సమతాస్ఫూర్తి 

వైష్ణవ సిద్ధాంతాన్ని ఒడిసిపట్టిన శాస్త్రపారంగతుడు... విశిష్టాద్వైత వైభవాన్ని విశ్వమంతా చాటిన ఆచార్యుడు... సనాతన ధర్మంలో సమానత్వాన్ని చాటిన మేరునగధీరుడు వేదాంతదీపంగా వెలుగొందిన శ్రీ రామానుజాచార్యుడు!
శ్రీమద్రామానుజులు క్రీస్తుశకం 1017లో భూమి పిరట్టియార్‌, ఆసూరికేశవ పెరుమాళ్‌ దంపతులకు తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జన్మించారు. త్రిమతాచార్యులలో ద్వితీయుడైనా అద్వితీయమైన పాండిత్యంతో ఆయన భాష్యాలు రచించారు. రామానుజులు ప్రాథమిక విద్యను తండ్రి దగ్గరే నేర్చుకున్నారు. మొదట యాదవ ప్రకాశులనే గురువు వద్ద వేదాంతాన్ని అభ్యసించారు. ఒక వ్యాఖ్యానం విషయంలో గురుశిష్యుల మధ్య భేదాభిప్రాయాలు కలగడంతో, ఆఖరుకు గురువే శిష్యుణ్ణి చంపాలనుకొనేవరకూ పరిస్థితులు వస్తాయి. ఆ కుట్రను రామానుజుడు తెలుసుకున్నారు. దాని నుంచి తప్పించుకొని కంచికి చేరుకున్నారు. ఆ తరువాత తల్లి కోరిక మేరకు వివాహం చేసుకున్నారు.

ముడుచుకున్న వేళ్ళు తెరుచుకున్నాయి!

ఆ కాలంలో శ్రీరంగం వైష్ణవ విద్యలకు నిలయంగా ఉండేది. అక్కడ ఆళవందారు స్వామి వైష్ణవ గురువు. శ్రీరామానుజుణ్ణి తన దగ్గరకు రమ్మని పెరియనంబి ద్వారా ఆళవందారుస్వామి వర్తమానం పంపారు. రామానుజులు శ్రీరంగం వెళ్ళేసరికి, అప్పటికి కొన్ని గంటల ముందే, గురువుగారు దేహత్యాగం చేశారు. కానీ ఆయన మూడు వేళ్లు ముడుచుకొని ఉన్నాయి. ‘‘గురువుగారికి మూడు కోరికలుండేవి. బ్రహ్మసూత్రాలకూ, విష్ణు సహస్ర నామాలకూ, తిరువాయిమొళికి సరళార్థ ప్రబోధకంగా వ్యాఖ్యానం రాయాలని ఆయనకు ఉండేది. కానీ అది నెరవేరకపోవడం వల్ల వారు దానికి సంకేతంగా అలా వేళ్లు ముడుచుకున్నా’’రని వారు చెప్పారు. ‘‘ఆ కార్యం నేను నెరవేరుస్తాను!’’ అని రామానుజులు ప్రతిజ్ఞ చేయగానే వేళ్లు తెరుచుకున్నాయి.

అందరికీ మంత్రోపదేశం!

రామానుజుడి భార్య కాస్త కటువైన మనిషి కావడం వల్ల ఆయన సంసారం వదిలి సన్యాసం స్వీకరించారు. తరువాత వైష్ణవాగమాలనూ, శాస్త్రాలనూ క్షుణ్ణంగా చదువుకొని తిరుక్కోటియార్నంబి శిష్యుడై మంత్రోపదేశం పొందారు. ఆయనను ‘గోష్ఠిపూర్ణులు’ అని కూడా పిలుస్తారు. ఆ మంత్రం రహస్యమనీ, అది ఎవరికీ చెప్పవద్దనీ గురువు ఆదేశం. కానీ రామానుజులు ‘‘రహస్యమైన మంత్రాన్ని ఇతరులకు చెప్పి నేను నరకానికి వెళ్ళినా సరే, ఇతరులు మోక్షానికి వెళితే చాలు!’’ అని తిరుకోష్టియారు గుడి పైభాగానికి ఎక్కి అందరికీ మంత్రోపదేశం చేశారు. గురువు మొదట ఆక్షేపించినా రామానుజుని విశాల మనస్తత్వానికీ, సామాజిక సమరసతకూ ముచ్చటపడి ఆశీర్వదించారు.

అవి రెండూ ఒక్కటే!

ప్రస్థానత్రయంలోని న్యాయప్రస్థానమైన ‘బ్రహ్మసూత్రాలు’, శ్రుతి ప్రస్థానమైన ‘ఉపనిషత్తులు’, స్మృతిప్రస్థానమైన ‘భగవద్గీత’లపై శ్రీరామానుజులు విశేష కృషిచేసి భాష్యాలు అందించారు. కేవలం బ్రహ్మసూత్రాలకు వివరణాత్మకంగా మూడు గ్రంథాలను అధికారి భేదాన్ని దృష్టిలో ఉంచుకొని రచించారు. వీటిని ‘వేదాంత దీపము’, ‘వేదాన్త సారము’, ‘శ్రీభాష్యము’ అని పిలుస్తారు. ఇవేగాక ‘దినచర్య’, ‘శరణాగతగద్య’ తదితర తొమ్మిది గొప్ప గ్రంథాలను రామానుజులు అందించారు. విశిష్టాద్వైత దర్శనాన్ని ఆయా గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఈ దర్శనానికే ‘రామానుజ దర్శన’మని పేరు.
భేదం అంటే ద్వైతం, అభేదం అంటే అద్వైతం. ఈ రెండూ ఉపనిషత్‌ ప్రతిపాదనలు. వాటిని శాస్త్రప్రమాణంగా సమన్వయపరచినవే ఉపనిషత్తులు. వీటిని సమన్వయపరచడమే విశిష్టాద్వైతం. స్థూల, జీవ, జడ విశిష్టమైన బ్రహ్మము కార్యం. ఈ రెండూ వేరూ కానేరవు. ఇది అవస్థాభేదం మాత్రమే. అందువల్ల ‘విశిష్టమ్‌’ కారణ దశలో, కార్యదశలో ఒక్కటే కాబట్టి ‘విశిష్టము అద్వైతమే’ అని రామానుజులు తన సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.

సామాన్యుల ముంగిటికి వైష్ణవం

చోళరాజైన కుళోత్తుంగుడు పచ్చి శైవుడు. అతని ఆధీనంలోకి శ్రీరంగం వచ్చింది. ఆ సమయంలో కొన్నాళ్ళు రామానుజులు ప్రవాసంలో ఉన్నారు. అక్కడి రాజైన బిత్తిదేవుని వైష్ణవుడిగా మర్చారు. అక్కడి జైన పండితులను ఓడించారు. మేల్కొటే గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి గొప్ప సామాజిక సమరసతను సాధించారు. వైష్ణవ మతాన్ని సామాన్యుల వద్దకు కూడా తీసుకుపోవడానికి పీఠాలు ఏర్పాటు చేశారు.

************************************************************************************
డాక్టర్ పి. భాస్కర యోగి 
ఆంధ్రజ్యోతి నవ్య 
20-04-2018  శుక్రవారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి