చిన్ననాటి మిత్రుడు చాలా ఎదిగాడని తెలిసి యోగక్షేమాల కోసం ఫోను చేశా. అన్ని పలకరింపులయ్యాక ‘ఏం చేస్తున్నావురా?’ అని అడిగా. దానికి వాడు ఇచ్చిన సమాధానం- "Aqua thermal treatment of ceramics, aluminium and steel under a constrained environment' నాకు చాలా ముచ్చటేసి వీడు ఇంతలా ఎదిగినందుకు వీడి పనేంటో తెలుసుకుందామని ఆరా తీస్తే దొంగ సచ్చినోడు ‘వాళ్లావిడ పర్యవేక్షణలో వేడి నీళ్లతో గినె్నలు తోమే పనిని’ ఎంత అందంగా చెప్పాడో ఆంగ్లంలో..!
కొందరు రాజకీయ వేత్తలు, కొన్ని రాజకీయ సంస్థలు ప్రజల్ని తికమకపెట్టే పని తెలుగు రాష్ట్రాలలో నేడు కనిపిస్తోంది. రాజకీయం ఎప్పుడూ ఓ పార్ట్‌టైమ్ జాబ్ కాదు. తీరికవేళల్లో, పదవీ విరమణ తర్వాత, ఏం పనీ తోచనప్పుడు రాజకీయం చేయడం తాత్కాలికంగా పొంగులా కన్పిస్తుంది. కానీ, ‘నిర్మాణాత్మక వ్యవస్థ’ ఏర్పడదు. ప్రస్తుతం తెలంగాణలో ‘జేఏసీ’, ఆంధ్రప్రాంతంలో ‘జనసేన’ పరిస్థితి ఇదే! మలిదశ తెలంగాణ ఉద్యమం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి వాళ్లు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నప్పుడు కేసిఆర్‌లో నిస్తేజం ఆవరించింది. వైఎస్ ఆకస్మిక మరణంతో మళ్లీ ఉద్యమానికి ఊపు వచ్చింది. కేసిఆర్ లాంటి రాజకీయ పరిణతి గల నాయకుడు వైఎస్ సంతాపసభలో కన్నీళ్లు పెట్టుకుని మళ్లీ కార్యరంగంలోకి దిగాడు. ఆ తర్వాత కేసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త జవజీవాలను ఊదింది. ఈ ఉద్యమం నడపడానికి రాజకీయ వేత్తలు వెనక వున్నా, ముందు భాగంలో ఓ ‘సాధుజీవి’ కావాల్సి వచ్చింది. ఆ సాధుజీవి ఎవరో కాదు ఆచార్య ముద్దసాని కోదండరాం రెడ్డి. ఈయనకు కమ్యూనిస్టు వర్గాలు పెట్టుకున్న ముద్దుపేరు ‘కోదండరాం సార్’. సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ నిష్క్రమణ కోదండరాంను తెరపైకి తెచ్చింది. ఈయన పేరులోని ‘రెడ్డి’ని మాయం చేసి దళిత, బలహీనవర్గాల గురించి ఆలోచించే మేధావిగా ‘ఎక్స్‌పోజ్’ చేసారని కొందరంటే- కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత ఆయనే ‘రెడ్డి’ పదాన్ని త్యజించాడని ఇంకొందరంటారు. ‘మీ పేర్ల చివర ఆ తోకలెందుకు? ఊరి చివర మా పాకలెందుకు’ అని ఓ సినీకవి ప్రశ్నించినట్టు కోదండరాం తన పేరు చివర ఆ తోకను వదిలిపెట్టారు. గిట్టనివాళ్లు ఆయనకు ‘రెడ్ల మనస్తత్వం’ ఉన్నందుకే 2009లో ఆయన్ని ‘తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఏసి) అధ్యక్షుడిగా చేశారని చెవులు కొరుక్కుంటారు.
రాజనీతి శాస్త్ర ఆచార్యులైన కోదండరాం 1980 ప్రాంతంలో పౌర సంఘాల్లో పనిచేసి, విద్యావేత్తగా, సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి వ్యక్తిని జానారెడ్డి, కెసిఆర్ ఇద్దరూ టిజెఏసి చైర్మన్‌గా చేసినట్లు చెప్తారు. ఆనాటి జేఏసిలో తెరాస, భాజపా పూర్తిస్థాయి తెలంగాణ అనుకూల పార్టీలుగా వుండగా, కాంగ్రెస్ తనపై వస్తున్న వత్తిడికి రక్షణ కవచంగా అందులో చేరి తర్వాత బయటికి వచ్చింది. ఉద్యమ వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి తెలంగాణ టిడిపి నాయకులు అందులో చేరినా ఎక్కువ కాలం అందులో వుండలేకపోయారు. కమ్యూనిస్టుల్లోని ఒక వర్గం కూడా అందులో చేరింది. ఇలా ‘నానాజాతి సమితి’లా తయారైన జేఏసీలో కేసిఆర్, తెరాస పార్టీదే పైచేయిగా నడిచింది. జనాన్ని పోగు చేయడానికి పార్టీలు ఉపయోగపడితే దానిని నడిపించే ‘డ్రైవర్’ పాత్ర మాత్రం తీసుకున్నారు. అందరూ పెద్దకులాల వాళ్లే జెఏసీని నిర్వహిస్తున్నారన్న విమర్శ రాకుండా మల్లేపల్లి లక్ష్మయ్య లాంటి దళిత పాత్రికేయుడిని కూడా అందులోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడైన విఠల్ వంటి బిసి కులస్తుడు, స్వామిగౌడ్ లాంటి నిఖార్సయిన వ్యక్తి కూడా అందులో పనిచేశారు. విమలక్క, పాశం యాదగిరి, ఘంటా చక్రపాణి వంటివారు ఇంకో పాయలో తమ వాదనలు వినిపించారు. మొత్తానికి 2014లో తెలంగాణ సిద్ధించింది. ‘కుర్చీలాట’లో ప్రతి రౌండులో ఓ కుర్చీ తీసేస్తారు. పరుగెత్తగలిగిన, తెలివైన వాళ్లంతా ఎవరి కుర్చీ వారు వెతుక్కున్నారు. అటు,ఇటు చూస్తే కోదండరాం సార్ కుర్చీ మాయమైపోయింది. తెలంగాణ వచ్చాక కోదండరాం ఏ పదవీ తీసుకోకపోవడం ‘త్యాగం‘ అని కొందరంటే, ‘యోగం’ ఆయనకు లేదని మరి కొందరు సరిపెట్టుకున్నారు. ఇక్కడే మనం కాస్త ప్రపంచ చరిత్ర పుటల్లోకి వెళ్లాలి!
ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టీన్ అమెరికా అధ్యక్షుడైన రూజ్‌వెల్ట్‌కు లేఖ రాస్తూ ‘అణుబాంబును సృష్టించే రహస్యం నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర అణుబాంబు ఉంటే వారే విశ్వ విజేతలు’ పేర్కొన్నాడు. రూజ్‌వెల్ట్ అణుబాంబు తయారీకి అవసరమైన అన్ని వసతులూ ఐన్‌స్టీన్‌కు సమకూర్చాడు. అణుబాంబు సిద్ధం అయ్యేసరికి రూజ్‌వెల్ట్ అధికారంలో లేడు. ట్రూమెన్ అధ్యక్షుడయ్యాడు. ఈ లోపు యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. జపాన్ కూడా వారం రోజుల్లో లొంగుతుందని యుద్ధ నిపుణులు చెప్పారు. జపాన్ సహాయకారి దేశం మాత్రమే. జర్మన్ దాదాపు తోకముడిచిందని, సాధారణ బాంబులతో జపాన్‌ను లొంగదీయవచ్చునని సైనిక నిపుణులు ట్రూమెన్‌కు చెప్పారు. చివరకు ఐన్‌స్టీన్ కూడా ‘ఇప్పుడు అణుబాంబు’లు అవసరం లేదని లేఖ రాసాడు. కానీ, ట్రూమెన్ వినకుండా ఏ కారణం లేకుండానే జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేయించి లక్షలాది ప్రజల చావుకు కారణమయ్యాడు. ట్రూమెన్ లాంటి బలమైన అధ్యక్షుడు ఐన్‌స్టీన్ మాట వింటాడా?
సరిగ్గా కోదండరాం అవసరం తెలంగాణకు లేదు. పరిపాలనలో అనుభవజ్ఞులైన నేతలు కొందరు ఉన్నా కెసిఆర్ చరిష్మా ముందు వాళ్లు దాసోహం అంటున్నారు. ఏపిలో మంత్రివర్గ విస్తరణ జరిగితే చింతమనేని ప్రభాకర్, గోరంట్ల, కాగిత వెంకట్రావు, గౌతు శివాజీ, బొజ్జల, ధూళిపాళ నరేంద్ర, బోండా ఉమ లాంటి నేతలు చంద్రబాబును కాస్త ధిక్కరించే ప్రయత్నం చేశారు. కానీ, తెలంగాణ మంత్రివర్గంలో మహిళా ప్రాతినిధ్యం లేకపోయినా ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా కేసిఆర్ వ్యూహాలు, ప్రజాకర్షణ ముందు అవన్నీ బలాదూర్. ఇలాంటి సంఘర్షణ వాతావరణంలో కోదండరాం నెట్టుకురావడం అంత సులభం కాదు. కోదండరాం శిక్షణా తరగతుల్లో రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పి ఉండొచ్చు! రాజకీయాలను శాసించడం అంత సులభం కాదు. ఈ మూడేళ్లలో కొన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్న ఈ ఆచార్యుడు వెనక్కి తిరిగి చూసుకునే సరికి జరగాల్సిందంతా జరిగిపోయింది. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల అంశంపై కోదండరాం పోరాటం ప్రారంభించినా అది జనంలోకి విస్తృతంగా వెళ్లలేదు. ఈలోపు నిరుద్యోగ ర్యాలీ తీసిందీ లేదు పెట్టింది లేదు కానీ జేఏసి ముక్కలైంది. ధర్నాచౌక్ మాయమైంది. ఆ తర్వాత మిగిలిన అరకొర సభ్యులతో కోదండరాం చర్చించి ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’ సుధీర్ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి జిల్లా వ్యాప్త సభలు పెడతానని బీరాలు పలికాడు. ‘్భమినీ ఆకాశాన్ని ఒక్కటి చేసైనా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తానని కేసిఆర్ చెపుతుంటే సుధీర్ కమిటీ సిఫార్సులని జేఏసీ నమ్మడం ‘రాజకీయ అపరిపక్వతకు’ నిదర్శనం!
రెడ్డి సామాజికవర్గ ఐక్యతకే కోదండరాం పనిచేస్తున్నాడని, కాంగ్రెస్, తెదేపాలతో చేతులు కలిపాడనే తెరాస నమ్మింది. అందుకే మొదట బాల్క సుమన్, ఇతర మంత్రులు విరుచుకుపడ్డా కోదండరాంను టార్గెట్ చేస్తే అతనికే లాభమవుతుందనే రాజకీయ వ్యూహంలో భాగంగానే ‘ఎలిమినేట్’ చేసింది. ప్రభుత్వ పెద్దలు చేయాల్సిన ఎదురుదాడి పిట్టల రవీందర్, నల్లపుప్రహ్లాద్ చేయనే చేసారు. ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు’గా వీళ్ల విమర్శలతో కోదండరాం నైతికంగా బలహీనుడయ్యాడన్నది నిజం. అనంతగిరి లాంటి దేవాలయాలను సందర్శించిన కోదండరాం అక్కడ భక్తుడిగా, విశ్వాసిగా కనిపించారు. కానీ నిజ జీవితంలో కమ్యూనిస్టుగా జీవిస్తాడు. ఒకవేళ కోదండరాం ప్రజానాయకుడు కావాలంటే ఈ ‘కమ్యూనిస్టు అవశేష రూపం’ వదిలిపెట్టాలి. తన సంభాషణల్లో , చేష్టల్లో విస్తృత సమాజాన్ని అంగీ కరింపచేయాలి. అంతేగాని తను మాట్లాడుతుంటే తమ్మినేని వీరభద్రంలాగా, బీవీ రాఘవుల్లాగా హావభావాలు ప్రదర్శిస్తూ పడికట్టు పదాలను ఉపయోగిస్తే కోదండరాం ‘పేపర్ పులి’గా మారడం ఖాయం!
ఇక ఆంధ్ర ప్రాంతంలో కమ్మ, బిసిలకు ప్రతినిధిగా తెదేపా వుండగా, రెడ్లు- దళిత క్రైస్తవులకు వైఎస్ జగన్ తానే కర్తను అనుకుంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు కావడికుండలు నెత్తినపెట్టుకుని తపస్సు చేసినా వాళ్లను అడిగేవాడు లేడు. ఇక్కడి కాపువర్గానికి ప్రతీకగా ప్రజారాజ్యం నుండి పుట్టిన పిల్లపార్టీ ‘జనసేన’. ఇది పార్టీనో, సంస్థనో! ఇప్పటికీ క్లారిటీ లేదు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేదీ సినిమాలు హిట్టయ్యాక ‘జనసేనాధిపతి’కి పట్టపగ్గాల్లేక ఓ ‘ఇజం’ సృష్టించాడు. ఆ రెండు సినిమాల్లో కాస్త మనసున్న మనిషిలా ఓ కోణంలో ధీరోదాత్తుడైన నాయకుడిగా మరో కోణంలో నటించి రాజకీయాల్లో కూడా నటించి జీవిద్దామని వచ్చాడు పవన్‌కల్యాణ్. 2014 ఎన్నికల్లో భాజపా-తెదేపా కూటమికి ప్రచారం చేసి మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. చంద్రబాబు మాత్రం పవన్ విషయంలో వేచి చూసే ధోరణిలోనే ఆయనా నటిస్తున్నాడు. ఆయనది యాక్షన్. ఈయనది రియాక్షన్. తెలంగాణలో కన్నా ఆంధ్ర ప్రాంతంలో సినిమా నటులకు ఫ్యాన్స్ ఎక్కువ. ఆ ధీమాతోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి, క్యాష్ కౌంటర్, రిసెప్షన్‌లను అల్లు అరవింద్‌కు అప్పజెప్పి, తాను రాజకీయ నటుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. చివరకు కాంగ్రెస్ పార్టీకి దాసోహమయ్యాడు. కొన్ని వర్గాలు చిరంజీవిని నమ్మితే ఘోరంగా దెబ్బ తీసాడని అంటారు విమర్శకులు. ఇలాంటి అపవాదు రాకూడదనే కాబోలు పవన్ కొన్నిసార్లు చేగువేరా లాగ, మరికొన్నిసార్లు భగతసింగ్‌లా రూపాంతరం చెందుతుంటాడు.
సినిమాల్లో అగ్రశ్రేణి నటుడు కాబట్టి అతణ్ణి స్టేజిమీద ఎలా చూపించాలో అలా చూపిస్తున్నారు ఆయన వెనకున్న మనుషులు. కానీ ‘పవనిజం’ అని ఓ కొత్త సిద్ధాంతం కనిపెట్టి అదేదో కమ్యూనిజం, హిందూయిజం స్థాయిలో చూపిస్తున్నారు. ఇటీవల ఆయన అమెరికాలో ఓ సభలో ‘కార్మికుల కండువా’ వేసుకుని తాను ‘కార్మికుల ప్రతినిధిని’ అంటూ ఏవేవో అపరిపక్వ ఉపన్యాసాలు ఇచ్చాడు. స్క్రిప్ట్ రైటర్స్‌గా సరైన వ్యక్తులను పెట్టుకుంటే మంచిది. రాజకీయం అనేది ఓ విశ్వనాటకం. ఇందులో పాత్రలు కదలాడే కడలి తరంగాలు అన్నది పవన్ మరిచిపోరాదు. నటనలో రాజకీయం వుండొచ్చుకానీ, రాజకీయంలో నటన ఎల్లకాలం పనికిరాదు. జీవితాంతం రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ విలన్ వేషాలేస్తే వాళ్ల కూతుళ్లను ‘తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకునే పాత్ర’లో నటించిన చిరంజీవి తన కుటుంబంలో అలాంటిదే జరిగితే భరించలేకపోయాడు. కాబట్టి నటన వేరు, జీవితం వేరు అని పవన్ తెలుసుకోవాలి. చంద్రబాబు లాంటి రాజకీయ దురంధురుణ్ణి, జగన్ లాంటి రాజకీయ వ్యాపారవేత్తను ఎదుర్కోవాలంటే ఈ ఇజాలు, నిజాలు కాదు, రాజకీయ పరిజ్ఞానం కావాలి. ఈ దేశంలో నిజమైన కమ్యూనిస్టులకే కాలం చెల్లింది. మరి కమ్యూనిస్టుగా నటిస్తే ‘పవనిజం’ కాస్తా పనికిరాకుండా పోతుందేమో..? *

డా. పి. భాస్కరయోగి, సెల్ : 99120 70125

Published Andhrabhoomi  Friday, 21 April 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి