గౌతమబుద్ధుని శిష్యుల్లో ప్రసిద్ధుడైన ఆనందుడు ఓసారి మండువేసవిలో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి బాగా దాహం వేసింది. నలువైపులకు చూస్తే అల్లంత దూరాన కొందరు స్ర్తిలు నూతి నుండి నీరు తోడుతున్నారు. ‘అమ్మా! దాహం’ అన్నాడు ఆనందుడు. ఆ స్ర్తిమూర్తి వెంటనే నీళ్లు పోసి అతని దాహం తీర్చింది. ఆ తర్వాత ‘నేను మాతంగకన్యను; అంటరాని దానిని’ అన్నది. ‘‘అమ్మా! నేను నిన్ను మంచినీళ్లు మాత్రమే అడిగాను; నీ కులం అడగలేదు. ఇందుకు ప్రతిఫలంగా నాకు ఈ పూట మాత్రమే దాహం తీర్చిన నీకు జన్మజన్మల దాహం తీర్చే మార్గాన్ని చూపిస్తాను’’ అని ఆనందుడు ఆమెను బుద్ధుని దగ్గరకు తీసుకెళ్లాడు.
ఈ కుల సంస్కరణ దృష్టి భారతదేశంలో ఎప్పుడూ కొనసాగింది. ఆదిశంకరుని నుండి బాబా సాహెబ్ అంబేడ్కర్ వరకు నిరంతరం ఈ జబ్బును, కులం గబ్బును వదలించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం జరిగింది. హిందూ ధర్మంలో ఇప్పుడున్న ఈ వేల కులాల పేర్లు ఏ శాస్త్రంలో చెప్పలేదు. కులవ్యవస్థ ఒక సాంఘిక వ్యవస్థ మాత్రమే అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి.
వర్ణాశ్రమ వ్యవస్థ పూర్తిగా గుణాధారితమైనదే కానీ జన్మ ఆధారితం కానేకాదు. మొదట యజుర్వేదం (31-11)లో చెప్పబడిన విరాట్ పురుషుని అవయవాల నుండి వివిధ వర్గాల పుట్టుక ఓ అలంకారికమైన వర్ణన తప్ప అవయవాల స్థానాల నుండి పుట్టిన వారి స్థాయిలను నిర్ణయించడం కాదు. విరాట్పురుషుని అవయవాల నుండి పుట్టడం అంటే స్ర్తి గర్భం నుండి శిశువు పుట్టినట్లు, చెట్లకు కాయలు పుట్టినట్లు భావించవద్దు. ఇక్కడ విరాట్పురుషుడు అంటే సమాజం. సమాజంలోని వ్యక్తులు ఈ ప్రజలకు ఎలా సేవలు అందించాలో అన్నివర్గాలను గురించి చెప్పింది. అదొక విస్తృమైన చర్చ.
అలాగే శాస్త్రాల్లో అనేక చోట్ల వ్యక్తుల మధ్య సమరసత నిర్మించి ఈ లోకాన్ని ముందుకు నడిపించడమే పూర్వీకుల సమన్వయతత్వం. కానీ దురదృష్టవశాత్తూ వెయ్యేళ్ల బానిసత్వంలో కులాల మధ్య అడ్డుగోడలు పెట్టబడే అవి మరింతగా పెరిగిపోయాయి. అంటరానితనం ఒకప్పుడు మన సమాజాన్ని ఓ జాడ్యంగా పీడించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక మనువుగా చెప్పబడే మేధావి డాక్టర్ బాబాసాహెబ్ నేతృత్వంలో రచించబడిన రాజ్యాంగం ద్వారా ప్రజాపాలన సాగుతోంది.
అయితే ఇప్పటికీ అక్కడక్కడ దేవాలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాల తంతు నడవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలు పెట్టి దళిత వర్గాలను సమాజం నుండి దూరం చేయవద్దు. వాళ్లు ఈ సమాజంలో అంతర్భాగం, ఈ రోజు దళితులు కోరుతున్నది ఆత్మగౌరవం. ఆలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాలు శాస్త్ర సమ్మతంగా, రాజ్యాంగబద్ధంగా దళిత వర్గాలకు ఎప్పటినుండో ఉన్నాయి. ఓటు బ్యాంక్‌గా దళితులను వాడుకొనే వారు ఈ రోజుకూ ప్రహసనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో అస్తిత్వ వాదాల పేరుతో విదేశీ సిద్ధాంతాలను ఈ దేశ ప్రజలపై రుద్దుతున్నవారే రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి ఏళ్లు దాటినా పోరాటం, ఉద్యమం, వర్గతత్వం అంటూ ప్రచారం చేస్తున్న శక్తులు దళితులకు ఒరగబెట్టింది ఏమీలేదు. కనీసం సంప్రదాయక పార్టీలైనా ఏదో రకంగా బహుజనవర్గాలకు తమతమ పార్టీల్లో స్థానం కల్పించాయి. ఈ రోజు రాజకీయ యవనికపై కన్పిస్తున్న బహుజన నాయకుల్లో ఎక్కువమంది అలాంటి పార్టీల నుండి వచ్చినవారే.
వర్గదృక్పథం పేరుతో భావోద్వేగాలను రెట్టింపు చేసిన పార్టీలు నక్సలైట్లుగా, మావోయిస్టులుగా అమాయకపు యువకుల్ని ఆకర్షించి అధికారం మాత్రం కొన్ని వర్గాల చేతిలోనే పెట్టుకొన్నది నిజం. వీళ్లమాటలు సాహిత్యం చదివి ప్రాణాలు పోగొట్టుకొన్న వారి సంఖ్య చాలా పెద్దది. వాళ్ల అవసరాలకు తగినట్లుగా బూర్జువా పార్టీలతో జతకట్టి, వాళ్ల పల్లకీమోసే ఈ డెబ్బై ఏళ్ల నుండి కుల పార్టీలను, వారసత్వ పార్టీలను అవినీతిపరులను గద్దెపై కూర్చోబెట్టారు. మతతత్వం అనే పేరుతో హిందూద్వేషం, మిగిలిన మతాల సంతుష్టీకరణనే వీళ్ల లక్ష్యం. దాని విపరిణామమే ఈ రోజు ఉత్తరాదిలో భాజపా ప్రభంజనం.
ఈ కులం కుంపట్లు పెట్రోలు పోసి మరీ కాపాడుతున్న ఈ అస్తిత్వ వర్గాలు ఇటీవలకాలంలో ఈ జాడ్యం అన్ని కులాలకు కలిగించారు. రాజకీయ ప్రయోజనాలకోసం మరో పార్టీ అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పడేసి గద్దె దింపడానికి కొత్త ‘రిజర్వేషాలు’ వేయించింది. అందులో భాగంగా రాజస్థాన్‌లో గుజ్జర్ల ఉద్యమం తారాస్థాయికి చేరింది. అది చాలాసార్లు హింసాత్మకంగా మారింది. అదే క్రమంలో గుజరాత్ భాజపా ప్రభుత్వాన్ని దోషిగా చూపడానికి అక్కడా కులతత్వం పాచిక విసిరారు.
దాని ఫలితమే ఇప్పుడు పుట్టిన కులనాయక త్రయం హార్దిక పటేల్, జిగ్నేష్ మేవానీ, అల్షేష్ ఠాకూర్‌లు. వాళ్లు విసిరిన మాయాజాలం గుజరాత్ ఎన్నికల్లో పనిచేయలేదు. దానిని ఎదుర్కొవడానికి నరేంద్రమోదీ ‘ఓబిసీ’ మంత్రం అందుకొన్నారు. ‘పటేళ్లకు రిజర్వేషన్లు ఏ ప్రాతిపాదికన కాంగ్రెస్ ఇస్తుంది? సాధ్యంకాని హామీని రాహుల్, కాంగ్రెస్ జనం ముందుకు తెచ్చిందని’ మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చేరవేశారు. దానితో అటు ఓబిసీలు భాజపావైపు మళ్లగా, పటేళ్లు కాంగ్రెస్‌ను నమ్మలేక భాజపాకు ఓటు వేశారు. దీనితో కాంగ్రెస్ పరిస్థితి ‘రెంటికి చెడిన రేవు’ అయ్యింది.
ఈ రిజర్వేషన్ల వరుస క్రమ పరిణామాలు రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రొత్త రాజకీయాలకు తెరలేపనున్నాయి. రిజర్వేషన్లు మొత్తానికి యాభై శాతం మించకుండా ఉండాలన్న రాజ్యాంగ సూత్రానికి, వివిధ కోర్టు తీర్పులను తుంగలో తొక్కి ఓటు బ్యాంక్ విధానాలు అనుసరిస్తున్న పార్టీలకు మోదీ నిర్ణయం శరాఘాతమే.
హడావుడిగా సుధీర్ కమిటీ, బీసీ కమిషన్ ఏర్పాటుచేసి తెలంగాణ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకొని అసెంబ్లీ తీర్మానం చేసిన తెరాస ప్రభుత్వ నిర్ణయం అడుగు ముందుకు పడడం కష్టం. ఇప్పటికే వైయస్ రాజశేఖర్‌రెడ్డి నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకొని ముస్లింలకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో ఉండగా దానిని త్రోసిరాజని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అమలుకాదని ఇటీవల గ్రహించిన కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. దానికి తమిళనాడు డిఎంకె నేత స్టాలిన్ మద్దతు ప్రకటించారు.
అలాగే ఆంధ్ర ప్రాంతంలో కమ్మ, రెడ్డి వర్గాలదే రాజకీయాల్లో పైచేయి అనే అపప్రధను తొలగించుకోవడానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తానని చంద్రబాబు కాపు రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టారు. మంజునాథ కమిషన్ రిపోర్టు ఆధారంగా ముద్రగడ పద్మనాభం కోరికను తీర్చడానికి అక్కడ తెదేపా ప్రభుత్వం మొన్న ‘కాపురిజర్వేషన్ల’ను ఆమోదించింది.
రాజకీయంగా క్రొత్త కులాలకు రిజర్వేషన్లు, మతాలకు రిజర్వేషన్లు పెంచడంవల్ల సమాజంలో సరిక్రొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. రిజర్వేషన్లు అనుభవిస్తున్న తమ ఉద్యోగాలకు, ఉపాధులకు భంగం వాటిల్లుతుందని భయపడితే, రిజర్వేషన్లు లేనివారు లోలోపల రగిలిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంత బీసీలు ఆందోళన చేస్తున్నది ఈ రెండు విషయాల్లోనే!
మరోవైపు ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనులు ఏకంగా లంబాడీల రిజర్వేషన్లు తొలగించాలని హైదరాబాద్‌నే ముట్టడించారు. వారికి వ్యతిరేకంగా లంబాడీలు ‘మా జోలికి వస్తే ఖబడ్దార్’ అని మరో సభను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగులు మాకువద్దని వాళ్లను బలవంతంగా పంపేయడానికి గిరిజనులు ప్రయత్నించారు. చివరకు ప్రభుత్వం అక్కడి కలెక్టర్‌ను, పోలీసు అధికారులను బదిలీ చేయాల్సి వచ్చింది.
రేపు ‘మా కులం వాళ్లు మాకే చదువు చెప్పాలి’ అనే నినాదం వస్తే సమాజంలో సుహృద్భావ వాతావరణం ఎలా ఉంటుంది? ఇప్పటికే కులగజ్జి ఓ జాడ్యంలా తయారై సమాజాన్ని పట్టిపీడిస్తుంటే రేపటి పరిణామాలు సమాజాన్ని ఏ దిశకు నడిపిస్తాయో విజ్ఞులు ఆలోచించాలి. అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా సమాన స్థాయిలో ఎదగాలి, కానీ వాటి ఎదుగుదల వెనుక పరస్పర ద్వేషం ఉండకూడదు. అప్పుడు మనం భౌతికంగా ఎదుగుతాం కాని మనుషులుగా పతనం అవుతాం.
సమాజంలోని అన్ని కులాలు ఓ దండకున్న రంగురంగుల పూలలాంటి వారు. దండ అనే సమాజం అందంగా కనిపించాలంటే అన్ని రకాల పూలు ఉండాలి. కానీ దానిని బంధించే అంతస్సూత్రం సహృదయత. ఆ దారం తెగిపోతే పూలు ఎంత అందమైనవైనా దండ విచ్ఛిన్నమవుతుంది. ‘సమాజంలో కులం ఉండాలి కానీ కులంలో సమాజం ఉండకూడదు’ అన్న వౌలిక సూత్రాన్ని మరచిపోతే ఏ కులం వాళ్లు ఆ కులం వాళ్లకే పరిమితమవుతారు.
‘‘మానవులంతా ఒకే జాతివారని చెప్పేందుకు ప్రత్యేక సాక్ష్యాధారాలేం అవసరం లేదు. ఒక కుక్క మరో కుక్కని చూసినపుడు అది తన జాతికి చెందిన జంతువే అని గ్రహించగలుగుతుంది. మనిషికి మాత్రమే తోటి మనిషిని చూసినపుడు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అంటే జంతువు కంటే కూడా మనిషే నికృష్టంగా ప్రవర్తిస్తున్నాడన్నమాట’’ అన్న నారాయణ గురు వాక్యాలను మనసులో పెట్టుకొని కులం కుంపట్లు రగిలిస్తున్న వారిపట్ల జాగరూకతతో వ్యవహరిస్తే భవిష్యత్తరాలు మనల్ని క్షమిస్తాయి.

డా. పి. భాస్కర యోగి 
Published Friday, 29 December 2017 ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి