ఓ తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ‘ఒక వస్తవ్య్రాపారి మీటరు బట్టకు 50 రూపాయలు తీసుకుంటే 32 మీటర్ల బట్టలో అతడు చేసిన దోపిడీ ఎంత?’ అని ఓ విద్యార్థిని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో అర్థం కాక విద్యార్థి బిక్కమొహం వేశాడు. వస్తవ్య్రాపారి తన వ్యాపారం ద్వారా సంపాదించింది లాభమా? దోపిడీనా? వాడికి అర్థం కాలేదు. గతంలో బెంగాల్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇలా అడిగేది అని హాస్యం కోసం కొందరు చెబుతుంటారు. ప్రశ్నను రెచ్చగొట్టే విధంగా నూరిపోయడం కమ్యూనిస్టులకు అలవాటు. అలాగే పత్రికారంగంలో కొత్త పరిభాషల్ని సృష్టించడం కోసం వాళ్లు బాగా ఆరాటపడతారు. ఈ పరిభాష, వ్యాఖ్యానం, విషయ సృష్టి, నిర్వచనం.. అన్నిట్లో ఈ దేశ మూలతత్వంపై మెల్లగా దాడిచేస్తారు. పైగా ప్రచార ప్రసార మాధ్యమ రంగాన్ని తామే నైతిక మార్గంలో నడిపిస్తున్నట్లు భ్రమింపచేస్తారు. కొందరైతే తమది ఏ సిద్ధాంతమో అర్థం కాకుండా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వీర కమ్యూనిస్టులా పోజులిచ్చే ఓ విద్యావేత్త బాసరలో యజ్ఞం చేస్తాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానసభలో మాట్లాడగలుగుతాడు. మరో పెద్ద మనిషి మావోయిస్టులతో చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామిని తన ఇంటికి పిలిపించుకుని ఆయనతో సన్నిహితంగా మెలగుతాడు. ఇలాంటి ‘రెండు నాల్కల’ మహా మనుషులంతా పత్రికలకు సిద్ధాంతకర్తలుగానూ వ్యవహరిస్తారు. వారు నాటిన విషబీజాలే మహావృక్షాలై ఇప్పుడు చాలా పత్రికల్లో కీలక స్థానాల్లో వున్నారు.
వీరు నోరు తెరిస్తే ‘ప్రజల భాష’ అని కలర్ ఇస్తుంటారు, కానీ అది ఏ దేశ ప్రజల భాషనో చెప్పరు. పత్రికల భాష ద్వారా కూడా మన ఆయువుపట్టును దెబ్బతీస్తారు. కొన్ని పదాలకు అర్ధ సంకోచం, మరికొన్ని పదాలకు అర్ధ వ్యాకోచం కల్పిస్తారు. సాంప్రదాయిక పదాలకు అర్ధ నిమ్నత కల్పించి అగౌరవ పరుస్తారు. ‘శఠగోపం’ అనే పదం ఆగమశాస్త్ర పదం. శఠులు అనగా మోసగాళ్లు, వంచకులు అని అర్థం. అలాంటి మోసగాళ్లను తన పాదాల కింద తొక్కిపెట్టేవాడు విష్ణువు అనే దానికి సూచనగా శఠారిని భక్తుల తలపై మూడుసార్లు పెడతారు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. కానీ ఈ పదం ఈరోజు నిమ్నత పొంది ఏదైనా మోసం చేసిన సంఘటనకు అతడు ‘శఠగోపం’ పెట్టి వెళ్లిపోయాడు అని మారింది. కుంభకోణం తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం. అక్కడ ఎప్పుడో, ఎవరో మోసం చేసారని ఆ పదాన్ని సామాజిక క్షేత్రంలో డబ్బు కొల్లగొట్టేవారందరికీ ప్రయోగిస్తున్నారు. ఏదైనా డబ్బును కుట్రతో కాజేస్తే పెద్ద కుంభకోణం జరిగింది అని అంటున్నారు. కైంకర్యం అంటే పూజ అని అర్థం. ఇది కూడా ధనం కాజేయడం అనే అర్థంలో వాడుతున్నారు. మంగళం అంటే శుభం అని అర్థం. సాధారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమం అనంతరం ముగింపులో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు ‘మూసివేయబడిన’ వాటిని గురించి చెప్పడానికి మంగళం అని వాడుతున్నారు. మరి ఈ పదాల సృష్టికర్తలు ఎవరు?
భాషను, వ్యాకరణాన్ని ధ్వంసం చేసి ప్రాచీనతను నరికివేయాలనే కరడుగట్టిన భాషావేత్తలు, భాషను సరళం చేసే మిషతో వ్యవహార భాషను నెత్తికెత్తుకున్న మేధావులే ఈరోజు భాషలు అంతర్ధానం అవుతున్నాయని గగ్గోలు పెడతారు. నన్నయ్యభట్టు రాజమహేంద్రవరంలో ఉండి భారతం రచించినా, నెల్లూరులో జీవించి తిక్కన సోమయాజి భారత రచన చేసినా, వరంగల్లులో పోతనామాత్యుడు నివసించి భాగవతం గ్రంథస్థం చేసినా ఇందులోని పలుకుబడి అన్ని ప్రాంతాలవాళ్లను అక్కున చేర్చుకొంది. ఈ పద్య, గద్యాలు అన్ని ప్రాంతాలవాళ్లకూ అర్థమయ్యాయి. కానీ, భాషా సంస్కర్తల పేరుతో పత్రికల ద్వారా తెలివిగా మూల భాషను మట్టుబెట్టే ప్రయత్నం చాలామంది ‘ఎర్ర పాత్రికేయులు’ నిర్విఘ్నంగా కొనసాగించారు. అసలు ప్రాథమికమైన వ్యాకరణం నేర్చుకోవడం కూడా నేరం అన్నంతగా ఈ మేధావులు పత్రికా రంగంలో ప్రచారం చేశారు. దీంతో ఏది సాధు పాఠమో ఏది సరైన పద ప్రయోగమో చెప్పలేని దుస్థితి.
నిజానికి ‘విలేఖరులు’ అనే పదంలోనే వ్యాకరణం దోషం వుంది. ఇది భాషా శాస్త్రం చదువుకొన్న వాళ్లందరికీ తెలుసు. ‘విలేఖకులు’ అనేది సరైన పాఠం. భాషా పరిజ్ఞానం కల్పించాల్సిన బాధ్యతను విస్మరించిన ఈ మేధావులు వున్న భాషను జీవం లేకుండా చేసి కొత్త పదాలను సృష్టించడం విడ్డూరం. అవన్నీ కృతకంగా ఉంటున్నాయి.
ఆచార్య కసిరెడ్డి వంటివారు పత్రికా భాష ఎలా ఉండాలనే దానిపై విస్తృత చర్చే చేశారు. పత్రికా రచనలో భాషా సమతుల్యత ఉండాల్సిందిపోయి విషమతుల్యత చోటు చేసుకోవడం వింతల్లోకెంత వింత. సిద్ధాంతాల కనుగుణంగా భాషను సృష్టించి వాటికి నిర్వచనాలు ఇస్తుంటే మనం ఇంత సంకుచితం అయిపోయామా? అనిపిస్తుంది. శైలీశయ్యా సమత కోసం పత్రికా భాషలో చాలా నియమాలు పాటించాలి. ఇవేవీ లేకుండానే పత్రికల్లో భాష చాలావరకు కొనసాగుతుంటే, వీటిపై ఎలాంటి శిక్షణ లేకుండానే టీవీ మాధ్యమాలు దుమ్ము రేపుతున్నాయి. కులోన్మాదులను సెలబ్రిటీలుగా మార్చే ప్రక్రియ ప్రసార మధ్యమాలు నిరాటంకంగా చేస్తుంటే మనం నోరెళ్లబెట్టి చూడడం తప్ప ఇంకేం చేయలేం. వితండ వాదం, అడ్డగోలు వాదనను జర్నలిజంలో అత్యున్నత ప్రమాణంగా పాటిస్తుంటే విలువలు, పాఠాలు వింత పదాలు..!
ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేఖరులకు భాషా నైపుణ్యం, విషయ సేకరణ కొరవడింది. సంచలనమే వార్తగా జగతికెక్కడం భాషను పాతరేయడం కాక ఇంకేమిటి? ఈ గందరగోళంలో మనం భాషా పరిజ్ఞానం కోల్పోతున్నాం. పత్రికా భాషలో గ్రాంధిక భాష కాకుండా వ్యవహార భాష ఉండాలి. మాండలిక ప్రయోగం చేసినా అది కనీసం డెబ్బై శాతం మందికి తెలిసినదిగా ఉండాలి. పదాద్యక్షరాల్లో అచ్చు ఉంటే అచ్చు, హల్లుంటే హల్లే విధిగా రాయాలి. వ్యవహార భాష పేరుతో ఊరును వూరుగా రాయకూడదు. గ్రాంధికంలో వాడే ‘అతనియందు’ లాంటి పదాల్లో అతనిలో అని రాయాలి. సంధికార్యాలు అవసరం ఉంటేనే చేయాలి. ఉచ్చారణ విధిని అనుసరించి లిపి వుండాలి. పరుష సరళాలు గసడదవలు సమాసంలో పాటించవచ్చు. ఉదా: కూరగాయలలో ‘కా’ను ‘గా’గా కూడా రాయవచ్చు. ఆయన కాలు బెణికింది అన్నపుడు ‘కా’ను ‘గా’గా రాయాల్సిన అవసరం లేదు.
ఈనాటి తెలుగులో ‘అర సున్న’ అవసరం లేదు. రెండు పదాలను మించి సమాసం చేయవద్దు. జన వ్యవహారంలో బాగా నానుతున్న అన్యదేశ్యాలు ప్రయోగించవచ్చు. కారు, స్టేషన్, రైలు, బందోబస్తు వంటివి. కొందరు ‘చదవడం’ లాంటి పదాల్లో ‘డ’కు బదులుగా ‘ట’ను వాడతారు. కానీ ఎక్కువమంది ప్రయోగించే ‘డ’ను వాడడం మంచిది. తెలుగులోకి వచ్చిన ఉర్దూ, పారసీ పదాలు ప్రసిద్ధమైతే ఈరోజుకూ వాడుతున్నారు. బర్దస్త్, రద్దీ రాస్తా, రాస్తారోకో, వాజీఫా, దివాలా వంటి పదాలు ఇప్పటికీ జనం నోట్లో నానుతున్నాయి. అందుకే పత్రికలు స్వీకరించాయి. కానీ దీనిని కూడా ఏదో మహాప్రసాదంగా అభివర్ణిస్తూ ‘గంగా యమునా తెహజీబ్’ అని జబ్బలు చరచుకొనేవాళ్లు పత్రికారంగంలో బోలెడంతమంది ఉన్నారు. వాళ్లతో వచ్చిన చిక్కంతా అదే..!
పత్రికా రచనలో విరామ చిహ్నాలకూ ప్రాధాన్యత ఉంది. ఒక్క విరామ చిహ్నం అందులోని భావాన్ని తెలియజేస్తుంది. ముగింపుచుక్క (్ఫల్‌స్టాప్), తోకచుక్క (కామా), కోలన్ (చుక్కతోక), కోలన్ (రెండు చుక్కలు) పొట్టిగీత, ఒంటి ఉల్లేఖనాలు, జంట ఉల్లేఖనాలు, ప్రశ్న చిహ్నం, సంబోధన, రాగ చిహ్నం (ఎక్స్‌లమేటరీ) వంటివి తప్పక పాటించాలి. ఇవి సరిగా పాటించకుంటే అడ్డుకట్టలేని ప్రవాహమే.
చదివేవాళ్లకు విసుగు తెప్పించకుండా అల్పాక్షరాల్లో అనల్ప భావన సారవంతంగా చెప్పాలి. పాఠకుడి మనస్సుపై బరువు పడని అంశాలు రచనలో వుండాలి. భాషా సౌందర్యాన్ని సామాన్యుడి దరిచేర్చేది పత్రిక. అలాంటి పత్రికలు కూడా సిద్ధాంతాల రాద్ధాంతాల చట్రంలో ఇరుక్కొని నలిగిపోవడం గర్హనీయం. ‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్న నానుడి నిజం కావాలంటే భాషపై విషం చిమ్మే ప్రయత్నం మానుకోవాలి. తమ సిద్ధాంతాలకు అనుగుణమైన భాషను ప్రచార ప్రసార మాధ్యమాలకు ఎక్కించి ‘పీఠాలపై కూర్చున్న కుహనా మేధావుల’కు భాష ద్వారా విషప్రచారం చేయడం బాగా తెలుసు. మూలాలను ముంచేసే ఈ పక్రియ ఈ డెబ్బై ఏళ్లలో పత్రికా రంగంలో బాగా కొనసాగింది. దీనికి సమాంతరంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వస్తే వీళ్లు భరించలేక పోతున్నారు. గతంలో వీళ్లు చెప్పిందే వేదంగా ఉండేది. ఇప్పుడు స్వీయ ఆలోచనలతో కొత్త తరం విజృంభిస్తుంటే ఈ కుహనా మేధావులు తట్టుకోలేక అక్కసు వెళ్లగక్కుతున్నారు. ప్రసిద్ధ పాత్రికేయుడైన రాజ్‌దీప్ సర్దేశాయ్ ఎన్నోసార్లు ‘నెట్ హిందువులు’ అంటూ తన ఉక్కబోత వెళ్లగక్కాడు. అక్షరానికి రక్తాన్ని రుద్ది ‘ఎర్రసిరా’ అని నమ్మించవచ్చు, కానీ ‘అక్షరం’ నాశనం లేనిదన్న సత్యం అర్థమైతే అది శాశ్వతమైన భారతీయత అని తెలుసుకొంటారు.*


-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి