విశ్వరసాయన శాస్త్రం ప్రకారం మనిషికి,ప్రకృతికి మధ్య గొప్ప సంబంధం ఉంది. కానీ దానిని విస్మరించి ప్రాకృతిక నియమాలకు విరుద్ధంగా జీవిస్తూ దానిని గొప్ప భౌతికవాదంగా, ప్రజ్ఞగా ప్రచారం చేస్తాం. దానిలో ఈ రోజు మనం అనుకునేంత సైన్సు లేకపోవచ్చు. కానీ అంతఃప్రజ్ఞఉంది. ఇంట్లోకి కాకులు, గుడ్లగూబలు ప్రవేశిస్తే కొన్నాళ్లు ఇళ్లు వదలమని జ్యోతిష్యులు చెప్తారు. వెంటనే మనకున్న జ్యోతిష వ్యతిరేకతతో దీనిని ఆలోచిస్తే అది అంధశ్వాసంలా కన్పిస్తుంది. కానీ దానిలోని మరో కోణం గమనించాలి.
మనం ఎంతో కలపను ఇంటి అవసరాలకు వాడుతాం. దాని వల్ల అడవులు నశిస్తున్నాయి. దీనివల్ల ఆ చెట్లపైన ఉండే జీవరాశులు గూడు లేనివిగా మారుతున్నాయి. అప్పుడు వాటి కష్టాలు వర్ణణాతీతం. వాటి బాధ మనకు తెసేఏదెలా? గూడుకోల్పోయిన ఆ పక్షులు మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని వదిలి కొన్నాళ్లపాటు అద్దె ఇంటిలో నివసిస్తే.. గూడులేని పక్షిలా జీవనం ఎలా ఉంటుందో మనకు అవగతం అవుతుంది.
ఇదే దీనివెనుక రహస్యం. ప్రతి సృష్టి ధర్మాన్నీ మైక్రోస్కోపులోనో, పరీక్ష నాళికలోనోపెట్టి చూడలేం. ప్రతి విశ్వాస్వాన్నీ మన తర్కంతో, మేధస్సు సహాయంతో, గణితసూత్రాలతో తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ అవి సంభవించి తీరుతాయి. అంతమాత్రాన అదిలేదని చెప్పలేం. అలాగే.. మహాపుణ్యక్షేత్రాలను ఎందరో మహానుభావులు సందర్శిస్తారు. వారందరి తత్వాన్నీ ఆయా క్షేత్రాలు తమలో ఇముడ్చుకుంటాయి. అక్కడికి వెళ్తే వాళ్లందరి స్ఫూర్తీ మనలో నిండుతుంది. ఆ క్షేత్రాలను కేవలం భౌతిక పర్యాటక కేంద్రంగా చూస్తే మనం పొందగలిగేదీ ఏదీలేదు. తాత్విక దృష్టితో జీవించడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధన. ఆ పవిత్ర సాధన.. కేత్రాల్లో, ఆశ్రమాల్లో, పవిత్ర స్థలాల్లో, కొన్ని సాంప్రదాయాల్లో, కొన్నిదైవిక కార్యక్రమాల్లో పుష్కలంగా దొరుకుతుంది. మనిషి మనసునిండా ఎన్నో పాపపు జ్ఞాపకాలుంటాయి. అన్ని రకాల జ్ఞాపకాలు మనకు బరువునే కల్గిస్తుంటాయి. వాటిని మన తలపై నుండి దింపుకోవటానికే ఈ పవిత్ర సాధనలు.
ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్
‘ఓ పరమశివా! నీవే ఆత్మవు; పార్వతి దేవే బుద్ధి; నా ప్రాణములే నీ పరిజనములు; ఈ శరీరమే గృహం. నా విషయోపభోగరచనయే నీకు చేసే పూజలు; నిద్రనే సమాధిస్థితి. నా సంచారమే ప్రదక్షిణ. నీ మాటలే ని స్తోత్రాలు; నేనేమి చేసినా అది నీ ఆరాధనే కదా!’ అన్నారు శంకరులు. ఈ స్థితి కోసమే ఆధ్యాత్మిక సాధన.
- డా. పి. భాస్కరయోగి
********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి