ఒకప్పుడు దేశంలో ప్రఖ్యాతి చెందిన ‘బ్లిట్జ్’ పత్రికలో విచిత్రమైన ద్వంద్వవైఖరి ఉండేది. ఆ పత్రిక ఆనాటి కాంగ్రెస్ విధానాలను తూర్పారబట్టేది. ఆ రోజుల్లో అది ఎక్కువ సర్క్యులేషన్ వున్న పత్రిక. ఓ వైపు కాంగ్రెస్‌ను తిడుతూ జవహర్‌లాల్ నెహ్రూపై అపార ప్రేమను కురిపించేది. నెహ్రూతోపాటు ఆయన క్యాబినెట్‌లోని కృష్ణమీనన్ లాంటి ప్రచ్ఛన్న కమ్యూనిస్టులను భుజాన మోసేది.
కృష్ణమీనన్ పూర్వాశ్రమంలో కమ్యూనిస్టుగా ఉండి, అక్కడుంటే అధికారం దక్కదని నెహ్రూ కూడా తన జాతి పక్షేనని కాంగ్రెస్‌లో దూకేడు. 1957 నుండి 1962 వరకు కీలకమైన రక్షణ శాఖను చేపట్టి చైనా యుద్ధంలో మనం భూభాగం కోల్పోయేందుకు పరోక్షంగా సహకరించి, తన సైద్ధాంతిక భక్తిని చాటుకొన్నాడు. బ్లిట్జ్ పత్రిక నెహ్రూ, కృష్ణమీనన్‌లతోపాటు సీపీఐకి బాకాలూదేది. అందుకే ఆ రోజుల్లో ‘సీపీఐని నెహ్రూ బొత్తంలోని గులాబీ పుష్పం’గా అభివర్ణించేవారు.
తాజాగా తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక సందర్భంగా తెరాస సీపీఐ మద్దతు కోరింది. ఇతరులకు ఛాన్స్ ఇవ్వవద్దన్న ఏకైక లక్ష్యంతో తెరాస ఇలా కోరడం రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. మరి సిపిఐ రోజూ వల్లెవేసే సిద్ధాంత నిబద్ధత, కట్టుబాటు ఎక్కడ వదిలేసింది? అసలు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు అసలు సిద్ధాంతపరమైన క్రమశిక్షణ ఉందా? అవకాశవాదం ఎర్రరక్తంలో కలగలిసిపోయి ఉండడం వెనుక మతలబు ఏమిటన్నది ఈ రోజు జరగాల్సిన చర్చ. ‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు’ అన్న ఓ దిక్కుమాలిన సిద్ధాంతాన్ని సృష్టించిందే కమ్యూనిస్టు పార్టీలు; దాని అనుబంధ మేధోవర్గం. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించి డబ్బు, అధికారం రంగం మీదకు తెచ్చిన సంప్రదాయ పార్టీలు ఒకవైపు వుంటే, ఈ రెండూ లేనట్టు కన్పించే కమ్యూనిస్టు పార్టీ అంతకన్నా ఎక్కువ చేసింది.
లేకపోతే ప్రజల షేర్లతో ఏర్పాటైన ఓ టీవీ చానల్ రాత్రికి రాత్రి ఎందుకు అమ్ముకున్నారో ఇప్పటి వరకు సీపీఎం నేతలు బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం చెప్పారా? ఓ పత్రికను గంపగుత్తగా అమ్మేసిన విషయం నారాయణనో, చాడ వెంకటరెడ్డో ప్రజల ముందు చెప్పారా? 20 రాష్ట్రాల్లో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీకి ఈరోజుకూ తెలుగునాట ఓ పత్రికకు, టీవీ చానల్‌కు టికాణా లేదు.
భుజానికి సంచులు వేసుకొని తిరిగే బి.వి.రాఘవులు పార్టీకి ఈ మాధ్యమాల నిర్వహణకు డబ్బులెక్కడివి? తమ సిద్ధాంత సారూప్యత వున్న రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించి తద్వారా పరోక్ష లబ్ధి పొంది సిద్ధాంత విస్తృతి చేయడమే కమ్యూనిష్టుల లక్ష్యం. ఇటీవల డిఎంకె నుండి సిపిఎం డబ్బులు తీసుకున్న విషయంపై పెద్ద చర్చే జరిగింది. ఆఖరుకు సీతారాం ఏచూరి వివరణ ఇవ్వాల్సివచ్చింది. అయినా డిఎంకె నాయకులు దానిపై స్పందించలేదు.
తెలుగు నాట జస్టిస్ పార్టీ భావజాలాన్ని ఎప్పుడూ సజీవంగా ఉంచేందుకు అప్పుడపుడు పుట్టుకొచ్చే చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడం, వాళ్లను ధ్వంసం చేసి వదలిపెట్టడం కమ్యూనిస్టులకు నిత్యకృత్యమైంది. ఇటీవల జనసేన పార్టీతో పొత్తే అందుకు ఉదాహరణ. బూర్జువాలు, భూస్వామ్య పార్టీలని విమర్శించే కమ్యూనిస్టులు అదే పార్టీల పల్లకీ మోయడం కొత్తేమీ కాదు. అయితే వాళ్లు తోకపార్టీలుగా మారినా ప్రచార ప్రసార, మేధోవర్గంలో కమ్యూనిస్టు గుంపు పెద్ద సంఖ్యలో ఉంది.
టిఆర్‌ఎస్ అధినేతను నియంతగా అభివర్ణించిన నారాయణ, వెంకటరెడ్డిలు తెరాస ఎంపీ కేకే పిలవగానే సరే అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎంత భావదారిద్య్రంతో కొట్టుమిట్టాడుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆంధ్ర ప్రాంతం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కమ్యూనిస్టు పార్టీ 63 శాసనసభా స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో విజయం సాధించి 16.46 శాతం ఓట్లు పొందింది.
అంతేగాకుండా వారు ఇచ్చిన మద్దతుతో 8 మంది ఇండిపెండెంట్లు, 10 మంది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే ఒకప్పుడు తెలంగాణలో పిడిఎఫ్ పేరుతో 45 స్థానాలకు కమ్యూనిస్టులు పోటీ చేసి 32 స్థానాలను గెలిచి 26.62 శాతం ఓట్లు పొందారు. అదే ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు పొందాడు.
తదనంతరం కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలను ప్రజలు మెల్లమెల్లగా అసహ్యించుకోవడం మొదలుపెట్టారు. 1955లో 168 స్థానాల్లో పోటీ చేసిన సిపిఐ 15 స్థానాలకు పడిపోవడం చూడవచ్చు. సోవియట్ యూనియన్‌పై వున్న ప్రేమ వారికి భారత్‌పై లేదని కాంగ్రెస్ ప్రజల ముందు పెట్టిన వాదం నెగ్గింది. 1957లో తెలంగాణలో సిపిఐ 44 స్థానాలకు అభ్యర్థులను పెట్టి 22 స్థానాలు గెలిచింది. 1962లో తెలంగాణలో 18 స్థానాల్లో విజయం సాధించింది. కేవలం నల్లగొండ జిల్లాలోనే 9 స్థానాలు పొందింది.
1967లో 103 స్థానాలకు పోటీ చేసి 10 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత అవకాశవాదం అప్రతిహతంగా కొనసాగింది. అనంతరకాలంలో ఇందిరమ్మ విధించిన ఎమర్జెన్సీని సమర్థించింది. 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొంది. 1977 తర్వాత కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించింది. ‘ఇదొక చారిత్రక తప్పిదం’ అంటూ లెంపలేసుకొంది. 1978లో 6 స్థానాలు గెలిచింది. 1983లో ఎన్టీఆర్ రాగానే అతనితో కలవడానికి ఉత్సాహపడ్డా అది సాధ్యం కాలేదు. 1985 సిపిఐ టిడిపితో కలిసింది. తర్వాత ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మార్చింది. ఇక సిపిఎం ట్రాక్ రికార్డు ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు.
ఇలా ఈ దేశంలో అవకాశవాద రాజకీయాలను సిద్ధాంతీకరించిన కమ్యూనిస్టు పార్టీలు ఏనాడూ రాజకీయ క్రమశిక్షణ పాటించలేదు. సంప్రదాయ పార్టీలు అధికారం, ధనం సంపాదిస్తారనే కమ్యూనిస్టులు రంగులు మార్చిడంలో వారి కన్నా సిద్ధహస్తులు. స్వాతంత్రానికి ముందు దేశ విభజనను సమర్థించి మతోన్మాద ముస్లిం లీగ్‌కు మద్దతు పలికిన వాళ్లే రోజూ ‘మతోన్మాదం’ అంటూ రాజకీయాలను దిగజార్చారు.
వీళ్లకు భారత్ గొప్పతనం ఎప్పుడూ కన్పించదు. మొన్నటికి మొన్న చంద్రయాన్-2 ప్రయోగం జరిగితే విమర్శలు ఎలా చేశారో చూశాం. కానీ 1957 అక్టోబర్‌లో సోవియట్ యూనియన్ విజయవంతంగా ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘స్ఫుత్నిక్’ సఫలమైతే ఆనాటి కమ్యూనిస్టు నాయకులు నంబూద్రిపాద్, కృష్ణమీనన్, మగ్దూం మొహియొద్దీన్‌లు చేసిన ఆనందోత్సావాలను చరిత్ర మరువదు. 1956 అక్టోబర్‌లో హంగెరీపై సోవియట్ సైన్యాలు దాడిచేసి అక్కడి నాయకుడు ఇమ్రీనాగీని అరెస్టు చేసి ఉరితీస్తే ఇక్కడి కమ్యూనిస్టులు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారు.
కానీ ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు శాంతిభద్రతల పరిరక్షణ కోసం రెండు నెలల గృహ నిర్బంధం విధిస్తే అదొక గొప్ప నేరమైనట్లే గగ్గోలు పెడుతున్నారు. ఇపుడు చైనాలో ముస్లింలపై ఘోరమైన అణచివేత సాగుతున్నా నోరువిప్పని కమ్యూనిస్టులు ఇక్కడ ఏమీ జరుగకున్నా స్థానిక గొడవలను మత కోణంలో చూపిస్తూ ఇక్కడి మెజారిటీ - మైనారిటీల మధ్య అగ్గి రాజేస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు ఏదైనా తప్పు చేసి తప్పించుకునేందుకు తమను భారత్‌మాతాకీ జై, జై శ్రీరామ్ అనమన్నారని చెబుతూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. దానికి మూకదాడులంటూ పేరుపెట్టిన అర్బన్ నక్సల్స్ నానాయాగీ చేస్తున్నారు.
దానికి స్వేచ్ఛ, సమానత్వం అన్న కలర్ ఇచ్చే మేధోవర్గం నేపథ్యం అంతా ఈ ఎర్ర రంగు పార్టీనే. గద్దెదించడం తమ సిద్ధాంతం అన్నట్లు ప్రవర్తించే కమ్యూనిస్టులు ఈ దేశంలో నెహ్రూను తప్ప అందరి పట్లా అలాం టి వైఖరి ప్రదర్శించినవారే. విచిత్రమేమిటంటే, స్టాలిన్ కాలం నాటి చార్లెస్ బిర్బాల్ చెప్పిన ‘రీడర్స్ గైడ్ టు మార్క్సిస్ట్ క్లాసిక్స్’ అధ్యయానికి బదులుగా తమ్మినేని వీరభద్రం, నారాయణల జీవితచరిత్రలు రాసి చదివిస్తే సరిపోతుంది! ఎందుకంటే వాళ్లే రేపు కేసిఆర్‌ను తిట్టకపోతే ఒట్టు!!
********************************
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రభూమి : భాస్కరవాణి *
*11-10-2019 : సోమవారం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి