భారతదేశం ఎన్నో భాషలకు పుట్టిల్లు. పాణిని ఎప్పటివాడో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ పుట్టిన ‘మహేశ్వర సూత్రాలు’ అన్ని భాషల అక్షరాలకు పొత్తిళ్లు.

కాశ్మీర్‌నుండి కన్యాకుమారి వరకు హఠన్‌నుండి కటక్ వరకున్న 1618 భాషలను, 6400 కులాలను, 29 ప్రధాన పండుగలను, మరెన్నో లెక్కలేనన్ని ఉత్సవాలను, సంప్రదాయాలను ‘ఏకం’చేసి అంతా ‘భారతీయత’నే నిండి ఉందని చెప్పే మహత్తర యజ్ఞానికి వేదికగా నిలవాల్సిన కేంద్ర సాహిత్య అకాడమీలో ఆశ్రీత పక్షపాతం, సిద్ధాంత విద్వేషం, మార్క్సిస్టు మనస్తత్వం రాజ్యమేలుతుంది.

వాళ్లు రాసిందే రాత...! 
వాళ్లు గీసిందే గీత...! 
వాళ్లు ఇచ్చిందే అవార్డు... 
వాళ్లు మెచ్చిందే రివార్డు...!! 

ఇంత పరమాద్భుతంగా సాహిత్య అకాడమీని నడిపిస్తున్న ‘గ్రంథ సాంగుల’ను గురించి చదివితే ఒళ్లు జలదరిస్తుంది...! మరీ ముఖ్యంగా మన ‘తెలుగు వెలుగు’ల జిలుగు పక్షుల గురించి, కవి కోకిలలను గురించి తెలుసుకొని తనివితీరా తరించాల్సిందే...!

సాధారణంగా రాజకీయాల్లో పదవుల కోసం, శత్రుపక్షాల వ్యూహాలను తుత్తినియలుచేసి గద్దెనెక్కే విద్యకోసం కుట్రలు, కుతంత్రాలు, వ్యూహ- ప్రతివ్యూహాలు చూస్తాం! కానీ పేరుమోసిన ‘సాహితీ రంగంలో’ ఇలాంటి జిత్తులమారి ఎత్తులన్నీ ‘కేంద్ర సాహిత్య అకాడమీ’పైన కూర్చొన్న ‘ఎర్రకోయిలలు’ నిస్సిగ్గుగా చేస్తుంటే చేవచచ్చిన పండిత ప్రకండులంతా కళ్లప్పగించి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు!!

ఇది భాషాపచారమా!
సాహిత్య విచారమా!
కవి పుంగవుల కన్నీళ్లా!
పండితుల వృథాప్రలాపమా!!
తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం!

గోపీచంద్ నారంగ్ (2003)
సునీల్ గంగోపాధ్యాయ (2008-2012)
విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ ప్రస్తుతం కొనసాగుతున్నారు.
ఈరోజువరకు సాహిత్య అకాడమీ మహిళలను అధ్యక్షులుగా చేయలేదు. 2003లో గోపీచంద్ నారంగ్‌తో మహాశే్వతాదేవి పోటీపడ్డా గెలవలేదు.

సాహిత్య అకాడమీ సదస్సులు, సమావేశాలు, పరిశోధకులకు, రచయితలకు, కవులకు ప్రోత్సాహాలు ఇస్తుంది. అవి: 

1) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 
2) భాషాసమ్మాన్ పురస్కారం, 
3) అనువాద పురస్కారం, 
4) బాల సాహిత్య పురస్కారం, 
5) యువ పురస్కారం.

ఇండియన్ లిటరేచర్ (ఆంగ్లం), సమకాలీన భారతీయ సాహిత్య (హిందీ)- అనే రెండు ద్విమాస పత్రికలు సాహిత్య అకాడమీ ప్రచురిస్తుంది. ఏటా సాహిత్య అకాడమీ 1,00,000/- బహుమతిగా 24 భాషల నుంచి ఎంపిక చేసిన రచయితలకు అందిస్తుంది. ‘బహుభాషల పుస్తకాల’ సేకరణలో సాహిత్య ఆకాడమీ అతిపెద్ద గ్రంథాలయం నిర్వహిస్తుంది.

అంతర్జాతీయ సెమినార్లు, సంవత్సరోత్సవాలు, వార్షిక ఉపన్యాసాలు, కవి సంగమం కవి సంధ్య.. వంటి ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో కార్యక్రమాలు సాహిత్య అకాడమీ నిర్వహిస్తుంది. ఇంత ప్రసిద్ధమైన చరిత్ర... ఇందరు ప్రఖ్యాతులు నడయాడిన సాహిత్య అకాడమీకి ‘ఎర్ర జబ్బు’ ఎలా పట్టింది...!

మందులేని ‘మార్క్స్ రోగానికి’ అడ్డుకట్ట ఎలా...?

‘భారతదేశం నా వారసత్వ సంపద’- అని ప్రతిజ్ఞ చేసినట్లు సాహిత్య అకాడమీ ‘నా వారసత్వ సంపద’ అని బల్లగుద్దిచెప్పి తనవాళ్లనే జనరల్ కౌన్సిల్, ఎక్సిక్యూటివ్ కౌన్సిల్‌లో నియామకంచేస్తూ వెళ్లిపోవడం వెనుక రహస్యం ఏమిటి?
తాము పీఠంలో ఉన్నప్పుడు తలచుకున్నవారికి అవార్డులు ఇవ్వడం- వీలైతే వాళ్లకే అవార్డులు ఇచ్చి ప్రసిద్ధులను చేసి వివిధ భాషల్లో ఎక్సిక్యూటివ్ కౌన్సిల్‌లో స్థానం కల్పించడం. తర్వాత తమ పుస్తకాలకు అవార్డులు ఇప్పించుకోవడం ‘సాహిత్య వింత’ కాక ఇంకేమిటి!?

ఎందరు కవుల రచనలు వర్షానికి తడిసి, మంటల్లో మండి ధ్వంసం అయ్యాయో వాళ్లకు తెలియదు. ఎందరు కవుల రచనలు మరణం తర్వాత తమ కుటుంబం చేత ఈసడింపబడి లోకానికి తెలియకుండాపోయారో చెప్పలేం. ఎందరు కవులు ఉద్యోగాలు మార్చినప్పుడు, కొత్త ఇళ్లకు మారినప్పుడు తాము రాసుకొన్న రచనలు పోగొట్టుకొన్నారో తెలియదు. ఇలాంటి ఏ రచయిత రచనలను ప్రచురించకుండా ప్రసిద్ధ, పేరుమోసిన వాళ్లపేరుతో విమానాల్లో చక్కర్లుకొడుతూ సాహిత్య పరివ్యాప్తికన్నా విలాసాలకే విలువ ఇస్తూన్న సాహిత్య అకాడమీ ప్రతి ఐదు ఏళ్లలో పెట్టే ఖర్చు తెలిస్తే గుండె పగిలి చస్తాం. అక్షరాల అయిదేళ్ల సాహిత్య అకాడమీ బడ్జెట్ పదివేల కోట్లు!! సిగ్గు! సిగ్గు!

ప్రారంభం.. ఘనం..

భారతీయ భాషల ఏకత్వం కోసం... దేశంలోని అనేక సాహిత్య రీతులను ఏకోన్ముఖంగా నడిపించాలనే సదుద్దేశంతో 1944లో Royal Asiatic Society of Bengal వారు ఫ్రతిపాదించడంవల్ల National Cultural trust ఏర్పడింది. నాటి ఆలోచనతో మూడు సంస్థల ఏర్పాటుకు బీజం పడింది. దృశ్య కళలు (Visual Arts), రంగస్థల కళలు (Performing Arts), సాహిత్యం (Letters) - అనే వాటికి ఫ్రాధాన్యం లభించింది. ఆ తర్వాత 15 డిసెంబర్ 1952లో కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటుచేయాలని నిర్ణయం జరిగింది. ఈ అకాడమీ మొదటి సభకు సభ్యులుగా ప్రసిద్ధ భారతీయ తత్త్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, విద్యావేత్త వౌలానా అబుల్‌కలామ్ ఆజాద్, సి.రాజగోపాలాచారి, కె.యం.్ఫణిక్కర్, కె.యం.మున్షీ, డా.జాకీర్‌హుస్సేన్, ఉమాశంకర్‌జోషి, మహాదేవివర్మ, డివి గుండప్ప, రాంధారీసింగ్ ఉన్నారు. దానికి అధ్యక్షులుగా పండిత జవహర్‌లాల్ నెహ్రూ ఉన్నారు. 1954 మార్చి 12న న్యూఢిల్లీలో ‘సాహిత్య అకాడమీ’ ప్రారంభింపబడింది. ఈ ప్రారంభ వేడుకలు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, వౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ ఉపన్యాసాలతో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగాయి. వారి ఉపన్యాసాల్లో సాహిత్య అకాడమీ ఉద్దేశాలు చెప్పబడ్డాయి. సాహిత్య సృజనాత్మకతను గుర్తించడం, సాహిత్య సమూహాలు ఏర్పాటుచేయడం, సాహిత్యవేత్తలను ప్రోత్సహించడం, సృజనాత్మకత, సాహిత్య విమర్శ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలుగా పెద్దలు చెప్పుకొన్నారు. తనను ప్రధానిగా కాకుండా కవిగా, రచయితగా గుర్తించి సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించినందుకు చాలా గర్వంగా ఉందని స్వయంగా జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు. అయితే విచిత్రంగా చైర్మన్ నియామకం ప్రభుత్వంద్వారా కాకుండా స్వతంత్రం సంస్థద్వారా జరగాలని నాటి పెద్దలు ప్రతిపాదించారు. ఆ తర్వాత మరికొన్ని సలహాలతో Societies Registration Act, 1860 క్రింధ సాహిత్య అకాడమీని పునరుద్ధరించి నెహ్రూని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు.
నెహ్రూ తర్వాత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ (1958), జాకీర్‌హుస్సేన్ (1963), కె.ఆర్.శ్రీనివాస అయ్యంగార్ (1969, 1973). ఉమాశంకర్ జోషి (1978), బీరేంద్రకుమార్ భట్టాచార్య (1983), యు.ఆర్.అనంతమూర్తి (1993), రమాకాంత్థ్ (1998).
*
ఈ కవులు చాలా కాస్ట్‌లీ గురూ...!

జర్మన్‌లో ఓ ప్రసిద్ధమైన కవిని బ్రతికుండగానే గుర్తించిందట. ఆయన విగ్రహాన్ని నగరం నడిబొడ్డున పెట్టాలని నిర్ణయం తీసుకొంది. అందుకుగాను బడ్జెట్‌లో వందల డాలర్లు కేటాయించిందట. ఒకవైపు పనులు వేగంగా జరుగుతుంటే కొందరు పాత్రికేయులు ఈ కవి స్పందన తెలుసుకొందామని వెళ్లారట. తన విగ్రహం కోసం ప్రభుత్వం ఇంత ధనం కేటాయించడం ఆ కవికి ఆశ్చర్యం కలిగించినా ‘తనకు రోజూ 2 డాలర్లు ఇస్తే రోజూ స్వయంగా వచ్చి తానే నిలబడతాన’ని అన్నాడట! ఈ స్పందన ఆ కవి బీదత్వాన్ని, దీనత్వాన్ని తెలియజేస్తుంది. ఈ కథకు భిన్నంగా మన దేశంలో సాహిత్య అకాడమీ పనిచేస్తుంది.

సాహిత్య అకాడమీలోని పీఠాధిపతులు ఫ్లైట్‌లో తప్ప కాలు కదపరు. లేదా ఏసీ రైలు తప్ప ఇంకోటి ఎక్కరు. ఎందుకోసం? దేశంలోని నలుమూలల్లో జరిగే సదస్సులకు, సమ్మేళనాలని వెళ్లడంకోసం చాలా విలువైన విలాసవంతమైన ప్రయాణం చేస్తారు...!

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ముతక బట్టలతో తెలిసినవాళ్ల ఇంటికివెళ్లి స్నానం చేయడానికి సబ్బు అడిగితే వాళ్లు ‘నీ మొహానికి సబ్బు అవసరమా’ అన్నట్టు చూశారట! దానిని కూడా ఆయన తన కవితాధారగా కన్నీటి ధారగా ప్రవహింపజేశారు.

కానీ మన సాహిత్య అకాడమీ ‘సాహిత్య నాయకులు’ దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో ఖరీదైన ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే బసచేస్తారు. ‘వర్కింగ్ లంచ్’ వాళ్లు ముట్టనేముట్టరు. సాదాసీదా భోజనం వీళ్లకు ముద్దదిగదు. షడ్రసోపేతమైన విందు భోజనం వీళ్ల ముందు ఉంటేనే వాళ్ల గౌరవానికి ఏమాత్రం భంగం రాకుండా ఉంటుంది.
ప్రజా సాహిత్యాన్ని పరివ్యాప్తం చేస్తామని చెప్పే ఈ సాహిత్యధీరులు ప్రజలతో సంబంధం లేని ఏసీ గదుల్లో కవిత్వం రాస్తారు. గతంలో హైదరాబాద్ ద్వారకా హోటల్లో తిని త్రాగి రాసే బ్యాచ్ వారసులే అకాడమీలో పీఠం వేసుక్కూర్చున్నారు. ఫైవ్‌స్టార్ కవితా సంస్కృతికి అలవాటుపడ్డ వీళ్లంతా ‘ఏసీ కవిత్వం’ రాస్తారు.

‘‘అయిదు చుక్కల హోటల్లో కూర్చొని
నాలుగు చుక్కలు వేసుకొని
మూడు ముక్కలు తిని ఆస్వాదిస్తూ
ఒక్కముక్క రాస్తాం’’
- అన్నాడు ఓ కవి. నిజమే!*

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

✍✍ డాక్టర్. పి. భాస్కర యోగి 📌
🔴 ఆంధ్రభూమి 🔴 30-04-2018 🔴సోమవారం 🔴

2 కామెంట్‌లు: