ఎత్తైన హిమగిరి సొగసులు.. కుంకుమ పువ్వు.. మంచుతుంపరలు.. ఆపిల్ తోటలు.. ఇవే కాశ్మీరపు అందాలని అందరం భావిస్తాం. కానీ గత వారంలో జరిగిన తీవ్రవాద శక్తుల పుల్వామా దాడి చూశాక భారతజాతి నివ్వెరపోయింది. స్వర్గధామం కోసం 45 మంది దేశభక్తులను బలిఇచ్చే నరరూప రాక్షసులు మరోసారి పంజా విసరడంతో దేశం అట్టుడికిపోయింది. కొవ్వొత్తుల వెలుగుల్లో వీరజవానుల ఆత్మలు ఆనందపడవచ్చు కానీ ఇప్పుడు ఈ దేశ రక్తం సలసల కాగిపోతుంది. 7వ శతాబ్ది ఉత్తరార్థంలో భారత్‌లోకి చొరబడాలని చూసిన జీహాదీ శక్తులకూ, టర్కీ వలసదారులకు.. ఈ రోజు ఆత్మాహుతి దాడులకు ఏం తేడాలేదు. పైకి దేశాల మధ్య స్పర్థలా, రాజకీయంలా కన్పిస్తున్నా, వీరి లక్ష్యం మాత్రం ఒక్కటే.
భారతదేశంలో ఒకప్పుడు చప్పన్నారు (56) దేశాలుండేవి. అందులో ఏ ప్రాంతానికీ, ప్రదేశానికీ లేని గొప్ప చారిత్రక గ్రంథం కాశ్మీరు దేశానికి ఉంది. 12వ శతాబ్దంలో కల్హణుడు రాసిన ‘రాజతరంగిణి’ గొప్ప చారిత్రక, సాంస్కృతిక గ్రంథమని ‘ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా’లో వి.ఎ.స్మిత్ ప్రకటించాడు. అలాంటి కాశ్మీర్ దేశం కశ్యపుని పేరుమీద ఏర్పడ్డది. అది ఇప్పుడు రాకాసిమూకల కబంధ హస్తాల్లో చిక్కి విలవిలలాడుతోంది. 14వ శతాబ్దంలో కాశ్మీరును పాలించిన సహదేవుడు తనకు లొంగిపోయిన ఇద్దరు విదేశీయులకు చోటిచ్చి ఈ పరిస్థితికి బీజం వేశాడు. తర్వాత మతమార్పిడి ముఠాకు నాయకత్వం వహించిన బుల్‌బుల్‌షా అనే మౌల్వీ, అతని బాటలో నడిచిన సద్రుద్దీన్ జీహాద్‌ను అమలుపరచే క్రమంలో కశ్మీరీ బౌద్ధ, హిందువుల పాలిట యమకింకరులయ్యారు.
సహదేవుడు, సద్రుద్దీన్‌ల అవతారమే నెహ్రూ, షేక్ అబ్దుల్లాలు. వాళ్లు మళ్లీ పుట్టి కాశ్మీర్‌కు ఈ గతి పట్టించారు. రాళ్లు రువ్వడం వారి మత నియమం అని చెప్పుకుంటూ, ఆ నియమంతోనే జిహాదీలు మన జవాన్లపై రాళ్లు రువ్వుతున్నారు. చూసి మనం వింత అనుకోనక్కరలేదు. 24 సెప్టెంబర్ 1931న మహారాజా హరిసింగ్ జన్మదినోత్సవం జరుగుతున్నది. నగరం కోలాహలంగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఈ ఉత్సవంలో మహమ్మ దీయులూ భాగస్వాములవుతున్నారు. సుద్రుద్దీన్ ఆత్మ ఆవహించిన షేక్ అబ్దుల్లా పథకం ప్రకారం రాజావారి ఊరేగింపుపై రాళ్లు వేయించాడు. హిందువుల ఇళ్లు తగలబడి కాశ్మీర్‌లో బీభత్స వాతావరణం నెలకొన్నది. ఉత్సవాలు ఆగి, శాంతి భద్రతల సమస్య ముందుకొచ్చింది. సరిగ్గా భారత్‌లో ఈరోజు ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఐదేళ్లలో నిరంతర నిఘా, అంతర్జాతీయ దౌత్యం, సర్జికల్‌స్ట్రెక్స్, నోట్లరద్దు కారణంగా ఉగ్రవాద మూలాలు దెబ్బతిన్నాయి.
ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ సైన్యం కోరలు పీకి వేర్పాటువాదుల చేతికి కశ్మీరును వదిలిపెట్టాయి. ఇటీవలికాలంలో సైన్యం కాశ్మీరుపై కొంత పట్టు సాధించింది. 2017లో ఏప్రిల్ 6 నాడు కాశ్మీరు మాజీ సిఎం ఫారూఖ్ అబ్దుల్లా ‘జమ్మూ కాశ్మీర్‌లో యువత దేశం కోసమే భద్రతా బలగాలపై రాళ్లు రువ్వుతున్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా కాశ్మీర్‌పై తీర్మానం చేయాలనే రాళ్లు విసురుతున్నారు’ అన్నాడు. కానీ అదే సంవత్సరం ఏప్రిల్ 16న ఫరూఖ్ అహ్మద్‌దార్ అనే రాళ్లు రువ్వే దేశద్రోహిని రాష్ట్రీయ రైఫిల్స్ కంపెనీకి చెందిన క్విక్‌రెస్పాన్స్ టీం జీపుకు కట్టి తమను తాము రక్షించుకున్నారు. ఇదీ అప్పటి ప్రభుత్వాలకీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా!
దీంతో మతోన్మాద జీహాదీ శక్తుల మోచేతి నీళ్లు తాగే దేశద్రోహ మనస్తత్వం ఉన్న ఒక వర్గం వారు ఓ పథకం ప్రకారం భారత్‌ను దోషిగా నిలబెట్టి పాకిస్తాన్‌కు ఆనందం కలిగిస్తున్నారు. పాక్ టీవీ చానల్ చర్చలో మణిశంకర్ అయ్యర్ భారత్-పాక్ మధ్య చర్చలు జరగాలంటే ‘మోదీని గద్దెదించాలి’ అన్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి వాళ్ల ఆర్మీచీఫ్‌ను కౌగిలించు కున్నాడు. నషీరుద్దీన్ షా అనే వృద్ధ నటుడు ‘భారత్‌లో తమకు భద్రత లేదు’ అన్నాడు. అంతకుముందు అమీర్‌ఖాన్ ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలే చేశాడు. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవి అనుభవించి దిగిపోయిన హమీద్ అన్సారీ ‘అసహనం’ అంటూ కూనిరాగాలు తీశాడు. ఈ దేశంలో బయటి శత్రువులకన్న ఇంటి దొంగలే ప్రమాదకారులుగా తయారయ్యారు. అమరవీరుల స్థూపాల ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగు ఆరకముందే మమతా బెనర్జీ రాజకీయం మొదలుపెట్టింది. ప్రశాంత్ భూషణ్, అపరమేధావి వి.ప్రకాశ్, కవితా కృష్ణన్, కమల్ హాసన్, సానియా మీర్జా, నవజ్యోత్ సింగ్ సిద్ధూ – అమర బలిదానాలను కించపరుస్తూ మాట్లాడారు. రేపోమాపో పచ్చ బ్యాచ్ రంగంలోకి దిగడం ఖాయం. స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్, అరుంధతీరాయ్, కన్హయ్యకుమార్, ఉమర్ ఖలీద్ వంటి కమ్యూనిస్టు ఆస్థాన గాయకులు తమ గళం కలుపుతారు !?
దేశంపై దాడి జరిగినా స్పందించని గ్యాంగులు మనదేశంలో చాలా ఉన్నాయి. అదే మైనార్టీపై ఈగ వాలినా వాళ్ల యావత్ శక్తీ వినియోగిస్తారు. అందుకే చావుకు దగ్గరవుతున్న వృద్ధులు కూడా ఈ ఘటనను ఖండిస్తుంటే అభ్యుదయ వాదులు, సేవ్ డెమోక్రసీ గ్యాంగులు, ఇండియా గేట్ క్యాండిల్ బ్యాచులు, రోహింగ్యాల రక్షణ కవచాలు, అవార్డు వాపసీ వృద్ధ జంబూకాలు, జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్, చైనా చంచాలు, మీటూ ఉద్యమకారులు, ఎర్ర కళ్లద్దాల మీడియా, కిస్ ఆఫ్ లవ్ గ్యాంగు, బీఫ్‌ఫెస్టివల్ వాళ్లు, పుస్తక స్మగ్లర్లు, ప్రజాస్వామ పరిరక్షకులు, జన అజ్ఞాన వేదికలు, అర్బన్ నక్సల్స్.. 42 మంది వీర సైనికుల చావు గురించి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు?!
అయినా మనకు బుద్ధిలేక గానీ!? కోయం బత్తూరు, బెంగళూరు బాంబు పేలుళ్లతో నరమేధం సృష్టించిన అబ్దుల్ నాసర్ మదానీని విడుదల చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ కమ్యూనిస్టులున్న ఈ దేశంలో దేశద్రోహ మనస్తత్వులు కాక ఇంకెవరుంటారు? ఈ దేశ బడ్జెట్‌లో మొదటి ముద్ద ముస్లింలకే అని సవతి తల్లి ప్రేమ చూపించిన మన్మోహన్ ఏలిన ఈ దేశం నుండి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలం!? బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాదులు చనిపోతే తెల్లార్లు నిద్ర లేకుండా ఏడ్చిన త్యాగమూర్తి సోనియా నడుపుతున్న పార్టీ ఉన్న ఈ దేశంలో, రోహింగ్యాలకు మా పూర్తి మద్దతు అన్న మమతను భావి ప్రధానిగా చూపిస్తున్న నాయకులున్న ఈ దేశంలో, ఐపియస్ కృష్ణ ప్రసాద్‌ను నిర్దాక్షిణ్యంగా చంపిన తీవ్రవాదిని మానవతా దృక్పథంతో విడుదల చేసిన వైయస్సార్ పుట్టిన ఈ దేశంలో, ముంబై దాడుల ముష్కరుడిని ఊరేగించే విద్యార్థులున్న ఈ దేశంలో, దేశాన్ని ముక్కలు చేస్తాం అంటూ నినాదాలిస్తున్న కన్హయ్య, ఉమర్ ఖలీద్‌లు ముద్దొస్తున్న ఈ దేశంలో, నరహంతకుడి కోసం అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరిపించిన న్యాయకోవిదులున్న ఈ దేశంలో, అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీలో జిన్నా భూతం ఫోటో తగిలించిన ఈ దేశంలో ఇంతకన్నా ఏం ఆశించగలం?!! ఇదే వేడిలో కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని గురించి చెప్పే 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తే దొరలెవరో దొంగలెవరో తెలిసిపోతుంది! దేశభక్తులెవరో దేశద్రోహులెవరో తేలిపోతుంది!
***********************************
*✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి*
జాగృతి : వారపత్రిక
25 ఫిబ్రవరి - మార్చి03 - 2019
సంపుటి : 71, సంచిక : 17
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి