హైదరాబాద్, నవంబర్ 26: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సంగీత శాఖ ఏర్పాటుచేసిన ‘తెలంగాణ ప్రాంతపు సంగీత వికాసం’ జాతీయ సదస్సులో పలువురు వక్తలు తెలంగాణ సంగీత మూలాలను గుర్తిస్తూ ప్రసంగించారు. డా. పి.్భస్కరయోగి, ‘పాలమూరు జిల్లా వాగ్గేయకారులు’ అనే అంశంపై మాట్లాడుతూ క్రీ.శ. 1268లో సింహగిరి కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనాలు తెలుగు సాహిత్యంలో సంగీతపరంగా, సాహిత్యపరంగా పేర్కొనదగిన గ్రంథమన్నారు. వేపూరి హనుమద్దాసు, పల్లా నారాయణాధ్వరి, ఇమ్మడిజెడ్డి చంద్రయ్య వంటి 150 మంది వాగ్గేయకారులు సామాన్యులకు సంగీత, సాహిత్యాల రూపంలో మానవ జీవన విలువలను ప్రబోధించాలని, ఆ భజన సంప్రదాయం నేటికీ తెలంగాణలో సజీవంగా ఉందని వివరించారు. ‘నిజాం సంస్థానం సంగీత పోషణ’ అనే అంశంపై వైజర్సు పావని మాట్లాడుతూ అసఫ్ జాహీలు పరిపాలించిన కాలంలో కర్ణాటక, హిందుస్థానీ సంగీతానికి విశేషమైన పోషణ, ప్రోత్సాహం లభించిందని అన్నారు. తాన్‌సేన్ వారసులు నిజాం సంస్తానాన్ని సందర్శించి తమ విద్యను ప్రదర్శించారు. మూడు తరాల తబలా విద్వాంసులు ఆనాడు హిందుస్థానీ సంగీతాన్ని సుసంపన్నం చేశారని వివిరంచారు. ఖవ్వాలి, గజల్ కూడా హైదరాబాద్ ఖ్యాతి పెంచిన సంగీత, సాహిత్య కళారూపాలని పావని తెలిపారు. ‘పాల్కురికి సోమనాథుని విరచిత పండితారాధ్య చరిత్రలో సంగీత ప్రస్థావన’ అనే అంశంపై సరిత ప్రసంగిస్తూ సంగీతానికి అనుకూలమైన ద్విపద ఛందస్సును కావ్య రచనకు ఎన్నుకోవడమే పాల్కురికి సోమనాథుని ప్రత్యేకత అని అన్నారు. ‘సరిగమపదని’ సప్త స్వరములు అనే సంగీతాత్మకమైన పద్యమే పండితారాధ్య చరిత్రలో ఉందని తెలిపారు. సంగీత శాఖ అధ్యయురాలు డా. ఎస్. ఉమాదేవి అధ్యక్షోపన్యాసం చేస్తూ తెలంగాణలోని హైదరాబాదుతో పాటు గద్వాల, ఆత్మకూరు, వనపర్తి, జటప్రోలు మొదలైన సంస్థానాల్లో పాలకులు శాస్ర్తియ సంగీతాన్ని విశేషంగా ఆదరించారని, భద్రాచలం, బాసర, యాదగిరగట్టు, ధర్మపురి, వేములవాడ తదితర దేవస్థానాల్లో వాగ్గేయకారులు ఆయా వేల్పులను కీర్తిస్తూ చేసిన సంగీత, సాహిత్య రచనలు తెలంగాణ సంగీత మూలాలను తెలియజేస్తున్నాయని తెలిపారు. ఇంకా ‘తెలంగాణ ప్రాంతపు పుణ్యక్షేత్రాలు - వాగ్గేయకార రచనలపై’ రాజ్యలక్ష్మి ‘దక్కన్ రేడియో సంగీత సేనపై’ రాధాపద్మజ, ‘గద్వాల సంస్థాన సంగీతపోషణ’పై టి. తబిత, ‘తెలంగాణ ప్రాంతపు లలిత గీతాల వికాసం’పై డా. వడ్డేపల్లి కృష్ణ, తెలంగాణ ప్రాంతపు లలితగీతాలు స్వరచనపై కె.రామాచారి ప్రసంగించారు. మధ్యాహ్నం సదస్సుకు డా. బి.రాధ అధ్యక్షత వహించారు. డా. నీతా చంద్రశేఖర్, ఓ.విజయ్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
Published Friday, 27 November 2015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి