చందూలాల్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుంటే అతని పదేళ్ళ కుమారుడు పాఠశాలలో గెల్చుకొన్న పెద్ద బహుమతితో ఎదురొచ్చాడు. ‘ఇది ఎలా వచ్చింది? ఇనే్నళ్లలో నేనే సంపాదించనంత ట్రోఫీ నీవు ఎలా గెల్చావు?’ అని కొడుకును అడిగాడు చందూలాల్. మా హెడ్మాస్టర్ ఓ ప్రశ్న వేస్తే, దానికి సరైన సమాధానం ఇచ్చి గెలిచానని అన్నాడు కొడుకు. ‘ఏనుగుకు ఎన్ని కాళ్లు ఉంటాయి?’ అని హెడ్మాస్టర్ ప్రశ్న వేస్తే మా తరగతిలో ఎవరూ చెప్పలేకపోయారు. నేను ‘ఐదు’ అని సమాధానం చెప్పా.. బహుమతి కొట్టేశా! అన్నాడు బుజ్జిబాబు. ఏనుగుకు ఐదు కాళ్లా? దానికి బహుమతా! నీకు బుద్ధి లేకున్నా, హెడ్మాస్టర్‌కు బుద్ధి ఉండద్దా! అని గదమాయించాడు తండ్రి. ‘లేదు నాన్నా..! మా తరగతిలో ఒకడు ఆరు అన్నాడు, మరొకడు ఏడు, ఇంకొకడు ఎనిమిది.. ఇలా చెప్తూపోయారు.. నేను ఏనుగుకు ‘ఐదు కాళ్లు’ అన్నందుకు కాస్త దగ్గరగా ఉండే సమాధానం ఇచ్చావని బహుమతి ఇచ్చారన్నాడు కొడుకు.
సరిగ్గా కేసిఆర్‌కు అధికారం వచ్చిన రోజు ఇదే పరిస్థితి. 2014 జూన్ 2 తర్వాత క్రమంగా తెలంగాణ సిఎం కెసిఆర్ తన పదునైన రాజకీయ వ్యూహాలతో పైచేయి సాధించారు. అధికార పీఠాన్ని సు స్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నారు. తన పార్టీలోని ఓ ప్రముఖ నాయకుడ్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవాలన్న వ్యూహం ఫలించకుండా తన ‘పాత పార్టీలోని పాత మిత్రులనం’తా పాలనా రంగంలోకి తెచ్చుకొన్నారు. పాలనానుభవం లేని మంత్రుల శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ‘రిమోట్’ను తన దగ్గరే పెట్టుకొన్నారు. ఇదంతా రాజకీయం.కేసిఆర్ కేవలం రాజకీయాలు మాత్రమే చేయరు. దానికి కావలసిన బలాలను సాధించుకోవడంలో ఆయన దిట్ట. పూర్వం చక్రవర్తులు రాజ్యాన్ని నడపాలంటే అశ్వ, గజ, రథ, పదాతి దళాలనే చతురంగ బలాలను సమకూర్చుకొనేవారు. కెసిఆర్ కేవలం అధికార పీఠంపై కిమ్మనకుండా కూర్చోలేదు. ఈనాటి చతురంగబలాలైన కులం, ధనం, అనుచర గణం, పార్టీ అనే వాటిని పరిపుష్టం చేసుకొన్నాడు. తనతోపాటు ప్రతిపక్షాలపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి కెటిఆర్, కవిత, హరీశ్‌లను వెంబడి పెట్టుకొన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని, పోచారం, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్లను మంత్రులుగా పెట్టుకోవడం వల్ల ప్రతిపక్షాల నోటికి తాళం వేయగలిగాడు. తనతోపాటు ఉద్యమంలో నడిచివచ్చిన అందరినీ అందలం ఎక్కించాడు. ఇదంతా స్వంత పార్టీని పటిష్టపరచుకోవడంలో వ్యూహమైతే, ఇతర పార్టీలను బెంబేలెత్తించడంలో కూడా తన తెలివిని దాచుకోలేదు.
పదేళ్ళ యూపిఏ పాలనాకాలంలో తెలంగాణ మలి ఉద్యమం తీవ్రరూపం దాల్చినపుడు కేసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపాడు. తెలంగాణ ఉద్యమంలో కలిసిరావడానికి కాంగ్రెస్‌ను ఎన్నోసార్లు బోనులో నిలబెట్టాడు. తప్పని పరిస్థితిలో కాంగ్రెస్‌ను నకారాత్మకంగానైనా ఉద్యమంలో పాల్గొనేటట్లు చేశాడు. అప్పటి యూపిఏ ప్రభుత్వ పెద్దలైన సోనియా, మన్మోహన్‌తో ‘తెలంగాణకు సై’ అనిపించడమేకాక సోనియాను ‘దేవత’ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకు స్నేహహస్తం అందిస్తానని ఆశపెట్టాడు. 3జీ, బొగ్గు, ఆదర్శ్‌లాంటి కుంభకోణాల్లో యూపిఏ ప్రభుత్వం సతమతమయ్యే దశలో తెలంగాణ ఇచ్చి లబ్ధిపొందుదామని కాంగ్రెస్ దురాశకు పోయింది. తెలంగాణలో కెసిఆర్ తమ వెంట నడిస్తే, ఏపిలో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే- మొత్తానికి కేంద్రంలో అధికారాన్ని సునాయాసంగా పొందవచ్చని కాంగ్రెస్ భావించింది. దిల్లీలో సోనియా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగి హైదరాబాద్‌కు వచ్చిన కెసిఆర్- ఒక్కసారిగా కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చాడు.
1,300 మంది బలిదానాలతో ఎంతో ఇబ్బంది పెట్టి సోనియా తెలంగాణ ఇచ్చిందన్న ఇక్కడి ప్రజల భావన కాంగ్రెస్‌ను మట్టికరిపించగా, ‘మాకు అన్యాయం చేసి రాష్ట్ర విభజన చేస్తారా?’ అని ఆంధ్ర ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌కు పాతరేశారు. ఈ రాజకీయమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కెసిఆర్ చుట్టూ తిరిగిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘కెసిఆర్ మన దగ్గరకే వస్తాడులే!’ అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. కెసిఆర్ ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌కు కాంగ్రెస్ వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అధికారం కెసిఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కెసిఆర్ తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశాడు. వైఎస్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని కెసిఆర్ దాదాపు14 ఏళ్లు రాజకీయం చేశాడు. ఆ సెంటిమెంట్‌లోని ఉత్థాన పతనాలనూ చవిచూశాడు. ఎన్నోసార్లు చల్లారిపోతున్న ఉద్యమాన్ని సెంటిమెంట్‌తో రగిలించాడు. తెలంగాణ వచ్చాక సెంటిమెంట్‌కు కాలం చెల్లిపోతుందన్న నిజం ఆయనకూ తెలుసు. అందుకే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టారు.
కెసిఆర్ అధికారంలోకి రాగానే 2014 మార్చి 31 నాటి వరకున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను 2017 ప్రారంభం వరకు మూడు విడతల్లో రద్దుచేశాడు. 11 ఏప్రిల్ 2017 వరకు తుదివిడతగా రూ.4 వేల కోట్లు రుణమాఫీ అమలు చేయడం కెసిఆర్‌కు ఓ పెద్ద విజయమే అనవచ్చు. 36 లక్షలమంది రైతులకు 17 వేల కోట్ల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచాడు. కాని మిర్చి కొనుగోళ్లు, ఇతర రైతుల సాధక బాధకాలను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిష్కరించడం లేదన్న విమర్శ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘మిషన్ కాకతీయ’ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ ఒక అద్భుతమే. కృష్ణా, గోదావరి నదులపై 13 చిన్న తరహా ప్రాజెక్టులు, 23 పెద్ద తరహా ప్రాజెక్టులు ప్రభుత్వం అనుకొన్న సమయానికి పూర్తిచేస్తే తెలంగాణాలో కోటి ఎకరాలకు నీరు పుష్కలంగా అందించవచ్చు. అయితే- వీటి సాధనలో ఎదురయ్యే సమస్యలు, జల వివాదాలు, భూసేకరణ, కోర్టుకేసులు మొదలైన అవాంతరాలు అంత సులభం కాదు. ఇప్పటికే వీటి టెండర్లలో, అంచనాల పెంపుదలలో జరిగిన అవినీతిపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాల్లో 2014 నవంబర్ 20 నుండి కోతల్లేకుండా విద్యుత్తు అందించడం, తద్వారా మేం ఏ పని చేసినా విజయవంతంగా చేస్తామని చెప్పుకొనే అవకాశం కలిగింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ‘సకల జనుల సర్వే’ పేరుతో పెద్ద ఎత్తున సర్వే జరిగినా అది ఎందుకో అమలు సాధ్యం కాలేదు. సాదా బైనామాలా పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపుగా ఉన్న భూమిని పరస్పర అంగీకారంతో 11.19 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం ముందడుగు వేసినా పాలనాపరంగా అది అంతగా విజయం సాధించలేదు. ఇంకా చాలా జిల్లాల్లో సాదా బైనామాలపై సమీక్షల దగ్గరే ఆగిపోయాయి. ‘డబుల్ బెడ్‌రూం పథకం’ కింద రెండు, మూడు చోట్ల మాత్రమే ఇళ్లు కట్టినా ప్ర భుత్వం రాష్టమ్రంతా ఇళ్లు నిర్మించినట్లే ప్రచారం చేసుకొంటోంది. అలాగే లబ్ధిదారులంతా పార్టీ కార్యకర్తలే అని విమర్శలు వస్తున్నాయి. పార్టీలోని చోటా మోటా నాయకులే తమ అనుచరులకు దరఖాస్తులు ఇప్పిస్తున్నారని విమర్శ ఉంది. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకం కొంత విజయం సాధించినా ఇటీవల శాసనసభ్యులే తాము ఎండార్స్ చేసిన దరఖాస్తులకు డబ్బు మంజూరు కాలేదని చెప్తున్నారు. మే 2018 నుండి 25 లక్షల టన్నుల ఎరువులను 55 లక్షల మంది రైతులకు ఉచితంగా అందజేస్తామని వరంగల్ ‘జనహిత సభ’లో కెసిఆర్ ప్రకటించారు. ఎప్పుడో 2018లో ఇచ్చే ఎరువుల పారితోషికం ఇప్పుడే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
మొదటి నుండి పోలీసులను తనవైపు తిప్పుకొంటున్న కెసిఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 500 కోట్ల నిధులతో వారికి వాహన సదుపాయం కల్పించారు. ఉద్యమకాలంలో కెసిఆర్ పోలీసులకు ‘నైతిక శిక్షణ’ అవసరమని ఎన్నోసార్లు చెప్పాడు. కాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. వృద్ధులకిచ్చే ‘ఆసరా’ పింఛన్లతోపాటు ఇటీవల ఒంటరి మహిళలకు భృతిని ప్రభుత్వం ప్రకటించింది. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాల అమలుకు నోచుకుంటే మిగులు బడ్జెట్ కాస్తా లోటు బడ్జెట్‌గా మారుతుందేమోనని ఆర్థిక విశే్లషకులు అంటున్నారు. ఇక ‘మిషన్ భగీరథ’ పేరుతో ఊరూరా వేస్తున్న పైపులు ప్రభుత్వానికి పెద్ద ప్రచారమే తెచ్చిపెట్టాయి. ఉల్లిపాయ ధర తగ్గితే ప్రభుత్వం కొన్ని చోట్ల నేరుగా పొలాల్లోని రైతుల దగ్గర నుండి సేకరించి వాళ్లకు క్వింటాలుకు 8 వేలు చెల్లించింది. కందులకు క్వింటాలుకు 5050 రూపాయలతో తెలంగాణ మొత్తం మార్కెట్లలో 21 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. ఎండుమిర్చి ధర విషయంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల 2500 రూపాయలు మించలేదు. దానివల్ల ఖమ్మం మార్కెట్‌లో జరిగిన అల్లర్లు, ఆ తర్వాత రైతులకు బేడీలు వేయడం పెద్ద చర్చ జరిగింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు జీతాలను పెంచడం వల్ల కెసిఆర్ కొన్ని కుటుంబాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యమకాలంలో కెసిఆర్‌కు దగ్గరయ్యారు. అందువల్ల సంఘ నాయకులంతా కొందరు పదవులు పొంది అధికారం అనుభవిస్తుండగా, మిగతావాళ్ళు బతుకమ్మ సం బరాలు, అవతరణ దినోత్సవాలకు పరిమితమవుతున్నారు. సంక్షేమ పథకాలను ఆచరణలో పెట్టాల్సిన ఉద్యోగులంతా ప్రభుత్వంపై లో లోపల మండిపోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ‘వర్క్ టు ఆర్డర్’ ద్వారా దూర ప్రాంతాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నా ప్ర భుత్వం పదోన్నతులు, బదిలీల ఊసెత్తడం లేదని, వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని పొగిడేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దాదాపు నలభైసార్లు డిఎస్సీ ప్రకటన చేసినా ఇంతవరకు ఆచరణ లేదని లక్షలాదిమంది అభ్యర్థులు బాధపడుతున్నారు. వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వల్ల తమకు అవకాశం పోతుందని నిరుద్యోగులు కోర్టుకు వెళ్లారు. దాని తీవ్ర పరిణామమే మొన్నటికి మొన్న ఉస్మానియా శత వసంత సభలో విద్యార్థుల ముందు కెసిఆర్ నోరు తెరవలేని పరిస్థితి. ‘తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం’ విషయంలో వాగ్దానభంగం జరిగిందని విశే్లషకులు చెబుతున్నారు.
విజయాలు-వైఫల్యాలు మిశ్రమంగా ఉన్నా కెసిఆర్ తన వాక్చాతుర్యంతో ఏమార్చుతున్నాడని విజ్ఞులు చెప్తారు. ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలను ‘అప్పడం’లా నములుకుతింటూ విజయయాత్ర కొనసాగిస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన కెసిఆర్‌లో కలవరం కలిగించింది. అందుకే ఉద్యమకాలంలో మాట్లాడినట్లు ‘అసహనపు భాష’ను కెసిఆర్ ఉపయోగించి మీడియా చూపును తన వైపుకు తిప్పుకొన్నాడు. గతంలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలో తెరాస అభ్యర్థి ఓడిపోయి, భాజపా అభ్యర్థి గెలిచాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ముఖ్య అనుచరుడైన దేవీ ప్రసాద్ ఓడిపోయి భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు గెలిచాడు. అప్రతిహతంగా సాగుతున్న తన విజయ పరంపరను భాజపా ఢీకొట్టడం కెసిఆర్ ఆనాడే జీర్ణించుకోలేదు. అందుకే భాజపా తెలంగాణలో త నకెప్పుడైనా ప్రమాదకరం అని కెసిఆర్‌కు తెలుసు. అందుకే అమిత్ షా నల్లగొండ పర్యటనను రచ్చ రచ్చచేసి వదలిపెట్టాడు. ఇదంతా గమనించే లోపు అమిత్‌షా వెళ్లిపోయాడు. రాహుల్ వ చ్చాడు. ఈలోపు స్వయం ప్రకటిత సర్వేతో మళ్లీ కెసిఆర్ కొత్త చర్చకు తెరతీశాడు. కాంగ్రెస్ వాళ్ల ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టడం, తెలుగుదేశాన్ని అపఖ్యాతిపాలు జేయడం ఈ రెండూ తెరాసాకు నిత్యకృత్యంగా నేర్పించాడు కెసిఆర్. తద్వారా ఆ పార్టీలను ఎప్పుడూ ఆత్మరక్షణలో పడేస్తాడు. కంట్లోని నలతలాంటి మజ్లిస్‌ను మిత్రపక్షంగా చేర్చుకొని ముస్లిం రిజర్వేషన్ల పేరుతో రాజ్యాంగ ఉల్లంఘనకు ప్రయత్నించినా, తాను చేసే పనిని సమర్థించుకొన్నాడు కెసిఆర్.
ప్రచార ప్రసార మాధ్యమాలను, సాంస్కృతిక సాహిత్య సంస్థలను తన నియంత్రణలో ఉంచుకొని ఒకవైపు సున్నితత్వం, మరోవైపు కర్కశత్వం ఏకకాలంలో ప్రదర్శిస్తున్న కెసిఆర్ ప్రస్తుతానికి ‘అజేయుడే’! తెలంగాణ అంటే కెసిఆర్ అన్న విధంగా పరుచుకుపోతున్న ఈ ‘నాయకుడి’ ఏక నాయక ప్రదర్శన చిత్రకావ్యమా? మహాకావ్యమా? అన్నది కాలమే తేల్చగలదు! *
డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125
Published Andhrabhoomi, Friday, 2 June 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి