భారత్ ఎంత మహోన్నతమైందో, అన్ని ఎదురు దెబ్బలూ తిన్నది. పడిలేస్తూ తన అంతర్గత సంస్కృతిని, ఆలోచనలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, కొత్తరూపంలో వ్యక్తీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నది. దానికి కారణం ఇక్కడి బహు సంఖ్యాకులైన హిందూ జాతి మాత్రమే. 800 ఏళ్లు ముస్లింలు, 200 ఏళ్లు క్రైస్తవులు పాలించినా మన దేశంలోని హిందూ ప్రజలు తమ మతాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ దేశంలో ఇంకా 89 శాతం ప్రజలు హిందువులుగానే ఉన్నారు. దీని వెనకున్న రహస్యం ఏమిటి? ఈ అంశంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రీ.శ 712లో మహమ్మద్ బిన్ కాశిం హిందూ రాజ్యంపై దండెత్తినప్పటి నుంచి మొదలైన విదేశీ దురాక్రమణదారుల పాలన 1947లో వైస్రాయ్ లార్డ్ వౌంట్ బాటన్ బ్రిటన్‌కు తిరిగి వెళ్లేవరకు సాగింది.
అందుకే హిందూ మతం నిరంతరం వివిధ రూపాల్లో అనేక దాడులను ఎదుర్కొంటూనే వున్నది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలోను మెజారిటీ ప్రజలు ఎవరుంటే వాళ్ల సంస్కృతి, చరిత్ర, నాగరికతలే ప్రధాన స్రవంతిగా కొనసాగుతాయి. ఇది జగద్విదితం. కాని మన దేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. దురదృష్టవశాత్తూ ఇక్కడి మెజారిటీ ప్రజలు తల ఎత్తి ‘ఇది మాది’ అని చెప్పే పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. దాదాపు గత 1400 ఏళ్ల బానిసత్వంలో ఇక్కడి హిందువులు తమకు ముఖ్య ఆరాధనా కేంద్రాలైన ముప్ఫై వేల దేవాలయాలను కోల్పోయారు. అవి పరమత పాలకుల ‘మత సంకుచిత దృష్టికి’ బలయ్యాయి. అందులో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య రామమందిరం, మధురలోని శ్రీకృష్ణ మందిరం, కాశీ విశ్వనాథ మందిరం ప్రధానమైనవి.
వందల ఏళ్ల పోరాటం తర్వాత ఇప్పటికీ ఈ దేశ మెజారిటీ ప్రజలు వీటిని పునర్నిర్మించుకోలేక పోతున్నారు. 1947 నవంబర్ 9న సర్దార్ పటేల్ సౌరాష్ట్ర పర్యటనలో-‘సోమనాథ్ మందిరం ఎక్కడ ఉండేదో అదే స్థలంలో నిర్మిస్తాం’ అని ప్రకటించారు. పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ చొరవతో ఒక్క సోమనాథ్ మందిరం మాత్రం నిర్మించుకోగలిగాం. మందిర నిర్మాణానికి ముందే పటేల్ మరణించడం విషాదం. అలాంటి స్ఫూర్తి తరువాతి పాలకుల్లో లేకపోవడంతో మిగతా దేవాలయాల నిర్మాణం కోసం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం.
1925లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపనతో హిందువుల్లో చైతన్యం రావడం ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతరం ఈ చైతన్యం మరింత పెరిగింది. 1985 తర్వాత హిందువులు చరిత్రలో ఎన్నడూ లేని ఏకత్వాన్ని సాధించారు. అది ‘రామజన్మభూమి ఉద్యమం’ రూపంలో.
అయోధ్య ఉద్యమం..
దేశంలోని ప్రతి హిందువును ఈ ఉద్యమం కదిలించింది. ప్రతి మారుమూల గ్రామం, బస్తీ నుంచి రామజన్మభూమి కోసం ఇటుకలు వెళ్లాయి. సాధువులు, విశ్వహిందూ పరిషత్, బిజెపి, శివసేన, ఇతర సంస్థలు ఇందులో నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ నిర్వహించిన రథయాత్ర ఓ చారిత్రాత్మక ఘట్టం. 1528 ప్రాం తంలో బాబర్ సేనాని మీర్‌బాకీ నేతృత్వంలో అయోధ్యపై మతోన్మాదులు దాడిచేసి అక్కడి సుందర నగరాన్ని, రామమందిరాన్ని ధ్వంసం చేశారు. మందిరం ఆనవాళ్లు లోపల ఉండగానే దానిపై మసీదు నిర్మించారు. దీనిపై బ్రిటీష్ చరిత్రకారుడు కన్నింగ్ హోమ్- మీర్‌బాకీ ఫిరంగులతో మందిరాన్ని పేల్చివేయడానికి విఫలయత్నం చేశాడు. దాదాపు 15 రోజులపాటు హిందువులు ప్రతిఘటించారు. సుమారు 17,400 మంది హిందువులు ఈ దురాగతానికి ఎదురు తిరిగి మరణించారని రాశారు. క్రీ.శ 1528 నుంచి 1949 వరకూ రామజన్మభూమి స్వాధీనం కోసం 760 యుద్ధాలు జరిగాయి. 1934లో జరిగిన ఉ ద్యమం చారిత్రాత్మకమైనది. అప్పటి నుంచి పోరాటం నడుస్తూనే ఉంది. 1983 తర్వాత ఈ ఉద్యమం ప్రతి భారతీయుడినీ కదిలించింది. హిందువుల్లో చైతన్యం మొదలైంది. వేయేళ్ల నుంచి మహ్మదీయ క్రైస్తవుల పాలన కింద నలిగిపోయిన హిందువులు తమ అస్తిత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. రామమందిర ఉద్యమానికి చేయూతనందించారు. 1983లో ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక హిందూ సమ్మేళనం నిర్వహించారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన గుల్జారీలాల్ నందాతోపాటు దావూ దయాళ్ ఖన్నా అందులో పాల్గొన్నారు. అయోధ్య రామజన్మభూమి, మధుర కృష్ణ జన్మస్థాన్, కాశీ విశ్వనాథ్ మందిర విముక్తి కోసం ఖన్నా ఇచ్చిన పిలుపు హిందువులను కదిలించింది. ‘రామజన్మభూమి ముక్తి యజ్ఞసమితి’ని ఏర్పాటుచేసి మహంత్ అవైద్యనాథ్ అధ్యక్షునిగా, దావూ దయాళ్ ఖన్నా ప్రధాన కార్యదర్శిగా కార్యాచరణ మొదలుపెట్టారు. 8, ఏప్రిల్ 1984న ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సాధుసంతులు సమావేశమై, అయోధ్య మందిరం తాళాలు తెరిపించాలని సంకల్పించారు. 1986 ఫిబ్రవరి 1న ఫైజామాద్ జిల్లా న్యాయమూర్తి కె.ఎం.పాండే తాళాలు తెరిచారు. 1989లో జరిగిన ‘ప్రయాగ కుంభమేళా’లో పూజ్య దేవరహ బాబా సమక్షంలో ప్రతి గ్రామంలో శిలాపూజకు సంకల్పించారు. 2.75 లక్షల రామశిలలకు పూజలు జరిగాయి. 1989 నవంబర్ 9న కామేశ్వర చౌపాల్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 1990 మే 24న హరిద్వార్‌లో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనంలో కరసేవ చేయాలన్న నిర్ణయం జరిగింది.
1990 అక్టోబర్ 30 నుంచి కరసేవకులు సిద్ధమయ్యారు. 1990 అక్టోబర్ 18న దీపావళి నాడు రామజ్యోతి దేశమంతా వెలిగింది. నాటి యుపి సీఎం ములాయం సింగ్ అయోధ్యలో ‘పక్షి కూడా రెక్క కదల్చలేదు’ అని బీరాలు పలికాడు. కానీ 1990 అక్టోబర్ 30న రామభక్తులు గుమ్మటాలు ఎక్కి కాషాయ ధ్వజం ఎగురవేసారు. నవంబర్ 2న ధ్వజం ఎగురవేసిన కొఠారి సోదరులు ప్రభుత్వ దమనానికి బలయ్యారు. ఎందరో కరసేవకులను ప్రభుత్వం కాల్చేసింది. వారి అస్తికలతో కలశయాత్ర చేసి 1991 జనవరి 14న మాఘమేళాలో 25 లక్షల మందితో భారీ ర్యాలీ జరిగింది. ఆ తర్వాత యూపీలో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఉద్య మం మరింత ఊపందుకుంది. 1992 సెప్టెంబర్ 26న శ్రీరామ పాదుకాపూజ జరిగింది. 1992 అక్టోబర్ 30న ఢిల్లీలో సాధుసంతులు సమావేశమై 5వ ధర్మసంసద్‌లో ద్వితీయ కరసేవ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత లక్షలాదిమంది కరసేవకులు 1992 డిసెంబర్ 6 నాటికి అయోధ్య చేరుకొన్నారు. అదే సమయానికి కోర్టు నిర్ణయం వాయిదా వేసినందున రామభక్తులలో క్రోధం పెరిగింది. వారి క్రోధానికి బాబ్రీ గుమ్మటాలు నేలకూలాయి. భారత చరిత్రలో మరిచిపోని రోజు అది. హిందూ జాతి చరిత్రలో అందరినీ ఏకం చేసిన రోజు.
మరిన్ని ఉద్యమాలు
అయోధ్య రామజన్మభూమి ఉద్యమం హిందూ జాతీయ భావానికి ప్రతీక అయితే ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల ఏర్పాటు హిందూ ధార్మిక భావ చైతన్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. హిందూ జాతిపై జరిగిన అనేక దాడులు ఎన్నోసార్లు హైందవ సమైక్యతకు తోడ్పడ్డాయి. హిందూ ధార్మిక భావన పునాదిగా పుట్టిన ఎన్నో సంస్థలు కూడా హైందవ చైతన్యాన్ని విశేషంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. దాదాపు 50 అంతర్జాతీయ సంస్థలు హిందూ ధార్మికతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రచారం చేస్తున్నాయి. కృష్ణ భక్తి సంఘం (ఇస్కాన్) అనే సంస్థ వందలాది దేశాల్లో పనిచేస్తూ కృష్ణతత్వంపై బాగా ప్రచారం చేస్తోంది. దీనిని శ్రీల ప్రభుపాదులుగా పేరుపొందిన ఏ.సి. భక్తి వేదాంతస్వామి స్థాపించారు. హిందువుల ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను దేశదేశాలకు అందించారు. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో కృష్ణ మందిరాలను నిర్మించారు. 100 ఏళ్లలో 3100 శాఖలను స్థాపించిన రామకృష్ణ మిషన్, ఆర్యసమాజం, అరవిందాశ్రమం, రమణాశ్రమం వంటివి ఈరోజుకూ హిందూ ధార్మిక రంగంలో అనంత సేవలందిస్తున్నాయి. ఆనందమూర్తిగా పిలువబడే ప్రభాత్ రంజన్ సర్కార్ స్థాపించిన ఆనంద్‌మార్గ్ ఆధ్యాత్మిక సామ్యవాదం ప్రతిపాదించి బెంగాల్‌లో కమ్యూనిస్టులకే సవాల్ విసిరింది. తన కార్యకర్తలెందరినో కమ్యూనిస్టులు హతమార్చినా జంకకుండా ఆనంద్‌మార్గ్ తన కార్యకలాపాలు నిర్వహించింది. మహర్షి మహేశ్ యోగి విదేశాల్లో భారతీయ విద్యలను చెప్పే విశ్వవిద్యాలయం స్థాపించి యోగను పరిచయం చేసారు. స్వామి సత్యానంద్, చరణ్‌సింగ్ మహరాజ్, మాస్టర్ సివివి మెహర్‌బాబా, స్వామి ముక్త్యానంద, శివానంద, స్వామి యోగానంద పరమహంస, రమణమహర్షి, పాండురంగ అథవాలే, రామచంద్ర మహరాజ్, ఎక్కిరాల వేదవ్యాస్, స్వామి చిన్మయానంద వంటి మహనీయులు భారతీయతను ఆధ్యాత్మికతతో జోడించి హిందూ ధర్మానికి గొప్ప సేవ చేసారు. వీరిలో చాలామంది 1990కి ముందు దేహాన్ని వదలిపెట్టినా వారు స్థాపించిన సంస్థలు హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని పరిరక్షిస్తున్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా హిందూ ఆందోళనల్లో పాల్గొనకున్నా హిందూ ధార్మిక భావాన్ని పునరుత్తేజం చేస్తున్నాయి.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్యాత్మిక సంస్థ హిందూ ధర్మ ఔన్నత్యానికి ప్రత్యేకంగా అంకితమైంది. దాని స్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ దేశ విదేశాల్లో ధ్యానంతోపాటు హైందవ సంస్కృతి వికాసానికి కృషి చేస్తున్నారు. కేరళలోని కొల్లం కేంద్రంగా మాతా అమృతానందమయి దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. విదేశీయులెందరో ఆమె ధార్మిక శక్తికి ఆకర్షితులవుతున్నారు.
బిహార్ నుంచి వచ్చిన రామ్‌దేవ్ ఇటీవల భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ద్వారా జాతీయ, ధార్మిక భావన నెలకొల్పారు. బాలకృష్ణ మహరాజ్, రాజీవ్ దీక్షిత్‌లతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశంలో యోగ విద్యను పునరుజ్జీవింపచేసి స్వదేశీ వస్తువులను, ఆయుర్వేదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. హరిద్వార్ కేంద్రంగా పతంజలి యోగ పీఠం స్వదేశీ ఉద్యమానికి తెరలేపింది. ఈ ఉద్యమం మధ్యలో గొప్ప జాతీయ హిందూ తత్త్వవేత్త రాజీవ్ దీక్షిత్ మరణించడం దురదృష్టకరం. 2005లో సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తమిళనాడు సీఎం జయలలిత ద్వారా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతిని అరెస్టు చేయించడం హిందువుల్లో ఆగ్రహం రగిలించింది. ఈ ఘటనతో దేశంలోని స్వామీజీలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఇలా దేశమంతా ఆధ్యాత్మిక, జాతీయవాద ఉద్యమాలతో హైందవ చైతన్యం వెల్లివిరుస్తోంది.
****************************************************
-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి