ఓ ఊళ్లో రచ్చబండ మీద జనం పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నారు. అందులో ముల్లా నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. అందులోంచి ఓ పెద్ద మనిషి ‘‘నసీరుద్దీన్ గారూ! మీవయస్సెంత?’’ అన్నాడు. దానికి ముల్లా తడుముకోకుండా ‘‘నలభై ఏళ్ళు!’’ అన్నాడు. దానికి పెద్దాయన ‘‘పదేళ్ల క్రితం అంతే చెప్పారు.. మళ్లీ ఇప్పుడూ నలభై ఏళ్లు అంటూ బుకాస్తారా? మీ వయస్సు పెరగదా?’’ అన్నాడట. దానికి ముల్లా నసీరుద్దీన్ ఏ మాత్రం తడుముకోకుండా ‘‘మాది మాట తప్పే వంశం కాదు. మేం ఎప్పుడూ ఒకేమాటపై ఉంటాం’’ అన్నాడట! మన దేశంలో కమ్యూనిస్టులు కూడా అంతే! భారతదేశంలో ఎర్రదండుకు పాదు పుట్టి 90 ఏళ్లు దాటినా ఒకే పంథా. మతిలేని గతి తార్కిక భౌతికవాదాన్ని వల్లెవేయడం తప్ప మార్పు చెందని ‘ఎర్రన్నల’ను చూస్తే జాలేస్తుంది. ఇటీవల వామపక్ష అవవేషం సీతారాం ఏచూరి మరోసారి ఎర్ర పైత్యం వెళ్లగక్కాడు. ‘రామాయణ, మహాభారతాల్లో హింసాప్రవృత్తి నిండి ఉందని’ దాని సారాంశం.


అన్యమతస్థులు లేదా తమకు నచ్చని స్వమతస్థులు, వాళ్ల దృష్టిలోని కాఫిర్లను కళ్లకు గంతలు గట్టి తుపాకీతో పేల్చేస్తున్న ‘ఐసిస్ ఉగ్రవాదం’ గురించి, ఇస్లామిక్ స్టేట్ దారుణాలను గురించి గాని ఈ మేధావి ఏనాడూ నోరు విప్పలేదు. మన కళ్లముందు, వర్తమానంలో జరుగుతున్న మతహింసకు మద్దతు పలుకుతూ ఈ దేశ సంప్రదాయానికి, సంస్కృతికి రెండు కళ్లలాంటి భారత, రామాయణాలపై విషం చిమ్మడం వామ‘పక్షపా(వా)తం’ తప్ప ఇంకొకటి కాదు. డాంగే, నంబూద్రిపాద్ నుండి సీతారాం ఏచూరి వరకు కరడుగట్టిన ‘పిడివాదం’ మరోసారి బట్టబయలైంది. రొమిల్లా థాపర్, ఆర్.ఎస్.శర్మ, రామచంద్ర గుహ వంటి ‘ఎర్ర కామెర్ల’ చరిత్రకారులతో కమ్యూనిష్టులు భారతీయ చరిత్రను ధ్వంసం చేయగలిగారు. కానీ ఈ దేశ సామాన్య ప్రజల గుండెల్లో గుడికట్టుకొన్న భారత, రామాయణ ఇతిహాసాలను ధ్వంసం చేయలేకపోయారు. ఇటీవల ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉండాలని కొందరు అనుకుంటున్నారు. కానీ సీతారాం ఏచూరి లాంటి వ్యక్తి ఇలాంటి కుత్సిత వ్యాఖ్యలు చేసి ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నాడో అర్థం కాదు. ప్రకాశ్ కారత్ లాంటి నేత కమ్యూనిస్టులను ఓటమిపాలు మాత్రమే చేశాడు. కానీ సీతారాం ఏచూరి వాళ్లకు వున్న గ్రాఫ్‌ను మరింత తగ్గిస్తున్నాడు. 1980 ఎన్నికల్లో వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లోనే ఏకంగా 38 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. అదే 2014కు వచ్చేసరికి బెంగాల్‌లో రెండే సీట్లు గెలుచుకునే పరిస్థితికి దిగజారిపోయారు. అలాగే 2016 నాటి పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో 295 స్థానాల్లో వామపక్షాలు కేవలం 28 సీట్లకు పరిమితం కావడం వెనుక వున్న కారణాలు ఏమిటని ఏచూరి ఎన్నడూ విశే్లషించుకోడు? 2004లో నాలుగు వామపక్షాలకు కలిపి 59 మంది ఎంపీలు వుంటే 2014లో ఆ సంఖ్య 11కు పడిపోయింది. ‘వామపక్ష విదురుడు’ మాణిక్ సర్కర్ ఇంటిముఖం పట్టాడు. బెంగాల్‌లో కమ్యూనిస్టుల స్థానాన్ని మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీ భర్తీ చేస్తున్నది. కేరళలో ఇపుడు కమ్యూనిస్టులు భాజపాతో తలపడుతున్నారు. వామపక్షాలకు నెలవుగా వున్న త్రిపుర, కేరళ, బెంగాల్‌లలో వారి పరిస్థితి అగమ్యగోచరం అయింది.కారల్ మార్క్స్ సిద్ధాంతం అంతా ఆర్థిక వ్యవస్థపై నిర్మాణమై ఉన్నా ఈ దేశంలో వామపక్షాలు పాలించిన ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతి అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా లేదు. అలా ఆలోచిస్తే సంప్రదాయ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాలే ఎక్కువ ప్రగతి సాధించాయి. భావస్వేచ్ఛకు, అణచివేతకు ‘టేకేదార్లుగా’ మాట్లాడే వామపక్షాలు వారి రాష్ట్రాల్లో శాంతిదూతల్లా పాలించింది ఏమీ లేదు. వామపక్ష పాలనలోనే వున్న పశ్చిమ బెంగాల్‌లోనే వందలాదిమంది ఆనంద్ మార్గ్ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. నందిగ్రాం, సింగూరులలో వామపక్ష ప్రభుత్వం చేసిన హింస మమతా బెనర్జీకి అధికారం తెచ్చిపెట్టింది. ఇక దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదుల హింసకు లెక్కనేలేదు. పాకిస్తాన్, చైనాతో చేసిన యుద్ధాల్లో మరణించిన సైన్యం కన్నా నక్సలైట్లు, మావోయిస్టులు జరిపిన హింసలో ఎక్కువమంది చనిపోయారు. ‘కంటికి కన్ను- పంటికి పన్ను’ సూత్రంతో నేపాల్ నుండి దండకారణ్యం వరకు మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో హింసకు హద్దే లేదు. ఎందరు గిరిజన బిడ్డలను, ఆదివాసీలను ఇన్‌ఫార్మర్ల నెపంతో నక్సలైట్లు కాల్చి చంపారో ఏచూరి లెక్కచెప్పగలడా? నేపాల్‌లో ఎంత హింస చేస్తే ఏచూరి మిత్రుడైన పుష్పక కమల్ దహల్ ప్రచండ సింహాసానికి దగ్గరయ్యాడో ఈ ఎర్రన్న లెక్క తేల్చగలడా? రామాయణంలో లేని (ఉత్తరకాండలోని) శంభూక వధ కథను చూపించి ఈ దేశ బహుజన వర్గాలను రెచ్చగొడుతున్న వామపక్షాలకు ‘మావోయిస్టు హింస’ కళ్లకు కన్పించడంలేదా? రాముడు తన భార్యను కిడ్నాప్ చేసిన రావణాసురుడిని మాత్రమే టార్గెట్ చేశాడు. మరి వామపక్ష పార్టీలు ఈ రోజు కేరళలో తమకు నచ్చని ఆరెస్సెస్, బిజేపీ కార్యకర్తలను బహిరంగంగా నరికి చంపుతుంటే ఏచూరి కళ్లు మూసుకుపోయాయా?స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం సీతారాం ఏచూరి వంటి అహింసామూర్తికి తెలియకపోవడం విడ్డూరం. కేరళలోని మల్లపురాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలని ముస్లిం లీగ్, కమ్యూనిష్టులు కలిసి ఆనాడు హిందువులపై అత్యాచారాలు సీతారాం ఏచూరి దృష్టిలో అశ్వమేధయాగాలా?అహింస, ఐక్యతలను గురించి మాట్లాడే హక్కు ఈ దేశ వామపక్షాలకు ఉందా? ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని మేడే నాడు జెండాలు ఎగిరేసే వామపక్షాల నాయకులు ఈ దేశంలోని 8 కమ్యూనిస్టు పార్టీలను ఎప్పుడైనా ఏకం చేయగలిగారా? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఓవైపు ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తుంటే, ఇక్కడి కమ్యూనిస్టులు రోహింగ్యాలకు వేలు విడిచిన చుట్టాల్లా వ్యవహరిస్తారా? కమ్యూనిజం పుట్టిన చైనా, రష్యాలే స్వేచ్ఛాయుత ఆర్థిక రంగం వైపు అడుగులేస్తుంటే ఇక్కడి వామపక్షాలు తమ గుడ్డి వ్యతిరేకతతో మన దేశ వినాశనం కోరుకుంటారు. 1848 నాటి కమ్యూనిస్టు పార్టీ చెప్పిన ‘ఇప్పటివరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే’’ అన్న వాక్యం ఇప్పటికీ ఇక్కడి కమ్యూనిస్టులు పరమ పవిత్ర వేదవాక్కులా భావిస్తారా? భారతీయతలోని సనాతన ధార్మిక, సాంస్కృతిక వాదాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారా?‘మతం మత్తుమందు’ అని మార్క్స్ తాతల కాలం నాడు.. అదీ ఐరోపా సమాజంలోని క్రైస్తవ మత వికృతులను చూసి చెప్పాడు. అది యథాతథంగా భారతీయ సమాజానికి కమ్యూనిస్టులు ఆపాదించుకొన్నారు. హిందూత్వాన్ని తిట్టడమే కమ్యూనిజం అన్న స్థాయికి దిగజారిన ఈ ‘ఎర్రబాబులు’ వీర సావర్కర్‌ను శివాజీని, గాంధీని, వివేకానందుడిని, నేతాజీని ఆఖరుకు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను కూడా తిట్టిపోశారు. తర్వాత వాళ్లందరికీ ఒక్కొక్కరుగా ఇపుడు క్షమాపణలు చెప్పి ‘చారిత్రక తప్పిదాల’ లిస్ట్‌లో వేసేస్తున్నారు. అదే కోవలో సీతారాం ఏచూరి ఇపుడు రామాయణ, భారతాలను నిందిస్తున్నాడు. ఇన్నాళ్లు క్షమాపణ చెప్పి లెంపలేసుకోవడానికి పార్టీ ఉండేది. ఇపుడు కమ్యూనిజం భారతదేశంలో అవసాన దశలో శవమై ఉందని ఆ పార్టీల నుండి బయటకు వచ్చిన మేధావులే చెబుతున్నారు. ఇపుడు ఏచూరి మాటలను ఆ కుళ్లిన శవాల నుండి వచ్చే కంపుగానే భావించాల్సి వస్తుంది. కేరళలో ఇటీవల ‘ఎచ్చుతచ్చాన్’ రామాయణ పఠనం పునఃప్రారంభమయ్యిందని తెలుస్తున్నది. 17వ శతాబ్దంలో మలయాళంలో తుంచతత్తు రామానుజన్ రచించిన ఈ రామాయణంలో వర్షఋతువులో ఇంటి పెద్ద కుటుంబ సభ్యులకు చెప్పడం అక్కడి సంప్రదాయం.. అది తిరిగి ఇటీవల మొదలైంది. ఇదే కేరళలో కమ్యూనిస్టులు వినాయకచవితి నిర్వహించే పరిస్థితి కింది స్థాయిలో నెలకొంది. బెంగాల్‌లో రామనవమి, హనుమజ్జయంతి ఉత్సవాలకు ఇటీవల మమతా బెనర్జీ అడ్డుకొంటుంటే కింది స్థాయి వామపక్ష కార్యకర్తలే ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్న సంగతి సీతారాం ఏచూరి లాంటి హేతువాది ఎప్పుడు గ్రహిస్తాడు? మతానికీ, మతతత్వానికి మధ్య భేదం గ్రహించలేని కమ్యూనిస్టులకు హిందువులపై గుడ్డి వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేదు.ఈ దేశంలో శ్రీరాముడిని అధికంగా ప్రేమిస్తారు, పూజిస్తారు. కానీ అదే రాముడిని తన భక్తుడే వ్యతిరేకిస్తే ఎలా వుంటుందో శ్రీరామాంజనేయ యుద్ధం పేరుతో ఓ కల్పిత గాథ సృష్టిస్తారు. ఇంతకన్నా తిరుగుబాటు మనస్తత్వం ఏ మతంలో ఉంది? ఆ కథనూ భక్తిపూర్వకంగా స్వీకరిస్తారు. ఎక్కడో పుట్టిన మార్క్స్, లెనిన్, ఏంజిల్స్, చెగువేరా, స్టాలిన్‌లను దేవుళ్లుగా భావించే కమ్యూనిస్టులు ఈ దేశం కోసం మట్టిపాలైన నేతాజీ, శివాజీ, ఆజాద్, సావర్కర్‌లను విమర్శిస్తారు. మార్క్స్‌ను మహాభక్తితో ఆరాధించే ఈ ఎర్ర మేధావులు శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని తిట్టిపోస్తారు. వాళ్ల దృష్టిలో రామాయణ, భారత గాథలు కల్పితాలని ఎన్నో పుస్తకాలు రాస్తారు. వాళ్లు చెప్పినట్లు కల్పిత గాథల్లో జరిగిన హింస కన్నా మావో సేటుంగ్, జోసెఫ్ స్టాలిన్ చేసిన క్రూరమైన హింస ఎక్కువే కదా? లక్షలాదిమందిని గ్యాస్ చాంబర్లలో చంపిన ఈ నియంతల కన్నా రాముడు, కృష్ణుడు చేసిన హింస ఎక్కువా? మావో, స్టాలిన్, నక్సలైట్లు, మావోయిస్టులు చేసిన హింస మన కళ్ల ముందు మనం జీవిస్తున్న కాలంలో జరిగింది కదా!లెనిన్ ప్రతి సోషలిస్టూ నాస్తికుడై ఉండాలని చెప్పినప్పటికీ- మన దేశంలో కమ్యూన్టిలెందరో ఆస్తికులుగా జీవించారు కదా? హరికిషన్ సింగ్ సూర్జిత్ ఏనాడూ సిక్కు మతస్థుడిగా తన తలపాగా తొలగించలేదు కదా? తెలంగాణ సాయుధ పోరాటంలో బలవలంతంగా హిందువులను రజాకార్లు మతం మార్చితే కమ్యూనిస్టులు తిరిగి హిందూమతంలోకి తెచ్చిన విషయం తెలుసా? హింస గురించి నీతి సూత్రాలు వల్లిస్తున్న ఏచూరి పశ్చిమ బెంగాల్‌లో ఆనాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఐఎస్‌ఐ కార్యకలాపాలపై మదర్సాలలో మతోన్మాదం బోధిస్తున్నారని, దానిపై చర్యలకు దిగేందుకు సిద్ధపడితే ఇదే సంతుష్టీకరణ బుద్ధితో మార్క్సిస్టు పార్టీ ఆయనను అడ్డుకొన్నది! అంతెందుకు? తమ సంతానాన్ని తామే చంపుకునే కొన్ని క్రూరజంతువుల్లా ఆ పార్టీని ప్రశ్నించిన ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. హంగరీ కమ్యూనిస్టు నేత ఇమ్రెనాగే ‘కమ్యూనిస్టులను విధ్వంసవాదులు’ అన్నందుకు 1956లో సాయుధ రష్యన్లు ఆయనను ఉరితీశారు. 1991లో సోవియట్ అధ్యక్షుడు గోర్బచేవ్‌ను కమ్యూనిస్టు గెనె్నడీ యెనయేవ్ నాయకత్వంలో ఎంత చిత్రహింసలకు గురిచేశారో ప్రపంచం చూడలేదా?1934లో సోవియట్ కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులైన 139 మందిలో ఆ తర్వాత కమ్యూనిస్టు అరాచకాల్లో అందులోని 70 శాతం సభ్యులు దేశద్రోహ నేరం కింద కాల్చి చంపిన హింసాకాండను ఏచూరి ఏమారితే ఎలా? ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు జరిపిన హింసనూ, బ్రెజ్నేవ్, డెంగ్, మావోసేటుంగ్, స్టాలిన్, హోనేకర్, న్యూసెస్క్యూ, కాశ్మీరీ వేర్పాటువాదుల్లో హింసను వెదకడం విడ్డూరం కాక ఇంకేమిటి? అంతేగాకుండా రామాయణం కానె్సప్ట్‌తో వాళ్ల తల్లిదండ్రులు పెట్టిన పేర్లు సీతారాం ఏచూరి, కె.నారాయణ, బి.వి.రాఘవులు హింసావాదులా? అహింసావాదులా? ప్రపంచం మొత్తం మారినా మీరు మారరా?


************************************
 * శ్రీకౌస్తుభ * 
 * ఆంధ్రభూమి *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి