పండిత మదనమోహన మాలవ్యా స్వాతంత్య్ర సమరంలో గొప్ప దేశభక్తుడు. వందేళ్ల క్రిత మే విద్య ఆవశ్యకతను గుర్తించాడు. అందుకోసం దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి కాశీలో బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. మాలవ్యాకు తెలియకుండా ఆయన సమీప బంధువు ఒకరిని ఆ విశ్వవిద్యాలయ అధికారులు ఓ పెద్ద ఉద్యోగంలో నియమించారు. ఈ విషయం తెలిశాక మాలవ్యా డా.రాధాకృష్ణన్‌కు లేఖ రాసి ‘వెంటనే నా బంధువును విధుల్లోంచి తొలగించాలని’ కోరారు. ఆనాటి నాయకుల, విద్యావేత్తల నిజాయితీకి ఇది తార్కాణం. ఇపుడంతా ‘క్విడ్‌ప్రోకో’ పద్ధతిలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.
బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి- అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు చేకూర్చేలా యత్నించడం విశేషం! ప్రాణాలను పణంగా పెట్టే వైద్యానే్న మనం ఈ పద్ధతిలోకి దిగజార్చాక, ఇక ఎపుడో చచ్చిపోయే విద్యావిధానం ఎవరికి పట్టింది?
తెలంగాణలో ఇపుడు ప్రతిపక్షాలకు దొరికిన ఏకైక అస్త్రం ‘ఇంటర్ విద్య’. ఇక్కడ ఇంటర్ విద్య ప్రక్షాళన కన్నా కేటిఆర్‌ను దోషిగా నిలబెట్టాలనే రాజకీయం ఉన్నది వాస్తవం. గ్లోబరీనా అనే సంస్థ దాని జాయింట్ పార్ట్‌నర్ మాగ్నిటిక్ సంస్థలతో కేటిఆర్‌కు సాన్నిహిత్యం ఉండడం వల్లే టెండర్లు వారికి దక్కాయని కాంగ్రెస్, భాజపాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమని ప్రజలని నమ్మిస్తే తెరాస ప్రభుత్వ ‘విశ్వసనీయత’ దెబ్బతింటుందన్నది వాస్తవం. మదన్ మోహన్ మాలవ్యాలా ఇపుడు విరాళాలు పోగుచేసి విద్యాలయాలు స్థాపించాల్సిన అవసరం లేదు. ఉన్నవాటిని పరిరక్షిస్తే చాలు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అనేక ప్రయోగాలు జరిపి ‘తెలుగు రాష్ట్రాల ప్రాథమిక విద్యను’ ప్రయోగశాలగా మార్చారు.
తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ చెప్పిన విషయం ఇప్పటికీ తలచుకుంటే అద్భుతం అనిపిస్తుంది. ‘మండలంలోనే అన్ని స్కూళ్లు సమీకృతంగా ఒకచోట నడిపిస్తాం’’ అన్నమాట ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది. కానీ తెలంగాణ వచ్చాక కులాల పేరిట ఏర్పడ్డ గురుకులాలు భవిష్యత్తులో కులవాదంతో సమాజాన్ని ప్రమాదంలో పడవేసే ప్రమాదం ఉంది. అలాగే మైనారిటీ గురుకులాలు- ఆ వర్గాలకు ఇప్పటికే వున్న ప్రత్యేకతను మరింత పెంచే ప్రమాదం ఉంది. వాటిలో చ దివే విద్యార్థులు ఓ పదేళ్లలో కులవాదులుగా, మతవాదులుగా మారితే.. సమాజ స్థితి అగమ్యగోచరం అవుతుంది. గురుకులాల్లో నాణ్యమైన వి ద్య అందించినట్లే అన్ని కులాలను కలగలిపి అందిస్తే కేసిఆర్ ఈ జాతికి గొప్ప మేలుచేసినవారు అవుతారు. వాటిని నడిపించే వ్యక్తులపై కులవాదం పెంచుతున్నారని ఆరోపణ వినిపిస్తున్నది. అయితే, అందులో చదువు చ క్కగా సాగుతుందనడం అందరూ ఒప్పుకోవలసిన సత్యం.
ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా వుంది. ఎక్కడా అమ్ముడుపోని ఎద్దు జట్‌ప్రోల్ అంగట్లో అమ్ముడుపోతుందన్న సామెతలాగా ఎక్కడా సీట్లు దొరక్క, దిక్కులేని స్థితిలో ప్రభుత్వ బడులకు విద్యార్థులు వస్తున్నారు. దానికితోడు ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న అనేక సమస్యలు ఈ వ్యవస్థపై పడి నానాటికీ దిగజారుతోంది. ఉపాధ్యాయ సంఘాల నేతలు శాసన మండలి సభ్యులైనప్పటి నుండి ఫక్తు రాజకీయ నాయకుల్లా మారిపోయి ఏ ప్రభుత్వం వస్తే అక్కడ తాబేదార్లుగా పనిచేస్తున్నారని ఇపుడు ప్రతి ఉపాధ్యాయుని మనస్సు లో వుంది. అందుకే ఇటీవల అధికార పక్షం బలపరచినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారన్నది నిష్ఠుర సత్యం. కేసీఆర్ మొదలుకొని ఎందరో ప్రముఖులు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే. వాళ్ల ఉపాధ్యాయుల్లో ‘కమిట్‌మెంట్’ ఉన్నది కాబట్టే సీఎం కేసీఆర్ ‘్భష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు’ లాంటి దుష్కర ప్రాస ఉన్న పద్యాన్ని అవలీలగా చదివేస్తున్నారు. అలాంటి అద్భుతమైన ఉపాధ్యాయులెందరో ఇప్పటికీ విద్యారంగంలో ఉన్నారు. కానీ అలాంటివారు మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ కన్పించరు. సచివాలయం చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసే వారిని రోజూ చూసిచూసి అందరూ ఇలాంటివారే ఉంటారని అనుకొంటారు. అందుకే మంత్రులూ, నాయకులూ ‘విద్యా వ్యవస్థ నాశనం అవుతుందనే’ వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఇక మరో దురదృష్టకర విషయమేమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో మేధావులు అనగానే ఓ పదిమంది వామపక్ష నాయక మేధావులు కన్పిస్తారు. వాళ్లే విద్యావేత్తలు, సామాజిక సంస్కర్తలు, వాళ్లే సీనియర్ జర్నలిస్టులు, వాళ్లే మానవ హక్కుల సంఘాల నేతలు, వాళ్లే కుల సంస్కరణవాదులు, వాళ్లే టీవీల్లో కూ ర్చొని రాజకీయాలను నిర్దేశించే మేధావులు, వాళ్లే సాహిత్యవేత్తలు..! అన్ని రంగాలను దురాక్రమణ చేసిన ఈ మహనీయులు గత ముప్ఫై ఏళ్ల నుండి ఈ వ్యవస్థలను కబ్జా చేసినవారే. వీరి పోరాటం నిరంతర ప్రవాహం. అది ఓ పట్టాన కొలిక్కివచ్చిన పాపా న పోలేదు. వీళ్ల పోరాటంలో వందమంది ఉంటే ‘మహాధర్నా’ అంటారు. నలుగురు కలసి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం పెడితే ‘రౌండ్ టేబుల్’ సమావేశం అంటారు. వీళ్లు ఈ దేశ ప్రాచీనతను అంగీకరించరు; పాశ్చాత్య విధానాలను ఒప్పుకోరు!
19వ శతాబ్ది మొదటి భాగంలో మన దేశంలో వార్షికంగా రెండు లక్షల టన్నుల నాణ్యమైన ఉక్కు తయారయ్యేది. అది ఇంగ్లాండ్‌లో తయారయ్యేదానికన్నా నాణ్యమైంది, చౌక అయ్యిందని మనం అన్నాం అనుకోండి. వెంటనే వ్యతిరేకిస్తారు. పూర్వం మన దే శంలో ఉన్నత విద్యలో భాగంగా కావ్య సాహిత్యాలు, యుద్ధ శాస్త్రం, వైద్యశాస్త్రం, నౌకాశాస్త్రం నేర్పించేవారు అని ఎవరైనా చెప్తే వామపక్ష మేధావులు ఒంటికాలిపై లే స్తారు. పోనీ విద్యలో నైతిక సూత్రాలను చెప్పే రామాయణ, భారతాలను బోధించాలంటే వాటిని మత గ్రంథాలంటారు. అవన్నీ కల్పితాలు, వాటిలో ఏమీ లేదని వాదిస్తారు. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన మాటలు. అయినా మనం ఒప్పుకొని తీరాల్సిందే; ఎందుకంటే వాళ్లు ‘మేధావులు’ కాబట్టి!?
పంజాబ్‌లో 1849లోనే మారుమూల ప్రాంతాల్లోనూ 2 వేలమందికి ఒక పాఠశాల ఉండగా, 1882 నాటికి ప్రతి 10 వేలమందికి ఓ పాఠశాల స్థాయికి మారింది. ఎందుకంటే రాజా రంజిత్‌సింగ్ దేశీయ విద్యాలయాలకు ఎన్నో మాన్యాలిచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వాటిని దిగమింగిందని లీట్నర్- డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్‌ట్రక్షన్- పంజాబ్ నివేదిక బయటపెట్టింది. ఇపుడు పన్నుల రూపంలో వసూలైన సొమ్మును పాఠశాలల కోసం ఖర్చుపెట్టకపోవడం అలాంటిదే.
ఇపుడు విద్యలో నైతికత లోపించింది. దాని దుష్పరిణామాల్లో భాగమే తాజాగా కిల్లర్ శ్రీనివాసరెడ్డి చేసిన హాజీపూర్ హత్యలు. నైతికత ఎందుకన్నట్లు కొందరు స్ర్తివాద సంఘాల ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారు. స్వేచ్ఛావిహారం చేయాలని యువతీ యువకులకు పిలుపు ఇస్తున్నారు. కట్టుబాట్లు, సంఘనీతికి మతం ముద్ర వేస్తున్నారు. వర్సిటీల్లో ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను పెడద్రోవ పట్టిస్తున్నారు. పడకగది శృంగారాన్ని వెండితెరపైకి ఎక్కించే సినిమా నటులు ఈ రోజు యువతకు సెలబ్రిటీలు! అరవై ఏళ్లు దాటుతున్న వయసులో కొందరు సినిమా నటులు 18 ఏళ్ల నటీమణులతో నటించే వికృత మనస్తత్వం యువకులను ఎటువైపు తీసుకెళ్తున్నది? హైదరాబాద్ లాంటి నగరంలో కాఫీ షాప్‌ల పేరిట నడుస్తున్న హుక్కా సెంటర్లవారు, మత్తుమందులు అందిస్తున్నవారు- విద్యార్థుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. జీడిబంకలా సాగుతున్న టీవీ సీరియళ్లు మహిళా శక్తిని చంపేస్తున్నాయి. ఇన్నిరకాల సంఘర్షణలు, పతనాలను తట్టుకొని నిలబడగలిగే విద్యా విధానం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? కోళ్లఫారాల్లా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీలను, స్కూళ్లను కట్టడి చేయలేని దుస్థితి నెలకొంది. ఎందుకంటే అలాంటి సంస్థలను నడిపే వ్యక్తులే మంత్రులుగా కొనసాగుతున్నారు. రోజురోజుకూ కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అందులో మన పిల్లలు చదవడం లేదు!
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్నో కమిషన్లను వేసుకొన్న మనం వాటిని అమలుపరచిన పాపాన పోలేదు. 7 వర్కింగ్ గ్రూపులతో, 12 టాస్క్ఫోర్స్‌లతో గుంపుగా ఏర్పడి సమర్పించిన గొప్ప రిపోర్ట్‌ను తక్షణం అమలుచేయాలని, ‘క్లాస్ రూముల్లో దేశ భవిష్యత్తు మలచబడుతుందని’ అనే వాక్యంతో ప్రారంభించిన డా డి.ఎస్.కొఠారి తన బరువైన, పెద్దదైన నివేదికను చూసి చెప్పిన వాక్యం దాని అమలు ఆవశ్యకతను తెలియజేస్తున్నది."I applagize for the size of the report. It could have been shorter but that would have cost more money and time''. రిపోర్ట్ ఇంత పెద్ద సైజులో ఉన్నందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. కావాలనుకుంటే దాన్ని తగ్గించవచ్చు. కానీ దానికి ఇంకా ఎక్కువ డబ్బు, సమయం కావాల్సివస్తుందని అన్నాడు. దురదృష్టం ఏమిటంటే స్వతంత్ర భారతంలో ఏర్పడ్డ మొదటి సమగ్ర విద్యా కమిషన్‌ను తనే నియమించి, ఆ నివేదికను వ్యతిరేకిస్తూ నాటి కేంద్ర విద్యా మంత్రి ఎం.సి.చాగ్లా తన మాట నెగ్గలేదని నిరసనగా మంత్రివర్గం నుండి తప్పుకొన్నారు. ఇదీ ఈ దేశంలో మొదటి నుండి విద్యా విధానంపై జరుగుతున్న దొంగాట. తక్షణం మన విద్యా వ్యవస్థకు మరమ్మతు చేయకపోతే సమాజమే కుళ్లిపోవడం ఖాయం. *
************************************
* శ్రీకౌస్తుభ *
* ఆంధ్రభూమి *
* శుక్రవారం : మే 03 : 2019 *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి