‘మరుగునపడ్డ కావ్యం తృణవిలాపం’ అనే శీర్షికన 2015 డిసెంబర్‌ 14వ తేదీన ‘వివిధ’లో ద్వా.నా.శాసి్త్ర ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో తిమ్మసానిపల్లి రంగదాసు గురించి అస్పష్ట సమాచారం ఉన్నందునే ఈ వివరణ. నేను పరిశోధించి ప్రచురించిన ‘పాలమూరు జిల్లా వాగ్గేయ కారులు’, ‘పాలమూరు జిల్లా సంకీర్తనా సాహిత్యం’ అనే రెండు పుస్తకాల్లో వారి జీవితాన్ని, సాహిత్యాన్ని గురించి రాయడం జరిగింది. రంగదాసు స్వస్థలం మహబూబ్‌నగర్‌ - పిల్లలమర్రి మధ్యగల తిమ్మసానిపల్లి. ఇతని తల్లిదండ్రులు భీమమ్మ, బాలయ్య. రంగదాసు మొదటి పేరు రఘునాథుడు. యాదవ కులంలో జన్మించిన ఈ కవి ఉపాధ్యాయునిగా పనిచేసి 2002 ప్రాంతంలో మరణించారు. ఈయన మహబూబ్‌నగర్‌లోని తిరుమలదేవుని గుట్టపై వెలసిన బాలబ్రహ్మేంద్రయోగి (బాలయ్య తాత)కి శిష్యుడై ‘రంగదాసు’గా మారిపోయారు. పద్యం, సంకీర్తన ఈయన రచనా ప్రక్రియలు. మొట్టమొదట కవిత్వం వెలువరించాలన్న సహజమైన ఉత్సుకతతో ‘తృణవిలాపం’ రచించారు. ఇతణ్ణి అందరూ ‘రాజర్షి’ అని పిలిచేవారు. ఇతని కవిత్వం అపప్రయోగాలకు తావు లేకుండా, జనసామాన్యమైన శైలిలో సలక్షణంగా నడిచింది. జీవితాంతం ఆధ్యాత్మిక, సామాజిక సేవలో గడిపిన ఈ కవి ఆంజనేయ భజన కీర్తనల్ని 1956లో రచించారు. ఇందులో 201 కీర్తనలు ఉన్నాయి. అలాగే శ్రీ లక్ష్మీనృసింహస్వామి భజన కీర్తనలు, బాల బ్రహ్మేశ్వర తత్త్వామృతసారం అనే గొప్ప సంకీర్తన గ్రంథాలు కూడా వెలువరించారు. అందులో ఆధ్యాత్మిక, సామాజిక, తాత్త్విక భావనలకు పెద్దపీట వేశారు. ఉదాహరణకు మనుషులకు తేరగా సంపాదించాలనే బుద్ధి ఎక్కువ. అందువల్ల చాలా వేషాలు వేస్తుంటారు. దొరికితే దొంగలు లేదంటే దొరలు. ఈ దొంగలను మనిషిలోని అరిషడ్వవర్గాలతో పోలుస్తూ ఆనాటి గ్రామ రాజకీయాలను తూర్పారబట్టారు.
 
‘దొంగలార్గురు పొంచియున్నారురా! ఊరి లోపల 
దొరతనంబులు చేయుచున్నారురా 
దొంగలార్గురు పొంచియున్నారు దొరతనంబులు చేయుచున్నారు 
ఇంకకుండగ ఎదురు నిల్వుడి మించకుండ అణగద్రొక్కుడి 
మంచివారిని మించనివ్వరురా ఊరూర వెలసిన కొండెగాండ్రు 
పొంచి యుందురు లంచమిచ్చి పటేలు గారిని మంచమును 
దిగనీయకుందురు’
రంగదాసు కవిగానే కాకుండా మంచి భాషా పరిజ్ఞానం ఉన్న రచయిత. ఈయన రచనలు పాలమూరు పలుకుబడులకు పెట్టింది పేరు. పద్యాన్ని, సంకీర్తనలను లక్షణంగా అందించిన నికార్సయిన కవి. కవిత్వాన్ని ఉపాసించిన ఇలాంటి మట్టిలో కలసిన మాణిక్యాలు ఎందరో తెలంగాణలో ఉన్నారు. వారి కీర్తనలు మూడు పుస్తకాలు నా వద్ద వున్నాయి. వారిని గురించిన పూర్తి వివరాలు పైన చెప్పిన నా రచనల్లో చూడవచ్చు. 

-డాక్టర్‌ పి. భాస్కరయోగి
ఆంధ్రజ్యోతి  04-01-2016 02:38:39

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి