ఎన్నికలు జరిగే రోజు అన్ని మాధ్యమాల్లో తానే కన్పించడం ఎలా?- అని అనుకున్నాడు చంద్రబాబు. ప్రచారం ముగిశాక ప్రకటనలు, ప్రసంగాలు అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోదు కాబట్టి ఆయన మెదళ్లో తటుక్కున ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. ఏదో ఒక నెపంతో ఏపీ ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని కలిసి, ధర్నా చేస్తే- పోలింగ్ రోజున అదే వార్తఅవుతుందని అనుకున్నాడు. ఇద్దరు ఎస్పీలను,కొందరు సీఐలను ఎన్నికల సంఘం బదిలీ చేసిందని అడగడానికి బాబు వెళ్లాడు. కానీ మళ్లీ అక్కడ మోదీ, జగన్, కేసీఆర్, లోటస్‌పాండ్ కుట్ర, వీవీ ప్యాట్ల లెక్కింపు, ఐటీ దాడులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, మోదీ నియంతృత్వం, సుప్రీం కోర్టుకు తప్పుడు సమాచారం, కేకే శర్మ ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, వ్యవస్థల విధ్వంసం, సేవ్ ఇండియా- సేవ్ డెమోక్రసీ, మోదీ పెత్తనం.. ఇలా రోజూ వల్లిస్తున్న మాటలనే మళ్లీ ప్రస్తావించాడు.

 19 రాష్ట్రాల్లో నెలకొన్న ఎన్నికల హడావుడిని విడిచిపెట్టి ఏపీలో సిఐలను మోదీ బదిలీ చేయిస్తాడా? ఈమాత్రం విచక్షణను సైతం పాటించకుండా ఎన్నికలకు ముందురోజు ప్రసార మాధ్యమాలన్నీ ‘ఈసీకి వార్నింగ్ ఇచ్చిన బాబు’ అంటూ శీర్షికలు పెట్టి తెలుగు ప్రజలకు చూపించి తరించిపోయాయి! ఈ ప్రచారం కూడా సరిపోదనుకుకొన్న మీడియా ‘దేవాన్ష్ ఆటలో మునిగిపోయిన బాబు’ అంటూ మరో క్యాప్షన్‌తో ఇంకోరకమైన ప్రచారం చేసింది! 2018 ఫిబ్రవరిలో భాజపాతో పొత్తు వికటించిన నాటినుండి మొదలైన ఈ ‘నిర్బంధ దృశ్యాలు’ మనస్సు నిండా కాస్తంతైనా ఖాళీ లేకుండా నిండిఉన్నాయి. మనసా! రిలాక్స్ ప్లీజ్!

తాడూ బొంగరం లేకుండా తీవ్రవాద సంస్థల, మిలట్రీ సహకారంతో పాక్ ప్రధానిగా గద్దెనెక్కి కూర్చొన్న స్వలింగ సంపర్కుడు ఇమ్రాన్‌ఖాన్ ‘మోదీ మళ్లీ గెలవాలి’ అని ఓ స్టేట్‌మెంట్ ఇస్తే, దానిపై కేజ్రీవాల్ నుండి రాహుల్ వరకు ఒంటికాలిపై లేచారు. ‘ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను విదేశాలు ప్రభావితం చేయడం అంటే ఇదే’ అంటూ కశ్మీర్ వేర్పాటువాద నాయకుల ఇళ్లముందు శీర్షాసనాలు వేసి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించడం విడ్డూరం. 

రోజూ చైనా భక్తితో పులకించిపోయే కమ్యూనిస్టులు విదేశాలు భారత్‌ను ప్రభావితం చేస్తున్నాయని ‘మోదీ ప్రభుత్వాన్ని’ గురించి చెప్పడం ఎనిమిదో వింత కాదా? మోదీ తరఫున ఇమ్రాన్ బ్యాటింగ్ చేస్తున్నాడని మరో కమ్యూనిస్టు గెరిల్లా వీరుడు చెప్తుంటే జాతీయ టీవీ ఛానళ్ళు నోరెళ్ళబెట్టడం తప్ప ఇంకేం చేస్తాయి? ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏది మాట్లాడినా అది పరమ పవిత్రం!? ఇక 150 ఏళ్ళ వృద్ధ కాంగ్రెస్ యథాలాపంగా ‘మోదీకి నవాజ్ షరీఫ్, ఇమ్రాన్‌ఖాన్‌లతో సత్సంబంధాలు ఉన్నాయని’ రణదీప్ సూర్జేవాలా ద్వారా వ్యాఖ్యానించింది. కశ్మీర్‌కు మరో ప్రధాని కావాలని అంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాకు కాంగ్రెస్‌తో తమకు వున్న సంబంధాలను గు రించి వివరణ ఇస్తే బాగుండేది. ‘మీకూ మాకూ ఉమ్మడి శత్రువు మోదీ’ అని పాక్ టెలివిజన్‌లో బహిరంగంగా ప్రకటించిన కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై ఇలాగే, ఇంతే స్పీడుగా స్పందిస్తే బాగుండేది.

ఇక రాఫెల్ వివాదంపై ‘హిందూ’ పత్రిక ఇస్తున్న ఆధారాలపై రోజూ టీవీల్లో మాట్లాడే రాహుల్ ఎన్నికల ముందురోజు సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్ గురించి తన పాత రికార్డింగ్ మళ్లీ తిరగేస్తారు. హిందూ పత్రిక వార్తలే కాంగ్రెస్ పార్టీకి రాఫెల్‌పై ఆధారాలు! రామజన్మభూమి వివాదంపై సమయం లేదంటూ వాదనలు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఎన్నికల ముం దురోజు నర్మగర్భ వ్యాఖ్య లు చేయడం మోదీ ప్రభుత్వానికి ఇరకాటమే! తలాతోకా లేకుండా కోర్టు వ్యాఖ్యలను రంగులద్దే మన పత్రికలకు, ప్రసార మాధ్యమాలకు పండగే పండుగ. తమకు కావలసిన భాగాలను క్వశ్చన్ మార్కులతో, ఆశ్చర్యార్థాకాలతో నింపే ప్రచార, ప్రసార మాధ్యమాలు నచ్చనివారిపై వెనుకనుండి చాకులా గుచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక తెలుగు లోగిళ్లలో ముగిసిన ఎన్నికలతోనైనా ఈ కువ్యాఖ్యలకు తెరపడితే బాగుంటుంది. అప్పుడైనా కాస్త ‘మనసా! రిలాక్స్ ప్లీజ్!’ అనుకొంటాం.

ఇక ‘పదహారు-సారు-కారు’ నినాదంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విజయగర్వం, ఇతర పార్టీల నేతలపై చేస్తున్న అశ్వమేధయాగ సఫల ప్రయోగంతో మంచి జోరుమీదున్న కేసీఆర్ గుంపునకు ఈ ఎన్నికల తర్వాతనైనా విశ్రాంతి దొరుకుతుందా? దాదాపు వంద అసెంబ్లీ సీట్లు గెలిచిన వ్యక్తి, 16 ఎంపీ సీట్లు గెలుస్తానని ప్రకటిస్తున్న తెలంగాణ శక్తి ‘వెంటనే ప్రధాని అయిపోతాను’ అంటే 200 సీట్లు గెలిచే పార్టీలు ఇంకేం పదవి కోరాలి? అని కేసిఆర్ వ్యతిరేక శక్తులు ప్రశ్నిస్తున్నాయి. ఇపుడు రాష్ట్రానికో ప్రధాని అభ్యర్థి ఉండడం మన హద్దులు మీరిన ప్రజాస్వామ్య వ్యవస్థకు తగిన శాస్తే! ‘అందరిలో నేను ఉండాలి అనుకోవడం ప్రకృతి; అందరూ నాలోన మాత్రమేండాలనుకోవడం వికృతి’- ఈ లక్ష్యం కేసిఆర్ పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితం ఇపుడు తెలియదు. తీవ్రమైన అణచివేతకున్న పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.
 రాజకీయాల్లో అణచివేతకు తావులేదు. ఎ న్నికలు - ఫలితాలు, జయాపజయాలు ఎవరి స్వంతం కాదు. కేసీఆర్ పార్టీ 2004లో తెలంగాణ ప్రాంతంలోని 107 అసెంబ్లీ స్థానాల్లో 56 స్థానాలకు పోటీ చేసి 26 మాత్రమే గెలిచింది. పాలమూరులో అంత ఉద్యమ సమయంలో భాజపా తరఫున యెన్నం శ్రీనివాసరెడ్డి గెలిచాడు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిచాడు. టిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మట్టిగరిచారు. ఇదంతా ఓ క్రీడ! కేసిఆర్‌ను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గొప్ప ఉద్యమ నాయకుడిగానే చూస్తున్నారు. మిగతా అంతా దానిచుట్టూ అల్లుకున్న గూడు. ఉద్యమం తన ప్రత్యర్థులపై చేస్తే ప్రజలకు గొప్ప చర్యగా కన్పిస్తుంది. కానీ స్వీయ సమాజంపై దాడి జరుగుతుందని భావిస్తే అది నిశ్శబ్ద విప్లవం అవుతుంది. అది కనిపెట్టకుండా చేసే చర్యలన్నీ గొప్ప వ్యూ హాలుగా కన్పిస్తాయి. కానీ అది తలకిందులైతే ఇపుడు మూటగట్టుకొన్న గొప్పతనమంతా కొట్టుకుపోతుంది. ఎన్నికల తర్వాతనైనా కేసిఆర్‌కున్న ‘స్టేట్స్‌మెన్’ హోదా నిలబెట్టుకోవాలంటే- మనసా! రిలాక్స్ ప్లీజ్! అనాల్సిందే.

ఇటీవల భారతీయ మీడియాకు, ప్రతిపక్షాలకు భాజపా పెద్దలైన ఎల్.కె.అద్వానీ, యం.యం.జోషీలపై ప్రేమ ఎక్కువైంది. ఒకప్పుడు మోదీ కన్నా ఎక్కువగా ద్వేషించి ‘ఉక్కుమనిషి’లాంటి అద్వానీని ప్రధానిగా కాకుండా చేసిన ఈ వర్గమే ఇటీవల ఆయనపై ప్రేమ ఒలకబోస్తోంది! జనసంఘ్ రూపంలో వచ్చిన పార్టీ 1951లో పూర్తి రూపం ధరించి 1952 ఎన్నికల్లో 94 మంది అభ్యర్థులను దించారు. 4 స్థానాలను 3.1 శాతం ఓట్ల బలంతో గెలిచింది. రెండవ లోక్‌సభ ఎన్నికల్లో 130 స్థానాలకు ప్రయత్నించినా 4 స్థానాలను గెలిచింది. 1962లో 196 స్థానాలకు పోటీ చేసి 14 స్థానాలు, 1967లో 35 స్థానాలు, 1971లో 22 స్థానాలు సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీ రూపంలో 1980 దశకంలో ఇద్దరు గొప్ప నేతలు వాజపేయి, అద్వానీలు ముందుండి పార్టీని నడిపించారు. ఒకపుడు రెండు స్థానాల్లో గెలిచిన పార్టీని అద్వానీ తన రథయాత్రతో దేశ నలుచెరగులకు విస్తరించాడు. ఆనాడు రథయాత్రను బిహార్‌లోకి రాకుండా అడ్డుకున్న లాలూకు ఆనాడు అద్వానీ ప్రమాదకారి; ఇపుడు మోదీ!? అద్వానీపై మతోన్మాద ముద్రవేసి, అపఖ్యాతిపాలుచేసి కీలకపదవులు రాకుండా చేసిన కాంగ్రెస్‌కు ఇపుడు అద్వానీ గొప్ప నాయకుడు. లోక్‌సభలో ‘అక్రమ ప్రభుత్వం’ అని యూపిఏ ప్రభుత్వాన్ని అద్వానీ విమర్శిస్తే సోనియా స్వయంగా లేచి నిలబడి తమ ఎంపీలను ఆయనపైకి ఉసిగొల్పింది. అలాంటి నాయకురాలి పుత్రరత్నం రాహుల్ ఆయనపై సానుభూతి ప్రకటించడం విచిత్రం!? ఇటీవల యథాలాపంగా ఓ పెద్దమనిషిగా అద్వానీ ‘నాయకులు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా చూడాలి తప్ప శత్రువులుగా చూడవద్దని’ చెప్తే, ఇది అన్ని పార్టీలకు వర్తించదా?

 ఒకపుడు మాజీ ప్రధాని చంద్రశేఖరో, వాజపాయో లోక్‌సభలో ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే అన్ని పార్టీలు వాటిని గౌరవంగా స్వీకరించేవి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు టిక్కెట్ నిరాకరిస్తే అది పెద్దలను అవమానించడమా? ఇపుడు అద్వానీ గొప్పతనం ప్రతిపక్షాలకు, మీడియాకు గుర్తొచ్చిందా? చక్రాల కుర్చీలో కరుణానిధి, వయోభారంతో దేవెగౌడ, నడవలేని ఘనీఖాన్ చౌదరి, జైల్లో ఉన్నా రాజకీయాలు చేసే లాలూ, మూతివంకరపోయి మాట్లాడలేకపోతున్న శరద్ పవార్, రాష్ట్రాలను కుటుంబాలకు రాసి ఇచ్చిన నాయకులను చూశాక ఇలాంటి పదవీ విరమణ కొందరికి విడ్డూరంగానే కన్పిస్తుంది. 1997 జూన్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి (1977 తర్వాత మొదటిసారి) ఎన్నిక జరిగింది. సుమారు 7500 మంది ప్రతినిధులు ఎన్నుకున్న అధ్యక్ష పదవికి సీతారాం కేసరి, శరద్ పవార్, రాజేశ్ పైలెట్ పోటీ పడ్డారు. అందులో సీతారాం కేసరికి 6224 (82.5 శాతం), శరద్ పవార్‌కు 882 (11.7 శాతం), రాజేశ్ పైలెట్‌కు 97 (1.2 శాతం) ఓట్లు లభించాయి. భారీ మెజారిటీతో గెలుపొందిన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరికి సోనియా బాధ్యతలు చేపట్టాక ఎలాంటి అవమానం జరిగిందో ఇప్పటివారికి తెలుసా? ఇలాంటి చరిత్రలు తవ్వి తీస్తే చాలా ఉంటాయి! మనసా! రిలాక్స్ ప్లీజ్!!

చిన్న దెబ్బవల్ల ఒక వ్యక్తి పిచ్చివాడయ్యాడు. ఈ డెబ్భై ఏళ్ళ ప్రజాస్వామ్యంలో దాదాపు అందరూ పిచ్చివాళ్లుగా మారారనుకొందాం. ఇక పిచ్చివాళ్లకు చికిత్స చేసే అవసరం ఉండదు. అదే మనకు కలిగే లాభం. పిచ్చివాడు తనకు పిచ్చిలేదని చెప్పడమే వాడి లక్షణం. ఇక రోగగ్రస్తునికి మనం ఎలాంటి ఉపశమనం ఇవ్వలేం. ఇపుడు మన పరిస్థితి ఇలాగే ఉంది. అన్నిరకాల అవలక్షణాలను అందంగా ముస్తాబు చేయడం నేర్చుకొన్న మనకు ఎవరైనా పిచ్చిలేని వ్యక్తి కన్పిస్తే తట్టుకోలేని స్వభావంలోకి దిగజారిపోతాం. అందుకే ఈ ఏడ్పులు.. పెడబొబ్బలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మనసా! రిలాక్స్ ప్లీజ్!! *

************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : ఏప్రిల్ 12 : 2019 *



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి