రాజకీయాల్లో అపరిపక్వ నిర్ణయాలు, ఆకస్మిక సంస్కరణలు, హద్దులు మీరిన క్రమశిక్షణ అప్పుడపుడు ప్రమాదకారిగా మారుతాయి. భారతదేశంలో నెహ్రు, ఇందిర తర్వాత తొంబయ్యవ దశకంలో అటల్ బిహారీ వాజ్‌పేయి బలమైన నాయకుడు. ఓ రకంగా చెప్పాలంటే మొదటి కాంగ్రెసేతర సర్వజనామోద నాయకుడు. ఆ రోజుల్లో ఆయన చుట్టూ అత్యంత క్రమశిక్షణ గల, బలమైన యుద్ధ నియమాలు పాటించే వాళ్ళవంటి వ్యక్తులు ఉండేవారు. అందుకే 1996లో భారతీయ జనతాపార్టీ మెజారిటీ ఉన్న ఏకైక పార్టీగా అవతరించినా అధికారం ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పోయింది. జయలలిత మద్దతు ఉపసంహరించుకోగా ఒక్క ఓటుతో అధికారం కూలద్రోసుకున్నారు. తర్వాత ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీయే ప్రభుత్వం 1998 నుండి 2004 వరకు కొనసాగింది.
మధ్యలో వచ్చిన సంక్షోభం అందరికీ తెలిసిందే. 2004 తర్వాత వాజ్‌పేయ్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయింది. దీని వెనుక పెద్ద కథా కమామిషు నడిచింది. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్న చంద్రబాబు సుదీర్ఘకాలం ఆ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాడు. అంతకు ముందే ఈయన త్రిప్పిన చక్రాలతో చంద్రశేఖర్, గుజ్రాల్, వీపిసింగ్ వంటి తోలు బొమ్మ ప్రధానులు గద్దెనెక్కారు. వీళ్ళు దేశ రాజకీయాల్లో ఎలాంటి ముద్రను ప్రత్యేకంగా వేయలేకపోయారు. కానీ ఈ గద్దెనెక్కించిన ఘనత నాదేనని చంద్రబాబు జబ్బ చరచి చెప్తుంటారు. దానివల్ల చంద్రబాబుకు ధర్మరాజులాంటి వాజ్‌పేయి అత్యంత గౌరవాదరాలను ఇచ్చేవారు. అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెదేపాకు ఎక్కువ మంది ఎంపీలు ఉన్నందువల్ల చంద్రబాబు చెప్పిందే వేదం.
భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి జియంసి బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారిని స్పీకర్లుగా, కేంద్రమంత్రులుగా చేసి తెదేపా బాగానే లబ్ది పొందింది. అయితే 2003 అక్టోబర్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా తిరుమల ఘాట్‌రోడ్డులో వెళ్తుంటే పీపుల్స్‌వార్ నక్సలైట్‌లు ఆయనపై దాడి చేసారని పోలీసువర్గాలు తెలిపాయి. అప్పటికే ఎన్నో ఏళ్ళ నుండి పాత తరం నాయకులతో కునారిల్లిపోయిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి తవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలిపిరి ఘటనతో చంద్రబాబు సానుభూతి పొందేందుకు ముందస్తు ఎన్నికలకు వ్యూహం రచించాడు. తానొక్కడే మునిగితే బాగుండదని కేంద్రంలోని భాజపాను కూడా ఈ ముగ్గులోకి దింపాలనుకున్నాడు. ఇప్పుడో కీలక పదవిలో ఉన్న, ఆనాటి భాజపా ప్రముఖనాయకుడి పలుకుబడిని ఉపయోగించి భాజపాను ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేసాడు.
సత్వ పురుషులైన వాజ్‌పేయి, అద్వాణీలు ఈ మాటలు నమ్మి‘భారత్’ వెలుగులీనుతోంది’ అంటూ వ్యవస్థలు సరిచేసుకోకుండా ఎన్నికలకు వెళ్ళారు. దాంతో పదేళ్ళు భారతీయ జనతాపార్టీ అధికారానికి దూరం అయ్యింది. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలోని కుంభకోణాలు, సోనియాగాంధీ నియంతృత్వం, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, దేశం మార్పు కోరుకోవడం, దేశంలో జాతీయభావన పునరుజ్జీవం వంటి అంశాలతో పాటు మోదీ వ్యక్తిగత జీవితంలోని నైతికత, గుజరాత్‌లో దృఢమైన పాలనాపరమైన నిర్ణయాలు 2014లో భాజాపాకు అధికారం కట్టబెట్టాయి. కానీ నెలలు నిండక ముందే శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీసినట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని మోదీ భావిస్తున్నారా? మొదటిసారి అధికారంలోకి వచ్చాక భాజపా సిద్ధాంతపరమైన రిపేర్లు చేయకుండానే పాలనాపరమైన సంస్కరణలకు తెర తీసింది.
దీనివల్ల భాజపాకు జరిగే నష్టాన్ని అంచనా వేసారా అని జాతీయవాద మేధావుల బుర్రలను తొలుస్తున్న ప్రశ్న! 2014 లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. బీహార్‌లో విజయం సాధించినా అధికారానికి కొన్నాళ్ళు దూరం ఉన్నా తర్వాత నితీశ్‌తో కలిసి సాధించారు. మిగితా రాష్ట్రాల్లోని పంజాబ్‌లో అధికారం భాజపా మిత్రపక్షం అకాలీదళ్ నుండి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక దాదాపు అన్ని ఎన్నికల్లో భాజపాదే పై చేయి. ఇదంతా మోడీ, అమిత్ షాల అశ్వమేధయాగంలో కన్పిస్తుంది సరే! రాజకీయంగా ఇంతవరకు ఇది అద్భుతమైన ప్రగతే!
కానీ ఇందిర తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఆవిర్భవించిన నరేంద్రమోడీ మచ్చలేని నాయకుడే. కానీ ఇప్పుడున్న గందరగోళం మధ్య ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం మరోసారి చేతిని కాల్చుకోవడమే.
ఇంత పెద్ద దేశంలో రోజు ఏదో ఒకచోట ఎన్నికలు జరగడం రాజకీయాలు ఎక్కువై పాలనపై ప్రభావం పడుతుంది. జమిలి ఎన్నికలు గొప్ప సంస్కరణ అయినా ఇప్పుడు దేశం స్వీకరిస్తుందా? మొదటి దఫా అధికారంలోకి రాగానే నోట్లరద్దు పెద్ద ఆర్థిక సంస్కరణే. కానీ గత రెండేళ్ళ నుండి బ్యాంకులన్నీ సామాన్యుడి అవసరాలను తీర్చడం లేదని అపప్రథ వచ్చింది. బ్యాంకుల నుండి 50 వేలు తీసుకోవాలన్న పాన్‌కార్డులు, నిఘాలు ఎక్కువైతే జనాలు బ్యాంకులలో డబ్బు ఎలా జమ చేస్తారు. బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే విధంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంటే దానిని సరిచేయకుండా ఎన్నికలకు వెళ్ళడం ఎలాంటి ముందడుగు? అలాగే జీయస్టీ అనేది స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద ఆర్థిక సంస్కరణ. దానివల్ల కేంద్రప్రభుత్వ ఆదాయం పెరిగి ఉండవచ్చు.
మన జీడిపి వృద్ధిరేటు గణనీయంగా ఉండవచ్చు. కానీ చిన్న తరహా పరిశ్రమలు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నాయన్న చిన్న విషయం అరుణ్‌జైట్లీ లాంటి వారు ఎందుకు అలోచించరు? నల్లధనం విషయంలో ప్రభుత్వం ప్రజలకు కొన్ని వివరాలు తెలియజేయాల్సి ఉంది. నల్లధనం వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ, దాని తర్వాత జరిగిన ఒప్పందాలు, లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ, విజయ్‌మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్ళు ఎవరిపాలనలో రుణాలు పొంది స్టాక్ ఎక్సేంజ్ సూచికల్లా దూసుకుపోయారో ప్రజల ముందు పెట్టాలి. దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు, సూడోసెక్యులర్ గ్యాంగ్, కుహనా మేధావుల దుష్ప్రచారంపై సమగ్రకార్యాచరణ చేపట్టాలి. భాజపాలో వివిధ రాష్ట్రాల్లో శాసన సభ్యులుగా ఉన్న 300 పై చిలుకు దళిత సభ్యులతో ప్రతిపక్షాలకు సమాధానం ఇప్పించాలి.
అలాగే తారేఖ్‌ఫతే లాంటి ముస్లిం మేధావులకు సరైన రక్షణ కల్పించి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్‌ల దుష్ప్రచారాన్ని అరికట్టాలి. పాకిస్తాన్‌కు చెందిన ఫతే ప్రస్తుతం కెనడాలో పౌరసత్వం పొంది ఐసిస్‌ను, జిహాద్‌ను మేధాస్థాయిలో గొప్పగా ఎదుర్కొంటున్నాడు. 2014 తర్వాత రెండు, మూడేళ్ళు మన దేశంలో ఉండి ఇక్కడి మతతత్వ ఎజెండాను బహిర్గతం చేశాడు. ఈ రోజు త్రిపుల్ తలాఖ్ అంశం ముస్లిం మహిళల్లో క్రొత్త ఆలోచన రేపింది అతని వల్లనే, ఇక్కడెవరూ అతడిని పట్టించుకోకపోతే తిరిగి కెనడాకు వెళ్ళి పోయాడు. తారేఖ్‌ఫతే లాంటి ఇస్లామిక్ స్కాలర్‌ను ఇక్కడి మతతత్వ శక్తులు బెదిరిస్తే కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం.
దళితుల సమస్యలు వస్తే భాజపాలో 50కి పైగా ఉన్న దళిత ఎంపీలతో మాట్లాడించకుంటే ఎలా? అలాగే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న రాంవిలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే వంటివారు నోరు తెరవకపోతే ఎలా? పెట్రోల్ ధరల విషయంలో సామాన్యుడి ఆవేదనను పట్టించుకోకుండా ఖజానా నింపి ఎవరికిస్తారు? రాహుల్ గాంధీకి ఖజానా నింపి ఇచ్చి వెళ్తే ఉపాధి పథకంలాంటిది పెట్టి మరో పదేళ్ళు అధికారం అనుభవిస్తాడు. ఇక ఎన్డీయే నుండి విడిపోయిన ఏకైక పెద్ద పార్టీ తెలుగుదేశం. ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు చంద్రబాబు రోజూ నరేంద్రమోడీపై విషం గక్కుతున్నాడు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా కాకముందు వరకు ఈ ప్రత్యేక హోదాపై నెట్టుకుంటూ వచ్చింది. ఈ నాలుగేళ్ళుగా చంద్రబాబుకు కేంద్రం ఎంత మేలు చేసినా భాజపాను దోషిగానే చూస్తూ వచ్చారు.
కానీ వెంకయ్యనాయుడు చరిష్మా ముందు భాజపా అవేమీ పట్టించుకోలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో భాజపా తోక పార్టీగా మారింది. వెంకయ్య ఉపరాష్ట్రపతి కాగానే చంద్రబాబును కేంద్రం లెక్కపెట్టలేదు. దాంతో చంద్రబాబు ఒంటికాలిపై కేంద్రంపై యుద్ధం అంటున్నాడు. దానికి తోడు పచ్చమీడియా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పక్షపాతంతో మోడీని విలన్‌ను చేసేశారు. ఏదో పెద్ద ఆకస్మిక పరిణామం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో భాజపా నిలదొక్కుకునే స్థితిలో లేదు. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలు భాజపాకు ఎలా మేలు చేస్తాయి? చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఇప్పటికే సుదీర్ఘ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అక్కడ భాజపాకు ఎదురుగాలి వీస్తే పశ్చిమబెంగాల్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ లోటును పూడ్చే స్థితిలో ఉన్నాయా! అలాగే ఈ రోజుకూ అన్ని కళాసాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కమ్యూనిష్టులదే పై చేయిగా ఉంది.
మోడీ అధికారంలోకి వచ్చాక తుకుడే తుకుడే గ్యాంగ్ నాయకులు అవార్డులు పొందుతున్నారు. అందలం ఎక్కుతున్నారు!? అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రచార ప్రసార మాధ్యమాలు అన్నీ ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిష్టుల చేతుల్లో ఉన్నాయి. రోశయ్యలాంటి కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిని అన్నేళ్ళు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్‌గా ఎందుకు కొనసాగించారు? రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఎందుకు? యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి లాంటి వాళ్లను ఈ రాష్ట్రాలకు గవర్నర్‌లుగా నియమించి ఉంటే స్వపక్షంలో విపక్షం ఎందుకుంటుంది? అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో భాజపా ఎందుకు ఆత్మరక్షణలో పడుతుంది? అంతేగాక తెలుగు రాష్ట్రాల్లోని ప్రసార మాధ్యమాలు బరి తెగించి సమాజంలో ఉద్రిక్తలు రేకెత్తిస్తే దానిపై కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసే న్యాయవిభాగాలు ఇక్కడి భాజపాకు లేవా?
మరోవైపు కాశ్మీరీ ఉగ్రవాద భాష మాట్లాడుతున్న హురియత్ కాన్ఫరెన్స్‌ను కట్టడి చేయకపోతే ఎలా? 370 ఆర్టికల్ రద్దు, రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతిపై ప్రగతిని ప్రజలకు చెప్పకపోతే ఎలా? నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్‌ల అక్రమాలు, రాబర్ట్ వాద్రా అక్రమ హర్యానా భూకుంభకోణం, కార్తీ చిదంబరం, మమత బెనర్జీల శారదా కుంభకోణం, కేరళలో పినరయ్ విజయన్ చేస్తున్న హత్యలు, ఎన్జీవోల పేరుతో విదేశీనిధులు పొంది దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అర్బన్ నక్సల్స్ ఎజెండాను బయట పెట్టండి. అలాగే తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, రైతుల పథకాలు దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయవచ్చో ఆలోచించండి. ఇవన్నీ ఏవీ పరిపూర్తి చేయకుండా ఎన్నికలకు ముందస్తుగా వెళ్ళడం ఆత్మహత్యా సదృశమే. కారు ఎంత క్రొత్తదైనా ప్రయాణం మధ్యలో పంక్చరైతే దానిని సరిచేసుకోవాల్సిందే. అలాగే మోడీ ఎంత గొప్పవాడైనా ఇవన్నీ సరిచేసుకొని ఎన్నికలకు వెళ్ళాలి.
***************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
వర్తమాన భారతం : విజయక్రాంతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి