మోతీలాల్‌ నెహ్రూ, ఫిరోజ్‌, ఇందిర, సంజయ్‌, రాజీవ్‌, సోనియా, రాహుల్‌, ప్రియాంక.. మరోసారి భారత రాజకీయాల్లో వారసత్వ గర్వరేఖ తళుక్కుమంది. 1919లో మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుండి 2019లో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసే వరకూ ఈ దేశ రాజకీయం ప్రపంచంలోనే ఓ పెద్ద సమాజ వారసత్వ గొడుగు క్రింద బ్రతకడం దురదృష్టం. ఇది ఒక అంటువ్యాధిలా సోకి రాష్ట్రానికో రాజకుటుంబం తయారవడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన చెద..!? దీని వికృతి ఎంత దారుణంగా ఉందో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కూతురు కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమె ‘చుండ్రు’ వారి కోడలు. కానీ పచ్చ కామెర్ల తెలుగు మీడియా ఆమెను నందమూరి సుహాసినిగా ఎక్స్‌పోజ్‌ చేసింది. అలాగే రాబర్ట్‌ వాద్రా భార్య అయిన ప్రియాంక వాద్రాను ఈ దేశ సూడో సెక్యులర్‌ మీడియా ‘ప్రియాంకా గాంధీ’గా చెపుతూ తిరుగులేని ప్రచారం కల్పిస్తోంది ఆమె భర్త భూకుంభకోణాలు, ఢిపెన్స్‌ దళారీ కుంభకోణాల్లో చిక్కుకున్న పరమ నైష్ఠికుడు. సయ్యద్‌ షుజా ద్వారా ఈవియంల ట్యాంపరింగ్‌ పేరుతో బ్రిటీష్‌ అనలిటికాతో కలిసి కాంగ్రెస్‌ కపిల్‌ సిబాల్‌ ఆడిన నాటకం ఎందుకో తెరపైకి అంతగా ఎక్కలేదు. అదంతా కాంగ్రెస్‌ సెలక్టెడ్‌ డ్రామాగా ప్రజలు భావిస్తారని భావించిన కాంగ్రెస్‌ వర్గాలు దానిని మరిపించేందుకు ప్రియాంకా వాద్రాను మీడియాకు అందించింది. ‘నదిలో కొట్టుకుపోతున్న వాడికి గరికపోచ దొరికినా ఘనమే’ అన్నట్లు ఓవైపు సపా-బసపాల పొత్తును అతి వినయంగా గౌరవిస్తూనే మరోవైపు వాళ్లను ఆత్మరక్షణలో పడేసే వ్యూహం ఇది. అయితే చరిత్రలో సోదరీమణు లెవ్వరూ సోదరులను రక్షించలేదు సరికదా మరింత కష్టాల్లోకి నెట్టారు. రావణ-శూర్ఫణఖ, కంసుడు- దేవకి, హిరణ్యకశ్యపుడు – హోలిక.. ఇలా దర్పానికి సోదరిలను వాడుకోవడంతో మొదటికే మోసం వచ్చింది. ఈ పదకొండవ కొత్త వారసత్వం ప్రియాంకా వాద్రా రాహుల్‌ను ఎలా రక్షిస్తుందో చూడాలి.
దేశం నిండా వారసత్వ రాజకీయం ఓ క్యాన్సర్‌లా వ్యాపించింది. షేక్‌ అబ్దుల్లా ఫరూఖ్‌ అబ్దుల్లాకు కశ్మీర్‌ అప్పగిస్తే, ఫరూఖ్‌ అబ్దుల్లా ఒమర్‌ అబ్దుల్లాను ఇప్పటికే సీఎంను చేసేశాడు. అలాగే హర్యానాలో చౌతాలా కుటుంబం, మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ సుప్రియ, అజిత్‌ పవార్‌లను ముందే రంగంలో పెట్టాడు. ముఫ్తి సయీద్‌ తాను చావ ముందే మెహబూబాను రంగంలోకి దింపాడు. లాలూ యాదవ్‌ రాబ్రీదేవితో అసెంబ్లీలో ఇప్పటికే మాట్లాడించాడు. ఇంకో యాభై ఏళ్లకు సరిపడా తేజస్వీ యాదవ్‌, తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, మీసాభారతిని బీహర్‌ గడ్డపై నిలబెట్టాడు. ములాయం యాదవ్‌ తన శక్తిమేరకు అఖిలేష్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్‌, శివప్రతాప్‌ యాదవ్‌లను యూపీలో గట్టిగా పాతేశాడు. ఆఖరుకు మాయావతి తన సోదరులను, వాళ్ల కొడుకును రాజకీయాల్లో చురుగ్గా ఉంచింది. ఇక దేవెగౌడ కుటుంబమంతా రాజనీతిలో ఉన్నవాళ్లే. కుమారస్వామి, దేవణ్ణలను చూస్తూ తొంభై రెండేళ్ల మాజీ ప్రధాని మురిసిపోతున్నాడు. కరుణానిధి కుటుంబం గురించి ఓ లిస్టే తయారు చేయొచ్చు. ఇక తెలుగునాట కేసీఆర్‌ తన కుమారుడికి రాష్ట్రం అప్పగించారు. అయితే కేటీఆర్‌ మాత్రం స్వయం ప్రకాశం ఉన్నవాడే. అలాగే ఇంకో గొప్ప కుటుంబం గురించి ఎవరూ చెప్పనక్కరలేదు. ఎన్టీఆర్‌, నారా, దగ్గుపాటి వారి ప్రాయోజిత కార్యక్రమం ఇంకా నందమూరి బ్రాండ్‌పైనే ఆంధ్రలో కొనసాగుతున్నది. మహరాష్ట్రలో స్వయంగా తండ్రి మార్గంలో ఎదిగిన థాకరే మరో ఇద్దరు థాకరేలను అందించాడు. ఎంఐఎం పార్టీలో ఒకప్పుడు తండ్రి ఒవైసీ, ఇప్పుడు పుత్ర ఒవైసీలు పూజింపబడుతూనే ఉన్నారు. సింధియా, పైలట్‌, రాజే కుటుంబాలు రాజకీయాలు చేసినా అవి ప్రభావవంతంగా లేవు. వాళ్లందరికీ కుటుంబమే పార్టీ. మరి జాతీయ వాదులకు పార్టీయే కుటుంబం. ఇదే వారికీ వీరికీ తేడా!
మనకు చలనం లేదా?
‘మనం వెయ్యేళ్ల నుండి బానిసలం’ మీకు గుర్తుందా? అంటే మెదడు వాపు వ్యాధి వచ్చిన వాళ్లలా నటిస్తున్న మెజార్టీలను ఎవరు రక్షిస్తారు? కులాల కుళ్లును మనకళ్లపై చల్లేసి కాలం గడుపుతున్న ‘కులౌకికవాద’ కుట్రలు మీకు తెలుసా ? అంటే కళ్లు తేలేసే ఈ దేశ మూలవాసుల గతి ఏం కానున్నదో! రాష్ట్రం, ప్రాంతం, భాష.. ఏది దొరికితే దానితో రాజకీయం చేస్తూ మన గొంతులను మనతోటే కత్తిరింపజేసిన దుర్మార్గపు దౌష్ట్యాలకు చలనం లేదా? మతాలు మాత్రమే ముఖ్యం అనుకున్నవాళ్లు, కులం మాత్రమే మాకు ముఖ్యం అనుకున్నవాళ్లు, సిద్ధాంత రాద్ధాంతం మాత్రమే మాకు స్వంతం అనుకున్నవాళ్లు, మాకు కుటుంబం మాత్రమే ముఖ్యం అనుకున్న వాళ్లు.. తమ స్వార్థ రాజకీయం కోసం బురదను హిందూ మెజార్టీపై వేస్తున్నా, చలనం లేని జడపదార్థాలు మెజార్టీ ప్రజలు..!?
ఏ దేశంలోనైనా మెజార్టీ ప్రజల అభిప్రాయమే అందరి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఇక్కడ పుట్టిన రాముని కన్నా ఎక్కడో పుట్టిన బాబర్‌ ఆరాధ్యుడు అయ్యాడు! ఇప్పటికీ ఇక్కడి మెజార్టీ ప్రజలను ముప్పైవేలకు పైగా ధ్వంసమైన దేవాలయాలు వెక్కిరిస్తున్నా నిస్తేజంగా చూస్తున్న మన బేలతనం..! అత్యాచారాలు మెజార్టీపై జరిగినా, ఊరేగింపులపై రాళ్ల వర్షం కురిసినా ఏమీ అనకుండా మిన్నకుండి పోవడం ఈ దేశంలో మతాల మధ్య సుహృద్భావ వాతావరణం అని మురిసిపోతారు! కశ్మీర్‌, కేరళలో ఐసిస్‌ జెండాలు అందలమెక్కినా, తీవ్రవాదులు ‘మా భూమి పుత్రులు’ అని మెహబూబా ముఫ్తి మురిసి పోయినా అది గొప్ప భావస్వేచ్ఛ అని మురిసిపోతాం. అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురులను ఏళ్లకేళ్లు బిర్యానీలు పెట్టి మర్యాదలు చేసి తీరా ఎలక్షన్ల ముందు ఉరి తీస్తారు. ఇది అంతర్జాతీయ స్థాయి విచారణ!? హిందూ సన్యాసి సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను మహిళ అని కూడా చూడకుండా 9 ఏళ్లు చిత్రహింసలు పెట్టినా మానవ హక్కుల సంఘాలు చప్పుడు చేయరు. పార్టీలకతీతంగా మైనార్టీలు ఏకమై ‘మాకు ఇంకా హక్కులు కావాలని’ గోల చేస్తే ‘జీ హుజూర్‌’ అనే నాయకుల ‘సెక్యులర్‌ పాతివ్రత్యం’ భంగం కానీయక రక్షించడమే రాజ్యాంగ స్ఫూర్తి అనే మేధావుల కుబుద్ధికి సలాం!
శబరిమలను చెరబట్టినా, అయోధ్యను అదుపులో పెట్టినా, కులం కుట్ర చట్రంలో మెజార్టీలను ఇరికించినా, అస్తిత్వాల కుస్తీ చేసి మెజార్టీలను అదుపు చేయాలనుకొన్నా మిన్నకుండే ఈ దేశ మెజార్టీ ప్రజల పాదాలకు వందనం. సహనం మా ఊపిరి అంటున్న మెజార్టీ పై ‘అసహనం’ ప్రకటిస్తున్నా, శాంతి మాకు భ్రాంతి అంటున్నా, బిక్క చూపులు చూస్తున్న మెజార్టీలలో చలనం లేకపోతే.. మరోసారి దేశ విభజన చూడాల్సిన పరిస్థితులు వస్తాయేమో..!?
***********************************
✍ ✍ శ్రీ కౌస్తుభ
జాగృతి : వారపత్రిక 
 04 -10 ఫిబ్రవరి - 2019
సంపుటి : 71, సంచిక : 14

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి