జమ్మూ కశ్మీర్‌లోని యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు.. ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్మానం చే యాలనే రాళ్లు విసురుతున్నారు’- ఈ మహావాక్యం జాలువారింది ఎవరినోటనో తెలుసా? 2017 ఏప్రిల్ 6న కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ మాటలన్నారు. కశ్మీర్‌ను రావణకాష్టంలా రగిలిస్తున్న అబ్దుల్లా కుటుంబం నుండి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.

24 సెప్టెంబర్ 1931న ఆనాటి కాశ్మీర్ రాజు హరిసింగ్ జన్మదినోత్సవానికి రాజ్యమంతా ముస్తాబైంది. ప్రజలంతా శాంతియుతంగా వేడుకలకు సిద్ధమయ్యారు. కానీ కశ్మీర్‌ను ఢాకినీ పిశాచంలా విడవకుండా వెంటాడి వేటాడిన షేక్ అబ్దుల్లాకు ఇది సుతారమూ ఇష్టం లేదు. తన అనుచరులతో రాజావారి ఉత్సవాలపై రాళ్లదాడి చేయించాడు. హిందువుల ఇళ్లు క్షణాల్లో తగలబడిపోవడంతో జన్మదిన వేడుకలు ఆగిపోయి శాంతి భద్రతల సమస్య ముందుకొచ్చింది. కశ్మీర్‌లో రాళ్ల దాడి చరిత్రకు వెయ్యేళ్ల వారసత్వం ఉంది. ఈ చర్చ ఎందుకంటే- ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 42 మంది సైనికులు మరణించి, కొందరు క్షతగాత్రులై విలవిలలాడుతుంటే- కొందరు వాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడి రాక్షస మూకలు ఆ సమయంలోనూ సైనికులపై రాళ్ల దాడి చేయడం ఎంత ఘోరం!


కశ్యపుడి పేరుతో ఏర్పడిన కాశ్మీర దేశం- పరమ పవిత్ర హిమాలయాలున్న ప్రదేశం. కంకుమపువ్వు, యాపిల్ తోటలకు నెలవైన స్థానం. అమర్‌నాథ్, వైష్ణోదేవి వంటి పవిత్ర స్థలాలున్న పుణ్యప్రదేశం. ప్రాచీన శైవానికి నెలవైన ఈ ప్రాంతం ఎందుకు ఈరోజు రక్తసిక్తమై విలవిలలాడుతోంది? ప్రాచీన భారతదేశ చరిత్రకు ఓ దిక్సూచిలా కాశ్మీర్ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం రచించిన కల్హణుని ‘రాజతరంగిణి’లో చెప్పిన స్థానంలో అబ్దుల్లా, ముఫ్తీ, హురియత్ నేతలకు స్థానం ఎందుకు దక్కింది?


14వ శతాబ్ది ప్రథమ భాగంలో కశ్మీర్‌ను సహదేవుడు అనే హిందూరాజు పాలించాడు. అతని ఉదారబుద్ధి తన శరణు జొచ్చిన ఇద్దరు పరదేశీ ఉన్మాదులకు స్థానం ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకడు టిబెట్ రాజవంశీకుడు రెంచన్, రెండవవాడు అప్ఘనిస్తాన్‌కు చెందిన షామీర్. కాశ్మీర్‌పై పరదేశీ మత దురాక్రమణదారుల కన్ను చాలా ముందే పడింది. ఇరాన్‌లోని సీస్తాన్‌లో ఇస్లామిక్ రాజ్యకాంక్ష మొదలయ్యాక క్రీ.శ. 650 నుండే ఈ విస్తరణకాంక్ష పెరిగింది. క్రీ.శ.712లో మహమ్మద్ బిన్ కాసిం సింధురాజ్యాన్ని ఆక్రమించడంతో మన దేశానికి ఆనాడే పెనుప్రమాదం ప్రారంభమైంది. 


క్రీ.శ.632లో మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఎనిమిదేళ్లలోపే ఈ దండయాత్రలు అరేబియా ద్వీపకల్పాన్ని దాటి సిరియా, ఈజిప్ట్‌ల వరకు వెళ్లాయి. క్రీ.శ.660లోనే ఖలీఫా అలీ పెద్ద సైన్యంతో సింధ్ ప్రాంతం మీదకు దం డయాత్ర చేయించి హిం దూ దేశాన్ని ఆక్రమించాలనుకున్నాడు. కిక్రాస్ దగ్గర హిందూ సేనలు వాళ్లను చావుదెబ్బ తీసాయి. ఆ తర్వాత ఇరవై ఏళ్లలో కిక్రాస్‌పై అరబ్బులు ఆరుసార్లు దాడి చేసి ఓడిపోయారు. తర్వాత హిజ్జాజ్, బుదాయిల్ భారత్‌పై దురాక్రమణకు ప్రయత్నించారు. సాధ్యపడనందున అతని అల్లుడైన మహమ్మద్‌బిన్ కాసింకు ఈ బాధ్యత అప్పగించారు. రాజాదాహిర్‌సేన్ ప్రయత్నాలు విఫలమైపోయి ఆ తర్వాత 1947 సెప్టెంబర్‌లో పాక్ దుండగులు మన కాశ్మీర్‌లో అక్రమంగా చొరబడే వరకు మన మొద్దు నిద్ర వదల్లేదు. 712లో ఎలాగైతే దాహిర్‌సేన్ అరబ్బుల దండయాత్రను అనుచరులమీద వదిలేసినట్లే 1947 సెప్టెంబర్ పాకిస్తాన్ దాడిని జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్ రాజు స్వంత వ్యవహారం అన్నట్లు మిన్నకున్నాడు. 

పుల్వామాలో జరిగిన దాడి అయినా, క్రీ.శ.712లో జరిగిన సింధు దురాక్రమణ దాడి అయినా దాని వెనుక ఓ స్పష్టమైన లక్ష్యం ఉంది! క్రీ.శ.638 నుండి 712 వరకు మధ్యన 74 ఏళ్లలో 15 సార్లు భారత్‌పై దురాక్రమణ ప్రయత్నం జరిగింది. చివరకు క్రీ.శ.712 జూన్ 16న సాయంత్రం సింధ్ రాజ్య మహావీరుడు దాహిర్‌సేన్ నేలకూలాకగానీ వాళ్ల లక్ష్యం నెరవేరలేదు. మళ్లీ జిన్నాతో క్రొత్త కథ మొదలైంది. 14వ శతాబ్దంలో కాశ్మీర్‌ను పాలించిన సహదేవుడు నెహ్రూగా, కాశ్మీర్‌లో మతోన్మాదం చెలరేగిపోయిన సద్రద్దీన్ షేక్ అబ్దుల్లాగా అవతారం ఎత్తారు. దీనితో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కశ్మీర్‌పై దాడి రాజకీయ, భౌగోళిక అంశం ఎంతమాత్రం కాదు. అలా ఆలోచించడంవల్లనే కాశ్మీర్‌లో ఈ పరిస్థితి వచ్చింది. ఇదొక మత దురాక్రమణగా క్రీ.శ.712లో భారతదేశంలోకి చొరబాటు జరిగిందో ఇప్పుడూ అదే ప్రయత్నం! ఇది అర్థం చేసుకోని అజ్ఞానులు ‘కాశ్మీరీ అజాదీ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. కశ్మీర్‌లో పుట్టి పెరిగిన, మూలవాసులైన కాశ్మీర్ పండిట్లు ఎందుకు దేశం విడిచివెళ్లారంటే- ఒక్కరూ సమాధానం చెప్పరు!

‘నిజానికి పాకిస్తాన్ ఓ కృత్రిమమైన జాతి’ అని తారేఖ్ ఫతే రాస్తాడు. వాళ్లకు ఎలాంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం లేదు. రాజకీయ అవసరాల దృష్ట్యా ఏర్పడ్డ మతరాజ్యం. భారత్‌లో నెహ్రూ, పాకిస్తాన్‌లో జిన్నా, కాశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబాలు రాజకీయంగా స్థిరపడడానికి బ్రిటీషు వారు పన్నిన ఒక వల అని ఇటీవలి చారిత్రక, రాజకీయ పరిశోధనలు తెల్పుతున్నాయి. కానీ ఈ సమస్య భారత్ మెడకు చుట్టుకొంది. యుద్ధాల్లో మరణించిన మన సైనికులకన్నా ఉగ్రవాద దాడుల్లో చచ్చిపోతున్న వారి సంఖ్య గణాంకాల ప్రకారం ఎక్కువ. యుద్ధం ఒకసారి వస్తే చేయవచ్చు, భారత సైనికులకు ప్రతిరోజూ ఒక యుద్ధమే. దురదృష్టం ఏమిటంటే సైనికులు యుద్ధం చేసేటపుడు రెండు పనులు చేయాల్సి వస్తోంది. తుపాకులు పట్టుకొని శత్రువులపై ఒకవైపు పోరాటం చేస్తే, కెమెరాలు పట్టుకొని మరోవైపు సాక్ష్యాలు సంపాదించాల్సి వస్తోంది. బయటి శత్రువులను నిర్మూలించడానికి తుపాకులైతే, అంతర్గత శత్రువులకు సాక్ష్యం ఇవ్వడానికి కెమెరాలు కావాల్సి వస్తోంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? 42 మంది వీరజవాన్ల కుటుంబాల్లో విషాదం నిండిపోవడమే గాక, దేశమంతా అట్టుడికిపోతుంటే అమరజవాన్ల స్థూపాల ముందు కొవ్వొత్తుల ముందు వెలుగులు ఆరకముందే రాజకీయం మొదలైంది.


లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వస్తుంటే ప్రధాని పదవికి పోటీపడుతున్న వాళ్లు, ‘నేనే పొలిటికల్ ఇండస్ట్రీకి ఆద్యుడిన’ని చెప్పేవాళ్లు వీరజవాన్ల మృతిపై సవాళ్లు విసురుతున్నారు. సర్జికల్ స్ట్రైక్, పెద్దనోట్ల రద్దు, ‘ఎన్జీవో’ల ఆటకట్టు, నిరంతర నిఘా, అంతర్జాతీయ దౌత్యం.. వంటి చర్యలతో టెర్రిరస్టు దాడులు తగ్గాయి. పుల్వామా ఘటన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అతి పెద్ద ఉగ్రవాద దాడిగా చెప్తున్నారు. మరోవైపు దేశంలోని అంతర్గత శత్రువులు చేస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం తక్కువేం కాదు. రాజకీయ అవకాశవాదంతో కొందరు చేస్తున్న దాడిలో భారతీయులు రోజూ మరణిస్తూనే ఉన్నారు. పాక్ టీవీ చానెల్ చర్చలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ‘భారత్-పాక్ చర్చలు జరగాలంటే మోదీని గద్దెదించాలి’ అన్నాడు. పంజాబ్ మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని ‘్ఫరిస్తా’ అని పొగిడొచ్చాడు. అమీర్ ఖాన్ లాంటి ప్రఖ్యాత నటుడు ముస్లింలకు దేశంలో భద్రత లేదన్నాడు. నసీరుద్దీన్ షా అనే వృద్ధ నటుడు అంతర్జాతీయ ఆమ్నెస్టీ వారి అడుగులకు మడుగులొత్తుతూ, తన పిల్లలకు ఇక్కడ రక్షం లేదని వాపోయాడు. 

ఐదేళ్లు ఉప రాష్టప్రతి పదవి అనుభవించి పోతూ పోతూ ‘అసహనం’ అంటూ హమీద్ అన్సారీ వ్యాఖ్యానించాడు. తీవ్రవాదుల కోసం ప్రశాంత్ భూషణ్ అనే న్యాయకోవిదుడు అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపులు తెరిపిస్తాడు. సినిమాలో ‘భారతీయుడు’లా వేషం వేసి ‘శహబాష్’ అనిపించుకొన్న కమల్‌హాసన్ కశ్మీర్‌లో ప్లెబిసైట్ పెట్టాలంటాడు. అదే కోవలో కవితా కృష్ణన్, వి.ప్రకాశ్, సానియా మీర్జా, సిద్ధూ, అమరుల బలిదానాలను కించపరుస్తూ వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఇక కమ్యూనిస్టు ఆస్థాన గాయకులు స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, అరుంధతీ రాయ్, కన్హయ్య, ఉమర్ ఖలీద్, షెహ్లా రశీద్‌లు కూడా తమ గళం త్వరలోనే వినిపిస్తారు. ‘్ధరవనిత’ మమతా బెనర్జీ ప్రధాని మోదీపై ద్వేషంతో విషం కక్కగా, భారత రాజకీయాలకు ‘దిక్సూచి’ లాంటి చంద్రబాబు ఆమెను సమర్థించాడు.

సాధారణ వృద్ధులు సైతం పాక్ ఉగ్రదాడులను ఖండిస్తుంటే.. ప్రచారంలో మునిగితేలే అభ్యుదయవాదులు.. సేవ్ డెమోక్రసీ గ్యాంగులు, ఇండియా గేట్ క్యాండిల్ ర్యాలీ బ్యాచ్‌లు, సపోర్ట్ ఆసిఫా బ్యాచ్‌లు.. రోహింగ్యా రక్షణ కవచాలు, అవార్డు వాపసీ వృద్ధ జంబూకాలు.. ‘జస్ట్ ఆస్కింగ్’ బృందాలు.. వ్యవస్థ పరిరక్షకులైన జడ్జీలు, చైనా చెంచాలు, ‘మీ టూ’ ఉద్యమకారులు.. ఎర్రకళ్లద్దాల మీడియా, హర్యాలీ మేధావులు, కిస్ ఆఫ్ లవ్ గ్యాంగ్, బీఫ్ ఫెస్టివల్ బ్యాచ్, పుస్తక స్మగ్లర్లు, కులగజ్జి గ్యాంగు.. జన విజ్ఞానవేదికలు, అర్బన్ నక్సల్స్.. వీళ్లంతా 42 మంది వీర సైనికుల చావు గురించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు!


బెంగళూరు, కోయంబత్తూరు బాంబు పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ నాసర్‌ను విడుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ కమ్యూనిష్టుల నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం? ‘ఈ దేశ బడ్జెట్‌లో మొదటి ముద్ద ముస్లింలకే’ అని హిందువులపై సవతి తల్లిప్రేమ ప్రదర్శించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నుండి మనం ఏం ఆశించగలం? బాట్లీహౌజ్ ఎన్‌కౌంటర్‌లో తీవ్రావాదులు మరణిస్తే తెల్లార్లు నిద్రలేకుండా బాధపడిన యూపిఏ చైర్ పర్సన్, త్యాగమూర్తి సోనియా గాంధీ నుండి మనం ఏం ఆశిస్తాం? రోహింగ్యాలకు మద్దతు ప్రకటించిన ‘ప్రధాని అభ్యర్థి’ మమతా బెనర్జీ నుండి ఏం ఆశించగలం? ఐపిఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ను నిర్దాక్షిణ్యంగా చంపిన తీవ్రవాదిని అప్పనంగా వదిలిపెట్టిన రాజకీయ వ్యవస్థ నుండి మనం ఏం ఆశించగలం? ముంబై పేలుళ్ల సూత్రధారిని ఊరేగించే విద్యార్థి నాయకులున్న ఈ దేశం ఇంతకన్నా ఏం ఆశిస్తుంది? ముంబైలో బాంబు పేలుళ్లను లైవ్ టెలికాస్ట్ చేసిన జర్నలిస్టులున్న వ్యవస్థ నుండి ఏం ఆశించగలం? దేశ విభజనకు కారణమైన జిన్నాను ఆరాధించే విశ్వవిద్యాలయాలున్న ఈ వ్యవస్థ నుండి ఏం ఆశించగలం? ఇవేవీ లక్ష్యపెట్టకుండా- మీ ప్రాణాలను ఈ మట్టికోసం ధారపోసిన వీరసైనికులారా.. దయచేసి మమ్మల్ని క్షమించండి..!


****************************
 * డాక్టర్. పి. భాస్కర యోగి *
 * ఆంధ్రభూమి : భాస్కర వాణి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి