‘ఈ మొకద్దమాలో చలాయిచిన కార్రవాయి అంటే జాలీది. సాహెబు జిల్లాజాయె వౌక్ఖాకు పోయి తహకీకా చేసి కైపియ్యతు రాసినాడు గదాకె ఫరీఖు దావా బిల్కూల్ నాజాయజు, ఆయిందా రుూ తేర్న కార్రవాయి చేసిన సూరత్‌లో...’
1914 ప్రాంతంలో తెలుగు భాషా దుస్థితిని గురించి ఆనాటి ప్రముఖ రాజకీయవేత్త, రచయిత శ్రీ మాడపాటి హనుమంతరావు పేర్కొన్న ఒక ఉదాహరణ వాక్యం. అలాంటి స్థితి నుండి భాషను ఆత్మగౌరవ సాధనంగా మార్చుకొని ఈ ప్రాంతం ప్రత్యేక తెలంగాణగా ఏర్పడింది.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా తెలుగు భాషను, తెలంగాణ తల్లిని తన వాక్చాతుర్యంతో ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లి, ఈ రోజు సంచలనాత్మకంగా ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నిర్వహించి మరో సంచలనం సృష్టించారు.
ఉద్యమ కాలంలో తెలంగాణ యాసను భాషగా గుర్తించాలని పోరాటం చేసిన కవులు, మేధావులు, భాషకున్న నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకొని తెలుగు భాష ప్రాచీనత్వానికి అద్దం పట్టేలా సభలు జయప్రదం చేయాలని అంటున్నారు. విరసం లాంటి కొన్ని సంస్థలు, డా.జయధీర్ తిరుమలరావు, జూకంటి జగన్నాథం వంటి రచయితలు సుతిమెత్తగా బహిష్కరించాలని చెప్పినా దాని ప్రభావం పెద్దగా లేదు. ప్రధాన స్రవంతి రచయితలంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటివరకు పేర్లు కూడా తెలియని కవుల పేర్లతో తోరణాలు ఈ రోజు నగరంలో దర్శనం ఇవ్వడం సంతోషదాయకం. దున్న ఇద్దాసు, వేపూరు హనుమద్దాసు, ఈగ బుచ్చిదాసు వంటి కవుల పేర్లతో వెలసిన తోరణాలే అందుకు ఉదాహరణ.
తెలంగాణ ప్రాంతం తెలుగు గొప్పదనానికి ప్రతీక. ఇక్కడ గోపరాజుల కాలం (క్రీ.పూ.300) నాటి నాణేలలో ‘నారన’ అనే పేరు విన్పించింది. ఇందులోని ‘అన్న’ అనేదే తొలి తెలుగు మాటగా గుర్తించారని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే క్రీ.శ.61లో హాలుడు రచించిన ప్రాకృత గ్రంథం ‘గాథాసప్తశతి’లో అత్త, పిల్ల, పత్తి లాంటి తెలుగు పదాలు కన్పించడం ఈ ప్రాంతంలో తెలుగు ఎలా నడకలు నేర్చిందో చెప్పడానికి ఒక ఉదాహరణ. అదే విధంగా క్రీ.శ.947 నాటి కుర్క్యాల శాసనంలోని కంద పద్యాలు ఈ ప్రాంతంలో పద్యం పరిఢవిల్లిందని చెప్పడానికి మరో ఉదాహరణ. మొత్తానికి యుద్ధమల్లుని శాసనం, అద్దంకి పండరిరంగని శాసనం, ధనుంజయుని కళ్లమళ్ల శాసనాలకన్న అటూ ఇటూ తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషా చరిత్ర కనబడుతుంది. అందుకు తెలుగు వాళ్లు ఏ ప్రాంతంలో ఉన్నా గర్వించాలి.
రాజమహేంద్రవరంలో నన్నయభట్టు మహాభారతం ఆంధ్రానువాదం రచనకు పూనుకోగా ఆయన సహాయకుడు, మిత్రుడుగా పేర్కొన్న నారాయణభట్టు కన్నడ, తెలంగాణ ప్రాంత సరిహద్దువాడని ఇటీవల చెప్తున్నారు. నారాయణభట్టు సహాయంతోనే నన్నయ భారత రచనకు పక్కా ప్రణాళిక చేశాడు. తెలుగు భాష స్థిరీకృతం కోసం నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణిని రచించడం ఒక మెట్టైతే దానిని ఆధారంగా పెట్టుకొని లక్షణ శాస్త్రాన్ని సృష్టించిన కాకునూరి అప్పకవి తెలంగాణ ప్రాంతంవాడు కావడం మరో విశేషాంశం. అప్పకవి విరచిత ‘అప్పకవీయం’ ఈ రోజుకూ లక్షణ గ్రంథాల్లో మేటిరత్నం.
అలాగే కవిజనాశ్రయం కర్తృత్వ విషయంలో మత భేదాలున్నా ఇది ఇక్కడ పుట్టిన తొలి తెలుగు గ్రంథంగా కొందరు విమర్శకులు ప్రకటించారు. కోస్తా ప్రాంతంలో స్ర్తి ప్రకృతిగా కావ్యశాస్త్రాలు ఎక్కువగా పుడితే, తెలంగాణ ప్రాంతంలో పురుష ప్రకృతిగా లక్షణ శాస్త్రాలు పుట్టడం చెప్పుకోదగిన అంశం.
తెలంగాణ ప్రాంతంలో పంపకవి ‘ఆదికావ్యం’ పేరుతో మొదటి జైనతీర్థంకరుడైన వృషభదేవుని చరిత్రను రచించాడు. క్రీ.శ.1530 నాటి ప్రాచీన కావ్య సంకలన గ్రంథంలో ఈ పంపకవి ‘పద్మకవి’గా పేర్కొనబడ్డాడు. కన్నడంలోని రత్నత్రయానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధం ఉన్నట్లు చెప్పబడుతున్నా ఇవన్నీ మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. అలాగే ఇక్కడి వేములవాడ భీమకవిని శాపానుగ్రహ సమర్థుడైన కవిగా చెప్తారు. కవిసార్వభౌముడైన శ్రీనాథుడే ఇతని గురించి పేర్కొన్నాడు. కానీ ఇతని కావ్యాలేవీ లభించలేదు. ఇప్పటికీ చాలా సంకలన గ్రంథాల్లో ఈ కవి చాటు పద్యాలు కన్పిస్తాయి. నీతిపద్యాల రారాజైన బద్దెకవి, వ్యాఖ్యాత్ర చక్రవర్తిగా బిరుదు పొందిన మల్లినాథ సూరి తెలంగాణ ప్రాంతంలో ప్రభవించడం తెలుగు ప్రజల అదృష్టం.
ఇక నన్నయకు సమకాలంలో ధీటైన కవి ఎవరూ రాకున్నా నన్నయ తర్వాత భారతానువాదం చేసిన తిక్కన సోమయాజికి ఈ నేలతో సంబంధం ఉందని చెప్తున్నారు. తాను ఆస్థానంలో మంత్రిగా ఉన్నపుడు నెల్లూరు మండల రాజు మనుమసిద్ధిని రక్షించడానికి ఇక్కడి కాకతీయ చక్రవర్తి గణపతి దేవుణ్ణి ఆశ్రయించి ఆపదను తప్పించాడని చెప్తారు. అందుకు కృతజ్ఞతగా కాకతీయ ప్రభువు కోరిక మేరకు ఇక్కడే మిగిలిన భారతానువాదం ప్రారంభించాడని పరిశోధకులు చెబుతున్నారు.
అలాగే దేశి కవిత్వాన్ని నీచంగా భావిస్తున్న రోజుల్లో ఆచారాలను, భాషను, సంప్రదాయాలను దేశిగా మార్చుకొని, ద్విపద సాహిత్యాన్ని నెత్తిన ఎత్తుకొని రెండు మహాకావ్యాలు బసవ పురాణం, పండితారాధ్య చరిత్రను రచించి మసాకావ్యాల సరసన నిలబెట్టిన పాల్కురికి సోమనాథుడు సాహిత్యంలో ఓ విప్లవమే సృష్టించాడని చెప్పవచ్చు. అనేక ప్రక్రియల్లో 32కు పైగా గ్రంథాలు రచించి మొదటిసారి బుట్టలల్లేవారు, బట్టలు నేసేవారు, బట్టలుతికేవారిని నాయకులుగా మలచిన పాల్కురికి తెలుగు జాతంతా ఋణపడే ఉంటుంది.
భక్తి మందారంలోని మకరందాన్ని తెలుగు ప్రజలకందించి ఈ నేలను పద్యమయం చేసిన పోతన ఈ పురిటిగడ్డపై జన్మించడం ఈ ప్రాంత ప్రజల సుకృతమే. సంకీర్తనా సాహిత్యానికి ఆద్యమైన వచనాలను 12వ శతాబ్దంలోనే తెలుగు ప్రజలకు అందించిన తొలి వచన కర్త సింహగిరి కృష్ణమాచార్యులు ప్రస్తుత రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రక్కనున్న సంతాపూర్ గ్రామస్థుడని తెలిసినపుడు అక్కడి ప్రజల హృదయాలు పులకించకుండా ఉంటాయా?
పంట కోతల్లో, నూర్పిళ్లలో పాడుకొనే విధంగా రంగనాథ రామాయణం రచించి అవాల్మీకాలతో, కొంగ్రొత్త అంశాలతో రామాయణం నిత్య పారాయణంగా మార్చిన గోన బుద్ధారెడ్డిని ఈ ప్రాంతం తడిమి చూసుకొనే సందర్భం పులకింత గాకపోతే ఇంకేమిటి?
కొఱవి గోపరాజు, మారన, కాసె సర్వప్ప, జాయపసేనాని, హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమారు రుద్రదేవుడు, కుప్పాంబిక, కొలని రుద్రదేవుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, కుచిమంచి తిమ్మకవి, కందుకూరి రుద్రకవి, మడికి సింగన వంటి కవులు ఈ ప్రాంత సాహిత్య వినీలాకాశంలో మెరిసే మెరుపు తీగలు.
ఎన్నో సాహిత్య ప్రక్రియలకు ఆలవాలంగా నిలిచిన తెలంగాణలో భాష కోసం ఆధునిక కాలంలో ఏ జాతీ చేయరాని పోరాటం చేసింది. రాకమచర్ల వేంకటదాసు, చెర్విరాల బాగయ్య, దాశరథి, సినారె, వట్టికోట, వానమామూలై వరదాచార్యులు, గంగుల సాయిరెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయులు ఈ నేలపై తమ అస్తిత్వాన్ని చాటి చెప్పారు. తెలుగు భాషా పరిరక్షణకు ఇక్కడి ప్రజల యోగదానం అమూల్యమైంది. అలాంటి మహనీయుల స్మృతిపథంలోని నవతరాన్ని తీసుకెళ్లే మహత్తర యజ్ఞమే ప్రపంచ తెలుగు మహాసభలు.
గడిచిపోయిన కాలాన్ని, ఇంకిపోయిన సిరాను మళ్లీ సరిక్రొత్త అక్షరాలతో తీర్చిదిద్దే ఈ సాహిత్య చరిత్ర తెలుగు జాతి మెడలో రత్నహారమే. జాతిగా ప్రజలు ఎన్ని ముక్కలైనా అందరినీ కలపగల వారధిగా తెలుగును నిర్మించుకోవడమే ఇందులోని ప్రధాన ఎజెండా. ‘ఎన్ని ముక్కలైనగాని తెలుగు భాష ఒక్కటే’ అన్న చందంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం కవులకు, రచయితలకు సముచిత స్థానం లభిస్తే అది సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర అవుతుంది. లేదంటే రెండు సాహిత్య చరిత్రలు రూపొందాల్సిన అవసరాన్ని ఇక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజామాధ్యమంగా ఉండాల్సిన భాషను అవహేళన చేయడం కూడా ప్రజల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తుంది. అలాంటి స్పర్థలు తొలగిపోయి ‘తెలుగు భాష’ అందరినీ ఒక్కటిగా ఉంచాలని కోరుకొందాం.

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125


Published AndhrabhoomiFriday, 15 December 2017


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి