మనం ధృవపు ఎలుగుబంట్ల గురించి విన్నాం. వాతావరణం వాటికి అనుకూలంగా లేనపుడు అవి మంచు లోపలికి వెళ్లిపోయి, తమకు అనుకూలమైనపుడు మళ్లీబయటకు వస్తూంటాయి. సరిగ్గా ఏపీ తెలుగుదేశం నాయకుల ప్రవర్తన చూస్తుంటే ఈ విషయం గుర్తుకు వస్తుంది. 2018 ఫిబ్రవరి తర్వాత చంద్రబాబు బిజెపి నుండి దూరమయ్యాక వై.యస్.జగన్‌ను గాలికి వదిలిపెట్టి బి.జె.పి.ని తీవ్రంగా ద్వేషించిన తెలుగుదేశం పార్టీని ఎవరూ ఆపలేకపోయారు. కాశ్మీర్‌లో 370 రద్దు తర్వాత అభినవ సర్దార్ పటేల్‌గా కొనియాడబడుతున్న అమిత్ షా తిరుమల దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తలతో షా కాన్వాయ్‌పై రాళ్లువేయించారు. మోదీని వచ్చీరాని హిందీలో బాలకృష్ణ బండబూతులు తిట్టాడు. 

ఆఖరుకు ‘నేను భాజపాను అధికారంలోకి రాకుండా చేస్తానని’ చంద్రబాబు దేశం నలుమూలలా తిరిగినాడు. ఫారూఖ్ అబ్దుల్లా లాంటి స్వార్థపూరిత నాయకుడిని తీసుకొచ్చి ఏపీ అంతా తిప్పి మోదీని తిట్టించాడు. ఇక టీవీ చర్చల్లోనైతే ఓ విశే్లషకుడు పేరుతో కూర్చున్న వ్యక్తి ఎన్నోసార్లు ‘మోదీ అజ్ఞాని’ అంటూ సాక్షాత్తూ ప్రధానిని నిందించాడు. దింపుడు కళ్లం ఆశగా ఎన్నికల ఫలితాలకు ముందు రోజు వెళ్లి కుమారస్వామిని నిద్రలేపి వచ్చిన చంద్రబాబు ఫలితాల వెల్లడిలో బొక్క బోర్లా పడ్డాడు. విచిత్రం ఏమిటంటే బాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ రాజకీయ విధ్వంసమే జరిగిపోయింది. 

కుమారస్వామి దగ్గరకు వస్తే అక్కడ జె.డి.యస్- కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. మమతా బెనర్జీని కదిలిస్తే ఆమె పీఠం కదులుతోంది. ఫారూఖ్ అబ్దుల్లాను కౌగిలించుకుంటే అక్కడ ఇప్పుడు వారి దుర్భర స్థితి వర్ణించలేం. ఇక రాహుల్ గాంధీని వెంటేసుకొని తిప్పితే ఇపుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరాతిఘోరం!? ఒకవేళ చంద్రబాబు సలహాలు వినకుంటే ఈ పార్టీల పరిస్థితి కాస్తయినా మెరుగ్గా ఉండేవని ఢిల్లీలో వినబడుతున్నమాట. అరిగిపోయిన చక్రాన్ని ఊరికే తిప్పుతా తిప్పుతా అంటే ప్రజలు దానిలోని బేరింగ్ పీకి అవతల పడేసారని కనికరం లేని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల తర్వాత అసలు కథ మొదలైంది. టి.డి.పి.లో రాజ్యసభ ఎంపీలు సీఎం రమేశ్, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ భాజపాలో చేరారు. అలాగే గరికపాటి మోహన్‌రావు, కొందరు మాజీ శాసనసభ్యులతోపాటు కొందరు నాయకులతో కలిసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దుచేసే క్రమంలో అమిత్‌షా వేసిన సంప్రదింపుల కమిటీలో సీఎం రమేశ్‌కు ప్రధాన స్థానం ఉందని కొన్ని టీడీపీ అనుకూల మాధ్యమాలు ఫ్రేం కట్టాయి. దానిలోని నిజానిజాలు బయటకు తెలియవు. 

అలాగే గరికపాటి మోహన్‌రావు పార్టీలో చేరేటపుడు చేసిన ప్రసంగంలో చంద్రబాబుకు ఎనలేని గౌరవం ఆపాదిస్తూ మాట్లాడారు. ఎక్కడో బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీ సభలో భాజపా ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటుందని ఆరోపించాడు చంద్రబాబు. అదీ తాను 23 మంది వైయస్సార్‌సీపీ కొనుగోలు చేసిన విషయం విస్మరించి ఆనాడు ఉపన్యాసాలు దంచివచ్చాడు. టీడీపీలో పేరున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్తే కనీసం ఆ రోజు ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. సరే! భాజపాలో చేరిన టీడీపీ నాయకులు, కొందరు విశే్లషకులు ఈ రోజు విధేయులుగా ఉన్నారు. కానీ ఈ వ్యవహారంపై అసలుసిసలు భాజపా నాయకులు ఓ కనే్నసి ఉంచకపోతే ఇది కూడా స్లీపర్ సెల్స్ ఆపరేషనే అవుతుంది. ఎందుకంటే జడ్జీలే తనకు ఫోన్లు చేస్తారని బహిరంగంగా ప్రెస్‌మీట్‌లో చెప్పే వ్యక్తి ‘ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం’ అధ్యక్షుడయ్యాడు. ఇపుడు రాజధాని మార్పు అనగానే తెలుగుదేశం నాయకులు ఉలిక్కిపడుతున్నారు.

 దీనిపై భాజపా విస్తృతంగా ఆలోచించి దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. శివరామకృష్ణన్ నివేదికను మార్చి చంద్రబాబు అండ్ కో తమ ఇష్టారీతిన చట్టానికి దొరక్కుండా ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారం చేసేందుకు అనుగుణంగా రాజధాని నిర్మాణం కట్టే యత్నం చేశారని అందరూ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే అమరావతి గురించి సీపీయం ధర్నాలు చేయడం విడ్డూరం. ఎక్కడ ఆంధ్రా కులవాద సీపీఎం ఉందంటే దాని వెనుక చంద్రబాబు ఉన్నాడనే విశే్లషకులు చెప్తారు. మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను భ్రష్టుపట్టించింది ఈ శక్తులే కదా! ఇదంతా భాజపా నాయకులు అధ్యయనం చేయాలి. ఆంధ్రాలో కూడా మేధావులు, విశే్లషకులు అనగానే వారు ప్రగతిశీలురుగా ముద్ర వేసుకున్న వామపక్ష భావజాలం ఉన్నవాళ్లే. పత్రికలు టీవీలను తెలుగునాట ప్రభావితం చేస్తున్నది వీళ్లే. భాజపా తమ సిద్ధాంతాని కనుగుణంగా ఈ వర్గాలను పెంచుకోవాలి. నిజానికి భాజపాకు తెలంగాణ తర్వాత అనుకూలమైన స్థలం రాయలసీమ. 

అక్కడి ప్రజల్లో వెనుకబాటుతనం ఉంది. వాళ్లకు సముద్ర తీరం లేదు. రాజకీయ ప్రాబల్యమే గాని ప్రజల్లో తీవ్ర దుర్భిక్షం ఉంది. 1937లో రాజగోపాలాచారి మద్రాస్ ప్రెసిడెన్సీకి ప్రధాని అయినపుడు 10 మంది మంత్రుల్లో ముగ్గురు తెలుగు వాళ్లుంటే అందులో రాయలసీమ నుండి ఒక్కరూ లేరు. నాటి ఆంధ్ర మహాసభలో వున్న రాయలసీమ నాయకులు మండి పడ్డారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే సీమకు ప్రాధాన్యం ఇవ్వాలని 1937 నవంబర్‌లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహంలో ‘శ్రీబాగ్ ఒడంబడిక’ చేసుకున్నారు.

 అయితే 1946లో ప్రకాశం పంతులు నేతృత్వంలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దానిని ఒక్క ఏడాది పసిగుడ్డుగానే గొంతు పిసికారు. ప్రకాశం పంతులు స్థానంలో ఓమండూరు రెడ్డియార్ రామస్వామి సీఎం పీఠం అధిష్ఠించాడు. అయితే ప్రకాశం పంతులును దించేయడంలో నీలం సంజీవరెడ్డి పాత్ర ఎంతో ఉంది. ఇలాంటి కుటిల బుద్ధితో రాయలసీమ రాజకీయంగా తేరుకోలేదు. కర్నూల్ తాత్కాలిక రాజధాని తదనంతరం తరలిపోయింది. సీమకు అనుబంధంగా వుండే నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుండి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, చంద్రబాబు వంటివారు సుదీర్ఘకాలంగా పదవిలో వుండి వాళ్లకు చేసిందేమీ లేదు. వై.యస్ రాయలసీమ గడ్డనుండే వచ్చి కొంత అభివృద్ధి చేసినా అక్కడి చుట్టుప్రక్కల జిల్లాల్లో ‘క్రైస్తవ మత విన్యాసం’ కరాళనృత్యం చేసింది. దాని పరాకాష్ఠ ఇపుడు తిరుమల బస్సు టిక్కెట్లపై కన్పిస్తున్నది. పుష్కరాల సమయంలో గుడులు కూల్చడం, విఐపీ భద్రత పేరుతో ముప్ఫైకి పైగా భక్తుల మరణాలు చంద్రబాబును వెంటాడింది. ఇపుడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో చర్చిలకు ప్రాధాన్యత, గోహత్యాపాతకం మళ్లీ మొదలైంది. 

ఇవన్నీ భాజపా గమనించి తగిన కార్యాచరణ చేయకుండా స్వంత ఎజెండాతో ముందుకు వెళ్లకుంటే టిడిపి స్లీపర్ సెల్స్‌కే లాభం. వెంటనే కంభంపాటి హరిబాబు, పైడికొండల మాణిక్యాలరావు, సోమ వీర్రాజు, గోకరాజు గంగరాజు, పురంధేశ్వరి, సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమారరాజు వంటివారు రాయలసీమలోని టీడీపీ క్యాడర్‌ను, నాయకులను ఖాళీ చేయడమే కార్యాచరణగా పెట్టుకోవాలి. మొదట పార్టీని బలోపేతం చేసుకోవాలి. అలాగే కొత్తగా వచ్చిన సుజన, టీజీ, సీఎం రమేష్‌లను ఈ పనులకు వారధిగా వాడుకోవాలి. అలాగే టీజీ వెంకటేష్ తెలంగాణపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

 రాయలసీమను భాజపా ఎదుగుదలకు ప్రథమస్థానంగా పెట్టుకొంటేనే భాజపా 2024కు లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే జాతీయ స్థాయిలో ఎంత గొప్పగా పార్టీ వున్నా ఇక్కడ తోక పార్టీగా మిగిలిపోతుంది. తీవ్రవాదులు, రాళ్ళదెబ్బలున్న చోట పార్టీని నిలబెడుతున్న అమిత్ షాపై రాళ్లు వేయించినవారిని వదలిపెట్టడం స్థానిక నాయకత్వానికి తగదు.

********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*30-08-2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి