ప్రపంచంలో చాలా జాతులు, మతాలు, దేశాలు, సంస్కృతులు బానిసత్వంలో పదేళ్ల నుండి వం ద సంవత్సరాలు ఉంటే వాటి అస్తిత్వం కోల్పోయాయి. రెండు భిన్నమైన భాషలు గల ప్రజలు 50 ఏళ్ళు కలిసి ఉండలేకపోయారు. పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లే ఇందు కు ఉదాహరణ. రాజకీయ సామాజిక ఉద్యమాలు జరిగిన తర్వాత మరికొన్ని దేశాలు తమ అస్తిత్వం వదిలేసుకోవలసి వచ్చింది. 

బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తిగల రష్యా ఎన్ని ముక్కలైందో మనకు తెలుసు. కానీ ప్రతి వంద కిలోమీటరుకు ఓ భాష, కొత్త ఆహారం, భిన్న వస్తధ్రారణ, అలవాట్లు ఉన్న భారత్ మాత్రమే ఇన్ని సంక్షోభాలను తట్టుకొని నిలవగలిగింది. పంజాబ్‌లో సిక్కు, తమిళనాడులోని లుంగీ ధరించే వ్యక్తి.. ఇద్దరూ తినే ఆహారం, వేషభాషలు అన్నీ భిన్నమైనవే. కానీ ఇద్దరూ ‘మేం భారతీయులం’ అంటూ గర్వంగా చెప్తారు. నరనరాల్లో ప్రవహించే ‘సాంస్కృతిక జాతీయవాద భావనే’ దానికి కారణం.

భారత్ కేవలం భౌగోళిక సరిహద్దుల మధ్య వున్న ‘్భభాగం’ మాత్రమే కాదు, భౌగోళిక ప్రాదేశిక సరిహద్దుల మధ్య వున్న బంధం కన్నా ఒక దేశానికి వున్న చారిత్రక బంధం గొప్పది. ఆ చారిత్రక సంబంధం కన్నా సంస్కృతి గొప్పది. ఆ సంస్కృతిని మించింది ధర్మం. దానికన్నా బలమైన శక్తిగలది ఆధ్యాత్మికత. 

ఈ ఆధ్యాత్మిక వారసత్వమే భారత్‌ను విశ్వగురువుగా నిలబెట్టింది. ఈ విషయమై అనేక విధాలుగా పరిశోధించిన సుధాంశు త్రివేది చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల వాళ్లంతా భారత్‌లో తమ సంప్రదాయాలను, సంస్కృతులను అధ్యయనం చేసేందుకు రావాల్సిందే’’ అన్న ప్రాచీన శ్లోకం అంతరార్థం అదే. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రెండు మసీదుల్లో రెండవది మన దేశంలోని మలబారు తీరంలో కట్టించడం ఆ కోణంలో అధ్యయనం చేయాల్సిందే. 

ప్రపంచంలో క్రైస్త వం కళ్లుతెరవకముందే ఇక్కడ అలాంటి మతానికే స్థానం ఇచ్చింది భారత జాతి. బౌద్ధాన్ని ప్రపంచంలో చాలా దేశాలకు పంపి గొప్ప తాత్విక జ్ఞానం అందించింది భారత్. అంతేగాదు పార్సీలు తమ దేశంలో అత్యాచారాలకు గురై, నిరాశ్రయులై ఇక్కడికి వస్తే వాళ్లను కన్నబిడ్డల్లా కడుపున పెట్టుకుంది. అలాగే కొందరు యూదులు భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 

యూదుల కోసం ‘ఇజ్రాయిల్’ ఏర్పడిన తర్వాత ‘మమ్మల్ని అత్యాచారం చేయని ఏకైక జాతి భారతజాతి’ అని వారు పేర్కొన్నారు. ఏ దేశంపై దండెత్తని దేశం భారతదేశం, ఎవ్వరినీ మత మార్పిడి చేయని జాతి హిందూ జాతి. మతపరంగా మనుషుల జనాభా పెంచి ‘రాజకీయ ప్రాదేశిక అస్తిత్వం సంపాదించాలని’ భారత్ అనుకోకపోవడమే ‘విశ్వగురు’ స్థానానికి ప్రధానమైన అర్హత.

భారతీయ సంస్కృతి పునాదులు భౌగోళిక సరిహద్దుల వల్ల నిర్ణయించబడలేదు. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఒకటైన ‘సింధు నాగరికత’ సింధు నది పరీవాహక ప్రాంతంలో జరిగింది. కానీ ప్రస్తుతం సింధునది భారత్‌లో లేదు. అయినా మన జాతీయగీతంలో ‘సింధు’కు స్థానం ఉంది. 

అలాగే ‘గాంధార్’ ఆప్ఘనిస్తాన్‌లో వుంది. అది ఇపుడు భారత్‌లో లేదు. కానీ భారత్‌లో గాంధారి కథకు స్థానం ఉంది. ‘నన్‌కానా సాహెబ్’ ప్రస్తుతం భారత్‌లో లేదు. కానీ గురునానక్‌కు, సిక్కు మతానికి ఇక్కడే స్థానం ఉంది. బౌద్ధం వారసత్వం అందుకొన్న దలైలామా ఈ దేశంలో లేడు. కానీ ఆయనకు ఈ దేశంలో గౌరవం వుంది. బమియాన్‌లో బౌద్ధ విగ్రహాలను నేలమట్టం చేసిన తాలిబన్లను చూసి ఈ దేశ హిందువులు బాధపడ్డారు.

అలాగే ఈ దేశం నుండి ఇతర దేశాలకు వెళ్లినవారు ఇక్కడి సాంస్కృతిక ధారను ఇతర జాతులకు చాలా గొప్పగా అందించారు. కానీ వాళ్ల మూలతత్వాన్ని ధ్వంసం చేయలేదు. కంబోడియాకు వెళ్లిన కంబుఋషి వాళ్లకు మన సంస్కృతిని పంచి ఇచ్చాడు కానీ కంబోడియాను, వారి సంస్కృతిని ధ్వంసం చేయలేదు. కానీ అదే వాస్కోడిగామా, కొలంబస్‌లను గమనిస్తే వాళ్లు అడిగిడినచోట మూల జాతులను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. 

ఇవాళ మానవ హక్కులను గురించి ఇంతగా గొంతు చించుకునే అమెరికా- కొలంబస్ వెళ్లిన తర్వాత అక్కడి ‘రెడ్ ఇండియన్లను’ ఊచకోత కోసిన వైనాన్ని ప్రశ్నిస్తే ఏం చెబుతుంది? వాస్కోడిగామా ప్రయత్నం ఇక్కడ పాక్షికంగానే నెరవేరింది. బలం-్ధనం అనే రెండు ఆయుధాలు ఉపయోగించి ప్రపంచమంతా మత మార్పిడి సాగింది. కానీ అన్ని మతాల, జాతుల చేత అత్యాచారం చేయబడిన భారత్‌లో ఇంత జరిగినా మూల సంస్కృతి ధ్వంసం కాకపోవడానికి కారణం ఈ సాంస్కృతిక జాతీయవాదమే కారణం.

అందుకే మెకాలే మానసపుత్రులు, మార్క్స్ మానసపుత్రులు సుమారు రెండు శతాబ్దాలుగా ఈ సాంస్కృతిక విధ్వంసం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ దీని నిర్మాణం అత్యద్భుతంగా ఉన్నందున ఎవరి వల్లా అది సాధ్యం కావడం లేదు. 

శత్రువు భౌతికంగా దేవాలయాలను ధ్వంసం చేస్తే ఇక్కడివాళ్ళు ‘దేహో దేవాలయ ప్రోక్తః’ అంటారు. శివభక్తులు అమర్‌నాథ్ నుండి రామేశ్వరం వరకు, కాశీ నుండి ద్వాదశ జ్యోతిర్లింగాల వరకు ఎక్కడైనా తమ ఇష్టదైవాన్ని పూజిస్తారు. పోనీ విష్ణ్భుక్తులు ఎలా? జగన్నాథ మందిరం నుండి మధుర వరకు ఎక్కడైనా మొదలుపెట్టవచ్చు. 

అయోధ్య నుండి తిరుమల వరకు, ఇంకాస్త కిందకు వెళ్తే గురువయ్యూరు వరకు అంతా విష్ణుమయం. లేదు.. మేం అమ్మవారిని అర్చిస్తాం అనుకుంటే వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు, ముంబాదేవి నుండి కామాఖ్య వరకు అంతా అమ్మవారి పాదముద్రలే. ఈ దేశంలో అద్వైత ప్రచారం చేసిన శంకరుడు పుట్టింది కేరళలోని కాలడిలో. ఆయన మందిరం శ్రీనగర్‌లో కన్పిస్తుంది. శంకరుడు సమాధి పొందింది ఉత్తరాఖండ్‌లో! ఎంత విచిత్రం!?

ఇలా దేశాన్ని కలిపే ఓ ఆధ్యాత్మిక ధార ఈ దేశంలో ఉంది. అది ఈ దేశంలో నదీనదుల్లో, దేవాలయాల్లో, భాషల్లో, ఆహారంలో, వేషభాషల్లో.. అన్నింటా పరచుకొని ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన మెసపటోమియా, హరప్పా, టర్కీ, గ్రీకు, ఈజిప్ట్, మాయ సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. 

కానీ అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడిన భారతీయ సంస్కృతిని ఎన్నిరకాల వ్యక్తులు వచ్చినా ధ్వంసం చేయలేకపోయారు. దానికి మూలకారణం సాంస్కృతిక జాతీయవాదమే. ఇంత ఎగసిపడే చైనాను భారత్ ఎలా కట్టడి చేసిందో బీజింగ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసిన ‘హుషీ’ చెప్పిన మాటలతో ముగిద్దాం.

"India has culturally dominated and controlled more than two thousand years without sending single soldier across the border''.


********************************
* డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి  : భాస్కరవాణి *
*25-10-2019 : సోమవారం*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి