అంబేడ్కర్‌ను ముందుబెట్టి ఇటీవలి కాలంలో విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొందరు
మేధావులు రాజకీయం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు
ఊరేగింపు నిర్వహించే దేశద్రోహులు అంబేద్కర్‌ని వాడుకుంటున్నారు. బాబాసాహెబ్‌ను ఈ దేశ మెజారిటీ ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను, సామాజిక ఉత్పత్తిని, ఆర్థిక ప్రగతిని వెనుకబడిన దళిత జాతులు వేల యేళ్ల నుండి కాపాడుకుంటున్నాయి. ఆ స్రవంతి నుండి దూరం చేయడానికి కుల ఘర్షణలు సృష్టిస్తున్న
వామపక్ష శక్తులు తమ పార్టీల్లో దళితులకు ఇచ్చిన స్థానం ఏమిటో గణాంకాలతో చెప్పవచ్చు. వామపక్షాల్లో తప్ప మిగతా అన్ని పార్టీల్లో దళిత, బీసీ వర్గాలకు అంతో ఇంతో అగ్రస్థానం దక్కింది.
ధిక శాతం ప్రజలను నిర్లక్ష్యం చేయడం అత్యంత పెద్దదైన జాతీయ నేరం. మన నాగరికత శిథిలం కావడానికి ఇదొక కారణం. కోట్లాది మన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు ఆకలి, అజ్ఞానం అనుభవిస్తూ ఉంటే, వారి శ్రమ ద్వారా విద్య, ఐశ్వర్యం పొంది వారిని పట్టించుకోని ప్రతి వ్యక్తీ ద్రోహి అని భావిస్తాను. ఇరవై కోట్ల భారతీయుల చెమట, శ్రమ ద్వారా ఐశ్వర్యం ప్రోగుచేసుకుంటూ ఖరీదైన దుస్తులతో , విలాసాలలో మునిగితేలే వ్యక్తులు నైతికంగా పతనం చెందారని భావిస్తాను’- అని స్వామి వివేకానంద నూరేళ్ల క్రితం చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ రోజు దేశంలో జరుగుతున్న విచిత్రం చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. కులాన్ని రాజకీయ అవసరంగా వాడుకొంటున్న మన భ్రష్టత్వం ఇంకా ఎంతదూరం పోతుందో తెలియదు.
‘దడి కట్టుకొని ఉండడం కుల వ్యవస్థకు ప్రధాన కారణం.. అది ఒక మానసిక స్వభావం’- అన్నాడు ఒక మేధావి. సమాజంలో వ్యవస్ధ నడవడానికి కులం సాంఘికాచారంగా వచ్చింది. అది ఇవాళ అన్నింటి నెత్తిపైన ఎక్కి కూర్చుంది. సమన్వయం కలిగించాల్సిన కులం సంఘర్షణగా ఎందుకు మారుతోంది? ఒకరినొకరు కలహించే స్థితి ఎందుకు వచ్చింది? అని ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి? ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్లు ఆనాడు సమాజంలోని అన్ని వర్గాలూ ఆమోదించినవే. ఈ రోజు దానిపై వివాదాలు సృష్టించడం, మరిన్ని కులాలకు రిజర్వేషన్లు, మత హోదాలు కల్పించాలని కోరడం- అగ్నికి ఆజ్యం పోయడమే.
కొన్ని కులసంఘాలు తమ కులంలోని విద్యార్థులను చదివించడానికి స్కాలర్ షిప్పులు, హాస్టల్ వసతి, ఇతరత్రా సహాయాలు చేస్తున్నాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని కులాల వాళ్లు ఇలా చేస్తే మంచిదే. కానీ కులాలను ఓటు బ్యాంకుగా మార్చి, గంపగుత్తగా రాజకీయ పార్టీలకు అప్పజెప్పడమే ఈ సంఘర్షణలకు ప్రధాన కారణం.
కుల అహంకారం, కుల అంతరం, కులతత్వం పాటించడం నేడు వేగంగా ఎదుగుతున్న భారత సమాజానికి గొడ్డలిపెట్టు. ‘కుల నిర్మూలన’ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే కులం ఈ రోజు అనేక కొత్త రూపాల్లో అవతారం ఎత్తింది. కానీ కులాల మధ్య సమన్వయం సాధించడం పెద్ద సమస్య కాదు. దానికి అర్థవంతమైన చర్చలు జరుపుకొని, అందరినీ ఒకే తాటిపైకి తేవాలి. రాజకీయ నాయకులు వేసే ఓటు బ్యాంకు మంటల్లో కులాలు చలికాచుకోవడం మొదలుపెడితే మిగిలేది బూడిదే.
‘కులతత్వంపై పోరాటం’ ఈ రోజు కొత్తగా జరుగుతున్నది కాదు. ఎప్పుడు కులం పుట్టిందో ఆనాటి నుండే దాని వికృతులను పారద్రోలే ప్రయత్నం మొదలైంది. చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడినాక కూడా పుట్టుకతో ముద్ర వేసుకొనే కులతత్వం మొదట్లో లేదు. ఈ రోజుల్లో ఎవరైనా రాజకీయ నాయకుడు ఏదైనా నియోజకవర్గంలో ఒకసారి ఎన్నికైతే- ఇక ఆ నియోజకవర్గం తమ కుటుంబానిదే అని భావించడం ఎలా మొదలుపెట్టారో, పుట్టుకతో ‘కులం’ మా స్వంతం అనే స్థితి మెల్లగా ప్రారంభమైంది. వర్ణాల మధ్య మార్పులు కూడా మొదట్లో జరిగాయి. ఛాందగ్యోపనిషత్ (4-4-2) ఆధారంగా సత్య కామ జాబాలి కథను మనం చూడవచ్చు. ఋషబుని 81 మంది కుమారులు తండ్రి ఆజ్ఞతో బ్రాహ్మణులుగా మారిన వైనం పరిశీలించవచ్చు. అలాగే వైవశ్వత మనువు దృష్టురాజు పుత్రులు కూడా మార్పు చెందారు. ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే.
వాల్మీకి మహర్షి రామాయణకర్త. ఆయన ఏ కులంలో పుట్టి రామాయణ రచన చేసాడో ఈనాటి మేధావులు గుర్తించరు! వ్యాస మహర్షి మత్స్యగంధి కడుపులో పుట్టి వేద విభజన చేసి, భారత, భాగవతాలు ఈ జాతికి అందించలేదా? హిందువులు పరమ పవిత్రంగా భావించే భగవద్గీతను రాసింది వ్యాసుడైతే, యాదవ క్షత్రియుడైన శ్రీకృష్ణుడు ‘గీత’ను బోధించలేదా? గీతను ప్రబోధించింది కూడా క్షత్రియుడైన అర్జునుడికే కదా!మహాభారత వీరుల్లో కర్ణుడికి ప్రత్యేక స్థానం ఉంది. కటికె కులస్థుడైన ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడైన కౌశికుడికి ఉపదేశం చేస్తాడు. దాసీ గర్భంలో జన్మించిన విదురుడు భారత కథలో తలమానికమైన మేధావి.
‘‘తత్వవేత్తలైన మహాత్ములు కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా శీలం మాత్రమే ప్రధానంగా గ్రహించాలి’’ అని మహాభారతంలోని (3-180-20,21) యక్ష ప్రశ్నల ద్వారా వ్యాసుడు ఈ సమాజానికి సందేశం అందించాడు. వజ్ర సూచికోపనిషత్తు కులం రహస్యాన్ని బయటపెట్టి మార్గనిర్దేశనం చేసింది.  శూద్రులకు వేదాధికారం ఉందని, వేద సూక్తాల్లోని కొన్నింటిని శూద్రులే సృష్టించారని డా బాబా సాహెబ్ అంబేద్కర్ నిరూపించారు. ఛాందగ్యోపనిషత్తులో కన్పించే జనశ్రుతి శూద్రుడని, అలాగే ఋగ్వేదం పదవ భాగంలోని అనేక సూక్తాలను సృష్టించిన కవశఐలుశ అనే ఋషి శూద్రుడని అంబేద్కర్ తన పరిశోధనలో నిరూపించాడు. దేవతల్లోని గొప్పవాళ్లని దేవర్షులుగా, బ్రాహ్మణుల్లోని తపోధనులను బ్రహ్మర్షులుగా, క్షత్రియుల్లోని సాధకులను రాజర్షులుగా, మిగతా వర్గాల్లోని ఆధ్యాత్మికవేత్తలను మహర్షులుగా పిలుస్తారు. మన పురాణాల్లో మహర్షులే ఎక్కువమంది అని చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇవాళ వైష్ణవ దేవాలయాలకు వెళ్తే ఆళ్వారు సన్నిధి పేరుతో పనె్నండు మంది ఆళ్వారుల విగ్రహాలు కన్పిస్తాయి. అందులో శ్రీరంగంలో గొప్ప మార్పు తెచ్చిన తిరుప్పాణి ఆళ్వారు దళితుడు, నమ్మాళ్వారు శూద్రుడు. ఇదంతా పురాణకాలంలో జరిగింది. దీని అడుగుజాడల్లో అనేకమంది సంస్కర్తలు వచ్చారు. ఆ తర్వాత గౌతమబుద్ధుడు, మహావీరుడు ఒక ఉద్యమ రూపంగా కుల సంస్కరణ చేపట్టారు. కులం గురించి ఒక నిర్దిష్టమైన వేదికను బుద్ధుడు సృష్టించాడు. అది ఖండాంతరాలకు వ్యాప్తి చెందింది. బుద్ధుడు మరణించాక బౌద్ధం కూడా వెర్రితలలు వేసింది. ఆదిశంకరులు వచ్చి సనాతన భారతీయ ఆత్మను పునరుజ్జీవింపచేశాడు. అందరిలో ఆత్మను దర్శించే అద్వైత భావనను ఈ జాతికి అందించాడు. కొన్నాళ్లకు శ్రీమద్రామానుజులు, మహాత్మ బసవేశ్వరుడు దక్షిణ భారతదేశంలో కులం యొక్క కూసాలను కదిలించారు. తమ జీవితకాలంలోనే సంస్కరణల ఫలితాలు చవిచూసారు.
ఈలోపు దేశంలో విదేశీ దండయాత్రలు జరిగి ముస్లింల ఆధిపత్యం పెరిగి, నిమ్నకులాలను భయపెట్టి మత మార్పిడి చేయడం మొదలుపెట్టారు. దాంతో ఎక్కడికక్కడ సనాతన ధర్మణకు భక్తి ఉద్యమం మొదలయింది. నందనార్ లాంటి దళిత భక్తులను ఆదర్శంగా తీసుకొని అన్ని కులాలనుండి భక్తి ఉద్యమకారులు పుట్టుకొచ్చారు. నామ్‌దేవ్, చొక్కమేళ, తుకారాం, మీరా, గోరకుంభార్, సక్కుబాయి, బ్రాహ్మనాయుడు, కబీర్, నానక్, రామానంద్, సంత్ జ్ఞానేశ్వర్, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, సంత్ రయిదాసు, అన్నమాచార్య, కృష్ణమాచార్యులు, కనకదాసు, ఘసిదాస్, నర్సీమెహతా, నారాయణస్వామి వంటి మహనీయులెందరో సంఘర్షణ లేకుండా కులతత్వాన్ని సమాజం నుండి వదిలించారు. ఈ సంస్కర్తల్లో అన్ని కులాలవారూ ఉన్నారు.
ఆ తర్వాత నారాయణ గురు, రామకృష్ణ పరమహంస, మలయాళస్వామి, దయానంద సరస్వతి, వివేకానంద, శ్రద్ధానంద, సయాజీరావు గైక్వాడ్, మహాత్మ పూలే, గాంధీజీ, డా అంబేడ్కర్, కేశవరావ్ వంటి మహనీయులు సంస్కర్తల అడుగుజాడల్లో నడిచి, ఇప్పుడున్న సమాజాన్ని సాధించారు. పూలే, అంబేడ్కర్ కులతత్వాన్ని వేర్లతో పీకే ప్రయత్నం చేశారు. కానీ కొందరు అంబేద్కర్‌ను అధ్యయనం చేయకుండానే గుడ్డిగా వ్యతిరేకిస్తే, మరికొందరు ‘అంబేద్కర్ మాకే పరిమితం’ అని సంకుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆధునిక భారత్‌కు దిక్సూచి లాంటి అంబేద్కర్‌ను ఇపుడు ‘అందరివాడు’గా చేయడమే మన తక్షణ కర్తవ్యం.
అసమాన దేశభక్తిని ప్రదర్శించిన అంబేడ్కర్‌ను ముందుబెట్టి ఇటీవలి కాలంలో విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొందరు మేధావులు రాజకీయం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు ఊరేగింపు నిర్వహించే దేశద్రోహులు అంబేద్కర్‌ని వాడుకుంటున్నారు. బాబాసాహెబ్‌ను ఈ దేశ మెజారిటీ ప్రజలకు దూరం చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను, సామాజిక ఉత్పత్తిని, ఆర్థిక ప్రగతిని వెనుకబడిన దళిత జాతులు వేల యేళ్ల నుండి కాపాడుకుంటున్నాయి. ఆ స్రవంతి నుండి దూరం చేయడానికి కుల ఘర్షణలు సృష్టిస్తున్న వామపక్ష శక్తులు తమ పార్టీల్లో దళితులకు ఇచ్చిన స్థానం ఏమిటో గణాంకాలతో చెప్పవచ్చు. వామపక్షాల్లో తప్ప మిగతా అన్ని పార్టీల్లో దళిత, బీసీ వర్గాలకు అంతో ఇంతో అగ్రస్థానం దక్కింది. నంబూద్రిపాద్ నుండి సీతారాం ఏచూరి వరకు ఏ కులం వాళ్లు వామపక్షాలను జాతీయ స్థాయిలో నడిపిస్తున్నారు? పుచ్చలపల్లి సుందరయ్య నుండి బి.వి.రాఘవులు వరకు తెలుగు ప్రాంత వామపక్ష నాయకులు ఏ కులం వాళ్ళు? అయితే, కొందరు కుహనా లౌకికవాదులు, వామపక్ష మేధావులు, మానవహక్కుల ఉద్యమకారులు కులం గురించి మీడియాలో గొప్పగా మాట్లాడుతారు. ఇది వింత కాక మరేమిటి?
దళిత నేతలను అవమానించిన వారు, నిమ్మవర్గాలకు పదవులు దక్కకుండా చేసిన వారు ‘దళితుల ఆత్మగౌరవం’ అంటూ ఉపన్యాసాలిస్తుంటారు. సామాజిక శ్రేయస్సు కోసం కులాన్ని ఉపయోగించుకోవాలి కానీ సంఘర్షణ కోసం వాడుకోవడం ఆత్మహత్య సదృశం. ఇన్నాళ్లూ అంటరానితనం, అస్పృశ్యతలకు కారణమైన ‘కులం’ ఈ రోజు సంఘర్షణలకు కేంద్ర బిందువు కావడం ఎంత ప్రమాదమో విజ్ఞులు ఆలోచించాలి. హెచ్చుతగ్గుల మానసిక వికృతులను సమాజంపై రుద్దే వ్యక్తుల పట్ల మనం జాగరూకులమై ఉండాలి.


****************************************************

-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125
Published Andhrabhoomi :
                     Friday,  April 13, 2018కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి