రోజురోజుకూ రంగులు మారుతున్న రాజకీయం- ఏదో ఒక దానిని ఊతంగా చేసుకొని ముందుకు సాగడమే పనిగా పెట్టుకొంది. కులం, ప్రాంతం, మతం, భాష.. ఇవన్నీ ఈ రోజు రాజకీయాలకు నిచ్చెనమెట్లు. ‘జనసేన’ అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ ఇటీవల ‘ఉత్తర-దక్షిణ భాగాలు’గా విభజించి దేశాన్ని అభివర్ణిస్తున్నారు. ‘ఉత్తరాది పెత్తనం’ అంటూ ఉరిమి చూస్తున్నారు. ఆయన ఓ సభలో మాట్లాడుతూ- ‘దక్షిణాది రాష్ట్రాలు బానిసలుగా ఉండాలి. దక్షిణాది ప్రజలు, మేధావులకు కూడా అదే అనిపిస్తుంది’ అంటూ ఉద్వేగంగా ఉత్తరాదివారిపై విరుచుకుపడ్డారు. ఇదంతా యథాలాపంగా పవన్‌కళ్యాణ్ అన్నాడని భావించనక్కర్లేదు. అతని వెనుక చేరిన ‘స్క్రిప్ట్ రైటర్స్’ సిద్ధాంతంలో అది ఓ భాగం.
మెకాలే విషపూరిత విద్యా విధానంలో భాగంగా ఒకప్పుడు మన దేశం ఆర్య-ద్రావిడ సిద్ధాంతంతో విభజించబడింది. ‘కైబర్‌పాస్’ నుండి అనగా మధ్య ఆసియా నుండి ఆర్యులు భారత్‌కు వచ్చి ద్రావిడులపై పెత్తనం చేశారని, వారి సంస్కృతిని ఇక్కడి ప్రజలపై రుద్దారని ఆంగ్లేయులు పుట్టించిన సిద్ధాంతాన్ని ఇక్కడి ‘సూడో మేధావివర్గం’ గత అరవై ఏళ్ళలో బాగా ప్రచారం చేసింది. విచిత్రం ఏమిటంటే- ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ లాంటి జాతీయవాది కూడా ఈ చట్రంలో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత ఆయన తన పొరపాటు గ్రహించాడు. నిజానికి ఆర్య శబ్దానికి ‘శ్రేష్ఠులు’ అని అర్థం. అందుకే ఈ రోజుకూ తమిళనాడులో ఆర్య శబ్దం ‘అయ్యంగారు’గా, తెలుగులో ‘అయ్య’గా మారింది. ప్రతి పేరుతో పూర్వం ‘అయ్య’ ఉండేది. రాముణ్ణి సీత ‘ఆర్యపుత్రా’ అని సంబోధిస్తుంది. ద్రౌపది ఎన్నోసార్లు ‘ఆర్యపుత్రీ’ అని పిలిపించుకొంది. పాండవులు, ఆఖరుకి రావణాసురుడు కూడా ‘ఆర్యపుత్రా’ అని పిలవబడ్డారు. ఇటీవల కేంబ్రిడ్జి, య్యూస్టన్ విశ్వవిద్యాలయాల్లో ఆర్య-ద్రావిడ సిద్ధాంతాలపై శాస్ర్తియమైన పరిశోధనలు చేశారు. వివిధ ప్రాంతాల్లోని భారతీయుల డిఎన్‌ఎను పరీక్షించి అందరిదీ ఒకేరకమైన డిఎన్‌ఎగా తేల్చేశారు. జన్యుశాస్తజ్ఞ్రులు డిఎన్‌ఏ ఆధారంగా జాతి విభజనను శాస్ర్తియంగా అధ్యయనం చేసి ఇందులో ‘పస’లేదని తేల్చేశారు.
ఇక, ద్రావిడ ఉద్యమం అంతా హిందీ భాషకు, ఉత్తరాదివారికీ వ్యతిరేకంగా తమిళ ప్రాంతంలో జరిగింది. ద్రావిడ శబ్దానికి ‘మూడు సముద్రాల మధ్య ప్రాంతం’ అని అర్థం. దీనిని మొదట ఆదిశంకరులు ప్రయోగించినట్లు ప్రముఖ పరిశోధకులు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. ఆదిశంకరుడు వైదిక మతానికి, బౌద్ధమతానికి ప్రతినిధిగా మండమిశ్రుడు ‘శాస్త్ర సంవాదం’ చేశారు. వీరిద్దరి మధ్య న్యాయమూర్తిగా మండమిశ్రుని భార్య ‘ఉభయభారతి’ వ్యవహరించింది. ఆదిశంకరుడిని - ‘నీవు ఎవరు?’ అని ఆమె ప్రశ్నిస్తే ‘నేను ద్రావిడ శిశువును’ అన్నాడట! ద్రావిడ శబ్దమే సంస్కృత శబ్దం. ఇటీవల ఈ శబ్దానికి, సిద్ధాంతానికి ప్రాముఖ్యత లేకుండా పోయింది. ‘ఆర్యులు భారతదేశంపై దాడి చేసి జయించారన్నది అభూతకల్పన.. ఆర్యులు భారతదేశంపై దండెత్తి వచ్చి, అక్కడి స్థానికులను జయించారు అని చెబితేనే కానీ ఆర్యజాతి ఆధిక్యం ఋజువు కాదు కనుక పాశ్చాత్య రచయితలు ఒక కథ అల్లి ఆర్యులు భారతదేశంపై దండెత్తారనీ, అక్కడి దాసులనూ, దస్యులనూ పరాజితులను చేశారని చెప్పసాగారు’- అని బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు (పు-73, 74) పుస్తకంలో పేర్కొన్నారు.
మొత్తానికి ఆర్య-ద్రావిడ సిద్ధాంతం రాజకీయంగా ఓ పెద్ద రాద్ధాంతంగా మారిపోయి పెరియార్ రామస్వామి 1944లో ద్రవిడస్తాన్ డిమాండ్‌తో బ్రిటీషువారికి విన్నవించడానికి నాటి జస్టిస్ పార్టీ వృద్ధ నేత పన్నీర్ సెల్వాన్ని ఇంగ్లాండ్ పంపించాడు. రహస్యంగా వెళ్తున్న సెల్వం విమాన ప్రమాదంలో మరణించడంతో అది విఫలమైందని కమ్యూనిస్టు నేత మోహన కుమార మంగళం తన రచనల్లో పేర్కొన్నాడు. ఆ తర్వాత పెరియార్- 1947లో బ్రిటీషు వాళ్ళు దేశమంతా వదలిపెట్టినా, తమ తమిళనాడును వదలిపోవద్దన్నాడు. 1955లో హందీ వ్యతిరేక ఉద్యమాన్ని పెరియార్ రామస్వామి జాతి వ్యతిరేక ఉద్యమంగా మలచాడు. 1857లో 10 వేలమంది పెరియార్ అనుచరులు భారత రాజ్యాంగ ప్రతులను తగులబెట్టారు. పెరియార్ 1960లో భారతదేశ చిత్రపటాన్ని అంటబెట్టారు. ఇదంతా ద్రావిడ ఉద్యమ దుష్పరిణామం. ఇటీవలి కాలంలో కేంద్రంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడ్డాక దానిని బలహీనపరచడానికి, అపఖ్యాతిపాలు చేయడానికి కొన్ని కుట్రలు మొదలయ్యాయి. గతంలో కూడంకుళం ప్రాజెక్టు విషయంలో కొన్ని ఎన్జీవో సంస్థలు భారత వ్యతిరేక చర్యలు ఎలా జరిపాయో నాటి యుపిఏ ప్రభుత్వమే కక్కలేక మింగలేక చెప్పుకొంది. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఈ వర్గం కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నది. జయలలిత మణానంతరం జరుగుతున్న ధన, స్వార్థపూరిత రాజకీయాల ఫలితాలను కేంద్రంపైకి, మోదీ, అమిత్‌షాల వ్యూహాలపైకి నెట్టివేసే ప్రయత్నం ఒకవర్గం మీడియా, మేధావి గుంపు ప్రయత్నిస్తుంది. ఒక రాష్ట్రంలో పాలనాపరమైన స్తంభన, రాజకీయ ప్రతిష్ఠంభన ఏర్పడ్డపుడు జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి లేదా?
తమిళనాడులో ‘జల్లికట్టు’ ఉద్యమాన్ని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పడానికి ప్రయత్నిస్తే, కేంద్రం తెలివిగా వ్యవహరించి దాని నుండి బయటపడింది. ఆ తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రవేశాన్ని నిలువరించడానికి కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు, పేరుమోసిన ఉద్యమ మేధావులు ‘ఉత్తర- దక్షిణ’ ప్రాంతాల మధ్య వైరుధ్యాన్ని సృష్టించడానికి కుట్రలు ప్రారంభించారు. పవన్‌కళ్యాణ్, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా పేరుతో విశాఖ బీచ్‌లో జల్లికట్టు లాంటి ఉద్యమం చేయించాలని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత తరుణ్ విజయ్ అనే భాజపా ఎంపి దక్షిణాదివారిపై యథాలాపంగా, వేరే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు వీరికి, వారి వెంబడి ఉన్న వందిమాగధ మీడియా గణానికి ‘మసాలా’ అందించాయి. తరుణ్ విజయ్ క్షమాపణ చెప్పినా తెలుగు మీడియా, కృత్రిమ ఉద్యమనేతలు ఈ విషయాన్ని వదలిపెట్టకుండా ఇదేదో నరేంద్ర మోదీ ఆయనతో అనిపించాడన్నట్లు విషపురాతలు మొదలుపెట్టారు. ఇంకొందరు మేధావులైతే ఇందులోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా తీసుకొచ్చి, ట్రంప్ జాత్యహంకారాన్ని మోదీ జాతీయవాదంతో లంకెవేసి వ్యాసాలు, చర్చలు చేశారు. దీని వెనుక పైకి కన్పించని ఓ పెద్ద కుట్ర దాగి ఉంది. దాని భౌతిక స్వరూపమే ‘ఉత్తర భారత- దక్షిణ భారత’ రాజకీయాలపై అడ్డుగోడ కట్టే ప్రయత్నం. పార్లమెంటు స్తంభనలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత మల్లికార్జున ఖర్గే ఎన్నో విషయాలను గాలికి వదలేశారు. గతంలో కాంగ్రెస్ కుటుంబ పాలకులు దక్షిణాది నాయకులను ఎలా అవమానించారో విస్మరించారు. పలు సంస్కరణలతో మన ఆర్థిక రంగం కొత్తపుంతలు తొక్కడానికి కృషిచేసిన ఏకైక తెలుగు ప్రాంత ప్రధాని పి.వి.నరసింహారావు భౌతికకాయం దిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ముఖమైనా చూడకుండా ఎందుకు హైద్రాబాద్ తరలిందో ఖర్గేకు తెలియదా? తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి టి.అంజయ్యకు నాటి కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద చేసిన అవమానం పునాదులపైనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అనే భవనం నిర్మించడం ఖర్గే మరచిపోతే ఎట్లా? వందలాది మంది బలిదానం తర్వాత గాని స్పందించి తెలంగాణ ఇవ్వని సోనియా, మన్మోహన్ తమ రాజకీయ అవకాశం కోసం చివరి నిముషంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం మనం చూడలేదా? ఇక్కడ ఉత్తర-దక్షిణ ప్రాంతాల భేదం కన్పించకున్నా అంతర్గతంగా కాంగ్రెస్ వాళ్ళు అదే సంస్కృతి అవలంబించారన్న విషయం ఖర్గేకు తెలియదంటే మనం అమాయకులమే!
ఇప్పుడు మోదీ వ్యతిరేక వర్గం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో భాజపాను అడుగుపెట్టకుండా చేయడానికే ఈ కొత్త సిద్ధాంతానికి తెరతీసింది. ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలు, ప్రతిపక్ష నాయకులు సాధ్యం కాని గొంతెమ్మ కోరికలు కోరి వీలైనంత ఎక్కువ అపఖ్యాతిని కేంద్రంపైకి తోస్తున్నారు. బిజెపికి మిత్రపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న తెలుగుదేశానికి జగన్ భయం కన్నా, భాజపాదే ఎక్కువ భయం ఉంది. తమ అవసరాలను తీర్చుకుంటూనే చంద్రబాబు అనుకూల మీడియా- కేంద్రాన్ని దోషిగా చూపించడానికే ప్రయత్నిస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఈ దోషాన్ని కేంద్రంపైకే ప్రజలు వేలు చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక పవన్‌కళ్యాణ్‌కు- చంద్రబాబు కుంభస్థలాన్ని కొట్టి జగన్ స్థానంలోకి రావడం అంత సులభం కాదు. పొత్తు ఉన్నన్ని రోజులు ఆంధ్రలో భాజాపా ఎదిగే ప్రశే్న లేదు కాబట్టి ఆ పార్టీని వ్యతిరేకిస్తూ కొత్త వేదికను పవన్‌కళ్యాణ్ సృష్టించాలనుకొన్నాడు. చంద్రబాబుపై దుమ్మెత్తి పోయడానికి పవన్ వస్తే అది అంత సులభం కాదు. ఎందుకంటే చంద్రబాబు వెంట ఎస్టాబ్లిష్‌డ్, ఆర్గనైజ్డ్ వ్యవస్థ ఉంది. అది పార్టీ బలం కావచ్చు, కుల బలం కావచ్చు, మీడియా బలం కావచ్చు. వీటిని ఎదుర్కోవడం పవన్‌కళ్యాణ్ తరం కాదు.
టిడిపిపై పవన్ ప్రత్యక్ష యుద్ధానికే దిగితే అదంతా చంద్రబాబుకే పాజిటివ్ అవుతుంది. అందుకోసం పవన్‌కళ్యాణ్ వెంబడి ఉన్న ‘చెగువేరా గ్రూప్’ సృష్టించిన వినూత్న పదమే ‘దక్షిణాదిపై ఉత్తరాది వివక్ష’ తెలంగాణలో కోదండరాం ప్రభావం కొంత చల్లబడగానే గద్దర్ రాజకీయ యవనికపై కన్పిస్తున్నాడు. పవన్‌కళ్యాణ్ గద్దర్ గురించి, గద్దర్ పవన్‌కళ్యాణ్ గురించి ‘మాది చిరకాల పరిచయం అని’ చెప్పుకొంటున్నారు. ఇక్కడ ‘మావోయిస్టు ఐకాన్’కు, ‘కాస్మొటిక్ లెజెండ్’కు సారూప్యం ఏంటో అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణ వచ్చాక బలపడని భాజపా ముస్లిం రిజర్వేషన్ల తర్వాత కొంత ‘స్పేస్’ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ఇది నిలువరించడమే ‘చెగువేరా గుంపు’ తక్షణ కర్తవ్యం. అందుకే గద్దర్‌ను, పవన్‌ను, కోదండరామ్‌ను, జస్టిస్ చంద్రకుమార్‌ను చైతన్యం చేసి ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు.
ఒకవేళ కేంద్రంలో భాజపా ప్రభుత్వం లేకపోతే ఈ ఉత్తరాది, దక్షిణాది అడ్డుగోడలు బద్దలవుతాయి. ‘మెగాస్టార్’ చిరంజీవి పార్టీ పెట్టి, దాన్ని ఉత్తరాది కాంగ్రెస్‌లో విలీనం చేసి, పదవులు అనుభవిస్తున్నపుడు పవన్‌కు ఈ సిద్ధాంతాలు గుర్తులేవా? ఉత్తరాదివాళ్లతో అవసరాలకు ‘అన్న’ ఎలాగూ ఉన్నాడు. దక్షిణాది ప్రజలను రెచ్చగొడితే తనకూ ఈ యవనికపై అవకాశం దొరుకుతుదని పవన్ ఆశ. అరిగిపోయిన పాత రికార్డులకు కొత్త పెయింట్ వేసి సిద్ధాంతాలను తయారుచేసే ఈ ‘చేగువేరా గుంపు’ పవన్ వెంబడి చేరిందనేది అక్షర సత్యం. ప్రపంచమే ఓ ‘గ్లోబల్ కుగ్రామం’గా మారుతున్న ఈ సందర్భంలో ఉత్తరాది, దక్షిణాది పేరుతో విడదీయడం రాజకీయ ప్రస్థానంలో మరో ‘అపరిపక్వ సిద్ధాంతం’ వండి వార్చడమే తప్ప ఇంకెలాంటి ప్రయోజనం చేకూరదు. 

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published AndhrabhoomiFriday, 5 May 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి