పరిగి: భారత చారిత్రక సాంస్కృతిక వాదమే భారతీయతను రక్షిస్తోందని వందే మాతరం ఉద్యమం మొదలుకుని స్వాతంత్య్ర పోరాటం వరకు భారత దేశంలో ఎంతో మంది గొప్పవాళ్లు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి సాంస్కృతిక ధారను అందించారని ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి అన్నారు. శనివారం స్థానిక సత్యసాయి ధ్యాన మందిరంలో ధార్మిక వేత్త డాక్టర్ పి.భాస్కరయోగి అధ్యక్షతన ‘మనదేశం.. మన కర్తవ్యం’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మన వేదాలు ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణంలో నిక్షిప్తమై ఉన్నాయని వాటిని జీవనాడిగా చేసుకుని దేశ సాంస్కృతిక విధానం నడుస్తోందని తెలిపారు. దురదృష్టవశాత్తు చరిత్రలో వాటికి స్థానం లేకపోవడంతో మన అస్తిత్వాలను మరిచిపోయామని వాటిని తిరిగి పొందడానికే దేశంలో ఉన్న జాతీయ శక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు. కుల, భాష, ప్రాంత, మత విద్వేషాలను వదిలిపెట్టి జాతి ఒక్కతాటిపైకి వచ్చినపుడే మళ్లీ భారతీయ శక్తి పునర్వైభవం పొందుతుందని తెలిపారు. భారతీయ చారిత్రక పుటల్లో ఎంతో మంది అమరుల బలిదానం దాగి ఉందని దాన్ని కుటుంబాలు, పార్టీలు, వ్యక్తులు తమ స్వార్థం కోసం మింగేసి జాతిని కకావికలం చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రాజకీయ విశ్లేషకులు ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని విచ్చిన్నకర శక్తులు పెట్రేగి పోవడంతో దేశ సార్వభౌమత్వానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు దేశంలో మరోసారి బలమైన జాతీయ వాదం రావాలని ఆకాంక్షించారు. ధార్మిక వేత్త డాక్టర్ పి.భాస్కరయోగి మాట్లాడుతూ చరిత్రను కుహనా మేధావులు వక్రీకరించి జాతీయ వీరులను తక్కువ చేసి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా మనలో ఉన్న సంస్కృతి బీజాలు నిర్వీర్యమైపోతున్నాయని తద్వారా దేశంలో వేర్పాటువాద మనస్తత్వం పెరుగుతోందన్నారు. జాతీయవాద శక్తులు వీటిని ఎదర్కొవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు, దేశభక్తిని కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి పరిగి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు గిరిమోని గోపాల్, మద్ది శ్రీహరిరెడ్డి, ఆలూరి వెంకటేశం, బ్రహ్మయ్య, వెంకట్రాములు, రాముయాదవ్, కోనేరు శ్రీను, ప్రదీప్‌రెడ్డి, వెంకట్రాములు, రాంచంద్రయ్య, పెంటయ్యగుప్త, దిలీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి