1.నియతాత్ముడు 2.మహాపరాక్రమవంతుడు 3.అపూర్వ తేజస్సంపన్నుడు 4.్ధర్యశాలి 5.నియమనిష్ఠలు గలవాడు 6.తేజస్సంపన్నుడు 7.నీతికోవిదుడు 8.సర్వవిద్యా పారంగతుడు 9.సంపన్నుడు 10.శత్రు సంహారకుడు 11.సౌందర్యవంతుడు 12.విశాల వక్షస్థలం గలవాడు 13.శుభలక్షణుడు 14.్ధర్మజ్ఞుడు 15.సత్యసంధుడు 16.నీలమేఘశ్యాముడు 17.విశాలనేత్రుడు 18.కీర్తిమంతుడు 19.జ్ఞాన సంపన్నుడు 20.పరిశుద్ధుడు 21.ఆశ్రీత జనరక్షకుడు 22.సర్వజీవ పోషకుడు 23.్ధర్మరక్షకుడు 24.వేదవేదాంగ కోవిదుడు.
ఈ 24గాక కథాకథనంలో చెప్పిన ఉత్తమ గుణాలు ఎన్నో రామునిలో వున్నాయి. ఇందులో కనీసం ఒక్క గుణం కూడా అసంపూర్ణంగానైనా లేని ఈనాటి రాజకీయవేత్తలను ఆకాశంలోకి ఎత్తుతున్నారు! మరి- ఇన్ని రాముడి సంపూర్ణ గుణాలు లోకాన్ని ప్రభావితం చేయకుండా ఉంటాయా? అందుకే 1872 ప్రాంతానికి చెందిన అల్‌బ్రెక్ట్ వేబర్ మొదలుకొని కత్తి మహేశ్ వరకు ఎందరికో శ్రీరాముడు వస్తువు అయ్యాడు.
ఈ దేశంలోని అన్ని వర్గాల్లో రామనామశక్తి ఉంది. మ నుషుల పేర్లలో, గ్రామాల పేర్లలో ఎన్ని చోట్ల రాముని పేరుందో చెప్పలేం. ఎన్నిచోట్ల రామపాదాలు ఉన్నాయో చెప్పలేం. కొన్ని దేశాల్లో శ్రీరాముని పేరిట కరెన్సీ ముద్రించబడింది. రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న కాలానికి చెందిన ముస్లిం రాజుల చరిత్రకు కూడా రామునితో సంబంధం ఏర్పడింది. అంతెందుకు? శ్రీరాముడిని వ్యతిరేకించాడని ఈ రోజు కుహనా మేధావులు బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును వాడుకొంటున్నారు. కానీ, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ప్రతుల్లో రామాయణ ఘట్టాల చిత్రాలున్నాయి. కాన్షీరాం, రాం విలాస్ పాశ్వాన్, రాందాస్ అథవాలే వంటి దళిత నాయకుల పేర్లలోని ‘రాం’ను తీసివేసే దమ్ము ఎవరికైనా వుందా? రోజూ రాముడిని నిందించే గ్యాంగును వెనకేసుకొచ్చే సీతారాం ఏచూరిలో, బి.వి. రాఘవులులో కూడా రాముడే ఉన్నాడు.
రాముడి పేరు మాయమైతే ఈ వ్యక్తుల జీవితాలకూ విలువ వుండదు. రామాయణం నిషేధింపబడితే మన చరిత్రలు కూడా ధ్వంసమవుతాయి! పెరియార్‌గా పేరొందిన ఇ.వి.రామస్వామి నాయకర్‌లో కూడా శ్రీరాముడే! ఎంత విచిత్రం! రామ వ్యతిరేకిగా రామస్వామి నాయకర్‌గా ఎవరూ లేకపోవచ్చు!
అంతేకాదు ‘శంభూక వధ’ పేరుతో పుస్తకం రాసి రాముడిని అపఖ్యాతి పాలుజేసిన త్రిపురనేని రామస్వామి చౌదరిలో కూడా రాముడే ఉన్నాడు!? ఇదంతా అతిశయోక్తి కోసం చెప్పడం లేదు. రామాయణ సంస్కృతి విస్తృతిని మరోసారి గుర్తుచేద్దామని! రామాయణ సంస్కృతి ఈ దేశంలో లేకుండా చేయాలని ‘ఎర్రగుంపు’ ప్రయత్నిస్తే ఎందరో గొప్పవాళ్ళని మనం చెప్పుకొనే పేర్లు చరిత్రలో మిగలవు!
దేవుళ్లలో శ్రీరాముడు సత్వగుణ సంపన్నుడనే ఎ క్కువమంది ఆరాధిస్తారు కానీ అదే రాముడిని విలన్‌ను చేయడానికి శంభూకవధ, వాలివధ, సీతను అడవిలో వదలడం- అనేవి ఉదాహరణలుగా చూపిస్తారు. వాలి -సుగ్రీవుల మధ్య తగవు అందరికీ తెలిసిందే. రాముడు సుగ్రీవునితో మైత్రి చేసుకొన్నాడు. ఈ రోజు మిత్రధర్మాల పేరుతో రాజకీయాలు జరగడం లేదా? గుంపుగా వున్న చెట్లమధ్య నుండి రామలక్ష్మణులు వచ్చారని మాత్రమే వాల్మీకి రాశాడు. వాలిని చెట్టుమాటున దాగి కొట్టాల్సిన అవసరం రాముడికి లేదు.
ద్రావిడ ప్రాంతంలో పెరియార్ రామస్వామి రావణ సంస్కృతిని సృష్టించాలనుకొన్నాడు. రామాయణంపై దుర్వ్యాఖ్యానం కొనసాగించాడు. ఆయనదంతా దక్షిణ ప్రాంత దురభిమానమే గాని, రామాయణ వ్యతిరేకతలో జీవం లేదు. అసలు ద్రావిడ శబ్దం ప్రాంత వాచకం కాదు. మూడు సముద్రాలు కలిసే చోటు అని అర్థం. ఆదిశంకరుని జీవితంలో ప్రయోగించిన ‘ద్రావిడ శిశు’ అన్న శబ్దం చూస్తాం. 1947 తర్వాత పెరియార్ అగ్రకుల వ్యతిరేకతను ‘ద్రవిడనాడు’ సాధన ఉద్యమంగా మలిచాడు. దీనికోసం ఆయనకు కూడా రాముడే ఉపయోగపడ్డాడు. ‘రాముడు ఆయన పరివారం ఆర్యులుగాను, రావణుణ్ణి రాక్షసుడిగాను, హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి మొదలైన వారిని కోతులుగాను వర్ణించారు’ అంటూ పెరియార్ రామాయణాన్ని కొట్టిపారేశాడు. ‘రామాయణం-యధార్థ పరిశీలన’ పేరుతో ఓ పుస్తకమే రాశాడు. 1955, 1968లో రామాయణ గ్రంథాలను పెరియార్ అనుచరులు తగులబెట్టారు. రాముడిని, సీతను విమర్శిస్తూ రావణుడిని గౌరవించడం మొదలుపెట్టారు. పెరియార్ బాటలో స్ర్తివాదం ముసుగేసుకున్న అస్తిత్వ ఉద్యమాల చారిత్రక రచయితలు సీతనెలా విమర్శిస్తారు? సీత దృష్టికోణంలో రాముడిని విమర్శించేవారు ఆమెపై జాలిపడ్డారా? అంటే అదీ లేదు. వీళ్ల ఉద్దేశం సీతను గెలిపించడం కాదు, రాముడిని ఓడించడం?
ఇదే బాటలో నడిచిన తెలుగు వీర రచయితలు, రచయిత్రులు ఇంకో దుస్సాహసానికి ఒడికట్టారు. త్రిపురనేని రామస్వామి చౌదరి, రంగనాయకమ్మ, నార్ల వెంకటేశ్వరరావు మొదలుకొని ఓల్గా వరకూ.. ఇదంతా ఒకే పాదునుండి పుట్టిన తీగలు.
ఇందులో త్రిపురనేని ‘శంభూకవధ’కు చాలా ప్రాచుర్యం వచ్చింది. శూద్రుడైన శంభూకుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నందువల్ల రామరాజ్యంలో ఓ బ్రాహ్మణ బాలుడు మరణించాడట! దానికి ఆ బ్రాహ్మణ వృద్ధులు వెళ్లి రాముని నిందిస్తే ఆయన శంభూకుణ్ణి పుష్పక విమానంలో వెళ్లి చంపాడని ఈ కథ సారాంశం. అసలు ఈ కథ వాల్మీకి రామాయణంలో ఆరు కాండల్లో ఎక్కడా లేదు. ఏడవదయిన ఉత్తరాకాండ 73 సర్గ నుండి 76వ సర్గ వరకు ఉంది. ఈ ఉత్తరాకాండ ‘అవాల్మీకమ’ని చాలామంది తేల్చారు. ఈ కాండలో అవాల్మీక అంశాలు ఎక్కువగా ఉన్నాయి. రామాయణం కథ మొత్తం అయ్యాక ఉత్తరాకాండలో మళ్లీ ‘షార్ట్ స్టోరీస్’ రాయాల్సిన అవసరం వాల్మీకికి ఎందుకొచ్చింది?
భాషాపరమైన శైలీభేదం మొదటి కాండలైన అయోధ్య, బాల, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండలకు, ఈ ఉత్తరకాండకు చూడవచ్చు. దీనిపై ‘ఎంగిలిరాతలు’ కాకుండా లోతైన పరిశోధన జరగాలి. వెయ్యేళ్ల మన బానిస జీవితంలో ఎన్ని గ్రంథాలు ప్రక్షిప్త ప్రక్షేపాలయ్యాయో చెప్పలేం.
అయినా శంభూకుడు ఎక్కడ తపస్సు చేసాడో, అతణ్ణి వెతకడానికి శ్రీరాముడే పుష్పక విమానంలో వెళ్లి తన యావశ్శక్తిని వినియోగించి తెలుసుకొని చంపాడని అందులో ఉంది. తిండికి టికాణా లేని బ్రాహ్మణుడికి శంభూకుడి తపస్సు గురించి ఎలా తెలిసింది? అదే రామాయణంలో గుహుడు రాముని చేత ఎలా గౌరవింపబడినాడు! అతడు ఈనాటి కుల విభజన ప్రకారం బీసీ వర్గానికి చెందినవాడు కాడా? శబరి తపస్సు చేస్తే శ్రీరాముడు మతంగముని ఆశ్రమంలో ఆమెను కలిసాడు కదా? ఈ మతంగుడు ఏ జాతికి చెందిన వ్యక్తి? శబరి ఏ క్యాస్ట్‌లో ఏ గ్రూపులో ఎన్నవ నెంబర్‌లో వుంటుంది? హనుమంతుడు సుందరాకాండలో నాయకుడు. అక్కడ రాముడు లేడు. ఆంజనేయుడు ఏ కులస్థుడు? ఇప్పుడు మనం చెప్పే అగ్రకుల బ్రాహ్మణుడు కాడే! నవవ్యాకరణ పండితుడు, మంత్రాంగం తెలిసినవాడని వాల్మీకే చెప్పాడు. మరి ఆంజనేయుడు అంజనాదేవి తపస్సు వల్ల కదా జన్మించింది? దానిని వాల్మీకి వ్యతిరేకించలేదు కదా? అసలు శంభూకుడిని వధించాడనే నెపం రామునిపై తోస్తున్నవారు ఈ కథకు తలా తోక ఉందని ఆలోచిస్తున్నారా? ఈ కథ ప్రకారం ఇపుడు రాజ్యాంగం ఎలాగో ఆనాటి అష్ట ఋషిమండలితో ఈ ఘటనపై రాముడు సమావేశమై ఏం చేయాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు? రాముడు స్వయంగా నిర్ణయం తీసుకోలేదు.
ఆ అష్ట ఋషుల్లో మార్కండేయుడు, వౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, నారదుడు, జాబాలి ఉన్నారు. పైన చెప్పిన రచయితలంతా అభిమానించే ‘జాబాలి’ కూడా ఉన్నాడు. ఈయన నాస్తిక సంఘ అధ్యక్షుడే కదా! నార్ల వేంకటేశ్వరరావు అయితే జాబాలిపై వీర విధేయతతో ఓ పుస్తకమే రాసాడు.
శంభూకవధలో జాబాలి పాత్ర కూడా ఉంది కాబట్టి ఇప్పటి గోగినేని బాబు, కత్తి మహేశ్, నరిశెట్టి ఇన్నయ్య కూడా బాధ్యులేనా? శంభూకవధ రాసిన త్రిపురనేని, జాబాలి రాసిన నార్ల, విషవృక్షం రాసిన రంగనాయకమ్మ జాబాలి పాపాన్ని పంచుకొంటారా? ఇలాంటి కుతర్కం బాగుందా?
ఈ రోజు ప్రభుత్వాధినేతలు ప్రతిదీ ప్రజాస్వామ్యం, రాజ్యంగం వంటి పదాలు చాలాసార్లు వాడుతారు. మేధోమండలి చేసిన నిర్ణయం ఆ కాలంలో రాజ్యాంగబద్ధమైతే ఈ పాపం రామునికెలా ఆపాదిస్తారు? ఇలా వాదిస్తూ పోతే ఎంతో చెప్పవచ్చు. కానీ తర్కబద్ధంగా ఉండాలి. రామాయణంలోని మిగతా మంచి విషయాలను స్వీకరించాలి. అంతే కాని అబద్ధాలతో ఎన్నాళ్లు కాలం గడిపేస్తారో వారే ఆలోచించుకోవాలి!
అలాంటి మంచి విషయాలు సమాజానికి అందించేందుకే గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాసినా, విశ్వనాథ రామాయణ కల్పవృక్షం రాసినా, ఓ జానపదుడు చిరుతల రామాయణం రాసినా ఈ భావ వ్యాప్తికే. యజ్ఞరక్షణకు గురువు వెంట, పితృవాక్య పాలనకు అడవుల వెంట తిరిగిన రాముడు సుఖపడ్డాడా? ఆయన జీవితమంతా కంటకాకీర్ణపథమే కదా!
‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ మాతృదేశాన్ని గౌరవించాలన్నాడు. దుర్మార్గుడైన రావణబ్రహ్మ స్ర్తిని అపహరిస్తే వానరులతో కలిసి యుద్ధం చేసి, ధర్మం కోసం ఎంత బలవంతుడినైనా ఎదురించాలని సందేశం ఇచ్చాడు. పౌరుని మాటకు విలువనిచ్చి భార్యను త్యజించాడు. జటాయువులా అధర్మంపై తిరగబడాలని, చేష్టలుడిగినా సంపాతిలా మార్గదర్శనం చేయాలని, చూచి రమ్మంటే కాల్చి రావాలని హనుమంతునిలా జీవించాలని రామాయణం తెలిపింది. నమ్మినవారిని రక్షించడం కోసం సుగ్రీవ మైత్రి, సామాన్యుల్నే మహామహులుగా మార్చిన వానరసేన, మన ప్రాచీన కుటుంబ వ్యవస్థ, అల్పజీవులే అనల్పులకు సహాయం చేయడం, ఏకపత్నీవ్రతం రా ము డు ఆచరిస్తే పత్న్యనురాగం ప్రదర్శించింది సీత. ప్రజారంజకపాలన,భ్రాతృప్రేమ.. వంటి ఎన్నో ఉత్తమోత్తమ లక్షణాలు రామాయణం మనకు నేర్పింది.
ఇవన్నీ వదలిపెట్టి రంధ్రానే్వషణ చేస్తే అది ఆత్మద్రోహం, జాతిద్రోహం. ఇన్ని ఉత్తమ గుణాలు రాముడిలో ఉన్నందుకే రాక్షసుడైన మారీచుడే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నాడు.
*****************************************
✍ ✍ డాక్టర్. పి. భాస్కర యోగి
📰 ఆంధ్రభూమి : భాస్కర వాణి 📰
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి