* దివ్యతత్వమూర్తి... గురువుల్లో దక్షిణామూర్తి
* ఎందరికో ఆధ్యాత్మిక స్ఫూర్తి..
* నడయాడే దేవుడు 
* శ్రీ గెంటేల వెంకటరమణులు!!
“సన్యాసంలో ఉండి నియమంగా ఉండడం గొప్ప కాదయ్యా. సంసారంలో ఉండి గొప్పగా ఉండాలి” అంటారు గొలగమూడి వెంకయ్యస్వామి. అలా తన చుట్టూ సంసారం ఉన్నా, దాని మకిలి అంటని మహనీయులు శ్రీ వేంకటరమణులు..!!
నిజమే! బురద అంటని కుమ్మరి పురుగులా, నీరు అంటని తామర ఆకులా.. సంసారంలో ఉంటూనే దాని వాసనలు అంటకుండా ఎలా జీవించాలో ఆయనను చూసే నేర్చుకోవాలి. తన పరమాద్భుతమైన ప్రేమతత్వంతో అందరి మనస్సులను జయించగల ఆధ్యాత్మికమూర్తి శ్రీరమణ గురూజీ... మనముందు గతించి పోయిన వారివే మాట్లాడుతుంటాం కానీ మనముందరే నడయాడే మహనీయులను మరచిపోతాం. కానీ ఈ రోజుల్లో యోగసిద్ధిని పొంది దివ్యానుభవాలను మూటగట్టుకున్న మహనీయులు శ్రీ వేంకటరమణ గురూజీ.
ఈ యోగమూర్తి 17 జూలై 1963న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బలుసుపాడు గ్రామంలో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, గెంటేల నరసింహారావు పుణ్యదంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక జీవనం పూర్ణంగా కలిగి వేంకటరమణగారు ‘ధర్మదృష్టి’తో జీవనయానం మొదలుపెట్టారు. చిన్ననాటి నుండే చక్కగా శాస్త్రాయధ్యయనం, సమాజ అధ్యయనం అనుశీలనం కలిగిన ఈ గురువు దేశ విదేశాల్లో అనేక పర్యటనలు చేశారు.
ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని విద్యలు నేర్చినా జన్మభూమిని మించిన దేశం లేదని, ఆధ్యాత్మిక విద్యను మించిన విద్యలేదని తెలుసుకొన్నారు. భరతఖండం ఒక ఆధ్యాత్మిక సరోవరం అనీ, ఇందులో ఓలలాడింది ఏ సత్యం తెలియదని ఈ ప్రపంచానికి చెప్పాలని తలచారు. తన సంకల్పానికి తగినట్లుగా ఇక్కడ ప్రసిద్ధులైన సిద్ధ గురువు సద్గురు శివానందమూర్తి విగ్రహాన్ని ఆధారంగా పెట్టుకొని ‘గురుధామ్’ అనే పేరుతో మరో కొత్త ముక్తిధామం సృష్టించారు. కళ్లు మూస్తే దైవాన్ని స్మరించు, కళ్లు తెరిస్తే సమాజాన్ని సేవించు” అన్న సద్గురు శివానందమూర్తి దివ్యపథాన్ని ఈ లోకానికి అందించడానికి ఉద్యుక్తులయ్యారు.
శ్రీ గురుధామ్ ఆశ్రమం ఒక కేంద్రంగా ఆర్తులు, భక్తులు, జిజ్ఞాసులకు అండగా ఉంటున్న బ్రహ్మజ్ఞాని, సిద్ధ పురుషులు, పూర్ణభక్తులు శ్రీశ్రీ గెంటేల వెంకట రమణ గురూజీ.
సద్గురు శ్రీ శివానందమూర్తిగారి మానస పుత్రులు. గురువు ఆజ్ఞ మేరకు భారతీయతను ఆచరిస్తూ, ధర్మ ప్రబోధం చేస్తున్న మంచి మనిషి, చెంతకు వచ్చిన వారి బాధలను తొలగిస్తూ ఆత్మజ్ఞానం బోధిస్తున్న ఋషివర్యులు శ్రీరమణ గురూజీ. బలుసుపాడు, జగ్గయ్యపేటలలో విద్య, వైద్య, అన్నదానం చేస్తున్న గురుకుటుంబం వీరిది. అపారమైన జ్యోతిష్య పరిజ్ఞానం, ఆంజనేయస్వామి అంశ, భగవాన్ రమణ మహర్షి బోధ సారాన్ని జీర్ణించుకున్న విలక్షణ వ్యక్తిత్వంతో దర్శినమిస్తారు. మహర్షి మహేష్ యోగి ద్వారా విదేశాలకు వెళ్ళినా భారతభూమిపై గల అపార ప్రేమ వలన వెంటనే వెనుదిరిగి వచ్చిన విశేషం వీరిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, శిష్యులు, మిత్రులు ఉన్నా నిరాడంబరత, సేవాతత్పరతలతో తరిస్తున్న ధన్యజీవి.
ఆత్మదర్శనం లేదా సాక్షాత్కార అనుభవాన్ని అలవోకగా ఈ ఆధునిక ఋషితుల్యులు వారి ఆంతరంగిక ప్రయాణం లేదా దర్శించిన అనుభవించిన సత్యాన్ని “ఒక ఊరి కథ” ద్వారా మనందరికీ కొన్ని భాగాలు గతంలో ప్రచురితం కావడం పాఠకుల అదృష్టం. చదివినంతనే అనుభవమౌతుందా అనేంత గాఢత వారి బోధలోని విశేషం. ఈ రచన మనందరి కథ.
అద్వైత ఆలంబనగా..
‘నేను’  అనే బహిర్గతమైన అహంకారం వదలిపెట్టి నేను  నేను అంతర్గతమైన ఆత్మకు తెలుసుకొనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన అరుణాచల శ్రీరమణుల మార్గమే శరణ్యం అనుకొని శుష్క వేదాంతం కాకుండా ఆచరణాత్మక వేదాంతం ఔదలదాల్చారు వేంకటరమణులు. శంకరుని సిద్ధాంత భాగానిన ఆచరణరూపంగా అవలంభించిన అరుణాచల రమణమహర్షి మార్గాన్ని వేంకటరమణులు ఎంచుకున్నారు. విచిత్రంగా ఈయన పేరులో కూడా రమణ ఉండడం విధి నిర్ణయమే. రమణమహర్షి ప్రబోధించిన ఆత్మబోధను  దాని ఆనుపానులను పట్టుకొన్న ఈ రమణుల జీవనం ఆలోచనతో కూడిన ఆత్మమార్గంలో కొనసాగుతుంది.
మొదట హనుమదోపాసకుడైన ‘వెంకటరమణులు’ హనుమంతుని ‘వాయువేగాన్ని’ ఆత్మస్వరూపంగా భావించారు. హనుమ వాయుపుత్రుడు. ప్రాణశక్తికి సాధనకు ప్రతీక. శ్రీరాముని కనుక్కోవడమే తారకనామ గ్రహణం. అదే పరమాత్మ దర్శనం. రామనామం తారకనామం. అది తరింపచేస్తుంది. ఆ నామంపైనే హనుమంతుని గురి. అదే తారకరాజయోగం.
****************************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ విజయక్రాంతి  : ఆధ్యాత్మికం ॐ*




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి