అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
అవ్యక్తనిధనాన్యేవ తత్రకా పరిదేవనా
‘ఓ
అర్జునా! ఈ ప్రాణులన్నీ పుట్టుకకు పూర్వం అవ్యక్తంగా ఉన్నాయి. మరణం తర్వాత
కూడా ఎవరికీ కన్పించకుండానే ఉంటాయి. కానీ మధ్యలో మాత్రమే కన్పిస్తాయి. మరి
అటువంటి వాటి గురించి శోకించడమెందుకు? అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. చావు
పుట్టుకల మధ్య స్వల్ప కాలమే జీవితం. కానీ అలా ఎన్నడూ అనుకోం. కల్పాంతాలు
మనమే జీవిస్తాం అనుకొంటాం. మనం తప్ప అందరూ మరణించేవారని అనుకుంటూ ఉంటాం.
జీవితానికి సరిపడా నాలుగు రాళ్లు కూడబెట్టడానికి బదులు నాలుగు జీవితాలకు
సరిపడే రాళ్లను ఇపుడే దాచేస్తాం. కానీ కుండలాంటి ఈ శరీరంలో నుండి ప్రాణం
పోయాక గానీ మన శాశ్వతత్వం గుర్తుకు రాదు. ఈ మాయలో నిజమైన శాశ్వతుడు
పరమాత్మను పట్టించుకోం. పరమాత్మ తన శాశ్వతత్వాన్ని గురించి ఎంత చెప్పినా
మనం వినం. దానికి కారణం మాయ, సంసారం. మన శాశ్వతత్వాన్ని గురించి తెలిపేది
ఒక కాలం మాత్రమే.
కాలం యొక్క శాశ్వతత్వాన్ని కూడా గమనించే శక్తి పరమాత్మదే. ‘‘ఏమీ లేనప్పుడు నేనే ఉన్నాను. ఏది ఉందో అందులో నా రూపమే ఉంది’’ అని చతుశ్లోకీ భాగవతంలో పరమాత్మ బ్రహ్మకు చెప్తాడు. కాలం అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. కాలం కూడా ధ్వంసం చేయలేనిది ఏదో అదే నేను అంటాడు ఆది మధ్యాంత రహితుడైన పరమాత్మ. ఈ శరీరం లేనపుడు, ఉన్నపుడు, ఇది నశించాక కూడా ఆయన ఉంటాడు.
అందుకే అమ్మవారికి కూడా ‘వ్యక్తావ్యక్త
స్వరూపిణి’ అని పేరు. శాశ్వతమైన దానిని లేదు అనుకుంటాం. . అశాశ్వతమైన
దానిని శాశ్వతం అనుకుంటాం. దేవుని విగ్రహంపై మెరిసే వస్త్రం ఎలాగైతే
ప్రతిమను కప్పిపెట్టి వస్త్రమే విగ్రహమన్నట్లు భ్రమింపజేస్తుందో సంపదలు,
ఐశ్వర్యం, పదవులు... కూడా మనల్ని అలాగే భ్రమింపజేస్తాయి. అదే నిజమనుకుంటాం.
అందుకే ఆదిశంకరులు ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్య’ అన్నారు. సత్యము, శాశ్వతమైన
బ్రహ్మను విస్మరించడంతో మాయాజగత్తు మహాసుందరంగా కన్పించి ఎన్నో పొరపాట్లు
చేస్తున్నాము. పరమాత్మ అన్నింటిలో ఉంటాడు, అన్నీ అతనిలో ఉంటాయని
శాస్త్రాలు చెప్తాయి. దీనికి ఇంకాస్త భిన్నంగా ఆలోచిస్తే అన్నింటిలో ఆయన
ఉండి కూడా లేనివాడే! ఎలా? జలంలో తరంగాలున్నాయి. తరంగంలో జలం ఉంది. జలంలో
తరంగాలు లేవు. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా కన్పిస్తాయి. జలం స్థిరంగా
ఉన్నపుడు జలంలో తరంగం లేదు. తరంగాలు నాశనమైనా జలం స్థిరంగా ఉంది. తరంగాలు
ఎన్ని గెంతులు వేసినా జలం అస్తిత్వం పోలేదు.
దీనిని
మన శరీరానికి అన్వయిస్తే మన శరీరానికి ముందూ వెనుక మధ్య ఎల్లపుడూ ఆత్మ
ఉంది. దాని విస్తృతి వల్లనే అన్నీ నేను అంటాం. సనాతనుడైన భగవంతుని
వదలిపెట్టి నీటి బుడగలా పగిలిపోయే శరీరం గొప్పదని విర్రవీగుతాం. పరమ సత్యం
విస్మరించి పరమాత్మ నుండి దూరమవుతాం. మన శాస్త్రాలు పరమాత్మను
సర్వాంతర్యామిగా, సత్యస్వరూపిణిగా, చైతన్యమూర్తిగా సనాతనుడిగా వర్ణిస్తాయి.
ఎప్పుడూ వ్యక్తంగా ఉంటూనే అవ్యక్తంగా భగవంతుడు ఎలా ఉన్నాడో తెలిస్తే
సాకార-నిరాకార తత్వాల సమన్వయం మనకు అర్థమవుతుంది.
***************************
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి
నవ్య : నివేదన: పరంజ్యోతి
ఆంధ్రజ్యోతి : సోమవారం
08-04-2019
✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి
నవ్య : నివేదన: పరంజ్యోతి
ఆంధ్రజ్యోతి : సోమవారం
08-04-2019
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి