరిగే హత్యలను ఆపలేకపోతున్నాం. వాటిని ‘వీడియో తీస్తున్నాం’! అది కూడా మన దృష్టిలో ఈవెంట్‌గా మారిపోయింది. ఈ దిక్కుమాలిన సీరియళ్లు చూశాక, పెద్ద ఘటనలను మనం చూసినా కళ్లనుండి నీరు కారడం లేదు. మన సున్నితత్వం చచ్చిపోయింది.
సెలబ్రిటీలు మంచీచెడ్డా తెలుసుకోకుండా యాడ్స్‌లో నటిస్తున్నారు. నటుడు మహేశ్‌బాబు ఓ సాఫ్ట్‌డ్రింక్‌కు ప్రమోటర్. ఇప్పటికే పెప్సీకోలా కంపెనీ 15 వేల టన్నుల వ్యర్థ పదార్థాలను అమెరికా నుండి మన దేశంలోకి దింపింది. దానివల్ల జరిగిన నష్టంతో పోల్చితే నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల జరిగే నష్టం స్వల్పం. ఈ జాతి పక్షులే ఈ రోజు ‘సేవ్ నల్లమల’ పిలుపు ఇవ్వడం విడ్డూరం. ఉద్యమకారుల పోరాటాలకు ప్రభుత్వాలు లెక్కబెట్టకుండా, ఇలాంటివాళ్ల నినాదాలకు విలువనిస్తే అది సమాజానికి ఆత్మహత్యా సదృశమే.
1914-17లో జరిగిన ప్రథమ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా గెలిచింది. అదే ఫ్రాన్స్ 1945లో ఘోరంగా ఓటమి చెందింది. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచాక ఫ్రాన్స్ ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్న విచక్షణ కోల్పోయింది. 1926లో ఫ్రాన్స్‌లో టెలివిజన్ వచ్చింది. పబ్బులు, క్లబ్బులు, మద్యం విచ్చలవిడితనం ఎక్కువైంది. క్యాసినోస్, జూదం, వ్యభిచారం అన్నీ ఎక్కువయ్యాయి. వీటన్నిటికీ ప్రమోటర్ టెలివిజన్. ఓ తరం నాశనమైపోయింది. దాంతో ఫ్రాన్స్ అంతర్గత శక్తి ధ్వంసమై పోయింది.
1945లో జరిగిన యుద్ధంలో జర్మనీ ఫ్రాన్స్‌పై యుద్ధం చేసి కొన్ని గంటల్లోనే ఆక్రమించుకుంది. ఇవన్నీ దగ్గరగా చూసిన చాలస్ డిగోట్ 1945 తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడై మొట్టమొదట తన దేశంలో సినిమా థియేటర్లను కూలగొట్టించాడు. రెండవ పని- టీవీలను ఆపేయించి జూదగృహాలను మూయించాడు. వారి పాఠశాలల్లో ‘బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్’ అని రాయించాడు. ఫ్రాన్స్ యువకుల్లో ఫ్రెంచ్ సంస్కృతి పట్ల గౌరవ భావం పుట్టించి ఆ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళాడు. ఇపుడు మన జాతి కూడా సంఘర్షణలో వుంది. మితిమీరిన వినోదం మన నెత్తిలోకి చేరుతోంది. ఈ భావకాలుష్యం ఆగపోతే మన జాతికి అధోగతే.
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి