మానవులు నానాటికీ సాంకేతికంగా, ఆర్థికంగా ఎదిగిపోతున్నారు. ఖండాంతరాలకు వెళ్లి ధన సంపాదన చేస్తున్నారు. అన్ని రకాల హద్దులూ దాటి హాయిగా జీవించగలుగుతున్నారు. కానీ.. మానవత్వంతో మనుషులుగా మాత్రం జీవించలేకపోతున్నారు. అనేక మానసిక సంఘర్షణలతో, భౌతికమైన వ్యాకులత్వంతో బతికేస్తున్నారు. అంతులేని ఆశల వెంబడి పరుగెత్తుతున్నారు. ఈ సంఘర్షణల చట్రం నుండి బయటపడి.. కేవలం బతకడం కాకుండా జీవించాలంటే.. మానవత్వ పరిమళాలను సమాజానికి అందించాలంటే.. మూడు సంస్కార కేంద్రాలు మళ్లీ పురుడుపోసుకోవాలి. అవే.. అమ్మఒడి-గుడి-బడి. ఈ మూడూ మనుషుల్ని సంస్కరించే మహత్తర కేంద్రాలు.

అమ్మ ఒడి ఎంత గొప్పదో చెప్పడానికి ప్రహ్లాదుడి కథే నిదర్శనం. తన బిడ్డను హరిభక్తుడిగా మార్చి దుష్ట హిరణ్య కశ్యప సంహారానికి కారణభూతురాలైన లీలావతి తల్లిగా తన పాత్ర గొప్పగా నిర్వహించింది. ఛత్రపతి శివాజీని అకుంఠిత దీక్షాదక్షునిగా మలచిన ఆయన మాతృమూర్తి జీజాబాయి. ఇక ఆధునిక కాలంలో ఎందరో తల్లులు గొప్ప బిడ్డలను ఈ సమాజానికి అందించారు. అందుకే.. ‘మాతృదేవో భవ’ అంటూ తల్లికే పెద్ద పీట వేసింది మనధర్మం. మానవులకే కాకుండా పశుపక్ష్యాదులకు సైతం తల్లి ప్రేమ అమృతం. బిడ్డలను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్ర గొప్పది. మొదటి గురువుగా తల్లి ఈ ప్రపంచాన్ని శిశువుకు పరిచయం చేసి.. తనలోని గొప్ప సంస్కారాలను బిడ్డలకు అందించాలి. తన బిడ్డలను మోసగాళ్లుగా, నేరగాళ్లుగా, అసత్యవాదులుగా కాకుండా అమృత పుత్రులుగా తీర్చిదిద్దాలి. సమాజం-దేశం-ధర్మం ఈ మూడింటి పట్ల బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.

ఇక, మానవులకు రెండవ స్ఫూర్తి కేంద్రం గుడి. దేవాలయాలు కేవలం దేవుళ్లను అర్చించే కేంద్రాలు కావు. మన ఆగమశాస్త్రకారుల ఆలోచన అదికానేకాదు. ఆలయాలు మానవ సంస్కార కేంద్రాలు. సమాజ పునర్నిర్మాణ కేంద్రాలు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటే ఇదే. ఏమీ పాలుపోని మనిషి నిస్సహాయతతో దరిచేరినప్పుడు ఆదరించే పుణ్యమూర్తే భగవంతుడు. మనిషి తన సంపాదన తన కోసమే ఖర్చుచేసుకోకుండా.. పరులకూ ప్రసాదరూపంలో పది ముద్దలు పెట్టేందుకు అవకాశం కల్పించే ప్రాసాదమే దేవాలయం.

అదేవిధంగా బడి.. వ్యక్తిని తీర్చిదిద్ది సమాజానికి అందించే మూడో సమున్నత సంస్కార కేంద్రం. అయితే నేడు ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య.. ఈ రెండూ వ్యక్తిని యాంత్రికంగా సిద్ధం చేస్తున్నాయి. మనుషుల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నారు కానీ మనుషులుగా మార్చడం లేదు. మానవవనరులు, ప్రాచీన విలువలు అత్యధికంగా ఉన్న మనలాంటి దేశంలో వెంటనే ఈ సంస్కారం విద్యావ్యవస్థకు కలిగించకపోతే కొందరు ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినట్లు మానవ జాతి మనుగడకే ముప్పురానుంది దీనికి విజ్ఞులైన వారు నడుంకట్టాలి.

******************************
   డాక్టర్. పి. భాస్కర యోగి 
నవ్య : నివేదన: పరంజ్యోతి  
ఆంధ్రజ్యోతి : సోమవారం 
06-05-2019

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి