‘‘ఈ ఎన్నికల్లో మనం పోరాడింది ఒక పార్టీతో కాదు.. నిష్పాక్షిక వ్యవస్థలుగా మనం కీర్తించుకుంటున్న సంస్థలన్నింటినీ విపక్షాలపైకి ఎక్కుపెట్టారు.. అన్ని వ్యవస్థలనూ భాజపా, ఆరెస్సెస్ పూర్తిగా ఆక్రమించి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచాయి’’-అంటూ గత వారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘కాడి’ కిందపడేసి వెళ్లిపోయాడు. దీన్ని కొందరు ‘త్యాగం’గా చిత్రీకరిస్తే, మరికొందరు ‘వ్యూ హం’గా చెప్తున్నారు. 134 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని అర్ధాంతరంగా అనాథను చేసి రాహుల్ వెళ్లిపోయారని ఢిల్లీలో గాంధీ - నెహ్రూ కుటుంబ వీరాభిమానులు నిరసన తెలపగా, మరికొందరు నాయకులు రాజీనామాల బాట పట్టారు.
1885 ఏవో హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్‌ను స్వాతంత్య్ర సమరంలో అందరూ ఆదరించారు. డబ్ల్యూ.సి.బెనర్జీ నుండి రాహుల్ గాంధీ వరకు ఎందరో నేతలు ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు. గోపాలకృష్ణ గోఖలే, మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ, పట్ట్భా, ఇందిర, సంజీవరెడ్డి, కాసు, నిజలింగప్ప, సంజీవయ్య, శంకర్ దయాళ్ శర్మ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియా, రాహుల్ వంటివారెందరో ఆ పార్టీకి అధ్యక్షులయ్యారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచారకర్తగా వచ్చాక రెండు లోక్‌సభలు (2014, 2019) ఘోర పరాజయం ఎదురుకాగా, 41 అసెంబ్లీ ఎన్నికల్లో 33సార్లు ఆ పార్టీ ఓటమి చెందింది. 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. అయినా గాంధీ-నెహ్రూ కుటుంబ భజన బృందాలు రాహుల్‌ను ‘త్యాగమూర్తి’గానే కీర్తిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు ‘కామరాజ్ ప్లాన్’గా రాహుల్ రాజీనామాను కీర్తికిరీటంగా మార్చేస్తున్నాయి. రాహుల్‌కున్న రాజకీయ అపరిపక్వతను గురించి చెప్పలేని వంధిమాగదులు, పదవి లేకుండా బతకలేని వృద్ధ జంబూకాలు కాంగ్రెస్ పార్టీ పతనాన్ని అడ్డుకోలేకపోతున్నారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రధాన పాత్రధారుడైన మోతీలాల్ వోరా లాంటి వీరవిధేయులు, కరడుగట్టిన మతతత్వవాదులైన గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, సల్మాన్ ఖుర్షీద్ లాంటివాళ్లతో కోటరీ నిర్మించుకొని, ముస్లిం సంతుష్టీకరణ నుండి బయటపడకుండా బాల్య చాపల్యం ప్రదర్శించే రాహుల్ అధ్యక్షతన పార్టీ ఎలా నిలదొక్కుకుంటుంది? దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ లాంటివాళ్లకు అప్పజెప్పినా రాహుల్ కన్నా గొప్పగా బ్యాటింగ్ చేస్తారు. కానీ కుటుంబ ఆరాధనకు కాంగ్రెస్ నాయకులు అలవాటు పడ్డారు. ఆ జబ్బును దేశం నిండా అంటించారు. అందుకే రాష్ట్రానికో కుటుంబం రాజ్యమేలుతోంది. కేటీఆర్‌లా స్వయం ప్రతిభ ఉంటే ఫర్వాలేదు కానీ, లోకేశ్, రాహుల్ లాంటి వాళ్లను ప్రజలు తిరస్కరించారు. రాజకీయాలు సినిమాల్లాగా ‘ఫేషియల్’ చేసుకొని నటించేవి కావు.
రాహుల్ ఫెయిల్యూర్ అంతా ‘అవగాహన లేమి’. రోహిత్ వేముల ఆత్మహత్యను నరేంద్ర మోదీపైకి నెట్టేందుకు చేసిన ప్రయత్నం మొదలుకొని గబ్బర్ సింగ్ టాక్స్ అనే పదం ఉపయోగించేవరకు అన్నీ వ్యూహాత్మక తప్పిదాలే. రహస్యంగా ముస్లిం వౌల్వీలను కలిసి, బయట ‘జంధ్యం’ దాల్చిన బ్రాహ్మణుడని చెప్పడం వల్ల ఏ సంకేతం రాహుల్ ఇచ్చాడో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు చెప్పలేరు. చంద్రబాబు వంటి అవకాశవాద రాజకీయ నాయకుల మాటలు నమ్మి 2019 ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం పొందాడు. చివరకు నిందంతా ఆరెస్సెస్‌పై వేసి అస్త్ర సన్యాసం చేయడం మ రో తప్పిదం! గతంలో ఎం దరో కాంగ్రెస్ నేతలు ఆరెస్సెస్‌ను అభిమానించేవారు. ఒకవేళ వారు ఏదైనా తప్పు చేస్తే చెప్పాలి గానీ ఏమీ లేకుండా దిగ్విజయ్ సింగ్‌లా మాట్లాడితే ఎలా?
కాంగ్రెస్ వాదులైన పి.వి.నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీని భాజపా ఎందుకు వాడుకుంటుందో ఇప్పటికీ కాంగ్రెస్‌కు సోయిలేదు. సర్దార్ పటేల్, నేతాజీల్లోని దేశభక్తిని కాంగ్రెస్ ఇప్పటికీ కనిపెట్టలేదు. వౌలానా అబుల్ కలాంకు కాంగ్రెస్‌లో వున్న గౌరవం నేతాజీ, పటేల్‌కు ఎందుకు ఉండదో వారికి అర్థం కాదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థులను రెచ్చగొట్టే సల్మాన్ ఖుర్షీద్‌కు వున్న ప్రాధాన్యత దేశాన్ని ప్రేమించే కరణ్‌సింగ్‌కు ఉండదు. స్వాతంత్య్రం కన్నా ముందు గాంధీని, నేతాజీలను అభిమానించిన కాంగ్రెస్, స్వాతంత్య్రానంతరం నెహ్రూను ఆరాధించడం మొదలుపెట్టింది. నెహ్రూ సంతుష్టీకరణ విధానాన్ని ఆదర్శంగా భావించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రాధాన్యమైన ఎన్నో విషయాల్లో రాజీపడింది. నెహ్రూ కాలంలో కమ్యూనిస్టులు గోడదూకి ఇందులోకి చేరి, తమ వామపక్ష భావాలను పరిపాలనలో ప్రవేశపెట్టిన చైనా, రష్యా వారసులు కాంగ్రెస్‌ను శాపగ్రస్తం చేశారు. కృష్ణమీనన్ మొదలుకొని పి.చిదంబరం వరకూ అంతా ఆ బ్యాచే.
ఇదంతా వదిలేసేసి ఆరెస్సెస్‌పై నాలుగు రాళ్లేసి వెళ్లిన రాహుల్‌ను చూస్తే జాలిపడడం తప్ప ఇంకేమీ చేయలేం. గతంలో సోనియాగాంధీ అధ్యక్షురాలయ్యాక ఈ ‘సంతుష్టీకరణ’ కాంగ్రెస్‌లో విశృంఖలమైంది. ఆఖరుకు ‘మతహింస బిల్లు’ తెచ్చి హిందువులను అణచివేయాలనే దురాలోచన వచ్చింది. రాజేంద్రకుమార్ సచార్ కమిటీ పేరుతో ‘మైనార్టీ సంతుష్టీకరణ’ ఈ దేశ హిందువుల్లో లోలోపల ఆగ్రహవేశాలు రగిల్చింది. దాని పర్యవసానమే గుజరాత్‌లో ‘గోద్రా ఘటన’, అనంతర అల్లర్లు. మతహింస బిల్లు, సచార్ కమిటీ నివేదిక కన్నా ముందే గుజరాత్ అల్లర్లు జరిగాయి. సంతుష్టీకరణను హిందువులు హర్షించడం లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ గ్రహించలేదని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తామంతా సమానంగా ఉండాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ హద్దులు మీరిన సంతుష్టీకరణ వెయ్యేళ్ల ‘హిందూ బానిసత్వం’పై కారం చల్లాయి. దానిని అడ్డుకొనే విరాట్ రూపమే మోదీ అవతారం.
ఆరెస్సెస్‌తో రాహుల్ ఎందుకు యుద్ధం చేయాలి? ఈ దేశంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్‌కు ఆరెస్సెస్ అవసరం ఎంత వుందో ఈ సంఘటన చెబుతుంది. 1921లో రాజద్రోహం కేసుపై బ్రిటీషువారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కేశవ్ రావ్ హెడ్గేవార్‌ని నిర్బంధించింది. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నాడని ఓ సంవత్సరం కఠిన కారాగారశిక్ష విధించింది. అదే జైలులో ఖిలాఫత్ ఆందోళనలో పాల్గొన్న ఇమానుల్లా ఖాన్ ఉన్నాడు. ఖాన్ ఉదయానే్న అందరూ నిద్రిస్తున్న వేళ బిగ్గరగా ఖురాన్ చదివేవాడు. ఎవరు చెప్పినా కావాలని మరింతగా బిగ్గరగా పఠించేవాడు. హెడ్గేవార్ సలహాతో ఖైదీగా వున్న రాధామోహన్ అనే ఆర్య సమాజ కార్యకర్త మరుసటి రోజునుండి రామాయణం బిగ్గరగా చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు గానీ ఇమానుల్లా ఖాన్‌కు తత్త్వం బోధపడలేదు. మరుసటిరోజు నుండి ఖాన్ లోలోపల ఖురాన్ పఠించేవాడు. ఇదే ఆరెస్సెస్ తత్త్వం. ఇటీవల కలకత్తా వీధుల్లో హనుమాన్ చాలీసా పారాయణం ఎందు కు మొదలయ్యింది? కలకత్తా నగరం భారీ ట్రాఫిక్ వుండే నగరం. అక్కడ మమత ప్రభుత్వ అండతో ఒక మతం వారు రోడ్లపై ప్రార్థనలు చేస్తున్నారు. అయినా ఓట్ల కోసం అదేదో తామే దగ్గరుండి జరపాల్సిన కార్యక్రమంలా మమత ప్రభుత్వం కొనసాగించింది. ఈ సంతుష్టీకరణకు వ్యతిరేకంగా ‘చాలీసా’ మొదలయ్యింది. స్వాతంత్య్రం రాక ముందూ వెనుకా కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలపై ఇంత ప్రేమ చూపిస్తే రాజేంద్ర సచార్ కమిటీ మళ్లీ ఎందుకు వేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందడంలేదో ఆ మత పెద్దలు ఆలోచించాలి?
కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికైనా ‘సంతుష్టీకరణ’ వదలిపెట్టి ‘అందరూ ఒకే దేశ పౌరుల’ని గుర్తించాలి. అలాగే పార్టీని త్యాగగుణంగల కార్యకర్తలతో నింపే పనిచేయాలి. సైద్ధాంతిక నిబద్ధత గల రాం మాధవ్ లాంటి ఒక్క వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మచ్చుకైనా చూపగలదా? ఆరెస్సెస్‌ను నిందించేముందు అందులోని ‘ప్రచారక్’ల్లోని త్యాగం ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల్లో నింపగలరా? సాధారణమైన ఆరెస్సెస్‌లో ఓ పెద్దాయన మరణిస్తే, ముందున్న టెంట్‌లో సామాన్యుల్లా కూర్చొనే మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ లాంటి నిబద్ధత కలిగిన కాంగ్రెస్ నాయకులు ఎంతమంది? ఎండ్రకాయల్లా ఒకరినొకరు లాక్కొనే సంస్కృతి నుండి కాంగ్రెస్‌ను ఎవరు కాపాడాలి? ఏళ్లనుండి పదవులు వెలగబెట్టి, ధన సంపాదన చేసి, అధికారం పోగానే అవతలి పార్టీ తలుపు తట్టేవారు, శల్యసారథ్యంలో తమ కడుపున పుట్టే పిల్లలని తామే చంపుకునేవారిపై ఎవరు కొరడా ఝుళిపించాలి? కటిక దరిద్రంలో పుట్టిన నరేంద్ర మోదీనైనా, బంగారు చెంచా నోట్లో పెట్టుకొని పుట్టిన అమిత్ షానైనా సిద్ధాంత బలంతో నియంత్రించగల శక్తి ఆరెస్సెస్‌లో ఉంది. అందుకే 56 ఏళ్ళ రాజకీయ జీవితంలో అధికారం అనుభవించింది స్వల్పమే అయినా సిద్ధాంతానికి కట్టుమడిన వాజపేయి లాంటి వ్యక్తిని ఈ డెబ్భై ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చూపించగలదా?
హిందీ కూడా సరిగ్గా రాని ఓ ప్రచారక్‌ను అస్సాం పంపిస్తే మారు మాట్లాడకుండా వెళ్లి, అయిదేళ్లలో హిందీతోపాటు అస్సామీ కూడా అతను నేర్చుకుంటాడు. రాహుల్ ఇనే్నళ్లలో ఏం నేర్చుకున్నాడో రాజకీయ పండితులే విశే్లషించలేకపోతున్నారు. ఈరోజుకూ ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చేసే ఆరెస్సెస్, భాజపా కార్యకర్తలు, నాయకులు తమ పేర్లు కూడా బయటకు తెలియనివ్వరు. కాంగ్రెస్ పార్టీ నుండి అలాంటి పునాదిరాళ్లను ఊహించగలమా? రాహుల్ ఇంకా ‘తెలియని వ్యాఖ్య’ చేస్తూ వెళ్లిపోయాడు. దేశమంతా ఆరెస్సెస్‌తో నిండిపోయిందా? అలా అయితే చారిత్రక కాంగ్రెస్, మీడియా, కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర ఎన్నో ప్రభుత్వ సంస్థలు కాంగ్రెస్- కమ్యూనిస్టులతో ఎందుకు నిండి ఉన్నాయి?
జాతీయవాదానికి ఆయువుపట్టైన మహాభారతంలోని మహిళా పాత్రను (ద్రౌపదిని) అవమానించిన వ్యక్తి మోదీ ప్రభుత్వం నుంచి ‘పద్మ’ అవార్డు ఎలా పొందుతాడు? వారానికోసారి మోదిని పత్రికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే ఓ పత్రికా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎలా వశపరచుకొంటాడు? మొన్నటివరకున్న మధ్యప్రదేశ్ భాజపా ప్రభుత్వం ఇచ్చే ‘కబీర్ సమ్మాన్’ పురస్కారం నక్సల్స్‌ను సమర్థించే కె.శివారెడ్డి ఎలా పొందుతాడు? వామపక్ష వాదాన్ని భుజాలపై మోసే ప్రణయ్ రాయ్, రాజ్‌దీప్ సర్దేశాయ్‌లు తమ ప్రాపకాన్ని ఎలా సాగిస్తున్నారు? ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. ప్రభుత్వం దేశ భద్రత, సమానత్వం, జాతీయవాదం వంటి అంశాలపైనే కేంద్రీకృతం అయ్యేట్లు ఆరెస్సెస్ చూస్తోంది. కానీ రాహుల్ గాంధీ రాజకీయాలకు అడ్డుచక్రం వేసే పని ఆరెస్సెస్‌ది కాదు. ఇదేదీ గ్రహించకుండా సంఘ్‌ను తిడితే కొన్ని వర్గాల ఓట్లు గంపగుత్తగా పొందవచ్చని రాహుల్ భావిస్తే అది ఆయన రాజకీయ అనుభవ శూన్యతే. ఇప్పటికైనా ఎ.కె.ఆంటోనీ ఇచ్చిన రహస్య అంతర్గత నివేదికను కాంగ్రెస్ పఠిస్తే అదే పార్టీకి శ్రీరామరక్ష. లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత నిజమవుతుంది.
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*12-07-2019 : సోమవారం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి