ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తారేఖ్ ఫతే అనే ఇస్లామిక్ మేధావి, పరిశోధకుడు, రచయిత ఓ ఆసక్తిరమైన వ్యాఖ్య చేశాడు. టీవీ ప్రతినిధి ఫతేను ప్రశ్నిస్తే ‘‘మీరు నిత్యం ఇస్లామిక్ తీవ్రవాదం గురించే మాట్లాడుతుంటారు.. ఆరెస్సెస్, భాజపా మతతత్వం గురించి మాట్లాడరు?’’ అన్నాడు. దానికి ఫతే సమాధానమిస్తూ- ‘ఆరెస్సెస్, భాజపా మతతత్వవాదులైతే ఏం జరుగుతుంది? గరిష్టంగా హిందూ జాతీయవాదం బలపడుతుంది. అంతకన్నా ఇంకేం జరగదు. అదీ భారతదేశానికే పరిమితం అవుతుంది. సెక్యులరిజం నిజమైన అర్థం అమల్లోకి వస్తుంది. అదే ఇస్లాంలో పెరిగే మతతత్వం ప్రపంచానికే ప్రమాదం కదా! అందుకే నేను ఐసిస్ లాంటి కరడుగట్టిన మతోన్మాద ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నా..’ అన్నాడు. తారేఖ్ ఫతే లాంటి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తి ఇంత గొప్పగా హిందూ జాతీయవాదాన్ని అర్థం చేసుకొన్నాడు. సింధు నాగరికత లేకపోతే భారతీయతకు అర్థం లేదన్నాడు. రాముని కుమారుడైన లవుడి పేరు మీద వున్న లాహోర్ హిందువులకు చెందకపోతే హిందూ సంస్కృతికి విలువలేదన్నాడు.

విచిత్రమేమిటంటే- ఈ దేశంలోని స్వార్థ సంకుచిత రాజకీయ నాయకులు తమ కుటుంబాల పరిపోషణార్థం ఓటు బ్యాంకు రాజకీయాలు నిస్సిగ్గుగా చేస్తున్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి త్రిపుల్ తలాక్‌పై చేసిన వ్యాఖ్యలు జుగుప్సను కలిగిస్తున్నాయి. ‘త్రిపుల్ తలాక్ చట్టంతో మోదీ ముస్లింలను ఇబ్బంది పెట్టాలనుకొంటున్నాడు.. నేను ఉన్నంతవరకు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు తమ్ముళ్ళూ..’ అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పుకొంటున్నాడు. మోదీ ప్రధాని అయ్యాక ఏనాడైనా హిందూ ముస్లిం అనే పదాలను జంటగానైనా వాడాడా? 135 కోట్ల భారతీయులు అనే పదం వేలసార్లు చెప్పాడు. అదే చంద్రబాబు గుజరాత్ వాళ్లను మూకుమ్మడిగా తిడతాడు. ఒకవేళ మోదీ తప్పు చేస్తే గుజరాత్ వాళ్లను ఎందుకు తిట్టడం? తనపై జరిగే రాజకీయ వ్యాఖ్యలకు ‘తెలుగుజాతి’ అని కలర్ ఇవ్వడం ఈ రెండూ నాణేనికి బొమ్మా బొరుసూ లాంటివే. సుజనా చౌదరి, పుట్టా సుధాకర్ యాదవ్ ఆస్తులపై జరిగే ఐటీ దాడులు తెలుగుజాతివారిపై జరిగే దాడులా? ఇన్నిసార్లు మోదీ ఆంధ్రకు వచ్చినా ఎప్పుడైనా ఆంధ్ర ప్రజలను అవమానకరంగా మాట్లాడాడా? ఒక దేశ ప్రధానిని ‘నువ్వు నా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు’ అంటూ వ్యాఖ్యలు చేస్తూ, బ్యానర్లు పెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?

వైకాపా అధినేత జగన్ ప్రచారం చేయకుండా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఎన్నికల విషయాలు చర్చిస్తే కుట్ర చేసినట్లా? కేసీఆర్ జగన్‌కు డబ్బు ఇచ్చి పంపించినట్లు సాక్ష్యాధారాలు చూపించాలి కదా? ఇవన్నీ బాబు మాట్లాడుతున్న ఊహాజనిత ఉపన్యాసాలకు ఉదాహరణ. రోజూ చేస్తున్న తిట్ల పురాణంలో మోదీ మోసగాడు, నియంత, వ్యవస్థల్ని ధ్వంసం చేశాడు- ఈ మూడు వాక్యాలు చర్విత చర్వణంగా చెప్తుంటే వినలేక జనం విసిగిపోతున్నారు. మోదీని, కేసీఆర్‌లను బూచిగా చూపి దానికి జగన్‌ను జోడించి ఓట్లు పొందడమే అసలు లక్ష్యం. ఇదంతా మోసం కాదా? నారుూ బ్రాహ్మణులను ఉద్దేశించి చంద్రబాబు ‘మీ తోక కత్తిరిస్తాను’ అనడం నిరంకుశత్వం కాదా? తెలుగుజాతి ఆత్మగౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్‌ను గద్దె దింపింది వ్యవస్థల్ని విధ్వంసం చేయడం కాదా? ఇన్ని ఘనకార్యలు మోదీ చేయలేకపోవచ్చు. జాతీయ నాయకుడిగా చెప్పుకొంటున్న చంద్రబాబును తెలంగాణ ఎందుకు తిరస్కరించింది? ఓట్లకోసం కులాలను, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయవాదాన్ని ఉసిగొల్పడం కన్నా- మోదీ చెప్పే జాతీయవాదం ప్రమాదకరమా?

అన్నా హజారేను ముందు పెట్టుకొని దొడ్డిదారిన అధికారం పొంది హజారేను యమునా ప్రవాహంలో తోసేసి ఆంధ్రలో ఉపన్యాసాలు చేస్తున్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ మోదీకి కొత్తనా? అవివీతిపరుల గుండెల్లో నిద్రపోతా, వాడి తాట తీస్తా, వీడి పొలుసు తీస్తా! అంటున్న పవన్ కల్యాణ్ మాయావతిని ఆంధ్రకు పిలిచాడు. నీతికి నిలువెత్తు రూపంగా ఎందరో యువకులు భావించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను తనవెంట బెట్టుకున్న పవన్- అవినీతి కేసుల్లో ఇరుక్కున్న మాయావతిని ఆంధ్ర ప్రజలకు చూపించి ఏం సందేశం ఇస్తాడు? మాయావతి ముందు కూర్చోవడానికి వాళ్ల పార్టీ వాళ్లే సందేహిస్తారు? జయలలిత లాగే దర్పం ప్రదర్శించే మాయావతి కన్నా మోదీ నిరంకుశుడా? మాయా ప్రధాని కావాలని పవన్ ఆశిస్తున్నాడు కదా? ఇటీవల కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వచ్చి ఆంధ్రలో రోడ్ షోలు చేసి వెళ్లిపోయాడు. ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రధాని కావాలంటున్నాడు. ఇక ముఫ్తీ మెహబూబా తన ఆటలు సాగడం లేదని 2020లో కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని అంటోంది. వీళ్లేనా ఈ దేశ రాజకీయాన్ని నడిపేది?! వీళ్లంతా మోదీకన్నా మెరుగైనవాళ్లా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, ఇతర పార్టీల అభ్యర్థులను, శాసనసభ్యులను లాక్కోవడం విజ్ఞులెవరూ హర్షించడం లేదు. కాంగ్రెస్-్భజపాలు పేలవమైన బ్యాటింగ్ చేస్తున్నందున కేసీఆర్ మెజారిటీ సీట్లను సాధించవచ్చు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తెస్తానంటున్న కేసీఆర్ ‘హిందుగాళ్లు బొందుగాళ్లు’ అన్నంత సులభంగా ఇతర మతాల వారిని చులకనగా అనగలడా? అదే మోదీనో, అమిత్ షానో ఇతర మతాల వాళ్లను ఇలా ‘గాళ్లు’ అని సంబోధిస్తే ఇది అంతర్జాతీయ సమస్య కాకపోయేదా? ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా ఈ విషయంపై స్పందించేది!?
రాజకీయాల గురించి ఓనమాలు తెలియని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా మతతత్వం గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్, ఉత్తమ్ భాషలో తేడా లేదు. మోదీ ఎపుడైనా ‘హిందూ అభిజాత్యం’ గురించి చెప్తూ ముస్లింలను కించపరిచాడా? ఓవైసీ పార్టీ, అతని చరిత్ర ఎంతగొప్పగా వుందో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ కేసీఆర్ చరిష్మా ముందు ఇవన్నీ మరుగున పడ్డాయి. చరిష్మా మరింత పెంచుకొనేందుకు సంతుష్టీకరణ జరుగుతోందన్నది సత్యం. ఇలాంటి సంతుష్టీకరణ రాజకీయం దేశమంతా విస్తరించడమే గుణాత్మమైన మార్పా?

ముతక చీర కట్టుకొని గాంధీ మహాత్ముని వారసురాలిగా కన్పిస్తున్న మమతా బెనర్జీ కేంద్రం నుండి వచ్చిన సీబీఐ అధికారులను అరెస్టు చేయించింది. ఇపుడు బాబు ఫ్రంట్‌లో ఆమె ప్రధాని అభ్యర్థి. ఒకవేళ ఆమె ప్రధాని అయ్యాక సీబీఐ, ఈడీ అధికారులను భాజపా పాలిత రాష్ట్రాల్లో అరెస్టు చేయవచ్చా? సీఎం స్థానంలో ఉండి ఇంత అహంకారంగా, దురుసుగా ప్రవర్తిస్తున్న మమత కన్నా మోదీ నిరంకుశుడా? కేవలం ప్రాంతీయ పార్టీల సీఎంలకే అధికారాలు, హక్కులు ఉంటాయా? నూరుకోట్లమంది ఎన్నుకున్న ప్రధానికి ఏ హక్కూ ఉండదా? తెలుగు టీవీ చానళ్లు, పచ్చ మీడియా ఎలా చెప్తే ప్రధాని అలాగే చేయాలా? ఇపుడు మోదీని వ్యతిరేకించే నాయకుల్లో దేవగౌడ కూడా ఉన్నారు. తన కొడుకులతోపాటు మనవలు కూడా పార్లమెంటులో కొర్రమీనంత మైక్ పట్టుకొని ‘అధ్యక్షా!’ అంటే చూసి తరించిపోవాలనుకొంటున్న దేవెగౌడ మోదీని వ్యతిరేకించడం సహజమే. ఎందుకంటే మోదీ రాజకీయ వారసులు భారతీయులే! ఇపుడు మనవడి చేత రాజకీయ అరంగేట్రం చేయిస్తే- ఇంకో యాభై ఏళ్లు కన్నడనాడు గౌడ కుటుంబం చేతిలోనే ఉంటుంది కదా! మరి మోదీ తర్వాత మరో మోదీ వచ్చేవరకు ఈ దేశ జాతీయవాదులు ఎన్నాళ్లు ఎదురుచూడాలో చెప్పడం కష్టం!

అబ్దుల్లా కుటుంబం, లాలూ కుటుంబం, దేవెగౌడ కుటుంబం, చౌతాలా కుటుంబం, బాదల్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం, గాంధీ-నెహ్రూ కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కరుణానిధి కుటుంబం, జయలలిత, మాయావతి అనుచర గణం అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అధికార కేంద్రీకరణ కన్నా ఇపుడు మోదీ నిరంకుశత్వమే దేశానికి ఎక్కువ ప్రమాదకరం!?

ఇక ఈ దేశాన్ని గరీబ్ హటావో దగ్గర్నుంచి ‘న్యాయ్’ పథకం వరకు 70 ఏళ్లు 5 తరాలు పేదవాళ్ల కోసం పాటుపడుతూనే ఉన్న గాంధీ-నెహ్రూ కుటుంబం వారసత్వం కన్నా మోదీ నిరంకుశత్వమే ఇపుడు దేశానికి ప్రమాదకరం! 72 ఏళ్లు ఈ దేశానికి అన్ని అవ లక్షణాలు అందించినందుకు ప్రాయశ్చిత్తంగా 72 వేలతో పేదరిక ప్రక్షాళన చేయాలనుకొన్న రాహుల్ గాంధీ రాజకీయ అజ్ఞానం కన్నా మోదీ చేస్తున్న నిరంకుశత్వమే ప్రమాదకరం!

ఈ ఎపిసోడ్‌లో గద్దెదించే పట్టువదలని ‘ఎర్ర’ విక్రమార్కులది మరో బాగోతం. ఏచూరి నుండి నారాయణ వరకు ఒకటే పాట. 2014లో మోదీ గద్దెనెక్కినప్పటి నుండి ‘దించేస్తాం’ అంటూ భీషణ ప్రతిజ్ఞలు. వీళ్లకెపుడూ హిందుత్వ మాత్రమే తీవ్రవాదంగా కన్పిస్తుంది. ఎర్రకళ్ల కామెర్లకు కాషాయమంటేనే గిట్టదు. వీళ్లకు రాజకీయం తక్కువ, రాద్ధాంతం ఎక్కువ. వీళ్ల వంధిమాగధ హర్యాలీ మేధావులంతా పత్రికల, టీవీల పీఠాల్లో ఈరోజుకూ కూర్చొని ఉన్నారు. ‘వాళ్లు జీవితమంతా ప్రత్నామ్నాయం’ కావాలంటారు. ఆ ప్రత్యామ్నాయం ఎప్పుడూ కశ్మీర్‌లో రాళ్లు విసిరేవాళ్లకు, పాలస్తీనా గురించి పలవరించేవాళ్లకు, పాకిస్తాన్ మిలిట్రీకి, చైనా వ్యాపారానికి, ఈ దేశ మతతత్వ గుంపులకు అడుగులకు మడుగులొత్తే విధంగా ఉంటుంది. ఉక్కుపాదంతో ప్రజలను అణచివేసే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లో సత్యహరిశ్చంద్రుడు, ప్రపంచంలోనే మూర్ఖుడైన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లో రంతిదేవుడిని దర్శిస్తారు. చచ్చి స్వర్గాన వున్న అనంతమూర్తి దగ్గర నుండి బతికున్న సురవరం సుధాకర్‌రెడ్డి వరకు మోదీలో తీవ్రమైన నిరంకుశత్వం కన్పిస్తుంది. అందుకే ఇపుడు ఈ మహాప్రజాస్వామ్య పరిరక్షకులంతా తక్షణం మోదీని గద్దెదించాలంటున్నారు. నిజంగా ఈ దేశ ప్రజలు విజ్ఞులైతే తారేఖ్ ఫతే మాటల్లో అంతరార్థం గ్రహిస్తే చాలు.


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి