శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గంలో అనేక సాధనలు చేశారు. పరమహంసలకే పరమహంసగా పేరొందారు. ఒకసారి శ్రీరామకృష్ణులు సతీసాధన చేయాలని మొదలుపెట్టారు. అది గోపికా మార్గం. శ్రీకృష్ణుడొక్కడే పురుషుడు, మిగిలినవారంతా స్త్రీలే అన్న భావనతో ఆ సాధన సాగుతుంది. రామకృష్ణులు గోపికగా మారిపోయారు. అంటే ఆ తత్వంలో జీవించారు. అనుక్షణం శ్రీకృష్ణారాధనలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడి సంకీర్తనలు వింటే చాలు భావసమాధిలోకి వెళ్లేవారు. ఈ సాధన వల్ల రామకృష్ణునిలో అనేక మార్పులు సంభవించాయి. కొన్నాళ్లకు స్త్రీలమాదిరి గొంతు మారిపోవడం, స్తనాలు పెరగడం జరిగింది.
అయితే ఈ లక్షణాలు చాలా మంది పురుషుల్లో కూడా సంభవిస్తాయి. కానీ వైజ్ఞానిక చరిత్రలో ఎప్పుడూ జరగని మార్పు ఒకటి శ్రీరామకృష్ణుల సాధనలో జరిగింది. ఆయన సతీసాధన తీవ్రస్థాయికి వెళ్లేసరికి ‘మాసిక ధర్మం’ ప్రారంభం కావడం ‘నభూతో నభవిష్యతి’ అంటారు ఓ తత్వవేత్త. కేవలం స్త్రీలలో ఉండే ఆ ధర్మం శ్రీరామకృష్ణుల భౌతిక శరీరంలో సంభవించడం విశేషమే. అంతర్గతంగా రామకృష్ణుల సాధన శారీరక స్థితిగతులను మార్చివేసింది.
భక్తుడు తన ఇష్టదైవాన్ని బాలునిగా, సఖునిగా, తండ్రిగా లేదా తాతగా భావించి ఆయన వాత్సల్యం, ప్రేమ, వినయం, గౌరవం మొదలైన పద్ధతుల్లో కీర్తించడం ఈ సాధనలో ప్రత్యేకత. ఇదంతా భావసంకీర్తనం. అలాగే ఈ భావసంకీర్తనంలో భక్తుడు తనను నాయికగా భావించుకొని భగవంతుడిని నాథుడిగా భావించి, తలంచి కీర్తిస్తాడు. అదే విధంగా కొందరు దేవిని తన తల్లిగా, జగజ్జననిగా భావిస్తారు. ఇందులో జీవ-దేవుల మధ్య దగ్గరితనం కన్పిస్తుంది. వారిద్దరి తత్వంలో అభేదం కన్పిస్తుంది. దీనిలోని మార్మిక భావాలు ఎందరో సంకీర్తనాచార్యుల్లో కన్పిస్తుంది. దేవుడిని నాయకుడిగా తనను నాయికగా ప్రతి సంకీర్తనకారుడు చెప్పుకొన్నాడు. దీనిని మధుర భక్తి లేదా గోపికా మార్గం అంటారు. అలాగే ఈ భావ సంకీర్తన చేసే భక్తుడు దేవుడిని నాయకుడిగా, నాథుడిగా భావిస్తూ దేవేరిని దూతికగా సంబోధిస్తూ కీర్తనలు రాసుకున్నారు.
‘‘భామినీ వినవమ్మా నా స్వామినీ పిలువవమ్మా
భామినీ నీకొక్క పని విన్నవించేదా
మందయానరో హరుని మరులొందియున్నాను
కందర్ప జనకుని కన్నుల జూపవే
మనసువానిదాయె మాయదెలయదాయె
వనజాక్షి మును బ్రహ్మ రాసిన ఫలమేమో’’

అంటూ రాకమచర్ల వెంకటదాసు అయ్యవారికి చెప్పాల్సిన విన్నపాలను అమ్మవారికి చెప్పుకొంటాడు. అయితే ఈ భావసంకీర్తనం లేదా గోపికామార్గం ఈ మధ్య కొత్తగా వచ్చిందేమీ కాదు. ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించారు. ఓసారి ధనుర్యాగం కోసం కంసుడు మధురకు పిలిపించగా వెళ్లిన శ్రీకృష్ణుడు మళ్లీ ఇక గోకులానికి రాలేదు. అక్కడి గోపికలు అతని కోసం ఎదురు చూసి శ్రీకృష్ణ లీలలను తలచుకొంటూ, భావసంకీర్తనం చేస్తూ తాము పూర్తిగా కృష్ణమయమైపోయారు. అలాగే గోదాదేవి గోపికామార్గం ద్వారానే శ్రీరంగనాథుడిని చేపట్టింది. మీరాబాయి ఇదే మార్గంలో కృష్ణతత్వంలో లీనమైపోయింది. సాధకుడు భగవంతుని తత్వాన్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆ తత్వంలోనే మునిగిపోవడం గోపికామార్గం. మానవులు కేవలం డబ్బులు, ఆస్తులు, పదవులు, అహంకారాలు, అధికారాలు, బంధాలు మాత్రమే శాశ్వతం అనుకొని వాటి వెంట వెర్రివాళ్లలా తిరుగుతుంటారు. అసలు జీవుడు శాశ్వతమైన పరబ్రహ్మం చుట్టూ తిరగాలనేది గోపికామార్గంలోని సందేశం. అందుకు భ్రమల్లో అస్థిరంగా జీవించే వ్యక్తులు భగవంతుడిని గట్టిగా పట్టుకోలరనే ఉద్దేశంతో భావసంకీర్తన ఒక ఉపదేశంగా, సాధనగా చెప్పబడింది.
-డా. పి. భాస్కర యోగి





***********************************
*✍ ✍ డాక్టర్‌. పి. భాస్కర యోగి*
*ॐ ఆంధ్రజ్యోతి : నవ్య నివేదన ॐ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి