విద్యాభ్యాసం ముగించుకొని గర్వంగా ఇంటికి చేరుకొన్న శ్వేతకేతును తండ్రి గడపదగ్గరే అడ్డుకున్నాడు. ‘ఏమి నేర్చుకుంటే నీవు ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదో అది నేర్చుకొని ఇంటికి రా’ అన్నాడు. ఇదే విషయం గురువుకు వెళ్లి చెప్పాడు శ్వేతకేతు. ‘అది బోధించేది కాదు, అనుభవంలోకి తెచ్చేది’ అన్నాడు గురువు. అదే కోరుకున్నాడు శిష్యుడు. అప్పుడా గురువు.. ‘మన ఆశ్రమంలోని నాలుగు వందల పశువులను తీసుకొని వెళ్లి అవి వెయ్యి అయ్యాక తిరిగిరా’ అన్నాడు. సరేనని పశువులతో అరణ్యంలోకి వెళ్లిన శ్వేతకేతుకు కాలక్షేపం కష్టమైంది. తన పాండిత్యాన్ని ప్రదర్శించుదామా అంటే.. అక్కడున్నవి పశువులు, నదులు, సెలయేళ్లు, కొండలు, చెట్లు, చేమలే! శ్వేతకేతుకు ఎంత పాండిత్యం ఉన్నా వాటికి పట్టదు. దీంతో కొద్దిరోజులకే అతడి పాండితీ గర్వం అణగిపోయి, అంతర్ముఖుడయ్యాడు. దీర్ఘ తపస్సులోకి వెళ్లాడు. నాలుగు వందల పశువులు వెయ్యి ఎప్పుడయ్యాయో కూడా అతనికి స్పృహలేదు. ఆ తర్వాత తపస్సు నుంచి బయటపడి తిరుగుప్రయాణమయ్యాడు. ఆశ్రమం ముందుకు వచ్చాక గురువు అతడి ముఖంలోని తేజస్సు, అంతర్ముఖ చిత్తాన్ని గమనించి సంతృప్తి చెందాడు. మనం కూడా శ్వేతకేతులాగానే ప్రతిక్షణం అనేక అహంకారాలను ప్రదర్శించాలని చూస్తుంటాం. కులం, ధనం, పదవి, రూపం, తెలివి... ఇలా ఎన్నెన్నో రూపాల్లో మన గర్వాన్ని ప్రదర్శిస్తాం. కానీ వాటన్నిటికీ హద్దులున్నాయి. మనకు ఒక భాషలో గొప్ప పాండిత్యం ఉండొచ్చు. కానీ, ఆభాష తెలియని ప్రాంతంలో మన పాండిత్యం కొరగానిది. మన దగ్గర బాగా ధనం ఉన్నప్పుడు అహంకరిస్తాం. అది పోయాక మన అహంకారం ఎవరిపై ప్రదర్శించగలం? కాబట్టి అశాశ్వతమైన విషయాలను గొప్పగా ఊహించుకొని, శాంతి లేకుండా జీవించడం కన్నా ఏది సత్యమో తెలుసుకొని అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఈ అహంకారాల ప్రదర్శనకు నెలవైన మనస్సు దేవుని సృష్టిలో ఓ అద్భుతం. ఇంత అత్యద్భుతమైన మనసులాంటి పదార్థాన్ని ఏ శాస్త్రవేత్తా సృష్టించలేకపోయాడు. దీనిలో సూక్ష్మంగా ఉండే గెంతులను, ఊహలను గమనించే సాక్షీభూతుడిగా జీవుడు తయారయినపుడే మనలోని వృత్తులు అణగిపోతాయి. ఈ వృత్తులను నిరోధించి అంతర్ముఖులు కావడానికే ఇన్నిరకాల సాధనలు. ఈ సాధనా మార్గాలను అనుసరించే క్రమంలో అడుగడుగునా అడ్డుపడేది గర్వం. దానిని ధ్వంసం చేసి శాశ్వతత్వం వైపు వెళ్లడమే యోగం.

*************************************************
      డాక్టర్‌ పి. భాస్కర యోగి
      ॐ ఆంధ్రజ్యోతి : నవ్య : నివేదన ॐ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి