సంస్కృతిని బతికిస్తున్నది రచనే   July 17, 2016, 20:04 IST


టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి
పరిగి: నాటి నుంచి నేటి వరకు సంస్కృతి సంప్రదాయాలను బతికిస్తూ వస్తున్నది రచనలేనని  టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలోని సత్యసాయి భవనంలో ఏర్పాటు చేసిన సాహితీ సమితి కార్యక్రమంలో వరకవుల జగన్నాధరాజు రచించిన పుండరీక చరిత్ర పద్యనాటకం పుస్తకాన్ని హరీశ్వర్‌రెడ్డితో పాటు ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్‌ భాస్కరయోగి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్‌ జయరాములు, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్‌ విజయమాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. కవి, రంగస్థల నటుడు అయిన పుస్తక రచయిత వరకవుల జగనాధరాజును ఘనంగా సన్మానించారు. ఈ పుస్తకానికి ముందుమాట, ఇతివృత్తాన్ని భాస్కరయోగి వివరించగా ఆచార్యులు డాక్టర్‌ జయరాములు పుస్తక సమీక్ష గావించారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ..తల్లిదండ్రుల సేవ అన్నింటికంటే గొప్పది.. వారిని విస్మరించరాదనే ఇతి వృత్తంతో పద్యరచన చేయటం ఎంతో గొప్ప విషయమన్నారు. రచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నేడు సోషల్‌ మీడియా, ప్రసార మాధ్యమాలు, టీవీ షోలు నాటి సంస్కృతి సంప్రదాయాలను మరుగన పడేలా చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు సైతం టీవీ షోలకే బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పండితుడు డాక్టర్‌ భాస్కర యోగి మాట్లాడుతూ సమకాలీన అంశాలను అద్దంపట్టేలా వరకవుల జగన్నాధరాజు రచన సాగిందన్నారు. ఓ బస్టాండ్‌లో బిచ్చమెత్తుకునే వృద్ధులు తాము అడుక్కుని కొడుకులకు ఇవ్వకపోతే కొడతారని చెప్పిన మాటలకు చలించి ఈ రచన చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాటి పుండరీకుని చరిత్రి ప్రస్తుతం తల్లిదండ్రులను హింసించే పిల్లలకు తగ్గట్టుగా సరిపోతుందని తెలిపారు. అనంతరం ఈ పుస్తకాన్ని ప్రముఖ రంగస్థల నటుడు అయిన మాలెల అంజిలయ్యకు అంకితం చేశారు.  ఈ కార్యక్రమంలో  సాహితీ సమితి పెద్దలు, నాయకులు కృష్ణయ్య, శ్రీశైలం, వీరకాంతం, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతురెడ్డి, భద్రప్ప, రంగాచారి, నర్సయ్య పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి