యోగమంటే.. భగవంతునితో కలవడం. పరమాత్మతో జీవాత్మ లయం కావడం అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. చిత్తవృత్తులను నిరోధింపజేసేది యోగమని పతంజలి చెప్పాడు. అన్ని విద్యల్లోకీ యోగ విద్య గొప్పదని శివసంహిత, ఘేరండ సంహిత చెప్పాయి. శరీర భ్రాంతిని వదిలిపెట్టి శాంతిని పొంది దైవత్వం వైపు నడిచేలా మానవులకు మార్గదర్శనం చేసేది యోగం. 

కానీ.. ఇప్పుడు యోగాను ఫిట్‌నెస్‌ ఫీట్‌గా చేసి సమాజంలోకి వదిలిపెట్టాం. యోగాను ఒక మార్కెట్‌గా మార్చేశాం. ఇప్పుడు యోగం పేరుతో మనం చేస్తున్నది అష్టాంగ యోగంలోని ప్రాణాయామ, ఆసనాలనే రెండు భాగాలు. ఇవి యోగ విద్యను గ్రహించేందుకు శరీరాన్ని సంసిద్ధం చేసే ప్రక్రియలు. శరీరంపై అభిమానాన్ని వదిలిపెట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచకోశాలను ఒకదాని తర్వాత మరొకటిగా దైవత్వం వైపు నడిపించే మెట్లు. అందుకే.. ‘పంచకోశాంతర స్థితా’ అంటూ అమ్మవారికి పరమాత్మతత్వం ఆపాదించి స్తుతించాం.
 
ఇంతకీ యోగమంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? దానివల్ల ఉపయోగాలేంటి? అంటే.. ఎన్నడూ నశించని పరమాత్మను ఆధారం చేసుకొని సాగే మహత్తర స్థితే యోగం. శివుడు పార్వతికి హఠయోగం చెప్పగా.. శ్రీ హిరణ్యగర్భుడు యాజ్ఞవల్క్య మహర్షికి బ్రహ్మయోగోపదేశం చేశాడు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడి ముఖంగా ‘నారాయణ యోగం’ బోధించాడు. ఈ మూడూ ఇప్పుడు లోకంలో పరివ్యాప్తమై ఉన్న యోగవిద్యలు. ఇవి మనుషుల్ని తరింపజేసే గొప్ప సాధనలు. 

వీటినే ఆధునిక కాలంలో ఎందరో యోగులు మనకు అందించారు. శ్రీరామకృష్ణులు, త్రిలింగస్వామి, స్వామి వివేకానంద, పరమహంస యోగానంద వంటి మహనీయులు ఈ విద్యను ఆధునిక కాలానికి అందించారు. యోగం మనుషులకు యమనియమాలతో సత్ప్రవర్తన నేర్పిస్తుంది. ఆసన ప్రాణాయామాలతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి స్థితులతో పరంవైపు నడిపిస్తుంది. ‘నీటి చుక్క సముద్రంలో ఉన్నంత వరకే ఉనికిని కలిగి ఉంటుంది. సముద్రం నుండి వేరుపడితే ఆవిరై నశిస్తుంది. అలాగే జీవుడు పరమాత్మలో కలిసి ఉన్నంతవరకు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు.’ అన్నారు శ్రీరామకృష్ణులు. కాబట్టి మానవుడు నిరంతరం తన పనుల్లో మునిగి ఉన్నప్పటికీ దైవస్మరణ వదలకుండా ఆనందమయుడై ఉండాలి. అందుకు యోగం ఒక గొప్ప మార్గం.
 
వేదాన్త శ్రవణం కుర్యాన్మననం చోపపత్తిభిః
యోగేనాభ్యసనం నిత్యం తతో దర్శన మాత్మనః
(పద్మపురాణం)
వేదాంత విషయాలను శ్రవణం చేసేవాణ్ని స్థిరంగా మనసుతో దర్శిస్తూ, నిత్యం యోగం చేసే వారికి ఆత్మదర్శనం లభిస్తుంది అన్న శాస్త్ర వాక్యం నిత్యసత్యం. ఆత్మజ్ఞానానికి యోగమే మార్గం.

**************************************************
 డాక్టర్. పి. భాస్కర యోగి*
*ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన*
* 04 - 11 - 2019 : సోమవారం*కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి