ఒకాయన చాలా డబ్బు ఖర్చుపెట్టి అందమైన భవనం కట్టుకొన్నాడు. అతని ఇంటిముందు ఇంటి యజమాని ఎవరితోనో ‘ఆ క్రొత్త ఇంటిపై రాయివేస్తాను’ అన్నాడు. క్రొత్త ఇంటి యజమాని రోజూ పనులన్నీ మానుకొని అతడు ఎప్పుడు రాయివేస్తాడా? అతనిపై పోలీస్ కేసు ఎప్పుడు పెట్టాలా? అని ఎదురుచూస్తున్నాడు. ఇతడు మాత్రం రోజూ రాయిని చేతిలో పట్టుకోవడం, ఇంటి అరుగుపై కూర్చొని సాయంత్రం లోపలికి వెళ్లడం చేస్తున్నాడు. కానీ కొట్టడం లేదు. ఇతడు ఎప్పుడు కొడతాడా అని ఎదురుచూస్తున్న వ్యక్తికి ఎదురుచూసి ఎదురుచూసి విసుగొచ్చింది. నెలలు గడిచినా ఎదురింటి పెద్దమనిషిది అదే తీరు. ఓరోజు ఈ క్రొత్త భవనం యజమానికి చిరాకుపుట్టి ‘నీవు త్వరగా కొడతావా? కొట్టవా? ఈ ఉత్కంఠతో చచ్చిపోతున్నా’’ అని నిలదీసాడు.

ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పరిస్థితి ఇదే. తెలంగాణ రాజకీయాల్లో మొన్న డిసెంబర్‌లో వేలుపెట్టాడన్న కోపంతో యథాలాపంగా కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అదేదో పెద్ద వరంలాగా ఇక కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచేయొచ్చు అని బాబు అండ్ కో ఎగిరి గెంతువేసింది. చంద్రబాబు-కేసీఆర్ మధ్య ఇదో గొప్ప అనుబంధం, వాళ్లిద్దరూ మాట్లాడుకొనే ఇదంతా చేస్తున్నారని పచ్చ రాజకీయ పండితులు విశే్లషణ చేసేశారు. కేసీఆర్ గెలుపులోని గొప్పదనాన్ని బాబుకు ఆపాదించే క్రమంలో చేసిన ఎల్లో మీడియా ఇదొక వ్యూహంగా పేర్కొన్నది. కానీ సీన్ రివర్స్‌అయ్యింది. ఎన్నికల కోడ్ రాగానే మోదీపై ఒంటి కాలిపై లేచి హైజంప్ చేసి ఢిల్లీని కలకత్తాను ఏకంచేద్దామనుకొన్న బాబు మెడకు ఐటీగ్రిడ్ కేసు మెడకు చుట్టుకొంది. మీడియా ద్వారా దానిని ఎంత కప్పి పాతిపెడదామనుకొన్నా ఈపాటికే ప్రజలకు ఎలా అర్థంకావాలో అలాగే అర్థంఅయ్యింది. ఇక అలీ వైసీపీలో చేరగానే ఆయన వేయించే ఓట్లు ఎన్నో తెలియదుగానీ వెంటనే టీడీపీ బుద్దావెంకన్న ఇదంతా కేసీఆర్ కుట్ర అన్నారు. జయసుధ వెళ్లగానే ఇది కేసీఆర్ బెదిరింపు అన్నారు. ఇదిలా ఉండగానే, కేసీఆర్ తన వ్యూహాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రేగా కాంతారావు, అత్రం సక్కు, హరిప్రియలను తనవైపు తిప్పుకొన్నాడు. ఈలోపు రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు బలమైన వర్గంగా ఉన్న ఇంద్రారెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్ వైపు మళ్లింది. ఉట్టికింద కూర్చొని పిల్లి శాపాలుపెట్టినట్లు కాంగ్రెస్‌వారు ధర్మపన్నాలు వల్లిస్తున్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి బలంగా ఉన్నపుడు కాంగ్రెస్ ఏం చేసిందో మర్చిపోతాడా కేసీఆర్. 


అంతెందుకు! 2014 తర్వాత వైయస్సార్సీపీకి చెందిన 20కి పైగా ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో కలుపుకోలేదా? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. కేసీఆర్ యజ్ఞాలు ఎంత బాగా చేయగలడో రాజకీయం అంతే బాగా చేయగలడు. కాంగ్రెస్, తెలుగుదేశం సిలబస్ మొత్తం క్షుణ్ణంగా చదివేకదా కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను స్థాపించింది! చంద్రబాబు జీవిత చరిత్రను వైయస్ రాజశేఖర్‌రెడ్డి కాచి వడబోసాడు. అటు బాబును, ఇటు వైయస్‌ను చివరి పేజీవరకు కేసీఆర్ చదువుకొన్నాడు. ఇపుడు అదే పాఠాలను వైయస్ జగన్‌కు నేర్పిస్తే తప్పేంటి? కేసీఆర్‌ను నేరుగా యుద్ధరంగంలోకి రెచ్చగొట్టిలాగి ఆంధ్ర-తెలంగాణ సెంటిమెంటును రాజేయాలనుకొన్న చంద్రబాబుకు కేసీఆర్ వౌనంగా ఉంటూ మరింత అసహనం కలిగిస్తున్నాడు. 

ఇక జగన్ అటు ప్రశాంత్ కిషోర్ సలహాలతో, కేసీఆర్ ఆశీర్వాదంతో, అసదొద్దీన్ ఓవైసీ మంత్రాంగంతో త్రిముఖ వ్యూహాలను అవలంభిస్తున్నాడు. నిజానికి ఆంధ్రకు చెందిన నటులు, పారిశ్రామిక, రాజకీయవేత్తలు హైద్రాబాద్‌లో తమ కార్యకలాపాలు జరుపుతున్నా తమ ప్రాణం ఆంధ్రా చుట్టూ తిప్పుతుంటారు. ఇపుడు కలుగులోని ఎలుకలను మెల్లిగా కేసీఆర్, జగన్ కలిసి విజయవాడ దారి పట్టిస్తున్నారు. ఇక ఆంధ్రా-తెలంగాణలో (హైద్రాబాద్) ఓటు నమోదు చేయించి గంపగుత్తగా వారి ఓట్లను ఖరీదు చేద్దామనుకొన్న వారి కుట్రలను చేధిస్తూ ఎన్నికల ముందు ఐటీగ్రిడ్ తుట్టెను కదిలించారు. దీనికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఒకేరోజు పోలింగ్ పెట్టి ఎన్నికల సంఘం మరో విజయం సాధించింది. అలాగే ఢిల్లీలోవెళ్లి చక్రం తిప్పుతాం అంటున్న, తిరిగి తిరిగి అరిగిపోయిన చక్రానికి మొదటే ఎన్నికలు పెట్టి ఒక్క రౌండుకే కథ ముగించే వ్యూహం ఢిల్లీనుండి రానే వచ్చింది.

ఇక కాంగ్రెస్‌వాళ్లకు కంట్లో నలుసులా కనిపిస్తున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రింద పడేద్దామనుకున్నారు. కానీ ఆపరేషన్ గులాబీతో పరేషాన్‌లో ఉత్తమ్ టీం కుదేలయ్యింది. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహిత కుటుంబమైన కార్తీక్‌రెడ్డి కుటుంబం టీఆర్‌ఎస్‌లోకి వెళ్తుంటే ఆయనే నివారించుకోలేకపోయాడు. జానారెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కుటుంబాలను ఏనాడూ విమర్శించని రేవంత్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయాడు. సముద్రం లాంటి కాంగ్రెస్‌లోకి వీళ్లందరినీ చూసుకొనే రేవంత్ వచ్చాడు. ఒకప్పటి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడేందుకు కావలసిన సమాచారం ఆనాడు కాంగ్రెస్‌లోకి ఈ వర్గాలే రేవంత్‌కు సహాయంగా ఇచ్చేవారని చెప్పుకొంటారు. 


ఇపుడు రేవంత్‌రెడ్డిని గట్టిగా ప్రోత్సహించేవారు తక్కువే. ఇటీవల జరిగిన రాహుల్ సభలో రేవంత్ లేకపోవడం స్పష్టంగా కన్పించింది. ఉత్తమ్ అధ్యక్షుడయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రా కాంగ్రెస్ పరిస్థితికి తమ్ముడిగా తయారైంది. కేసీఆర్ నాయకుడిగా ప్రజలను మెప్పిస్తున్నాడు. అలాగే రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాడు. అతనికి సమఉజ్జీగా కాంగ్రెస్‌లోని ఏ నాయకుడూ నిలువలేకపోయారు. అంతేగాక పుల్వామా దాడి జరిగాక మోదీపై మళ్లీ యువతలో క్రేజ్ మొదలైంది. రాహుల్‌గాంధీలోని రాజకీయ అపరిపక్వత కాంగ్రెస్‌వాదులకు శూన్యంగా గోచరిస్తుంది. రాఫెల్ కుంభకోణంపై రాహుల్ చెప్పే చిలుక పలుకులను ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ ‘కుటుంబ భజన’ చేస్తున్నారు తప్ప రాహుల్‌గాంధీ బ్రహ్మచారిగా ఉన్నందుకు అతనిని సరైన దిశలో నడిపించలేదు. 

మోదీకి సమఉజ్జీగా తయారుచేయలేకపోతున్నారు. ఏకే ఆంటోనీలా ఉన్నదున్నట్లు చెప్పేవారు లేరు. కేవలం తమ ప్రాపకంకోసం రాహుల్ చుట్టూచేరి భజన పరులయ్యారు. ఈ రోజుకూ కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ కొరకు అమరవీరుల మరణాన్ని ‘‘నోటితో పొగుడుతూ నొసలుతో’’ వెక్కిరిస్తున్నది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రా, తెలుగుదేశం మైనార్టీ నాయకులు ఒవైసీపై విరుచుకుపడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీనేకదా మజ్లిస్‌కు రక్షణ కవచంగా నిలిచింది, అంతలా పెంచి పోషించింది?! ఆఖరుకు హిందూ జనాభా ఓట్లుఉన్న ప్రాంతాలను తొలగించి హైద్రాబాద్‌ను నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ గంపగుత్తగా అప్పజెప్పింది ఎవరు? హైద్రాబాద్ గల్లీలల్లో నిందితుల ఇళ్లకువెళ్లి సమాలోచనలు చేసిన షబ్బీర్‌అలీ గతం మరిచిపోయాడా? ఇటీవల ‘నారా హమారా’- టీడీపీ హమారా’ అంటూ మైనార్టీ జపం మొదలుపెట్టిన చంద్రబాబు అవకాశవాదం ప్రజలు గమనించరా? పుష్కరాల్లో గుడులు కూల్చి, విఐపీల రద్దీపెంచి భక్తుల చావుకు కారణమైనవాళ్లను ఆంధ్రా హిందువులు బాగానే గుర్తుపెట్టుకొంటున్నారు. 

అమరావతి బుద్ధుడిని చూపించి బౌద్ధ దేశాలనుండి పెట్టుబడులకు వెళ్లడం బాబు రాజకీయ వ్యూహమే. ఎప్పుడో 2017లో ఈడీ సిబిఐకి రాసిన ఓ లేఖను పట్టుకొని తెలుగు మీడియా రాద్ధాంతంచేసి చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే పనిలో బిజీగా ఉంది. ఇక రేపోమాపో కేసీఆర్ సామెతలు, వెటకారాలు, వ్యంగ్యోక్తులు, తిట్లు, నీతులు కలగలిసి బాబుగారికి కుంకుడుకాయ స్నానం చేయిస్తే గాని రాజకీయం రగుల్కోదు.
ఈమధ్యలో ఏదో నాజీ సైన్యంలా పేరుపెట్టుకొన్న జనసైన్యం, చేగువేరాలా గడ్డంపెంచి రాసిచ్చిన డైలాగులతో సగం కమ్యూనిస్టులా, ఇంకో సగం నేతాజీలా ఫోజులిస్తున్న పవన్‌కల్యాణ్ దారి ఏంటో ఇప్పటికీ అర్ధంకాలేదు. సినిమా నటులపై సహజంగానే మనసుపారేసుకొనే ఆంధ్రా యువకులకు ఇది రాజకీయమా సినిమానా అర్ధంకాక చస్తున్నారు. దేశం ఎటు కొట్టుకుపోయినా పర్వాలేదని జనసేనను గెట్టు దాటకుండా కావలిగాస్తున్న కమ్యూనిస్టుల రాజకీయ భావదారిద్య్రం చెప్పనలవి కాదు. పవన్‌కల్యాణ్‌ను భాజపాతో కలవకుండా చేసేందుకు నారాయణ, రాఘవులు, రామకృష్ణ, మధు షిఫ్టులవారీగా కాపలా కాస్తున్నారు. 


జస్టిస్‌పార్టీ తోక సంబంధం ఉన్న కమ్యూనిస్టు, టీడిపి మైత్రికి ఇది పరాకాష్ట. ఈమధ్యలో కె.ఏ.పాల్ అనే రాజకీయ నాయకుడిని విదూషకుడిగా సోషల్ మీడియా మార్చుకుంది. క్రైస్తవుల ఓట్లను జగన్‌వైపు వెళ్లకుండా చూసేపనిలో ఇతనిద్వారా చేయిస్తున్నారని కొందరి అంచనా. నీతి, నిజాయితీలకు మారుపేరుగా నిల్చిన జేడి లక్ష్మీనారాయణ, టీడిపిలో చేరడం అంటూ వెనుకనుండి ప్రచారంచేయడం ఎవరి పథకమో తేలాలా!? ఇక ఆంధ్రాలో కాపు కుల నాయకుల రాకపోకలు, పార్టీల చేరికలు అనే అంశం ప్రత్యేకంగా జరుగుతున్నా, ఇదంతా గుంభనంగా నడుస్తున్నది.

ఈ ఆటలో కాంగ్రెస్, బీజెపీల పాత్ర ఇంకా ఖరారు అవలేదు. దేశమంతా మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నాయకులు కాలికి బలపం పట్టుకొని ఎన్నికల సంగ్రామంలోకి దిగితే ఇక్కడి భాజపా నాయకులు ఇంకా దాగిళ్లు మూగళ్ల ఆటలోనుండి బయటకు రావడంలేదు. బలమైన అభ్యర్థులుంటే హైద్రాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, చేవెళ్ల సీట్లు సులభంగా గెలుచుకోవచ్చు. అలాగే ఆంధ్రాలో విశాఖ మొదలుకొని రాజమండ్రివరకు ఎన్నో సీట్లలో భాజపాకు అవకాశం ఉంది. ఇంతవరకు అభ్యర్థులు ఖరారు చేయకుండా అదే అసెంబ్లీ పంథాను అవలంభించి చర్చోపచర్చలు జరుపుతూ నామినేషన్ల వరకు అత్యంత గోపనీయత ప్రదర్శించడం హద్దులు మీరిన రాజకీయ క్రమశిక్షణ. ఇదే తేలేవరకు పుణ్యకాలం గడిచిపోయి ఉత్తరద్వార దర్శనం జరిగిపోతుంది. మోదీ బలాన్ని కూడా ఉపయోగించుకోలేని బలహీనతకు మందే లేదు. ఇక ఆంధ్ర కాంగ్రెస్ పరిస్థితి జనసేనకు తక్కువ ప్రజాశాంతి పార్టీకి ఎక్కువ. వేసవి కాలంలో వస్తున్న ఈ ఎన్నికలు తెలుగు ప్రాంతంలో మరింత వేడిని పుట్టిస్తున్నాయి. ఈ ఆటలో మాడేవారెవరో, ఓడేవారెవరో, గెలిచేవారెవరో నిలిచేవారెవరో చూడాలి.

************************************
 * శ్రీకౌస్తుభ *
 * ఆంధ్రభూమి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి