‘గరీబ్‌కా బీబీ సబ్‌కా బీబీ’ అని ఉర్దూలో ఓ సామెత. పేదవాడి భార్య అందరికీ వరసకు వదినే అని దాని అర్థం. ఇపుడు భారతదేశంలో పేరుకు మెజారిటీగా వున్నది హిందువులు. కానీ ఎవరైనా మెజారిటీలను తిట్టవచ్చు. చాలామంది నాయకులు ‘హిందువులను తిట్టే నేతలుగా ఎదిగారు. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు నోరులేని మూగజీవాలు. లౌకికవాదం అనే రక్తాన్ని నరనరాన ఎక్కించుకున్నారు. ఓట్లకోసం హిందువులను తిట్టని మేధావులు, నాయకులు లేరు! మరీ ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు, చాలావరకు ప్రాంతీయ పార్టీల నేతలు.. మేధావులు, సూడో సెక్యులర్ పాత్రికేయులు, రచయితలు, కవులు, హర్యాలీ గుంపు!.. 

ఇలా చెప్తూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇటీవల ఆ లిస్టులోకి చేరిన వాళ్ళలో సినీనటులు ప్రకాశ్‌రాజ్, కమల్‌హాసన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీళ్లను కళాకారులను చేసి, గౌరవించి సినిమాలను ఆడిస్తున్న మెజార్టీ ప్రజలకు ఆమాత్రం ‘సిన్మా’ చూపించకపోతే ఎలా? ఇప్పటికే తమిళనాడులో బోలెడు పార్టీలుండగా కమల్‌హాసన్ ఓ పార్టీ పెట్టి మెజార్టీ ప్రజల మనోభావాలపై దాడి చేయడమే ఎజెండాగా నడిపిస్తున్నాడు. తాను స్థాపించిన ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 13న కమల్‌హాసన్ తమిళనాడులో ముస్లిం సంఖ్యా ప్రాబల్యం గల ‘అరవకురిచి’ అనే చోట నాథూరామ్ గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తీవ్రవాది ఒక హిందువే. అది ఎవరో కాదు, మహాత్మా గాంధీని చంపిన గాడ్సే. అప్పటినుండే భారత్‌లో తీవ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతం ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ మాట చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి చెబుతున్నాను’’ అన్నాడు ఆయన. అంటే అది ముస్లిం జనాభా ఎక్కువున్న ప్రాంతం అని ఈ మహానటుడికి ముందే తెలుసన్నది సుస్పష్టం.

గతంలో ఇలాంటి వ్యాఖ్యలే మణిశంకర్ అయ్యర్, సీతారాం ఏచూరి, కొడియేరి బాలకృష్ణన్, కరుణానిధి వంటివాళ్ళు సంతుష్టీకరణకు అనుగుణంగా హిందువులనే లక్ష్యంగా చేస్తూవచ్చారు. హిందువులను అదేపనిగా తిడుతూ నాయకులుగా ఎదగవచ్చనదే వాళ్ల రహస్య ఎజెండా. వాళ్లు అనునిత్యం వార్తల్లో ఉండాలంటే ఇంతకన్నా ఉత్తమ మార్గం ఇంకోటి లేదు. ఈ ‘మెజారిటీ ద్వేషులు’ తమిళనాడుకు అతి సమీపంలోని శ్రీలంకలో ఇటీవల బాంబు పేలుళ్ళు జరిగి సుమారు 300 మంది మరణించిన ఘటనకు సంబంధించి ‘ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల’ (ఐసిస్) గురించి పనె్నత్తి మాట్లాడారా? ఫ్రాన్స్‌లో ఓ పత్రిక గీసిన వివాదాస్పద కార్టూన్ ఫలితంగా ఎంతమంది బలయిపోయారో వాళ్లకు తెలియదా? ఇపుడు మన దేశంలో ఈ రాజకీయ క్రీడ దేశ రక్షణను ప్రమాదంలోకి నెడుతుందని వీళ్లకు తెలుసా?


ఓట్ల వేట కోసం ఈ దేశంలో ఎవరు ఎలాగైనా మాట్లాడవచ్చు. అదీ ముఖ్యంగా హిందువులను ఎంత తీవ్రంగానైనా నిందించవచ్చు. ‘హిందూ తీవ్రవాదం’ అనే పదబంధాన్ని సృష్టించి నిరూపించేందుకు ‘మాలేగావ్ పేలుళ్ల’ను ఆధారం చేసుకున్నారని సాధ్వీ ప్రజ్ఞ ఇటీవల నెత్తీ నోరూ కొట్టుకొని చెప్తున్నది కదా? సుశీల్ కుమార్ షిండే, పి.చిదంబరం, దిగ్విజయ్‌సింగ్ వంటి నాయకులు ముస్లిం సంతుష్టీకరణ కోసమే ఇలాంటి చర్యకు పాల్పడ్డారని సాధ్వి బహిరంగంగా చెప్పింది. ఇపుడు దేశంలో ఓట్లకోసం ఎలాంటి దుశ్చర్యకైనా దిగేందుకు తీవ్రవాదుల కన్నా ఘోరమైన పనులు చేస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లందరి లక్ష్యం హిందూ సంస్థలే. అంతెందుకు..? ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతమార్పిడి కూటములను హేతుబద్ధంగా, తార్కికంగా ఎదుర్కోవడానికి శివశక్తి అనే ఆధ్యాత్మిక చైతన్య వేదిక పనిచేస్తున్నది. ఎన్జీవో నిధుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆశల ప్రలోభాలతో మత మార్పిడి విస్తృతంగా ఒకపుడు జరిగేది. ఈ సంస్థ ద్వారా కొందరు యువకులతో కరుణా సుగ్గున, చట్లపల్లి కల్యాణ్‌కుమార్ వంటివారు ఓ నిశ్శబ్ద విప్లవం తెచ్చారు. 


ఇటీవల ‘నేనే దేవుణ్ణి’ అనే షార్ట్ ఫిలిం రూపొందించి, యూట్యూబ్ చానళ్లలో విడుదల చేశారు. లక్షలాదిమంది ఆ చిత్రాన్ని వీక్షించారు. అందులో క్రైస్తవ మతాన్నిగాని, యేసుక్రీస్తును గాని లేశమాత్రమైనా అవమానించలేదు. మత మార్పిడి చేస్తున్న వ్యక్తుల తప్పులను బయటపెట్టారు. దానిపై కొందరు కల్యాణ్‌పై కేసుపెట్టి అరెస్టు చేయించారు. ఈ దేశ మెజార్టీ ప్రజల మతభావాలను ఎంతమంది నటులు, దర్శకులు నిందించారో కనీసం లెక్కపెట్టగలమా? యముడు- కఠోపనిషత్తును నచితకేతుడికి ప్రబోధించిన ధర్మవేత్త. అలాంటి యముడి పాత్రతో ‘యముడికి మొగుడు’ అనే పేరు పెట్టి ఓ మహానటుడు సినిమా తీసి ఆడించాడు. నారదుడు మహర్షుల్లో చాలా గొప్ప వ్యక్తి. అతని పాత్రను ‘చిచ్చులు పెట్టే కొండెగాడి’గా మార్చినవాళ్లను ఏం చేయాలి? సీతను, ద్రౌపదిని అవమానిస్తూ, నమక చమకాలను పాటల్లో అవమానిస్తూ ఎందరో చలన చిత్రాలు తీస్తే మెజార్టీ ప్రజలు ఎన్నికేసులు పెట్టాలి? ఇదొక ఉదాహరణ మాత్రమే!

ఇలా హిందువులను అవమానించి సొమ్ము చేసుకోవడం కొంతమంది ఓ అలవాటుగా మార్చుకున్నారు. నిజానికి కమల్‌హాసన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా? గాడ్సే గాంధీని చంపడం ఈ దేశంలో ఎవరూ ‘జస్టిఫై’ చేయరు. కానీ చారిత్రక తప్పిదాల్లో మహాత్మా గాంధీ భాగస్వామ్యాన్ని చరిత్రకారులు ప్రశ్నించకుండా ఉండలేరు. ఇప్పటికీ 1917 తర్వాత- గాంధీ రాజకీయ అరంగేట్రం జరిగాక ఈ సంతుష్టీకరణకు బలం ఏర్పడిందని భావించేవారు ఎందరో ఉన్నారు. దేశ విభజన పేరుతో మహమ్మదాలీ జిన్నా ఎన్ని హత్యలు చేయించి ‘ఖాయిదే ఆజం’ అయ్యాడో కమల్ హాసన్ చెప్పగలడా? 16 ఆగస్టు 1946 నుండి 1947 చివరి వరకు జస్టిస్ ఖోస్లా చెప్పినట్లు పది లక్షలమంది మరణించారు. వీళ్లను చంపింది ఉగ్రవాద మనస్తత్వం గలవాళ్లా? దేవదూతలా? 1921 నుండి 1947 వరకు ఈ దేశ రాజకీయం ఎంత సంక్షోభం అనుభవించిందో మెహర్ చంద్ ఖన్నా రచించిన ‘లుకింగ్ బాక్’ పుస్తకం కమల్‌హాసన్ చదివితే అవగతమవుతుంది.
బెంగాల్ విభజన జరిగినప్పటి నుండి- లార్డ్ కర్జన్ మొదలుకొని లార్డ్ వౌంట్ బాటన్ వరకు హిందువులపై జరిగిన కుట్రలకు మహాత్మాగాంధీయే కారణమని ఈ రోజుకూ ఈ దేశంలో చాలామంది భావిస్తున్నారు. నాథూరాం గాడ్సే అంతకుముందు ఏనాడూ తీవ్రవాది కాదు. ఆనాటి రాజకీయ పరిస్థితులు వారిలో అభద్రతను పెంచాయి. అంతేకాక జవహర్‌లాల్ నెహ్రూ ఏనాడూ హిందువులపై కనికరం చూపించలేదు.


దానికి ఆనాటి ప్రముఖ రాజనీతివేత్త గాడ్గిల్ మాటలే సాక్ష్యం. "Nehru was the sevearest critic of the Hindus and constantly accused the Hindu Mahasabha and the RSS having the disign to him firm India into a Hindu Theocracy''. ఇలాంటి ఘటనలు, ఆలోచనలు ఈ తరంలో మనకు తెలియకపోవచ్చుగానీ బహుశా! గాడ్సేని ఉద్రేకపరిచి ఉండవచ్చు. అంతేగాక ఈరోజు లౌకికవాదం పేరుతో గొంతుచించుకుంటున్న మమతా బెనర్జీ పాలిస్తున్న బెంగాల్‌లోని ఓ ముక్కను ఎవరికి ఎవరు ధారాదత్తం చేయించారు? 16 జూన్ 1946లో ప్రత్యక్ష చర్య నిర్మాణకర్త సుహ్రవర్దీ వౌంట్ బాటన్ సలహా మేరకు కుటిలబుద్ధితో గాంధీ దగ్గరకు వచ్చాడు. ఇందులో సుహ్రవర్దీ ‘బెంగాల్ మొత్తాన్ని ప్రత్యేక దేశం’గా మార్చుదామని ప్రతిపాదించాడు. ఈ ఉచ్చులో గాంధీజీతో పాటు బెంగాల్ నాయకుడైన శరత్‌చంద్రబోస్ లాంటివారూ చిక్కుకొన్నారు. బెంగాల్‌ను రహస్యంగా పాకిస్తాన్‌లో కలిపేందుకు ఇదో రహస్య తంత్రమని హిందూమహాసభ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ బయటపెట్టాడు. గాడ్సే ఎదిగిన ‘హిందూ మహాసభ’ లేకపోతే ఈ రోజు మమత ఎక్కడ పాలించేది? ఆమె తోక పట్టుకు తిరుగుతున్న చంద్రబాబు ఎవరికి భజన చేసి మద్దతుగా నిలిచేవాడు.

అలాగే గాంధీ ప్రదర్శించిన అలసత్వం వల్ల తమిళ ప్రాంతం గురించి వాస్తవం తెలిస్తే- కమల్ హాసన్ వ్యా ఖ్యలు ఎంత అజ్ఞాన పూరితమో అర్థం అవుతుంది. పాకిస్తాన్‌లాగే ద్రవిడస్తాన్ ఏర్పడాలని ఇ.వి.రామస్వామి నాయకర్ కుతంత్రం పన్నాడు. 1944లోనే ద్రవిడస్తాన్ డిమాండ్ కోసం బ్రిటీష్ వాళ్లను ఒప్పించాలనే కుట్రతో నాటి జస్టిస్ పార్టీ వృద్ధ నాయకుడు ‘పన్నీర్ సెల్వం’ను రహస్యంగా బ్రిటన్‌కు పంపించాడు. బ్రిటీష్‌వారికి బంటులా పనిచేసిన పన్నీరు సెల్వం విమాన ప్రమాదంలో మరణించడం వల్ల ఆ కుట్ర మధ్యలో ఆగిపోయింది. ఇవన్నీ ఏ హిందూ మహాసభ నాయకుడో చెప్పలేదు. కమల్‌హాసన్ పార్టీ పెట్టి- ‘నేను అపర కమ్యూనిస్టును’ అన్నాడు కదా! ఆ కమ్యూనిస్టు పార్టీ నేత మోహనకుమార మంగళం రాసిన ‘ది ట్రూత్ అబౌట్ డీఎంకే’ అనే వ్యాసం (1962)లోని అమృత వచనాలు ఇవి! 1948 జనవరి 30న గాంధీ హత్యగావించబడ్డాక ఇదే పెరియార్ భారతదేశాన్ని ‘గాంధీనాడు’గా మార్చాలన్నాడు, ‘గాంధీమతం’ పెట్టాలన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే గాంధీ బొమ్మలు తగులబెట్టించి, రిపబ్లిక్ డేను సంతాపదినంగా ప్రకటించాడు. ఇదంతా హిందూ శిథిలాల క్రింద జరిగిన చరిత్ర. అంతెందుకు? 1971లో బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండ చేసింది ఎవరు? 1990ల్లో కాశ్మీరీ పండిట్ల వలసకు కారణం ఎవరు? 1947 నుండే సుమారు లక్షమంది హిందువులు ఎందుకు చనిపోయారు? ఇదంతా వర్తమాన చరిత్ర. ఏదీ లేకుండా అజ్ఞానంతో కమల్‌హాసన్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలకు 18వ శతాబ్దంలో బ్రిటీష్ వారెన్ హేస్టింగ్స్ మాటలే సమాధానం. "Extreem frankness of Common Hindus it comes when there is nothing to hide to manpulate, to fear utmost reverense for truth and truth alone''. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలను తిట్టడం వల్ల తాము పెద్దవాళ్లం అవుతామనే సంస్కృతి నానాటికీ పెరుగుతున్నది. *


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *
* శుక్రవారం : మే 17 : 2019 *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి