మానవుని సహజ స్వరూపం ఆనందం. దుఃఖం కాదు. అందుకే మన దేవతల చిత్రపటాలు, విగ్రహాలు ఆనందస్వరూపంగా ఉంటాయి. ప్రకృతి అంతా భగవంతుని స్వరూపమే. అంటే ఆనంద స్వరూపమే. నదులు, పర్వతాలు, చెట్లు, పక్షులు, పశువులు, సెలయేళ్లు.. అన్నీ ఆనందంగా ఉంటాయి. ఎవరికైతే ఈ ఆనందం పక్కకు జరుగుతుందో.. అంటే దేవుడు దూరంగా జరుగుతాడో.. అప్పుడు వారు దుఃఖంలో మునిగిపోతారు. తమలోని చైతన్యాన్ని కోల్పోతారు. ఆనంద స్వరూపాన్ని వేదం.. ‘రసోవైసః’ అన్నది. భగవంతుడు రసస్వరూపుడు కూడా. విశ్వమంతా రసమయమే. ‘నాకు ఇక చాలు’ అన్నది సంతృప్తి. దానికి ఆనందమనే పేరు కూడా ఉంది. సృష్టిలో మనిషికి ఏ వస్తువు ఎంత ఇచ్చినా ‘చాలు’ అని చెప్పరు. కానీ, భోజనం విషయంలో మాత్రం.. ‘చాలు’ అంటారు. సంతృప్తి చెందుతారు. ఆకలి వేసినప్పుడు కడుపునిండుగా భోజనం పెడితే అలౌకికమైన అనుభూతి కలుగుతుంది.
అది మాటల్లో వర్ణించనలవి కాదు. కంటికి కనిపించే మూర్తపదార్థం కాదు. సర్వజీవులూ అలాంటి ఆనందం కోసం వెంపర్లాడుతుంటాయని బృహదారణ్యకోపనిషత్‌ తెలిపింది. మరి అల్పసుఖాలైన ధనం, పదవి, జూదం, పరదూషణ, ఆత్మస్తుతి, ఈర్ష్య, అసూయ, మద్యం.. వీటి వల్ల కూడా ఆనందం కలుగుతుంది కదా అనే సందేహం రావచ్చు. నిజమే. కానీ ఆ ఆనందం.. ఒక బండరాయిని నెత్తిన పెట్టుకుని కొండపైకి చేరేవాడి ఆనందం లాంటిది. భూమండలంలోని సంపదలన్నీ అనుభవింపగలిగే శక్తిసామర్థ్యాలున్నా.. తనను తాను అంతరంగంలో దర్శించుకోలేకపోతే మనుష్యానందంలో ఉన్నట్టే. అలాంటి ఆనందాలు వందరెట్లు కలిసినా.. ఆత్మానందానికి సరిపోవు. సంతృప్తి వల్ల కలిగేది ఆత్మానందం. అదే బ్రహ్మానందం. దాన్ని కనుగొని పొందడమే పరమోత్తమమైన సాధన. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి